ఆ పాదాలు..వరాల ఆరామాలు!
శ్లో :
త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవత గణాః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా
భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంచా సమధికం
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ !!
ఇది సౌందర్య లహరిలో నాలుగవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమిటంటే.."అమ్మా, మిగిలిన దేవతలందరూ తమ రెండు చేతులా అభయ, వరదముద్రల్ని దాల్చి ఉన్నారు. నువ్వొక్కతివే ఆ మాదిరిగా ముద్రలు అభినయించనిదానివి. నువ్వలా ఎందుకు చెయ్యడంలేదంటే ఆర్తుల్ని వారి వారి భయాలనుండి కాపాడటానికీ, అర్ధులకు వారు కోరినదానికి రెట్టింపుగా వరాలనిచ్చేందుకూ నీ చేతుల దాకా ఎందుకు..అట్టడుగునున్న నీ పాదాలే చాలు కదా..!"
ఇక భావార్ధం లోకి వెళితే శంకరాచార్యులవారు ఎప్పటిలాగే దేవి పట్ల తన మక్కువనంతటినీ కవితా చమత్కృతిలోకి జొప్పించి మిగతా దేవుళ్లని ఒక్కపెట్టున తీసి పారేశారు. మిగతా దేవుళ్లంతా వరాభయ ముద్రలు ప్రదర్శిస్తారట. అదీ రెండు చేతులతోనూ...(మిగతా దేవుళ్ల పట్ల ఎంత వ్యంగ్యమో.."ఆవిడగారు రెండు చేతులూ ఊపుకుంటూ ఎలా గొప్పలు చెబుతుందో చూశావా..." అని అమ్మలక్కలు ఆడంబరంగా మాట్లాడే మరో ఆడదాని గురించి చెప్పుకున్నట్టే) తల్లి మాత్రం అసలు ఏ అభినయమూ చెయ్యదు. గంభీరంగా..హుందాగా "పాశాంకుశ పుష్పబాణచాపా"లతో ఉంటుంది. అమ్మగారు చేత్తో చెయ్యవలసినదేదో ఆమె కాళ్లే చేసుకుపోతాయి. ఇదీ చమత్కృతి. హవ్వ..ఎంత అభిమానం ఉంటే మటుకు.."నువ్వు ముద్రల్ని అభినయించవు తల్లీ...చాలా గొప్పదానివి" అంటూ అలా అనేయడమేనా...అభయ, కటి హస్త ముద్రలతో అలరారే వెంకన్న ఈ మాట విని ఎంత చిన్నబుచ్చుకుంటాడు పాపం..? ఏమైనా శంకరులకు త్రిపురసుందరి అంటే వెయ్యిన్నొక్క శాతం పక్షపాతం. మరోచోట ఈయనే.."నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్నే ఆరాధిస్తానమ్మా. వేరే దేవతల జోలికి వెళ్లినా వాళ్లు ఇంతకంటే కంటే గొప్పగా ఆదరిస్తారన్న నమ్మకమేమీ లేదు" (త్వదన్యస్మాదిఛ్ఛా విషయ ఫల లాభే న నియమః) అంటూ కుండ బద్దలుగొట్టినట్టు చెప్పేశారు.
ఇక్కడ ఇంకో విశేషం ఉంది. దేవతా దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా విగ్రహం తాలూకు పాదాలు చూడాలట. అక్కడి నించి అలా అలా పైకి చూడాలి. అలాగే పూజ చేసేటప్పుడు..లేదా దేవతను వర్ణించేటప్పుడు ముందు పాదాల దగ్గర నించీ మొదలు పెట్టాలి. అలా అలా శిరసు దాకా వెళ్లాలి. అసలు మనం దేవతా దర్శనానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసుకున్నా దేవుడి పాదాలకే ముందు నమస్కారం చేస్తాం. ఇక్కడ కాపాడటానికీ, వరాలివ్వడానికీ పాదాలే చాలు అంటే.. మనం ముందు తల్లి పాదాల్ని చూసి ఇలా శరణు వేడుకోగానే ఆయమ అలా కరుణించేస్తుందన్నమాట...అంటే అంత శీఘ్రంగా..అదీ విశేషార్ధం.
ఈ శ్లోకంలో కవితా చమత్కృతి సంగతి అలా ఉంచితే ఇది (ఈ శ్లోకం) త్రిపురసుందరి పట్ల మన నమ్మకానికి గీటురాయి. సౌందర్య లహరి అంతటికీ నాకు భక్తి పరంగా, ప్రార్ధనాపరంగా ఈ శ్లోకం చాలా ఇష్టం. ఎందుకంటే...సింపుల్..బై వన్ గెట్ టూ అంటే ఎవరు తన్మయులైపోరు చెప్పండి? మనుషులందరిలోనూ ఉండే ఆరోగ్యవంతమైన స్వార్ధమే నాలోనూ ఉంది. సాధారణంగా లోకంలో అందరూ సమస్యా పరిష్కారం కోసమో, అభివృద్ధి కోసమో మాత్రమే దేవుణ్ణి ప్రార్ధిస్తారు..పూజలు చేస్తారు. దేవుడు కాపాడి, వరాలిచ్చేవాడు కాదంటే ఉత్తరక్షణంలో భక్తుడనేవాడొక్కడూ మిగలడు. సంపదలు పెరుగుతాయీ అంటే వైభవలక్ష్మి నోము నోచుకుంటాం. పెళ్లవుతుందంటే కాత్యాయనీ వ్రతం. కుటుంబ సంక్షేమం కోసం నిత్య పూజలూ..వ్రతాలూ..!! ఇది తప్పు అని ఎవరూ అనరు, శంకరాచార్యులవారితో సహా. మనుషులు దేవుణ్ణి తమ మేలు కోసమే పూజిస్తారని శంకరులకు తెలుసు..అందుకే ఆయన "భయాల నుండి కాపాడటానికీ..కోరినది రెట్టింపుగా ఇవ్వడానికీ" అన్నారు..అక్కడికి దేవుడి పని అదే అయినట్టు. బై వన్ గెట్ టూ (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ) అంటూ ఏ పెద్ద షాపింగ్ మాలో ప్రకటిస్తే నగరంలోని జనాభా అంతా అక్కడ చేరిపోతుందా లేదా..అలాగే, స్వయంగా శంకరుడి అంశలో ఉద్భవించిన శంకరాచార్యులవారు,"ఫలమపిచ వాంఛా సమధికం" (కోరినదానికంటే ఎక్కువ ఫలం) ఇస్తుందని చెబుతూ ఉంటే ఆశగా ఆ తల్లిని పూజించకుండా ఉండగలరా ఎవరైనా..?? అలాగే నేనూ.
ఈ రోజుల్లో మనుషులకు జీవితమే ఒక పెద్ద భయంకరానుభవంలా తయారైంది. ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితులు, అనుబంధాలు, రక్షణ..అన్నీ సమస్యలే. కల్లో సైతం పీడించుకు తినే భయాలే. ఇటువంటి పరిస్థితిలో, "మీ భయాల్ని తగ్గిస్తాం.మీ కోర్కెల్ని రెట్టింపుగా తీరుస్తాం" అంటూ ఎవరైనా కాస్త అభయమిచ్చేసరికి జనాలంతా అక్కడికి పరుగు తీస్తూ ఉండటం మనకు తెలిసిందే కదా. అదేమిటి..అలా ఎవరు అభయమిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా ..మరి రోజుకొకరుగా సంఖ్యాబలాన్ని పెంచుకుంటున్న దొంగ స్వాములు, బాబాలూ చేస్తున్నదేమిటి..వరాభయ ముద్రల్ని అభినయించడం కాదా..?? "నువ్వు అభినయించవు" అంటూ దేవిని పొగడటంలో శంకరులు ఆ "అభినయం" అన్న పదాన్ని "సూచింపదగిన అర్ధాన్ని సూచించడం" అన్న అర్ధంలో ఉపయోగించారే తప్ప,"నటించడం" అన్న భావంతో మాత్రం వాడలేదు. కాని భక్తుల్ని చుట్టూ పోగేసుకుని తమ వాంచితార్ధాల్ని తీర్చుకుంటున్న దొంగ స్వాములంతా మాత్రం ఆ ముద్రల్ని నూటికి నూరుపాళ్లూ అభినయిస్తున్నారు..అంటే నటిస్తున్నారు. అటువంటి నటనలకు లొంగి మోసపోయే బదులు..జగద్గురువైన ఆది శంకరులు చెప్పిన మాటను నూటికి నూరుపాళ్లూ నమ్మండి. అదేదో ఆ మహనీయుడు ఉత్ప్రేక్ష చేసి అలంకారం కోసం చెప్పిన మాట కాదు..మనసా వాచా కర్మణా మనం నమ్మాలే గాని మన నమ్మిక ఊరికే పోదు..తప్పక ఫలిస్తుంది. మీలో ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. పరదేవత పాదసేవ లౌకికమైన భయాల్ని పోగొడుతుందనీ..ప్రాపంచికావసరాలకు సంబంధించి మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుందనీ ప్రగాఢంగా నమ్మండి. ఆ నమ్మిక ఫలితాన్ని స్వయంగా అనుభవించండి.
"రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పధి సదైవ గఛ్ఛతాం " అన్నాడు బుధకౌశిక ముని రామరక్షాస్తోత్రంలో.
"శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు"
అన్నాడు శ్రీనాధుడు. ఇవి కేవలం కవితా చమత్కృతులు కావు. నమ్మినవాడి నమ్మకం ఎన్నటికీ వట్టిపోదని "నమ్మకం" గా చెప్పే మాటలు. బుధ కౌశిక ఋషి చెప్పినట్టు రామలక్ష్మణులు నిజంగా ధనుర్బాణాలు తీసుకుని మన ముందు రక్షక భటుల్లా నడవరు. శివుడికి అభిషేకం చేసి పత్రితో పూజిస్తే కామధేనువూ, కల్పవృక్షమూ మన పెరట్లో వచ్చి వాలవు. కాని త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి నమ్మినవాడి విశ్వాసం మాత్రం ఎన్నటికీ వృధా పోదన్నది ఎవరికి వారే అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయం. రామకృష్ణ పరమహంస తన కధల్లో ఇదే మాట ఎన్నోసార్లు చెప్పాడు. అడవి దాటేందుకు భయపడే పిల్లవాడికి వాళ్లమ్మ చెప్పినట్టు "అన్నయ్య గోపాలుడు" తోడు రావడం అలాంటి నమ్మకానికి దక్కే ఫలితాలకు సాక్ష్యమే.
ఇక్కడ ఒక చిన్నమాట. మీకు తెలియదని కాదు..సందర్భానుసారంగా మరోసారి చెబుతున్నానంతే. మనం పురాకృతాన్ని నమ్ముతాం. "ఫూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితా" అనేది మా అమ్మ. ఈ జన్మలో మనకి దక్కేవి పురాకృతాన్ని అనుసరించి మాత్రమే ఉంటాయన్నది పెద్దలు చెప్పే మాట. అదలా ఉంచితే, మనం కోరే కోర్కెలు మన వర్తమాన జీవితానికి ఎంతవరకూ మేలు చేస్తాయన్నది మనకు తెలియదు. ఒక్కొక్కసారి కోరిన కోరిక తీరడం కూడా శాపమే అవుతుంది. అంచేత, మన పురాకృతం ఫైలు తిరగేసి, ఈ జన్మలో మన భవిష్యత్తుని క్లెయర్ వాయెన్స్ (దివ్యదృష్టి) తో చూసి..అప్పుడు మనకి ఏమివ్వాలో..ఎప్పుడివ్వాలో..ఎంత ఇవ్వాలో నిర్ణయించి ఆర్డర్స్ పాస్ చేస్తాడు దేవుడు. ఇలా ఈ విశ్వాంతరాళంలోని పిపీలికాది బ్రహ్మ పర్యంతానికీ...అబ్బ.. ఆ భువనేశ్వరి ఎంత గొప్ప "మహారాజ్ఞో" కదా..!! అందుకే పది రోజుల పసికందు మాదిరి జీవితాన్ని ఆ తల్లి చేతుల్లోకి వదిలేసి, కేవలం ధర్మంగా..మన విచక్షణాజ్ఞానాన్నీ, బుద్ధికుశలతనూ అనుసరించి బతకడం చాలా మంచిదంటాను నేను. (కాని మళ్లీ నేనే అలా బతకలేను కదా...:) మీకు చేతనైతే అలా బతికి చూడండి..అప్పుడు ఏ సమస్యా పీడించదు.) మన పూర్వీకులు అలాగే బతికేవారన్నది కాస్త ఆలోచిస్తే నికరమవుతుంది.
సరే...ఇంక ముగింపు శ్లోకానికి వెళదామా...
విరాజన్మందార ద్రుమ కుసుమ హారస్తనతటీ
నదద్వీణా నాద శ్రవణ విలసత్ కుండల గుణా
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే !
(మెడలో మందార కుసుమ మాలను ధరించి..మధుర వీణానాదాన్ని ఆలకిస్తూ..చెవుల తళతళ మెరిసే కుండల కాంతుల సొబగుతో..వయ్యారంగా వంగిన తనువుతో..ఆడయేనుగు అందమైన నడకలా మనోహరమైన మందగమనంతో..హే భగవతీ..శంభుని సతీ..కలువల వంటి కన్నులు గల నీ రూపమే నాకు సర్వత్రా గోచరించేను తల్లీ..! )
---శంకరాచార్య విరచితం (శంకరాచార్యులవారి శ్లోకాల్లో అద్భుతమైన లయ ఉంటుందనడానికి ఈ శ్లోకం ఒక గొప్ప ఉదాహరణ)
P.S...(రేపు ఆదివారం. అమ్మవారు, అయ్యవారు సరదాగా న్యూయార్క్ నించి ఏ కైలాసగిరో (ఇప్పుడందరూ జన్మభూమిని వదిలేసి పరసీమలో కాపురం చేస్తున్నారు కదా..అమ్మ, అయ్య కూడా కైలాసం నించి ఏ న్యూయార్కో వలస వెళ్లలేదని ఏమిటి గేరంటీ..:) ) షికారు వెళ్లొచ్చు. (మా ఇశాపట్నంలో కైలాసగిరి పెద్ద టూరిస్టు స్పాట్) అంచేత రేపు కూడా నా పిచ్చి రాతలతో వాళ్లని డిస్టర్బ్ చెయ్యడం బాగోదు. కాబట్టి, మళ్లీ సోమవారం కలుసుకుందాం. అప్పుడైతే మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ హడావిడిలో ఉన్న సీఎంలా అమ్మ కూడా ఈ రాతల్ని పట్టించుకోదు. మరి ఉంటా..సెలవు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి