అర్జెంటు పని మీద రోడ్డు పట్టుకుని తిరగాల్సి వచ్చింది. అదిగాక..సంసార సాగరంలో అలల ధాటి కూడా కాస్త ఎక్కువై..సౌందర్య లహరి రాయలేకపోయాను.ఏమిటో..షేక్స్పియర్ చెప్పినట్టు జీవితంలో ఏడు అంకాలు మాత్రమే ఉన్నట్టు లేవు...రోజుకి కనీసం ఒక అంకం చొప్పున అనంతమైన అంకాలు ఉన్నట్టున్నాయి.ఎంతో కొంత కాలానికి దేవుడికి బాండు రాసేశాక అన్నాళ్లూ చచ్చినట్టో బతికినట్టో నటీంచక తప్పదు కదా..!!
సరే..రేపు మహా శివరాత్రి. అమ్మ కోరి కోరి కట్టుకున్న అయ్యకి బోలెడంత సంరంభం. వెనకటికి ఎవరో అన్నారు...వైష్ణవాలయాల్లో పూజారులు చక్రపొంగలీ..దద్ధోజనం..లడ్డూలూ తినీ తినీ తెగ బలిసి ఉంటారుట..(పాపం శమించుగాక) శివాలయాల్లో పూజారులు ఉపవాసాలు చేసీ చేసీ బక్కచిక్కిపోయి ఉంటారుట. అంచేత..చెప్పొచ్చేదేమంటే రేపు పర్వదినం కదా అని మనం చచ్చీ చెడీ ఏ పిండివంటలూ వండి వార్చక్కర్లేదు. ఎల్లుండి పొద్దున్న దాకా సరిపడేలా ఇప్పుడే తినేసి ఎల్లుండి దాకా ముక్కు మూసుక్కూచుంటే చాలు.
నా చిన్నతనంలో శివరాత్రి గానీ..కార్తీక సోమవారాలు గానీ ఇంటిల్లిపాదీ ఉపవాసాలు ఉండేవాళ్లం. ఒకర్ని చూసి ఒకరికి భక్తిభావం పెచ్చరిల్లేది. మరి ఇప్పుడో...బీపీ ఉందని నాన్నా..సుగరుందని అమ్మా..కాలేజీకి సెలవు లేదని అబ్బాయీ..పరీక్షలవుతున్నాయని అమ్మాయీ...ఇలా ఇంటిల్లిపాదీ సుష్టుగా తినేసి..వీలు దొరికినప్పుడు ఓ దండం పారెయ్యడంతో భక్తిని రక్తి కట్టించేస్తున్నారు. కాలమహిమ...ఏమనగలం..??
సర్లెండి. ఇవేళ సౌందర్య లహరి ఎటూ లేదు గాబట్టి...అందాకా శివమానసపూజాస్తోత్రం చెప్పుకుందాం. శివస్తోత్రాలన్నిటిలోకీ నాకది చాలా ఇష్టం. ముందు స్తోత్రం చెప్పుకుని తర్వాత దాని గురించి చూద్దాం.
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ |
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || ౧ ||
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || ౧ ||
సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || ౨ ||
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || ౨ ||
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || ౩ ||
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || ౩ ||
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || ౪ ||
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || ౪ ||
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో || ౫ ||
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో || ౫ ||
నాలాంటిదానికి ఈ స్తోత్రం ఒక పెద్ద వరం. ఇది మహేశ్వరుడికి మనసా చేసే పూజ. దీనికి బాహ్యమైన వస్తువులతో పని లేదు. ఈ పూజ ఇలా సాగుతుంది...
"స్వామీ..రత్నాలతో ఆసనం తయారుచేశాను. (మరి బంగారపు సింహాసనానికే రత్నాలు తాపారో..లేక ఎకాయెకీ ఒక పెద్ద రత్నాన్ని దొలిచి ఆసనంలా తయారు చేశారో) హిమాలయ ప్రాంతంలో ప్రవహించే గంగ వంటి దివ్య నదుల్లోంచి మంచులా చల్లగా ఉన్న నీళ్లు తీసుకొచ్చి..ఇదిగో..నీకు స్నానం చేయిస్తున్నాను. (స్వామి రుద్రుడు. కోపం వస్తే తట్టుకోవడం కష్టం. అంచేత స్వామిని చల్లబర్చేందుకు గాను, మాఘమాసమైనా చలేస్తున్నా సరే స్నానానికి చన్నీళ్లే కావాలి.) స్నానం అయిపోయిందా...ఇవిగో దివ్యమైన పట్టు పీతాంబరాలు. కట్టబెడుతున్నాను..చూడు..నీకు నచ్చాయా తండ్రీ..(అయినా నాకు తెలీకడుగుతానూ...దిక్కులే వస్త్రాలుగా గల దిగంబరుడికి పట్టు పీతాంబరాలేమిటి నా మొహం) బట్టలు కట్టేసుకున్నావా..ఇప్పుడు ఆభరణాలు తెస్తున్నానుండు. రకరకాల రత్నాలతో కూర్చిన విభూషితాలివి...నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఆఆ..నగలు అలంకరిచడం కూడా పూర్తయింది. ఇప్పుడు చందన చర్చ చేస్తానుండు. అదేమిటి స్వామీ..నువ్వెంత విభూతిరాయుడవైనా జగదీశ్వరుడవు...అప్పుడప్పుడైనా ఇలా..మాలాంటి భక్తుల ముచ్చట తీర్చడం కోసమైనా చందనమలదుకోవలసిందే..తప్పదు. ఇదేమి చందనమనుకున్నావు...కస్తూరీమృగాల వంటి మృగాల చెక్కిళ్లనుండి స్రవించే మదంతో తయారైన అత్యంత పరిమళభరితమైన చందనం. అయిందా...ఇప్పుడు పూలు. "గంగాతరంగ రమణీయమైన నీ జటాకలాపం" లో నన్ను పూలు కూడా ముడవనీ.పుష్పకోమలమైన అమ్మ చేతులకు బదులు సర్పబంధం అల్లుకున్న నీ మెడలో పరిమళభరితమైన పూమాలను వేయనీ..ముజ్జగాలనేలే ముక్కంటివి నువ్వు...మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ అంటూ నీ పాదాల దగ్గర ఓపినన్ని పూలు రాశిగా పొయ్యనీ..ఒక్క పువ్వులే కాదు స్వామీ...నీకు అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు కూడా ఉన్నాయి. ఇవిగో..స్వీకరించు. పూసేవ అయిందా ఇప్పుడు నన్ను నీ చుట్టూ అగరు ధూపం వెయ్యనీ. నువ్వుండే తావు అగరు పరిమళాలతో గుబాళిస్తూ మా బతుకుల్ని గుబాళింపజేయాలి. ఏ పూజకైనా ముందు పూలు పెట్టి అప్పుడు దీపం వెలిగిస్తారు.ఆనకే గంధమూ ధూపమూ. కాని నేను నీకు అన్నీ చేసేశాను..దీపం తప్ప. ఉండు..ముల్లోకాలూ కాంతివంతమయ్యేలా నీ ముందు బంగారు ప్రమిదలో నిండా ఆవునెయ్యి పోసి త్రికరణ శుద్ధిగా మూడు వత్తులు వేసి వెలిగించనీ...ఆఆ ఇదిగో దీపం. ఓ దయానిధీ..పశుపతీ..ఇవన్నీ నిజంగా లేవు తండ్రీ..నేను కూర్చున్న చోటి నించి కదలకుండా..నా ఊహాలోకంలో నీకివన్నీ "కల్పిస్తున్నాను". అంతే. దయతో స్వీకరించు.
అలంకారాలూ అవీ అయ్యాయి...ఇప్పుడు నీకు కడుపునిండా భోజనం పెడతాను. బోలెడంత నెయ్యి పోసి నీకోసం పరమాన్నం తయారు చేశాను. పచ్చకర్పూరపు వాసనతో అది గుబాళిస్తోంది. కమ్మని నేతి ఘుమఘుమలు కైలాసందాకా వ్యాపిస్తున్నాయి. దాన్ని నవరత్నాలు తాపిన బంగారు పాత్రలో అమర్చాను. ఇదిగో..తిను. అదొక్కటే కాదు తండ్రీ...మమ్మేలే మారాజువు నీకు ఇంత బియ్యం ఉడకేసి పెట్టి ఊరుకుంటానా...ఐదు రకాలైన భక్ష్యాలు (గారెలు, బూరెలు అవీ) తయారు చేశాను. ఎర్రగా కాగిన పాలూ, కమ్మని మీగడ పెరుగూ కూడా ఉన్నాయి. కేవలం వీటితోనే భోజనం పూర్తి కాదుగా...పెరుగన్నంలోకి నంజుకుంటావో..భోజనమంతా అయ్యాక తింటావో నీ ఇష్టం గాని, తేనె కంటే తియ్యనైన చక్కెరకేళీ అరటిపళ్లు కూడా తెచ్చాను..అచ్చంగా నీకోసం. ఇక తాగడనికి మేం తాగినట్టు ఉత్తి నీళ్లిస్తానా నీకు...రకరకాల పళ్లూ, కూరల నించి తయారు చేసిన రుచికరమైన పానీయం ఇదిగో...హాయిగా తాగు. పెళ్లికొడుకులా అలంకరించుకున్నావు. కడుపునిండా భోంచేశావు. బిడ్డ తిండి తల్లి చూసినా దిష్టి తగులుతుందిట.నువ్వు తింటూండగా ఎంతమంది చూశారో..ఉండు గుత్తంగా ఇంత ముద్ద కర్పూరం వెలిగిస్తున్నాను...నీ చుట్టూ తిప్పి దిష్టి తీసి మంగళం పలుకుతాను. ఆఆ..అయింది. ఇంక హాయిగా విశ్రాంతిగా కూచో..భోజనం తర్వాత మంచి తాంబూలం ఉంటేనే ఆ భోజనం తాలూకు పస. ఇదిగో తాంబూలం...పచ్చకర్పూరమూ..ఏలకులూ మిళాయించాను. నిజంగా బజారు నించి ఆకూ వక్కా తెచ్చాననుకునేవు సామీ...లేదు లేదు..ఇదంతా నా మనసులో సాగుతున్న ఉత్తుత్త పూజే. మానస పూజ. అయితేనేం...నువ్వంటే నాకెంతో భక్తి..ప్రేమ..ఆరాధన. అంచేత నేను చేస్తున్న ఈ మానస పూజను స్వీకరించు తండ్రీ..
అయిందా...నువ్వెంత హిమగిరిపై ఉన్నా వేడిగానే ఉంది సామీ, గొడుగు పడుతున్నానుండు. చమరీ మృగాల నించి తయారు చేసిన చామరాలతో నీకు వీవన వీయనీ...ఈ క్షణం నువ్వు ఎంత బావున్నావో తెలుసా...అందుకే ఆ త్రిపురసుందరి ఆకులలములు కూడా మానేసి తపస్సు చేసి మరీ నువ్వే కావాలంది. ఎందుకు స్వామీ నవ్వుతావు...నా మాట నమ్మవా...కావాలంటే ఇదిగో నిర్మలమైన అద్దం..నీ అందాన్ని నువ్వే చూసుకో. అద్దం అబద్ధం చెప్పదు. సర్లే...ఈ కబుర్లెందుకు గాని...లయాత్మకమైన విధులతో అలసి సొలసి ఉన్నావు నువ్వు. కాస్సేపు వీనుల విందుగా వీణాభేరీమృదంగ కాహళ వాద్యాలతో కూడిన గీతాల్ని విను. ఇదిగో అందాల సురభామినులు ముల్లోకాలూ మురిసిపోయేలా నృత్యం చేస్తున్నారు. తిలకించు. ఈ పవిత్రమైన వేళ..నీ పావనమైన సన్నిధిలో నేను సాంగంగా నీ ఎదుట సాష్టాంగపడుతున్నాను. నాకు తోచినట్టు అనేక విధాల నిన్ను స్తుతిస్తున్నాను. వాస్తవానికి ఇవేమీ కూడా నేను చెయ్యలేదు తండ్రీ...మా విభుడివైన నీకోసం నా మనస్సులో ఇవన్నీ సంకల్పించుకుంటున్నాను..అంతే. ప్రభూ..నా ఈ మానస పూజను స్వీకరించు.
స్వామీ...ఇన్ని మాటలెందుకు...నా ఆత్మ నువ్వే. నా బుద్ధి శివపత్ని అయిన ఆ గిరిజమ్మ. నా పంచ ప్రాణాలూ నీ సహచరులైన శివగణాలు. పాంచభౌతికమైన నా ఈ శరీరమే నీ ఇల్లు. నేను నా జీవనయానంలో చేసే దైనందిన కృత్యాలే నీకు పూజ. నేను చలనం వలనం లేకుండా నిద్రపోతాను చూశావా..అదే నా తపస్సమాధి. రోజూ నేను నడిచే నడకే నీకు ప్రదక్షిణాలు. నా నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాటా నీకు స్తోత్రమే. ఇంకా ఒక్క మాటలో చెబుతున్నాను చూడు...నేనంటూ అసలు ఏ ఏ పనులు చేస్తానో..ఓ శంభో...అదంతా నీ ఆరాధన కోసమే.
నేను చేతులతో గాని కాళ్లతో గాని..పనుల ద్వారా గాని, వాక్కు ద్వారా గాని, విని గాని, చూసి గాని, మనస్సులో గాని, తెలిసి గాని తెలియక గాని చేసిన అపరాధాలన్నిటినీ క్షమించు తండ్రీ...నన్ను దయజూడు శంకరా..!!
ఇదండి ఆ స్తోత్ర భావం. ఇంతకీ దీన్ని ఎవరు రాశారనుకుంటున్నారు...ఊహించేశారా...మరెవరు...మన గురువుగారు..ఆది శంకరాచార్యులవారు. అందుకే ఇది ఇంతా బావుంది...!
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో...సెలవు మరి....
jjjjjjjjjjjjjjjjjjjjjjjjj
రిప్లయితొలగించండి@ అజ్ఞాత...Thank Youuuu..:)
రిప్లయితొలగించండిmee varnana adbhutanga undi. Thank you
రిప్లయితొలగించండి@ అజ్ఞాత Thanks endukandiii...:)
రిప్లయితొలగించండి