గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
"లలిత" అన్న పేరే ఒక అందం! లలిత లలితమైనది లలిత. విశ్వాంతరాళంలోని కోమలత్వమంతటినీ పోగేసినా ఆ తల్లి ఒక్క తల వెంట్రుకకు సాటి రాదంటే అందుకు శంకరులే సాక్షి. పరదేవత వైభవం, మహిమ వగైరాలన్నీ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోనూ, మార్కండేయ పురాణంలోని శ్రీ దుర్గా సప్తశతి స్తవంలోనూ సమగ్రంగా కనిపిస్తాయి. కాని శంకరాచార్య విరచితమైన ఈ సౌందర్య లహరి మాత్రం అఖిలాండనాయకి బాహ్య, అంతస్సౌందర్యాలకే పెద్దపీట వేసింది. వాస్తవానికి ఇలా దేవతా సౌందర్యాన్ని కీర్తిస్తూ వినుతికెక్కిన కావ్యం మరొకటి లేనేలేదు.
సౌందర్య లహరిలోని తొలి నలభై శ్లోకాలూ పరిపూర్తిగా దివ్యసృష్టి అనడానికి సాక్ష్యంగా వాటిలో సౌందర్య వర్ణన కంటే అత్యంత రహస్యమైన గుహ్యవిద్యే నిగూఢంగా ఉంది. ఆ నలభై శ్లోకాలూ యంత్ర, తంత్ర విధాన రహస్యాల్ని గోప్యంగా వివరిస్తాయని పండితులు చెబుతారు. అందుకే అవి నా వంటి సామాన్యులకు కొరుకుడు పడవు. ఆ నలభై శ్లోకాల్నీ "ఆనంద లహరి" అంటారనీ, తనకు దైవ ప్రసాదంగా లభ్యమైన ఆ శ్లోకాలకు శంకరులు జోడించిన తరువాయి అరవై శ్లోకాల్నీ మాత్రమే "సౌందర్య లహరి" అంటారనీ ఒక వాదం ఉంది. అయితే దాన్ని ఖండించేవారు కూడా అందరికందరూ ఉన్నారు. మరొక మాట ఏమిటంటే "ఆనంద లహరి" పేరున శంకరాచార్య విరచితమైనదే మరొక స్తోత్రరాజం ఉంది. అందులో శ్లోకాలు సౌందర్య లహరికి మరింత దీటుగా ఉంటాయి. అయితే అవి కేవలం ఇరవై శ్లోకాలు మాత్రమే. ఆ ఆనంద లహరి ముందు వెనుకల గాధలేమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అలవాటుగా పుస్తకాల షాపుల్ని గాలిస్తున్నప్పుడు ఆ చిన్ని పొత్తం కనబడి, వెంటనే దాన్ని సొంతం చేసుకున్నాను.
ఎటూ ఈ రోజు కూడా ఇప్పటిదాకా ఇటువంటి ఉపోద్ఘాతాలతోనే గడిచిపోతోంది కాబట్టి సౌందర్య లహరి గురించి మరో రెండు ముక్కలు చెప్పుకుందాం. సౌందర్య లహరిని నాకు ఒక గురుతుల్యులైన స్నేహితురాలు సరిగ్గా పన్నెండేళ్ల కిందట పరిచయం చేశారు.అప్పట్లో ఆవిడ ఏ శ్లోకం చదివితే ఏ ఫలితమో కూడా ఒక కాగితం మీద రాసి ఇచ్చారు. తర్వాత ఆ కాగితం ఎక్కడో పోయింది. నేను దాని గురించి అంత పట్టించుకోలేదు కూడా. ఎందుకంటే నా ఆరోగ్యం పుట్టుక నించీ అంతంత మాత్రమే. ఎటూ నేను ఏ జపతపాలూ చెయ్యలేను. రోజూ ఇన్నివందలు లేదా వేల సార్లు అని దేన్నీ జపించలేను/పారాయణ చెయ్యలేను. దేవుడి ముందు దీపం వెలిగించి రెండు చేతులూ జోడించి ఒక్క నమస్కారం చేసి లేచి వచ్చేసిన రోజులే నా జీవితంలో ఎక్కువ. అంచేత నేను ఆవిడ రాసిచ్చిన కాగితాన్ని అసలు పట్టించుకోనేలేదు. కాకపోతే దేవతా స్తోత్రాల దగ్గర్నించీ సమస్త రకాలూ చదవడమనే వ్యసనం కూడా పుట్టుకతోనే అబ్బింది కాబట్టి, అప్పటికే శంకరుల రచనల పట్ల ఆరాధన బాగా పోగై ఉంది కాబట్టి..పురాకృతసుకృతంగా సౌందర్య లహరి గురించి తెలిసిన వెంటనే ఆ పుస్తకం కొనుక్కుని తెచ్చుకుని చదవడం ప్రారంభించాను. అది చదవడం ప్రారంభించే వేళకు నాకు కాస్త అనారోగ్యంగా ఉంది. శారీరకమైన వ్యాధితో బాటు మానసికమైన భయాందోళనలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఆ పరిస్థితిలో నేను నాకు తెలియకపోయినా కేవలం శ్లోకార్ధాన్ని ఊతంగా చేసుకుని "త్వదన్యః పాణిభ్యామభయ వరదో దైవత గణాః" శ్లోకాన్ని (శ్లో : 4) నాకు భయం వేసినప్పుడల్లా మననం చేసుకోవడం ప్రారంభించాను. అది చదువుకున్నప్పుడల్లా భయం తగ్గి, ఏదో ధైర్యంగా ఉండేది. ఆ తర్వాత నాకు సరైన చికిత్స లభించడం...నేను ఆరోగ్యవంతురాల్ని కావడం జరిగాయి. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే నా స్నేహితురాలు ఇచ్చిన కాగితాన్ని పట్టించుకోకపోయినా నేను అసంకల్పితంగా అందులో ఉన్న ప్రకారమే ఆచరించాను, దానికి ఫలితమూ దక్కింది.
ఇక్కడ మరో చిన్న కోతి కొమ్మచ్చి. నాకు ఆది శంకరుల రచనా వైశిష్ట్యాన్ని తొట్టతొలుతగా పరిచయం చేసింది మా నాన్న. ఆయన రాగయుక్తంగా (మా తాతగారి నించి సంగీత వారసత్వం మా నాన్నకి వచ్చింది. ఆయన నించి మా పెద్ద చెల్లికి)శివానందలహరి లోని ఈ శ్లోకాన్ని నాకు చదివి వినిపించేవారు...
గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజముమానాధ భవతు
సుఖేనావస్థాతుం జనయిహ న జానాతి కిమహో
తండ్రీ..ఉమానాధా..! నీ పూజకి పువ్వులు తీసుకురావడం కోసం జనం లోతైన చెరువుల్లో దిగిపోతున్నారు..నిర్జనాలైన ఘోరారణ్యాల్లోకి పరుగులు తీస్తున్నారు. ఎత్తైన కొండలమీదకీ ఎక్కేస్తున్నారు. తమ మనస్సు అనే తామరను పరిశుద్ధంగా నీకు సమర్పించి...ఈ పరుగులేమీ లేకుండా సుఖంగా ఉండవచ్చునన్న విషయం వారికి ఎందుకు తెలియదో కదా..??
ఇదీ దాని భావం. ఇది గాక భజగోవింద శ్లోకాల్ని నాకు మొట్టమొదటగా పరిచయం చేసిందీ, శంకరులు రాసిన ఏ స్తోత్రానికైనా అద్భుతమైన లయ ఉంటుందన్న విషయాన్ని ప్రత్యక్షంగా నాకు తెలియజెప్పిందీ కూడా మా నాన్నే. అలా ఊహ తెలిసీ తెలియక ముందే శంకరుల పట్ల భక్తిభావాన్ని పెంచుకున్న నాకు ఈ సౌందర్య లహరి కోతికి కొబ్బరికాయే..! ఇక ఇప్పుడు శంకరులు రాసిందే "భవాన్యష్టకం" చదువుకుని ఈ రోజుకి సెలవు తీసుకుందాం. సంపూర్ణ శరణాగతికి మారుపేరు భవాన్యష్టకం. అది చదివాక నాకు ఏమనిపించిందంటే...అసలు ఏ పూజలూ అక్కర్లేదు...ఏ సహస్ర నామాలూ వల్లించక్కర్లేదు...ఈ ఎనిమిది శ్లోకాల్నీ మనసారా చదువుకుంటే చాలు అనిపించింది. మీరు కూడా చదివి చూడండి మరి...మీకేమనిపిస్తుందో..!!
న తాతో న మాతా న బంధుర్నదాతా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
భవాబ్ధావపారే మహా దుఖ భీరుః
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః
కుసంసారపాశః ప్రబద్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
న జానామి పుణ్యం న జానామి తీర్ధం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్
న జానామి భక్తిం వ్రతం వా పి మాతః
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః
కులాచారహీనః కదాచారలీనః
కుదృష్టిః కువాక్య ప్రబంధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్
న జానామిచాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలేచానలే పర్వతే శత్రుమధ్యే
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
అనాధో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణ దీనః సదా జాడ్యవక్త్రః
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
ఇది చాలా సులువుగా అర్ధం చేసుకోగలిగే స్తోత్రం. కాస్త శ్రద్ధగా చదివి చూస్తే భావం ఇట్టే బోధపడిపోతుంది. తాత అంటే మాత్రం మన తెలుగు తాత కాదు. సంస్కృతంలో తాత అంటే తండ్రి. న తాతో న మాతా అంటే తల్లీ తండ్రీ లేరు అని అర్ధం. అంటే నిజంగా లేరు అని కాదు. వాస్తవంగా మనకు ఏదైనా పెద్ద అవసరం వస్తే "ఆబ్రహ్మకీట జనని" అయిన ఆ లలితా త్రిపురసుందరి తప్ప పాంచభౌతికమైన ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఏమీ చెయ్యలేరు అని అంతరార్ధం. ఇలా అంతరార్ధాలు గ్రహిస్తూ పోతేనే ఏ శ్లోకానికైనా అసలు భావం తెలిసేది! సెలవా మరి...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి