20, ఫిబ్రవరి 2014, గురువారం

అందాల కడలి-3


అంతా ఆ పాదధూళిలోనే ఉంది 


శ్లో :
      తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహభవం
      విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలాన్
      వహత్యేనం శౌరిః కధమపి సహస్రేణ శిరసాం
      హరః సంక్షుద్యైనం భజతి భసితోద్దూళన విధిం
                                 ఇది సౌందర్య లహరిలోని రెండవ శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే "ఓ మాతా..త్రిమూర్తులు ముగ్గురూ  నీ పాదపద్మాల నుండి కించిత్ ధూళిని గ్రహించి దాని సహాయంతోనే తమ తమ పనులు నెరవేరుస్తున్నారు. బ్రహ్మ ఆ ధూళిని ఎటువంటి వైకల్యమూ లేని విశ్వాంతరాళంగా సృష్టిస్తున్నాడు. విష్ణుమూర్తి దాన్ని ఒక్కతలతో మోయలేక ఎలాగో వెయ్యి తలలతో మోస్తున్నాడు. లయకారుడైన హరుడు మాత్రం ఆ ధూళిని చక్కగా మెదిపి..విభూతిగా ఉపయోగించుకుంటున్నాడు."
                                ఇక భావార్ధం చూద్దాం. ఈ శ్లోకంలో రచనా వైచిత్రి అంతగా లేదు. కేవలం ఆ జగన్మాత గొప్పతనమూ, త్రిమూర్తులతో సహా యావత్  సృష్టికీ ఆ తల్లే ఆధారభూతమైనదన్న విషయాన్ని మరోసారి స్థిరీకరించడమూ మాత్రమే ఇక్కడ జరిగాయి. భావార్ధం లోకి వెళితే ముందుగా మొదటి శ్లోకంలో చెప్పుకున్నదాన్నే మళ్లీ మరోసారి చెప్పుకోవాలి. సృష్టిలోని చరాచరవస్తుసముదాయమంతా ఆదిపరాశక్తి అంశగలదేనని చెప్పుకున్నాం కదా..అదేమాటను ఇక్కడ మరో రకంగా చెబుతున్నారు శంకరులు. త్రిమూర్తులు ముగ్గురిలో  సృష్టికర్త బ్రహ్మకు సాత్వికశక్తీ, స్థితికర్త విష్ణువుకు రాజసశక్తీ,శివుడికి తామస శక్తీ సహాయపడుతున్నాయి.  ఆ సహాయమే ఎలా జరుగుతోందన్న విషయాన్ని మనకు చెప్పడానికి  శంకరాచార్యులవారు దేవి పాదధూళిని వస్తువుగా ఎన్నుకున్నారు. అమ్మవారి పాదాలు ఎటువంటివి...అరవిచ్చిన పద్మాల్లాంటివి. బీదవాడి పాదాల నుంచి దుమ్మూ ధూళీ వస్తాయి..లక్ష్మీపుత్రుల పాదాలు చందన చర్చలతో గుబాళిస్తాయి. మరి ఆ పాదపద్మాలు  సాక్షాత్తూ  భువనేశ్వరివే అయితే...వాటి నుంచి వచ్చేది ధూళి కానేకాదు...పుప్పొడి..పరాగం. ఆ పాద పరాగాన్ని స్వీకరించి బ్రహ్మ దాంతోనే  తన సృష్టి సాగించాడు. అంటే సృష్టిలోని సమస్త జీవజాలంలోనూ అమ్మ అంశ ఉందన్నమాటే కదా..ఇక స్థితికర్త అయిన విష్ణుమూర్తి ఆ ధూళిని అంటే బ్రహ్మ చేసిన సృష్టిని ఎలాగో వెయ్యి తలలతో మోస్తున్నాడు. ఆ పుప్పొడిలోనే సర్వ శక్తులూ ఉన్నాయన్నమాట.  
              ఇక్కడే నాకు కాస్త సందేహం కలుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తిని వెయ్యి తలలవాడిగా వర్ణించడంలోనూ, దేవి పాదధూళిని నారాయణుడు  "ఎలాగో కష్టపడి" మోస్తున్నాడని చెప్పడంలోనూ శంకరుల ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? మహా త్రిపురసుందరి "నారాయణి" కాగా.."గోవిందం భజ మూఢమతే" అంటూ నారాయణుణ్ణి కీర్తించిన  శంకరులు అప్రయత్నంగానే  "సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం" అంటూ  యజుర్వేదం కీర్తించిన మహాపురుషుణ్ణి తలచుకున్నారా? అయినప్పటికీ నారాయణుడు "ఎలాగో కష్టపడి" మోస్తున్నాడని చెప్పడం ద్వారా నారాయణికే పెద్దపీట వేశారా..??   "శివకేశవయోరభేదః" అన్న అద్వైత ప్రవక్త ఆదిశంకరులు తన రచనల్లో శివకేశవులిద్దర్నీ దరిదాపు సమానంగానే కీర్తించారు. అయితే.."మనసి భావయామి పరదేవతాం" అంటూ ముల్లోకాలకూ మూలవిరాట్టు అయిన జగదంబను కీర్తించడంలో మాత్రం ఆయన హద్దులెరుగని  రచనామండలంలో కనీ వినీ ఎరుగనీ చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆనందవిహారం చేసిన మాట వాస్తవం. 
              గుంటూరు టీజీపిఎస్ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగాధ్యక్షులుగా పని చేసిన డా. జి.ఎల్.ఎన్. శాస్త్రి గారు తనకసలు సంబంధమే లేని కవితారంగంలోకి జొరబడి..సౌందర్య లహరి చదివి..పరవశించిపోయి..ఆ మహత్తర కృతికి తెలుగుసేత  చేస్తూ..వ్రాసిన ఈ మాటల్ని చదివితే శంకరులు సౌందర్య లహరీ రచనలో ఎంతటి రసానందాన్ని అనుభవించి..మనకు పంచిపెట్టారో అర్ధమవుతుంది. శాస్త్రిగారి మాటలివీ..."శంకరులు ఎన్నో స్తోత్రాలు రచించారు. వాటన్నిటిలోకీ తలమానికమైనది సౌందర్య లహరి. ఇది మంత్ర, తంత్ర,యంత్ర, సౌందర్య, యోగసమన్వితమైన స్తోత్రం. త్రిపురసుందరి అయిన అమ్మవారి అందచందాలు, అనురాగ అనుగ్రహాలు, నవరసోపేతమైన ఆ తల్లి దినచర్యల్ని శంకరులు వర్ణించిన తీరు న భూతో న భవిష్యతి. ఉపమ, రూపక, ఉత్ర్పేక్షాది అలంకారాలు, అసమానమైన శబ్ద రమ్యత, చిత్రవిచిత్రమైన కవితారీతులు సౌందర్య లహరికి మాత్రమే ప్రత్యేకం. పాఠకులకు ఆ పరదేవతను సాక్షాత్కరింపజేయాలనే విధంగా శంకరుల రచన సాగింది"   శాస్త్రిగారు సౌందర్య లహరికి తెలుగు అనువాదం ప్రారంభించాక, అది 32 శ్లోకాల దాకా సాగి, అక్కడ ఎందుకో ఆగిపోయిందిట. చాలారోజుల దాకా కొనసాగింపు కుదరలేదు. ఆ పరిస్థితిలో ఒక తెల్లవారుఝామున శాస్త్రిగారికి తన ఇంట్లో గజ్జెల చప్పుడు సుమధురంగా వినిపించిందిట. అది అమ్మవారి అందెల రవళేనని నిశ్చయించుకున్నారు   శాస్త్రిగారు. ఆ రోజు నించి ఆయన రచన గంగావతరణంలా వడివడిగా సాగిందిట. అదీ ఆ తల్లి మహత్తు. నమ్మినవారికి విగ్రహం...నమ్మనివాడికి రాయి!!    
                                               ఇక్కడ మరో విషయమేమంటే "పాదధూళి" అనగానే నాకు శరత్ బాబు  గుర్తొస్తాడు. శరత్ నవలల్లో ఇంచుమించు ప్రతి స్త్రీ పాత్రా పెద్దవాళ్ల "పాదధూళి" స్వీకరిస్తూ ఉంటుంది. అంటే వంగి వారికి పాదప్రణామాలర్పిస్తుందన్నమాట. అంటే ఇక్కడ దేవి పాదధూళిని స్వీకరించిన త్రిమూర్తులు మువ్వురూ ఆయమకు పాదాభివందనం చేస్తున్నట్టే కదా..! అదీ అంతరార్ధపు వైచిత్రి..! 
                             సరే..విష్ణువు దాకా వచ్చాం. విష్ణుమూర్తి వేయి తలలతో మోస్తున్న ఆ ధూళిని పరమేశ్వరుడు చక్కగా మెదిపి..భస్మలేపనంగా ఉపయోగించుకుంటున్నాట్ట. ఇది లయాత్మకమైన వర్ణన. బ్రహ్మ సృష్టిలోకి ఇమిడ్చిన ధూళిని, నారాయణుడు శిరసా భరిస్తూ ఉండగా..శివుడు మాత్రం దాన్ని మెదిపేశాడు..అంటే లయమొందించాడు. లయమైనదాన్ని తనలోకి ఇముడ్చుకున్నాడు. లయకారుడైన శివుని మృత్యుంజయత్వానికి ఇది చిహ్నం. విలయాన్నంతటినీ తనలో ఇముడ్చుకుని తాను మాత్రం చిరంజీవిగా చిరుదరహాసమొనరించగల విశ్వనాధుడతడు. రూపగుణస్వభావాల్లో ఏ మాత్రమూ అమ్మకు తీసిపోనివాడు. గంగావతరణ సమయాన తన దూకుడు భరించడానికి సిద్ధపడిన శివుణ్ణి చూస్తూ గంగ.."ఇతడేనటే స్మరహరుడు..ఇతడేనటే పురహరుండు..? ఇతడేనటే హిమవన్నగనందినీ మనోహరుండు.." అనుకుందట. అప్పుడాయన కూడా గంగను చూసి.."స్ఫురత్ శుభ్ర సుందరతర దరస్మేర ముఖము...శరద్యామినీ రాకా చంద్రకోటి సఖము" అనుకున్నాట్ట. బాబోయ్...దక్షిణ నాయకుడు..!!
                     చాలు..ఇంక ఆపేద్దాం. అమ్మ వింటే ఇంకేమైనా ఉందా..:) 
మరి ముగింపు శ్లోకానికి వెళదామా...
  ఘృతక్షీర ద్రాక్షా మధు మధురిమా కైరపి పదై
   ర్విశిష్యానాఖ్యేయో భవతి రసనా  మాత్రవిషయః 
   తధా తే సౌందర్యం పరమశివ దృజ్మాత్ర విషయః 
   కధంకారం బ్రూమ సకల నిగమా గోచరపదే.
      (నెయ్యి, పాలు, ద్రాక్ష, తేనెల్లోని మాధుర్యాన్ని వట్టి మాటలతో చెప్పలేం. ఆ మాధుర్యపు రుచి ఎంతటిదో జిహ్వకే తెలుసు. అలాగే..ఓ తల్లీ..నీ సౌందర్యాన్ని వర్ణించేందుకు వేదాలకే శక్తి చాలదే..ఇంక మాబోటివాళ్లమెంత..? ఆ సౌందర్యపు అతిశయం ఒక్క మహాదేవుని కంటికే ఎరుక!) 
                            -------శంకరాచార్య విరచితం 
ఈ రోజుకు సెలవా మరి.. 
    ఇది వ్రాయడం పూర్తయ్యాక ఎందుకో ఫేస్ బుక్ చూసేసరికి అక్కడ ఈ ఫోటో కనిపించింది. బావుంది కదూ..
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి