అనంత పయనం లో మరో ఏడాది గడిచిపోయింది. నవ్వుతూనే ఉన్నామో, నవ్వుతూ..ఏడుస్తూ ఉన్నామో...అసలు ఎప్పటికైనా నవ్వుతామా దేవుడా అనిపించేంతగా శోకాంబుధిలో మునిగిపోయామో...ఎవరికి వారికే తెలిసిన, ప్రత్యేకమైన జీవితగ్రంధమది. అయితే, జీవన గమనం లో మరో కొత్త ప్రస్థానం ప్రారంభించబోయే తరుణాన...ఒక్కసారి అందరం...పరస్పరం శుభకామనలు తెలియజేసుకోవడం మన కనీస విధి...మర్యాద. అందుకే..ఈ బ్లాగులోకి కన్నూనిన ప్రతి ఒక్కరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదామని మళ్లీ మౌసు పెన్ను పట్టుకున్నాను. అందరికీ హేపీ న్యూ ఇయర్...!!! ఆఖరికి 31-12-2015 న ఈ బ్లాగు చూసిన వాళ్లు కూడా నేను మీకు పన్నెండు నెలల కిందటే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేశానని గ్రహించండి చాలు...ఓకే...ఆల్ ది బెస్ట్..!!
30, డిసెంబర్ 2014, మంగళవారం
13, సెప్టెంబర్ 2014, శనివారం
2, సెప్టెంబర్ 2014, మంగళవారం
6, జూన్ 2014, శుక్రవారం
రాయాలి...
ఏమీ రాయకుండా రోజులు ఎలా గడిచిపోతున్నాయో...?? అవును మరి..నా కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా ఏం...??? కాని, అందాల కడలి ఆగిపోయింది...(అమ్మకి బుగ్గపోటు పొడిచాను కదా..గర్వానికి పోతే ఏమవుతుందేం...) రాయాలమ్మా...రాయాలి....కనీసం అదొక్కటైనా రాయాలి..!! అయితే దానికీ టైం రావాలి కాబోలు...అంతే కదా మరీ...!!!
13, ఏప్రిల్ 2014, ఆదివారం
నా తరమా...
ఫిబ్రవరి ఆరవ తారీఖున బ్లాగు ప్రారంభించాక...ఇన్ని రోజుల పాటు అసలేమీ రాయకుండా లేను. ముఖ్యంగా అందాల కడలి. కాని...ఇప్పటికి పదహారు రోజులైంది...అసలు మౌస్ పట్టుకోవడానికే వీల్లేకపోతోంది. మార్చి 28న అమ్మకో బుగ్గపోటు తగిలించాక...నాక్కూడా బిజీ పోటొచ్చింది.అమ్మకి బుగ్గపోటిస్తే ఏమీ చేతకానిదానిలా ఆవిడ ఊరుకుంటుందా మరి..?? ఇప్పట్లో కుదిరేలా కూడా లేదు...కనీసం ఈ నెల ఇరవయ్యొకటో తారీఖు దాకా...సముద్రతరంగాలైనా కాస్త కుదుటపడతాయేమో గాని సంసారసాగరానికి మాత్రం అసలు విశ్రాంతి లేదు కదా...
ఏ తీరుగ నను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా...నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా...
ఏ తీరుగ నను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా...నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా...
28, మార్చి 2014, శుక్రవారం
అమ్మకో బుగ్గపోటు..!!
ఓయ్ అమ్మా...తెలిసిందిలే...తెలిసేపోయిందిలే నీ బ్యూటీ సీక్రెట్..! నువ్వు అంత అందమైనదానివీ..ఇంత అందమైన దానివీ అని ఆ శంకరాచార్యులవారు ఎకాయెకీ ఓ వంద శ్లోకాలు రాసేశారే..ఆ అందం తాలూకు అసలు రహస్యం మేం గ్రహించేశాంలే..!
షహనాజ్ హుస్సేన్ అనీ,ఓ పేద్ద బ్యుటీషియను..నీకు తెలీకపోవడమేమిటిలే...నువ్వు ఆవిడ చెప్పిన సీక్రెట్లన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నావని ఇవేళ అర్ధమైంది నాకు. భారతదేశంలో కోకొల్లలుగా దొరికే (ఇప్పుడు తగ్గిపోతున్నాయనుకో) వనమూలికలూ, సహజ ఉత్పత్తులతోనే బ్రహ్మాండమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చునన్నది షహనాజ్ హుస్సేన్ మాట. అది నీకు తెలిసిపోయింది. బహుశా కైలాసంలో కూచునే ఇంటర్నెట్ లో చూసేసి ఉంటావు. నువ్వు ఏమేం చూశావో...వాటిని నువ్వు ఎలా పాటిస్తున్నావన్నది మేం ఏం గ్రహించామో వరసగా చెబుతాను విను...
పాలని మించిన క్లీన్సర్ లేదన్నది షహనాజ్ తో సహా బ్యుటీషియన్లంతా ఏకగ్రీవంగా ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఆ పాలు..అవి కూడా నీళ్లల్లాంటివి కావు...చక్కటి చిక్కటి పాలతో ఏకంగా ఒళ్లంతా క్లీన్ చేసుకుంటున్నావు నువ్వు. ఒళ్లంతా తడిసిందా లేదా అని చేత్తో తడిమి తడిమి చూస్తూ బిందెల కొద్దీ పాలతో నీ సేవకులు నీకు తానం చేయిస్తున్నారు. ఆగాగు...ముందసలు పాలు కానే కాదు...పసుపు.
భారతీయ స్త్రీకి పసుపే పరదైవతమని పూర్వీకులే కాదు...ఈ కాలపు బ్యూటీషియన్లు సైతం మొత్తుకుంటున్నారు. "పసుపూ చందనాల అపూర్వ సంగమం" అంటూ వికో టర్మరిక్ వాళ్లు గొంతు చించుకున్నారు చూశావా..."శెనగపిండిలో కాస్త పసుపు, పెరుగు వేసి ఆ ముద్దని ముఖానికి పట్టించుకుని ఓ అరగంట ఉండి కడుక్కోండి...మీ ముఖసౌందర్యానికి మీరే అబ్బురపడండి" అని షహనాజ్ హుస్సేన్ తన బ్లాగుల్లోనూ, తన వెబ్సైట్ లోనూ కూడా గోల పెడుతూ ఉంటుందే ఆ పసుపుని ముందు ఒళ్లంతా పట్టించుకుంటున్నావు నువ్వు. తర్వాత నీకు మరే సొంత బ్యుటీషియను చెప్పిందో గాని ఒళ్లంతా కుంకుమ కూడా అలదుకుంటున్నావు. బహుశా నీ "అరుణారుణ వర్ణానికి" కారణం ఇదే అయి ఉంటుంది. ఆ తర్వాత వికో టర్మరిక్ వాళ్ల అడ్వర్టైజ్మెంట్ లో మాదిరిగా శరీరానికి చందన చర్చ చేయించుకుంటున్నావు.
"చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ" అన్నాడు గాని జయదేవుడు, నీకు జరుగుతున్నట్టు ఏ కృష్ణుడికి జరుగుతోంది తల్లీ చందన చర్చ...?? పాపం అప్పుడెప్పుడో ద్వాపరయుగంలో యదుకులబాంధవుడై పుట్టి ఏ చందన సేవలందుకున్నాడో గాని నల్లనయ్య...ఇప్పుడు వెన్నక్కూడా మొహం వాచిపోతున్నాడిక్కడ...(అంటే తెలుగునాట)
సరేలే ఇప్పుడా గోలంతా ఎందుక్కానీ, చందన చర్చ అయ్యాక అప్పుడు మొదలవుతుంది నీ పాల స్నానం. "రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు పన్నీటి జలకాలు పాలాభిషేకాలు" అన్నారు చూశావా కవిగారు...అవన్నీ వెంకన్నతో పోటా పోటీగా జరుగుతున్నది నీకే కదమ్మా...ఎన్ని చేసినా పాపం వెంకన్న నల్లనయ్యే...నువ్వు మాత్రం ఎర్రెర్రని గులాబీరేకుల్ని పాలల్లో నానబెట్టినట్టూ మెరిసిపోతూ ఉంటావు. అదే ఆ బ్యూటీ సీక్రెట్టే చెబుతున్నా...
ఒకటా..రెండా..ఏకంగా మూడు బిందెల పాలు..అవును మరి, విశ్వాంతరాళమంతా నిండి ఉన్న భువనేశ్వరివి కదా నువ్వు...నీ ఒళ్లంతా నిండారా తడవాలంటే ఆ మాత్రం పాలుండొద్దూ...బాత్రూం లో మ్యూజిక్ పెట్టుకుని మనసుకు నచ్చిన సంగీతం వింటూ హాయిగా జలకాలాడుతున్నట్టు లయబధ్ధంగా మంత్రాలు వినిపిస్తూ మరీ నీకు క్షీరాభిషేకం చేయిస్తారు నీ సేవకులు. అవన్నీ ఉట్టి పాలు మాత్రమే కావన్న సంగతి మాకు తెలిసిపోయిందిలేవమ్మా...పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార...పంచామృతాలు. అవిగాక సహజామృతమైన పరిశుధ్ధజలం. కొబ్బరినీళ్లూ, సెంటూ, విభూతీ, రోజ్ వాటరూ ఇంకా ఇతరమైన సుగంధ ద్రవ్యాలూ..ఎన్ని వీలైతే అన్నీ కలగలిపి... వీటన్నిటితో అరోమా బాత్ తీసుకుంటావు నువ్వు. మరింక నీ అందానికేం..??!!
ఇక్కడితో అయిపోయిందా...ఏటి పొడవునా చన్నీటి స్నానం చేస్తే మనసూ శరీరమూ ఫస్టుగా ఉంటాయన్నది ఇటు డాక్టర్లూ, అటు బ్యుటీషియన్లూ ఇద్దరూ కలిసికట్టుగా చెప్పే మాట. ఒకప్పుడు గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ అలా చేసేవారుట. అది కూడా ఏదో ఒక బకెట్టు నీళ్లతో కాకి స్నానం గాకుండా తనివి దీరా ఓ నాలుగైదు గంగాళాల నీళ్లు స్నానం చేస్తే ఆ ఒంటి తీరే వేరు. ఈ సంగతి నీకు తెలిసిపోయింది. హాయిగా నిశ్చింతగా కూచుని, పక్కనున్న కొళాయిలోంచి ధారగా పడుతూన్న చల్లని నీటిని..మాలా ఓ బుడ్డిచెంబుతో కాదు...బుల్లి బిందెతో తీసి నువ్వు నిలువెల్లా తలమీంచీ తడిసేలా నీ సేవకులు పోస్తూంటే...హాయిగా చల చల్లగా కనీసం ఓ అరగంట సేపు స్నానం చేస్తావు నువ్వు. మండు వేసవిలోనైనా అదే స్నానం...గడ్డకట్టించే చలిలోనైనా అదే చన్నీటి స్నానం..! మరిక నీ బాడీ మెరిసిపోకేం..??!!
అయిందా...స్నానం అయ్యాక మాలా ఏదో హడావిడిగా ఓ బట్ట చుట్టేసుకుని పరుగు తియ్యవు నువ్వు. ముందు నీ "చికుర నికురుంబ"మంతా (కేశపాశం) అరోమాటిక్ గా పరిమళించేలా సాంబ్రాణి ధూపం వేసుకుంటావు. ఆనక చక్కని చీరని అంచులన్నీ చక్కగా కనబడేలా కడతారు నీ సేవకులు.దాంతో నీ మనసు హాయిగా ఉండి ముఖం కమలంలా విచ్చుకుంటుంది. ఆ తర్వాత ఉంటుందమ్మా అసలైన అరోమా...ఒకటా రెండా...ఏ సీజన్ లో దొరికే పువ్వులు ఆ సీజన్ లో..ఎర్రెర్రని మందారాలు,గుమ్మెత్తించే గులాబీలు, మనసు దోచే మల్లెపూలు, సన్నని పరిమళాల సన్నజాజులు, కళ్లకు ఆహ్లాదాన్నిచ్చే బంతులు, చామంతులు, అపురూపంగా దొరికే నాగమల్లి పూలు... నీ ఒళ్లంతా ఈ అరోమాలతోనే నిండిపోతుంటే "అరోమా థెరపీని మించింది లేదన్న" బ్యూటీషియన్ల మాటల్ని నువ్వు ఎంత తూచా తప్పకుండా పాటిస్తున్నావో తెలీడంలేదూ..??!!
ఇక్కడితో అయిందా..."అందచందాల కోసం ఒంటికి ఏవేవో పూసేసుకుంటే చాలదు. లోపలకి తీసుకునే ఆహారం కూడా బావుండా"లన్నది డాక్టర్లూ, బ్యూటీషియన్లూ కలిసికట్టుగా చెప్పే మాట. అది కూడా నువ్వు ఎంతగా పాటిస్తున్నావో నాకీవేళ బాగా తెలిసిందిలే. ఒకటా రెండా...యాపిలు పళ్లు, ద్రాక్షలు, దానిమ్మ, ఎర్రరటి, పచ్చరటి, ఆకుపచ్చరటి, ఖర్జూరం..ఇలా బోలెడన్ని పళ్లూ, ...తేనె, పాలు..నెలలో మూడొంతుల రోజులు ఇదీ నీ ఆహారం..! ఇలా పాలూ పళ్లూ, కొబ్బరినీళ్లమీద బతుకుతూంటే మరిక నువ్వు జీరో ఫిగర్ మెయింటైన్ చెయ్యకేం..??!!
మీ ఆయన ఆ పరమశివుడు కనబడినప్పుడల్లా నువ్వు మోకాళ్లమీద వంగి నమస్కారాలు చేస్తూ ఉంటావుట. "సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం" అని నీ మోకాళ్లని ఆ శంకరాచార్యులవారే వర్ణిస్తూ..నీ పర్ఫెక్ట్ ఫిగర్ తాలూకు ఎక్సర్సైజ్ రహస్యాన్ని చెప్పేశారు. మరి మా జీవితాలన్నీ నిలబడే గడిచిపోతాయి గాబట్టి, మొగుడి సంగతి దేవుడెరుగు, మేం ఎరిగీ మరిచీ కన్నవాళ్లకి కూడా మోకాళ్లమీద వంగి దండం పెట్టం కాబట్టి.. నీకు సాష్టాంగపడటానికి కూడా మా శరీరాలు సహకరించవు గదా..! ఇక మాకు ఫిగరొకటీ...!!
మొత్తానికి బ్రహ్మాండమైన అరోమా థెరపీలు, బ్యూటీ ట్రీట్ మెంట్లు,ఆహారం, ఎక్సర్సైజులు...ఇవే నీ బ్యూటీ సీక్రెట్లు. అవునా...చూశావా మేం ఎలా గ్రహించేశామో...!!
అయితే మాకు మరో విషయం కూడా తెలుసులే...ఆస్కార్ వైల్డ్ "ద పిక్చర్ ఆఫ్ డొరియన్ గ్రే" లో చెప్పినట్టు అద్వితీయమైన నీ నిర్మలాంతఃకరణమే నీ అందానికి ప్రధమ కారణం..!! నీకున్నదీ మాకు లేనిదీ అదే..! అందుకే...ఓ లలిత లలితమైన తల్లీ...నీకు శతకోటి నమస్సులు!! నీ సౌందర్య లహరికి వేవేల జేజేలు..!!
మా లలితాపీఠంలో ప్రతి శుక్రవారమూ అమ్మవారికి చేసే పంచామృతాభిషేకం చూసిన తర్వాత...నా తల్లితో నేను ఆడుకున్న వేళాకోళమిది..! "ఎంత బావున్నావో ఓవిడా" అంటూ బుగ్గపోటు పొడిస్తే అందులో అసలు సిసలు ప్రేమనూ అభిమానాన్నీ అమ్మ గ్రహిస్తుంది కాబట్టి...ఆ తల్లికే ఇది అంకితం..!!

26, మార్చి 2014, బుధవారం
మా నాన్న
అవును మరి..శరీరం ఎలాంటి బాధలకి గురైనా మనసును క్షణక్షణమూ చల్లగా, ఆనందంగా ఉంచే అమ్మ ప్రియస్నేహితుడు..నాన్న ఏరీ..?? "ఇంకెన్నాళ్లే..బుజ్జితల్లిక్కూడా పెళ్లి చేసి పంపించేశామంటే మన బాధ్యతలు మూడొంతులు తీరిపోతాయి. అప్పుడు నువ్వూ నేనూ ఎంచక్కా ఇలాగే కూచుని బోల్డు కబుర్లు చెప్పుకుందాం." అంటూ ఎంచక్కటి భవిష్యత్తు అందంగా కళ్లముందు కనిపించేలా ఊరించి ఊరించి చెప్పిన నాన్న ఏరీ..??
బుజ్జితల్లికింకా పెళ్లి చెయ్యనేలేదు నాన్నా..! వయసులో ఉండగా ఏవో సమస్యలూ, బాధలతోనే సరిపోయింది అమ్మకి. ఆవిడతో తనివితీరా కబుర్లు చెప్పనే లేదు. అప్పుడే మిమ్మల్ని హడావిడిగా పిలిచెయ్యడానికి ఆ దేవుడికి మనసెలా ఒప్పింది నాన్నా..?? అంత తొందరేమొచ్చింది? అక్కడ కూడా ఏవైనా రాచకార్యాలు మీ చేత చక్కదిద్దించాలని అల్లప్పటి శ్రీకాకుళం ఎమ్మెల్యేలా దేవుడు కూడా మీకోసం హడావిడి పడ్డాడా..?
అమ్మలు ఇంటర్ పరీక్షలు రాస్తుండగా నాన్నకి ఏలూరు ట్రాన్స్ఫరయింది. ఏలూరులోని సెయింట్ థెరిసా కాలేజీలో బిఏలో అమ్మల్ని జాయిన్ చెయ్యాలని కలలుగన్నారు నాన్న. తీరా చేసి అమ్మలు ఇంటర్ రిజల్ట్స్ కూడా ఇంకా రాకుండానే నాన్నని శ్రీకాకుళం వేసేశారు.
ఇంక నాన్న ఎంత బాధపడ్డారో..?! వెంటనే బైల్దేరి రాజధాని వెళ్లి మినిస్టర్ని కలుసుకున్నారు. "నన్ను ఏలూరు వేసి ముచ్చటగా మూణ్ణెల్లు కూడా కాలేదు సార్ ! నా పెద్దకూతురు ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంటు. మూడేళ్లపాటు అక్కడుంటాను గదా దాన్ని థెరిసా కాలేజీలో జాయిన్ చేద్దామని ఆశపడ్డాను. ఇంతలో మళ్లీ నన్ను కదిపెయ్యడం ఏం న్యాయం సార్..??" అంటూ గోల పెట్టారు.
అప్పుడు మినిస్టర్ ఏమన్నారు...???
"నిజమేనయ్యా. కాని ఇది మా పని కాదు. శ్రీకాకుళం పరిస్థితి ఏమీ బాగాలేదని, అదంతా చక్కబెట్టడానికి మంచి ఆఫీసర్ కావాలని ఆ ఎమ్మెల్యే పట్టుబట్టి నిన్ను అక్కడికి వేయించుకున్నాడు. నీకు ఆర్డర్స్ డిస్పాచ్ అయ్యేదాకా ఇక్కణ్ణించి కదిలితే ఒట్టు. నన్నేం చెయ్యమంటావో చెప్పు." అన్నారు.
అన్నేళ్ల ఉద్యోగజీవితంలో నాన్నకి అటువంటి రాజగౌరవాలెన్ని జరిగాయో..?! నాన్న పేరు చెబితే చాలు..ప్యూన్ దగ్గర్నించి కలెక్టర్ దాకా అందరూ ఆత్మీయంగా గౌరవంగా ప్రవర్తించేవారు. ఆ గొప్పతనమంతా మనసులో మెదులుతుంది కాబోలు..నాన్న పేరు చెబితే చాలు అమ్మ పెదవులు చిరునవ్వుతో విచ్చుకునేవి. వాళ్లిద్దరికీ పెళ్లి ఎలా అయిందో గుర్తు చేస్తే మరీనూ..ఆ చిరునవ్వు మొహమంతా పాకేది. ఇంతకీ వాళ్లిద్దరికీ పెళ్లి ఎలా అయింది..??
అమ్మకీ నాన్నకీ పెళ్లిచూపులు జరగలేదు. "ప్చ్..పెళ్లిచూపుల ముచ్చట తీరనేలేదు." అంటూ నిన్న మొన్నటిదాకా నవ్వుతూ అమ్మని వెక్కిరిస్తూనే ఉండేవారు నాన్న. పెళ్లినాటికి అమ్మకి పదమూడేళ్లు..నాన్నకి పదిహేడేళ్లూను. నాన్న చదువు ఇంకా పూర్తవనేలేదు.
తాతగారికి..అంటే అమ్మా వాళ్ల నాన్నగారికి అమ్మ పెళ్లి గురించి ఆలోచిస్తూంటే చప్పున అమ్మడు కొడుకు గుర్తొచ్చాట్ట. సంబంధం వేలు విడిచిందే అయినా అనుబంధం అంతకన్న దగ్గరదే. అందుచేత వెంటనే హుటాహుటిన బైల్దేరి నాయనమ్మా, తాతగారూ ఉంటున్న పల్లెటూరికి వచ్చారుట.
అప్పటికి నాన్న అక్కడ లేరు. పట్నంలో చదువుకుంటున్నారు. నాన్నతో ఓ ముక్క చెప్పాలన్న ఆలోచన గాని, అమ్మా-నాన్నల (మాకు అమ్మానాన్నా- కాని అప్పటికి పెళ్లికొడుకూ-పెళ్లికూతురూ...:) ) అంగీకారం తీసుకోవాలన్న అభిప్రాయం గాని ఆ ముగ్గురికీ లేవు. అంచేత నరిసిమన్నయ్యా, అమ్మడూ, మీసాలబావా కలిసి అమ్మకీ-నాన్నకీ పెళ్లి నిశ్చయించేసి, అప్పటికప్పుడు హడావుడిగా తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు. నాన్న పరీక్షలు రాసి వచ్చాక అప్పుడు తనకి మరో వారం రోజుల్లో పెళ్లి అని తెలిసిందిట. నాయనమ్మ విషయం చెప్పగానే నాన్న తెల్లబోయి, "అదేమిటమ్మా, నాకసలు ఆ పిల్ల ఎలా ఉంటుందో కూడా తెలీదు. నేను ముందుగా అమ్మాయిని చూడక్కర్లేదా? ఒకవేళ నాకు నచ్చకపోతేనో..??" అన్నారుట. నాన్న మాటలకి నాయనమ్మ తేలిగ్గా "మేం అలా అనుకోలేదురా. పోన్లే, ఇప్పుడేం మునిగిపోయింది? మరో నాల్రోజుల్లో ఎటూ పెళ్లికి తరలి వెళ్తాం కదా..వెళ్లగానే పిల్లని చూడు. నీకు నచ్చకపోతే మానేద్దాం." అందిట. (నాయనమ్మ నాన్నకి తల్లే గాని అమ్మకి అక్షరాలా అత్తగారు..)
ఆ మాటకి నాన్న నొచ్చుకుని "ఏమిటమ్మా నీ మాటలు? పెళ్లికి తరలి వెళ్లి పిల్ల నచ్చలేదని వెనక్కొచ్చేస్తామా? ఏమైనా న్యాయమైన పనేనా అది? నాతో ఒక్క ముక్క చెప్పి మరీ పెళ్లి ఖాయం చెయ్యాలన్న ఆలోచన మీకు ముందే రావాల్సింది. ఇప్పుడిక పిల్ల నాకు నచ్చినా నచ్చకపోయినా వెనక్కి తిరిగే ప్రసక్తి మాత్రం లేదు." అని ఖచ్చితంగా చెప్పారుట. "సరే నాయనా, నీ ఇష్టం" అనేసి చేతులు దులుపుకుంది నాయనమ్మ.
పెళ్లి మర్నాడనగా తాతగారూ, నాయనమ్మా, నాన్నా తరలి వెళ్లి గుమ్మంలో దిగేసరికి ఎదురుగా వరండా మీదే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ అమ్మ కనిపించిందిట. పట్టు పరికిణీ, ఖద్దరు వోణీ,బిగుతుగా అల్లి, జడగంటలు వేసి, గొబ్బిపూలదండతో అలంకరించిన పొడుగాటి జడా, కళ్లకు కాటుకా, ముఖాన ఎర్రని తిలకం బొట్టూ, పసిమి పచ్చని మేని ఛాయా...వెరసి కాళిదాసు కుమారసంభవంలో బాల పార్వతిలా ఉన్న అమ్మని చూపిస్తూ నాయనమ్మ, "అదిగో, అదేన్రా అబ్బాయ్ పెళ్లికూతురు. గబుక్కున చూడు" అందిట.
నాన్న గబుక్కునే చూశారో, తనివితీరానే చూశారో గాని, ఆ మాటలు విన్న అమ్మ మాత్రం తెల్లని ప్యాంటూ షర్టూ వేసుకుని, సన్నగా, చామన చాయ కంటే కూడా ఓ పిసరు తక్కువ రంగులోనే ఉన్న పెళ్లికొడుకుని చూసి సిగ్గుతో లోపలికి పారిపోయిందిట.
అలా చేయీ చేయీ కలుపుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రారంభించిన అమ్మకీ, నాన్నకీ తొలి దశంతా కష్టాలతోనే గడిచింది. పెళ్లయ్యేదాకా నిక్షేపంలా ఉన్న అమ్మకి పెళ్లి ఇలా అవుతూనే అలా వచ్చిన తొలి గర్భం కాస్తా వట్టిపోయి, ఆ మొదటి అబార్షన్ తో ఆరోగ్యమంతా పాడైపోయింది. ఆ తర్వాత ఆరు సార్లు వరస అబార్షన్లు జరిగాయి.
గర్భస్రావాలతో ఒంట్లో ఉన్న రక్తమంతా పోయి, పాలిపోయి, మంచాన్ని అంటిపెట్టుకుపోయింది అమ్మ. "రోగిష్టిది" "గొడ్రాలు" అన్న బిరుదులు వచ్చి చేరాయి. నాయనమ్మ నాన్నకి మరో పెళ్లి చెయ్యాలన్న నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఆ సంగతి తెలిశాక అమ్మ ఏడుస్తూ, "నాకిక బాగవదు. మీరు మరో పెళ్లి చేసేసుకోండి" అందిట. కాని జరిగినదానికి కించిత్తూ చలించనిది నాన్న ఒక్కరే. మరో పెళ్లికి ఆయన ససేమిరా అన్నారు. "లోపం నాలోనే ఉంటే మీరంతా కలిసి దానికి మరో పెళ్లి చేసేవారా..?? నాకో న్యాయమూ, దానికో న్యాయమూనా..?" అంటూ నాయనమ్మని కసిరేశారు. నాయనమ్మ ఇంకేం మాట్లాడలేక ఓ పెద్ద నమస్కారం చేసేసి ఊరుకుంది.
అలా పదహారు సంవత్సరాల వివాహ జీవితాన్ని ఎండమావిలా గడిపి..విసిగెత్తిపోయాక..అమ్మకి ముప్ఫై, నాన్నకి ముప్ఫైనాలుగూ నడుస్తూ ఉండగా, అమ్మకీ నాన్నకీ అపురూపాల అపరంజిలా అమ్మలు పుట్టింది. మళ్లీ తొమ్మిదేళ్లదాకా ఎవ్వరూ లేరు. అమ్మలు పుట్టుకతో పిల్లల మీద కోరిక మరి కాస్త పెరిగింది అమ్మకీ నాన్నకీ.
అమ్మలు పుట్టిన తొమ్మిదేళ్లకి ఎంచక్కా అమ్మని మించిన పచ్చటి పసిమి ఛాయతో భువన పుట్టింది. ఆ తర్వాత రెండేళ్లకి బాబు. వాడు పుట్టడం ఎంత నల్లగా పుట్టాడో వాడి కంటే పదకొండేళ్లు పెద్దదైన అమ్మలుకి బాగా తెలుసు. ఇప్పుడు మాత్రం అమ్మలు చెయ్యి లాక్కుని తన చేతి పక్కన పెట్టి, తలెగరేస్తూ, "చూశావా, ఎంత తెల్లగా ఉన్నానో..! నీ కంటే నేను తెలుపని ఒప్పుకోవే పెద్దక్కా" అంటాడు వాడు. అమ్మలు నవ్వుతుంది.
బాబు పుట్టిన రెండేళ్లకి..అమ్మకి నలభై మూడేళ్ల వయసులో బుజ్జి పుట్టింది. నలుగురు పిల్లలు పుట్టుకొచ్చాక ఇంక నాన్న ఆనందానికి అంతే లేదు. నలుగురూ నాలుగు ప్రాణాలూ, అమ్మ ఐదో ప్రాణమూ అయిపోయారు. నాన్న పిల్లల్ని చూసే తీరు, వాళ్లకోసం పెట్టే ఖర్చు చూసి ఎవరైనా, "ఏమిటయ్యా నీ పిచ్చి" అంటూ దెబ్బలాడితే, "అవును. పిచ్చే. పిల్లల కోసం వాచిపోయి ఉన్నాను నేను. నా పిచ్చే నాకానందం" అనేవారు నాన్న. అలా అని నాన్న పిల్లల్ని ఎప్పుడూ మితిమీరిన గారాబం చెయ్యలేదు. శక్తి మీరిన ఖర్చు కూడా పెట్టలేదు. ఉన్నంతలోనే అన్నీ వైభవంగా జరిపించేవారు. కాస్త జ్ఞానం వచ్చింది మొదలు పిల్లలు తమంతట తామే బాధ్యతగా డిసిప్లిండ్ గా మెలిగేలా పెంచారు.
అమ్మలు బిఏ పూర్తి చెయ్యగానే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకా ఏదీ చూపుల వరకూ కూడా రాలేదు..అంతలో ప్రభుత్వం ఉద్యోగస్తుల సర్వీసు మూడేళ్లు తగ్గిస్తూ యాభై ఐదేళ్లకే రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ లెక్కన నాన్న సర్వీసు ఇంక ఎనిమిది నెలలే ఉందని తేలింది. వెనకాల ఆస్తిపాస్తులేమీ లేవన్న అధైర్యం, తీరని బాధ్యతల బరువుని రెట్టింపు చేస్తూ నాన్న గుండెని ఒక్క కుదుపు కుదిపింది.
అర్ధరాత్రి సమయంలో తొలిసారి నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడే ఎందుకో నిద్ర లేచిన పదమూడేళ్ల భువన నాన్న చెయ్యి పట్టుకుని ధైర్యంగా ఆస్పత్రికి తీసికెళ్లింది. అంతలోనే నిద్ర లేచిన అమ్మలు తనూ పరిగెత్తింది. ఆస్పత్రిలో జాయినైన నాన్న నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకున్నారు. గుండె నిబ్బరాన్ని పెంచుకున్నారు. "నేనే ఇలా అయిపోతే ఇంక పిల్లలకి దిక్కెవరు? పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చెయ్యాలంటే ముందు నేను బావుండాలి" అంటూ తనకి తనే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారు. ఐసియూలో తన మంచం పక్కనే దీనంగా కూచుని ఉన్న అమ్మని దగ్గరకి పిలిచి, "నాకేం పర్వాలేదే. నువ్వు ఇంటికి వెళ్లి స్నానం, భోజనం కానిచ్చి ఓ గంట పడుకుని రా" అని పంపించారు.
ఆ గుండె నిబ్బరమే నాన్నకి శ్రీరామరక్ష అయింది. ఆస్పత్రి నించి వచ్చాక, "ఇప్పుడు మరింత చలాకీగా ఉన్నారండీ" అంటూ నలుగురూ పరామర్శకి బదులు ప్రశంసలకి దిగేలా చేసింది.
తొలి ఎటాక్ తర్వాత దాదాపు పదిహేడేళ్లపాటు అదే నిబ్బరంతో హాయిగా బతికిన నాన్న ఆఖరికి శాశ్వతంగా వెళ్లిపోయే రోజున గుండెనొప్పితో బాధపడుతూ, ఆంబులెన్స్ లో ఆస్పత్రికి బైల్దేరబోతూ కూడా కళ్లనీళ్లపర్యంతమవుతున్న అమ్మని తనే స్వయంగా ఓదార్చారు. "ఏడవకే..నాకేమీ పర్వాలేదు. ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తాను" అంటూ అమ్మకి ధైర్యం చెప్పి, మరో నాలుగ్గంటల్లోనే ప్రాణం లేని కట్టెగా తిరిగొచ్చారు.
ఇన్నేళ్ల జీవితంలో పిల్లలు...అమ్మలు, భువన, బాబు, బుజ్జీ నాన్నతో కలిసి పంచుకున్న ఆనందాలు అన్నీ ఇన్నీనా..??!!
అమ్మలూ.. నాన్నా కబుర్లలో పడితే గడియారంలో తేదీ మారిపోయేది. ఇంటల్లుడితో సహా ఇంటిల్లిపాదీ నిద్రపోతూనే వీళ్ల మాటలు వినేవారు. ఏ పన్నెండున్నరకో అమ్మ లేచి, నవ్వుకుంటూ.. తనూ కబుర్లు చెబుతూ, ఫ్రిజ్ లోంచి పాలు తీసి పొంగించి, రాత్రి పడుకోబోయేముందు వేసిన స్ట్రాంగ్ ఫిల్టర్ డికాక్షన్ కలిపి కమ్మటి కాఫీ తెచ్చి అమ్మలుకీ నాన్నకీ ఇచ్చేది. తను మాత్రం తెచ్చుకునేది కాదు. ఎటూ నాన్న కాఫీలో తనకి భాగం ఉందని తెలుసుగా...:)
నాన్న సగం కాఫీ తాగి, "బ్రహ్మాండంగా ఉందే. నువ్వూ రుచి చూడు" అంటూ మిగతా సగమూ అమ్మకిచ్చేవారు.
అమృతంలాంటి అమ్మ చేతి కాఫీ తాగేసి, సంగీత సాహిత్య చర్చలకీ, ఇతర ఆత్మావలోకనపు కబుర్లకీ తాత్కాలికంగా కామా పెట్టేసి అమ్మలు వెళ్లి పడుకునేది.
భువన అయితే నాన్న ప్రాణంలో ప్రాణమే. నాన్న మంచి గాయకుడు. శాస్త్రీయ సంగీతం పాడినా..లలిత గీతాలైనా..సినిమా పాటలైనా అద్భుతంగా పాడేవారు. ఆంధ్రా యూనివర్సిటీలో నాన్న బీకాం చదువుతూ ఉండగా జరిగిన ఒక ఫంక్షన్ కి ప్రార్ధనాగీతం పాడటానికి స్నేహితులు నాన్న పేరు సడన్ గా అనౌన్స్ చేశారుట. దాంతో కాస్త కంగారు పడ్డ నాన్న స్టేజి ఎక్కి "మా తెలుగు తల్లికీ మల్లెపూదండ" పాటని ప్రారంభించడమే హెచ్చుస్థాయిలో ప్రారంభించేశారుట. ఇంకేముంది..పాట చివరికి వెళ్లేసరికి "ఓ తెలుగు తల్లీ" "మా తెలుగు తల్లీ" పంక్తులు తారస్థాయికి వెళ్లి అంత పెద్ద గ్యాలరీ హాలూ ఒక ఐదు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
సభకి అధ్యక్షత వహించిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు (సర్ సి.ఆర్.రెడ్డిగా ప్రముఖులైన కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రా యూనివర్సిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1926-31 మళ్లీ 1936-49 సంవత్సరాల్లో ఆంధ్రా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పని చేశారాయన) నాన్నని దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందిస్తూనే "పాట బ్రహ్మాండంగా పాడావు గాని, తిక్కయ్యకి కలమెక్కడుందయ్యా..తిక్కయ్య రాసింది గంటంతో కదా" అంటూ చమత్కరించారు.
నాన్న సంగీత వారసత్వమంతా భువనకి వచ్చింది. నాన్నా భువనా కలిసి పాటలు పాడుకుంటూ, నాన్న భువనకి పాటలు నేర్పుతూ ఉండగా రికార్డ్ చేసిన క్యాసెట్ ఒక్కటే ఇప్పుడు "కామితమిచ్చే మామిడిపండూ కవులకు మిగిలిందీ" అన్నట్టు మిగిలింది.
ఇంక బాబు చదువులో ఎక్కి వస్తూ బాంబే ఐఐటీకి సెలెక్ట్ అయినప్పుడూ, "హి ఈజ్ వెరీ యూజ్ ఫుల్ టు అవర్ డిపార్ట్మెంట్" అంటూ ప్రొఫెసర్ నాన్న దగ్గర వాణ్ని మెచ్చుకున్నప్పుడూ నాన్న పుత్రోత్సాహం చెలియలికట్ట దాటి పొంగి పొర్లేది. వాడు బొంబాయి నించి సెలవులకి ఇంటికొచ్చినప్పుడల్లా వాణ్ని చంటిపిల్లాణ్ని చూసినట్టే చూసేవారు. వాడు ఉద్యోగం ఇంకా దొరకలేదని బాధపడుతూ, "పాపా కహతే హై బడా నాం కరేగా..బేటా హమారా ఐసా కాం కరేగా..మగర్ యే తో తుం భీ న జానే యే ఖాబ్ హై" అంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్నకి ఒక కంట దుఖాశృవులూ, మరో కంట ఆనందబాష్పాలూ వచ్చాయి. "టు అవర్ గ్రేట్ డాడ్" అన్న మొమెంటోని బాబు బాంబే నించి తెచ్చి అందిస్తే ఆనందంగా..సగర్వంగా అందుకున్న నాన్న చివరికి వాడికి ఉద్యోగం రాకుండానే హడావిడిగా వెళ్లిపోయారు.
నలుగురిలోకీ ఆఖరుదైన బుజ్జి నాన్నకి ప్రాణం కంటే ఎక్కువ. బుజ్జికున్న పెద్ద క్వాలిఫికేషనల్లా ప్రేమించటం. అది అమ్మనీ, నాన్ననీ, అక్కల్నీ, అన్ననీ ఎంతగా ప్రేమిస్తుందంటే..దానికే గనక సాధ్యమై ఉంటే అది చచ్చిపోయి అయినా నాన్నని బతికించేసి ఉండేది. నాన్నకి దాని గుణం తెలుసు. అందుకే ప్రేమగా "బుతా" (బుజ్జితల్లీ) అంటూ పిలుచుకునేవారు. వయసు మీదపడుతున్నా బాధ్యతలు తీరకపోవడంతో ఎంత కూడగట్టుకున్నా అప్పుడప్పుడూ నాన్న మనోనిబ్బరం సడలిపోతూ ఉండేది. అటువంటి స్థితిలోనే ఒకసారి అమ్మలుకి ఉత్తరం రాస్తూ.."పూర్వపు జవసత్వాలిప్పుడు లేవమ్మా. కాని ఏం చెయ్యను? బుజ్జికీ బాబుకీ కూడా పెళ్లిళ్లయి, వాళ్లు కుడా స్థిరపడేదాకా నేను ఓపికని బజార్లో అరువు తెచ్చుకుని అయినా తిరగాలమ్మా..తప్పదు" అంటూ రాశారు. ధైర్యం తగ్గినప్పుడల్లా, తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ బుజ్జితో, నీకు ఏ లోటూ రానివ్వనమ్మా. పెద్దక్కకీ, చిన్నక్కకీ ఎలా చేశానో నీకూ అంతా అలాగే చేస్తాను." అనేవారు.
భువన పెళ్లి అయింది మొదలు బుజ్జికి సంబంధాలు చూడటం మొదలుపెట్టి సారె సామాను కూడా ఒకటీ ఒకటీ చేర్చడం ప్రారంభించారు. బుజ్జికి ఏమేం కొనాలో పొందిగ్గా ముత్యాల్లాంటి అక్షరాల్తో ఒక చిన్న కాగితం మీద రాసుకుని దాన్ని పర్సులో పెట్టుకున్నారు. నాన్న పోయాక ఆ పర్సు తీసి చూసిన అమ్మలుకి పర్సులో ఆ కాగితమూ, ఒకప్పుడు పచ్చనోట్లతో నిండుగా ఉండే ఆ పర్సు ఒకే ఒక్క యాభై నోటుతో చిక్కిపోయి ఉండటమూ కనిపించి తీరని దుఖం కలిగింది. నాన్న గుర్తుగా ఆ పర్సుని అమ్మలు ఇప్పటికీ తన దగ్గరే ఉంచుకుంది.
నాన్న చెప్పా పెట్టకుండా సుదూర తీరాలకి పయనమవుతున్నప్పుడు ఆఖరి సెండాఫ్ ఇచ్చింది కూడా అమ్మలే. మామూలుగా నాన్నని ఒకసారి చూసి వెళదామని వచ్చిన అమ్మలు, తను వచ్చిన కొన్ని గంటలకే గుండె చేత్తో పట్టుకుని విలవిల్లాడుతున్న నాన్నని దగ్గరుండి ఆంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తీసికెళ్లి అడ్మిషన్ ఫారం మీద చేజేతులా సంతకం పెట్టి, నాన్నని స్వయంగా మృత్యుదేవతకి అప్పజెప్పేసింది.
తను ఉన్నన్నాళ్లూ ఐదుగుర్నీ రెండు చేతులా గుండెల్లో దాచుకున్న నాన్న ఎవరి ఖర్మానికి వాళ్లని వదిలేసి వెళ్లిపోక తప్పని స్థితి దాపురించేసరికి భువనకి ఏడోనెల.తొలిసారి గర్భవతి అయిన భువనని సీమంతానికి, పురిటికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న నాన్నని ఆ దయమాలిన దేవుడు, "ఇంక చాల్లే..పద పద" అంటూ కర్కశంగా వెంటబెట్టుకెళ్లాడు.
ఫోను మోగేసరికి అలవాటుగా "ఏరా తల్లీ, ఎలా ఉన్నావ్" అంటూ పలకరించే నాన్న మాటల కోసం చూసిన భువనకి అసలు నాన్నే ఇక లేరన్న వార్త అశనిపాతంలా వినిపించింది.
పళ్లూ, పాలూ, కోరినవీ కోరనివీ ఫలహారాలూ క్షణంలో అమర్చిన నాన్ననే తలచుకుంటూ నిండు కడుపు ఎగిరెగిరి పడేలా కుమిలి కుమిలి ఏడ్చింది భువన. పొట్టలో ఉన్న బిడ్డకోసం అన్నట్టు బలవంతాన నాలుగు ముద్దలు మింగుతూ ఎలాగో బతికింది. నాన్నకీ, భువనకీ బాగా తెలిసిన డాక్టరుగారు భువనకి స్కానింగ్ చేస్తూ, "మీ నాన్నగారు ఎక్కడికీ వెళ్లలేదమ్మా..నీ కడుపునే పుట్టి మళ్లీ నీ దగ్గరకే రాబోతున్నారు. నీకు పుట్టబోయేది బాబమ్మా" అంటూ చెప్పేసరికి అక్కడే వెక్కిపడిన భువన ఇంటికొస్తూనే..అమ్మ గుండెల్లో తల దాచుకుని.."అమ్మా..నాన్నమ్మా, నాన్న" అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది.
ఇంక ఎక్కడో దూరంగా బాంబేలో ఉన్న బాబు ఉద్యోగపు ఇంటర్వ్యూ కోసం మరికొన్ని గంటల్లో బైల్దేరతాడనగా "ఫాదర్ ఎక్స్పైర్డ్" అన్న వార్త వాణ్ని పిడుగులా తాకింది. వాడికి శుభాకాంక్షలు చెబుతూ బెంగళూరు ట్రైను ఎక్కించడానికి సన్నధ్ధమవుతున్న వాడి స్నేహితులు తలా ఇంతా అని చందాలేసుకుని ఉన్న పాటున వాణ్ణి విమానమెక్కించి నాన్నకి తుది వీడ్కోలు చెప్పడం కోసం పంపించేశారు.ఎప్పుడూ తనకి స్వాగతం చెప్పడానికి స్టేషన్ లోనే నవ్వుతూ నిలబడి ఉండే నాన్న తను గుమ్మంలోకొచ్చినా కదలక మెదలక కట్టెలా పడి ఉండేసరికి తట్టుకోలేని బాబు గేటు దగ్గరే "నాన్నా" అంటూ కుప్పకూలిపోయాడు.
అమ్మలూ బుజ్జీ మొదటినించీ నాన్న పక్కనే ఉన్నారు. బాబూ భువనా వచ్చేశారు. నలుగురూ కలిసి కనలి.. కనలి.. రగిలి రగిలి శోకిస్తున్న అమ్మని చుట్టుముట్టారు. నాన్న లేని పిల్లల్ని చూసి అమ్మ మరింత బావురుమంది. నాన్న లేని అమ్మని చూసి పిల్లలు ఇంకా ఇంకా విలపించారు.
నెమ్మదిగా రోజులు గడిచాయి. ఏనాడూ ఒంటరిగా ఏ పనీ చెయ్యని అమ్మకి గాఢాంధకారంగా తోచిన భవిష్యత్తులో నాలుగు ఆశాకిరణాలు కనిపించాయి. "సింహంలాంటి మనిషి...వెళ్లిపోయారు" అంటూ ఏడుస్తున్న అమ్మని, "సింహపు కొదమలు ఉన్నాయి కదమ్మా" అన్న ఆత్మీయుల మాటలు కాస్తలో కాస్త ఓదార్పునిచ్చాయి.
నాలుగు రెళ్లు ఎనిమిది చేతులు కలిశాయి. అమ్మలూ, భువనా, బాబూ, బుజ్జీ కలిసి చిక్కగా అల్లిన మమతల పందిరి కింద అమ్మని కూచోబెట్టారు. నెమ్మదిగా కాలం ముందుకి కదిలింది. నాన్న లేని లోటుని ఎత్తి చూపిస్తూనే రోజులు గడిచాయి.
భువనకి బాబు పుట్టాడు. "బుల్లి నాన్న" అంటూ వాణ్ని పదిలంగా చేతుల్లోకి తీసుకుంది అమ్మలు. పెద్దకూతుర్ని గుర్తుపట్టినట్టు బుల్లి నాన్న బోసినవ్వు నవ్వాడు.
బాబుకి ఉద్యోగం వచ్చింది. వాడు అమ్మనీ బుజ్జినీ అపురూపంగా బెంగళూరు తీసికెళ్లిపోయాడు.
మరికొన్నాళ్లకి బుజ్జికి పెళ్లయిపోయింది. నాన్న కాగితంలో రాసి పెట్టుకున్నవన్నీ ఒక్కటీ మర్చిపోకుండా అమర్చి బుజ్జికి ఏ లోటూ లేకుండా అత్తవారింటికి పంపించారు అక్కలూ అన్నా. నాన్న లేని లోటుని మాత్రం ఎవరు పూడ్చగలరు?
కాలం ముందుకి నడుస్తూనే ఉంది. అమ్మ పిల్లల నీడలో నిశ్చింతగానే ఉంది. కాని అమ్మ కళ్లలో మునుపటి కాంతి కరువైందన్న నిజం పిల్లలకి తెలుసు. అందరూ నవ్వుతూనే ఉన్నారు. కాని, అందరి హృదయాలూ ఎంత లోతైన విషాదసాగర ఘోషతో ఘూర్ణిల్లుతున్నాయో వారికే తెలుసు...ఆ పైవాడికే తెలుసు...తనవారిని వదిలి నిస్సహాయంగా తరలిపోయిన నాన్నకే తెలుసు.
అమ్మ రెండు కళ్లల్లోనూ ఒక కన్ను పిల్లల కోసం నవ్వుతూంటే మరో కన్ను నాన్న కోసం ఎడతెగని దుఖాశృవుల్ని కురిపిస్తూనే ఉంది. ఒక కన్ను పిల్లల్ని తనివిదీరా చూస్తుంటే మరో కన్ను దూరాకాశవీధుల్లో నాన్న కనబడి, "రావే, ఇంక నా దగ్గరకొచ్చెయ్" అని పిలుస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూనే ఉంది.
అమ్మా...వద్దమ్మా, నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోకు. నాన్న లేని పిల్లలం. నువ్వే మాకు అమ్మా...నువ్వే మాకు నాన్నా. నువ్వైనా మా దగ్గరుండమ్మా. నీలో మేము, మాలో నువ్వు నాన్నని చూసుకుంటూ బతుకుదాం. సరేనా...అమ్మా...సరే అనమ్మా...అమ్మా...!!
2000 మార్చి 27వ తేదీ... మా నాన్నని చూడటం కోసం బైల్దేరిన మేం పొద్దున్న పదిన్నరకి ఇల్లు చేరుకున్నాం. మా పిల్లలిద్దరూ స్నానాలు చేసి అమ్మమ్మ చేత జడలు వేయించుకున్నారు. మనవరాళ్లు వస్తున్నారంటే మా అమ్మ పెరట్లో పూసిన పువ్వులన్నీ కోసి, డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో దాచి ఉంచేది. కనకాంబరాలైతే ఇద్దరికీ చిన్న చిన్న మాలలు కట్టి మరీ ఉంచేది. అలాగే సిధ్ధంగా ఉంచిన కనకాంబరాల దండలు ఇద్దరూ పెట్టుకున్నారు. మరో గంటకి మావాఅల్లుళ్లిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. మార్చి నెల...టెంపరరీగా పెట్టిన కొత్తావకాయతో కమ్మని భోజనం వడ్డించింది మా అమ్మ. భోజనాలయ్యాక మావారు హాయిగా శయనించారు. నేను (అమ్మల్ని)అలవాటుగా నాన్నతో కబుర్లకి దిగాను. మధ్యాహ్నం మూడు దాకా కబుర్లు సాగాయి. మూడింటికి సడన్ గా నాన్న ఏదో పని గుర్తొచ్చి.."ఇప్పుడే వెళ్లొస్తా" అంటూ తన లూనా మీద బైటికెళ్లారు. నేను వీధి కటకటాల్లో సోఫాలో కూచుని చందమామలో పడుతున్న నా సీరియల్ "స్వర్ణ సింహాసనం" మార్చి నెల భాగాన్ని చదువుతున్నాను.
అంతలో గేటు చప్పుడైంది. చూసేసరికి నాన్న..!! అప్పుడే వచ్చేశారు. రావడమే గబగబా వస్తూ..."అమ్మా..బుజ్జీ నా సార్బిట్రేట్ మాత్రలు తీసుకురా" అంటూ కేకేశారు. "ఏం నాన్నా...గుండెల్లో నొప్పిగా ఉందా" అంటూ నేను గబగబా నాన్న దగ్గరకి వెళ్లాను. క్షణంలో నేనూ, బుజ్జీ, అమ్మా, మా పిల్లలూ నాన్న చుట్టూ చేరిపోయాం. నాన్న వరసగా మూడు సార్బిట్రేట్ మాత్రలు వేసుకున్నారు. అయినా నొప్పి తగ్గలేదు. నేను పరుగు పరుగున వెళ్లి మా ఫేమిలీ డాక్టరుగారిని తీసుకొచ్చాను. ఆ రోజులకే డాక్టర్లు ఎవరింటికీ వెళ్లడం మానేశారు. కాని నాన్న మీదున్న అభిమానం కొద్దీ ఆ డాక్టరుగారు ఇంటికొచ్చి చూశారు. చూస్తూనే.."హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా ఉంది. కనీసం పన్నెండు గంటలపాటు అబ్జర్వేషన్ లో పెట్టాలి. వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చెయ్యండి" అన్నారు. ఇంట్లో కానీ లేదు. ఇప్పట్లా అప్పుడు ఏటీఎంలూ లేవు. ఒక్క పరుగున నేను ఎదురింటికి వెళ్లాను. ఆ ఇంట్లో ఉండే ఆయన నగరం లో పేరు మోసిన వకీలు. మా కుటుంబమంటే ఆయనకి ఎంతో అభిమానం. సంగతి వింటూనే ఆయన ఒక్క గంతులో లోపలికి వెళ్లి బీరువా లోంచి యాభై రూపాయల కట్ట తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతూ, "నాన్నని వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లమ్మా" అన్నారు.
ఆస్పత్రికి ఫోన్ చేశాం. ఆంబులెన్స్ వచ్చింది. హార్ట్ ఎటాక్ వచ్చినవాడు నడవకూడదన్న కనీసపు జ్ఞానం ఉంది నాకు. అందుకని "స్ట్రెచర్ తీసుకురండి" అని ఆంబులెన్స్ వాళ్లని అడిగాను."స్ట్రెచర్ ఏమీ లేదు. నడిచొచ్చెయ్యమనండి" అన్నారు వాళ్లు. ఏం చేస్తాం...నేనూ, మావారూ,బుజ్జీ కలిసి నెమ్మదిగా నాన్నని నడిపించుకుంటూ వీధిలోకి తీసికెళ్లి ఆంబులెన్స్ ఎక్కించి పడుకోబెట్టాం. ఆస్పత్రి చేరాక మళ్లీ స్ట్రెచర్ కోసం అడిగాం. "అదేం లేదు. నడిపించి తీసుకొచ్చెయ్యండి" అన్నారు. చేసేదేమీ లేక అలాగే చేశాం.
"డిపాజిట్ ఐదు వేలు కట్టాలి. అప్పుడే ట్రీట్ మెంట్ ఇస్తాం" అన్నారు. దగ్గరున్నదే ఐదు వేలు. అది కాస్తా వీళ్లకి సమర్పించేస్తే...??? దేవుడి దయ వల్ల తెలిసినాయన ఒకరు కల్పించుకుని డిపాజిట్ లేకుండా అడ్మిషన్ ఇప్పించారు.
నాన్నని ఎమర్జెన్సీ లోకి తీసికెళ్లారు. నగరంలోకెల్లా పేరుకెక్కిన కార్డియాలజిస్టుని పిలిపిస్తున్నామని చెప్పారు. సరేనన్నాం. ఓ ఇరవై నిమిషాల్లో ఆయన వచ్చారు. పేషంట్ తాలూకా ఎవరు అని అడిగారు. నేను వెళ్లాను. నాన్న గుండె చరిత్ర అడిగారు. 1983 ఏప్రిల్ లో నాన్నకి తొలిసారి హార్ట్ ఎటాక్ రావడం నించి అంతా రెండు ముక్కల్లో చెప్పాను. "పేషంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్ మెంట్ ఇవ్వడమే చాలా రిస్కీ. వైద్యం చెయ్యమంటారా వద్దా" అని అడిగారాయన. నేనేం చెప్పను...? వైద్యం చేసి మా నాన్నని బతికించండి అని చెప్పనా...వైద్యమే ప్రమాదమన్న స్థితిలో వద్దు వదిలెయ్యండి అని చెప్పనా..???
డాక్టరుగారికి రెండు చేతులూ జోడించి నమస్కారం చేశాను. "నాకు తెలియదు డాక్టర్. మీరు వైద్యులు. మీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి" అన్నాను. ఆయన కనీ కనిపించనట్టు చిన్న నవ్వు నవ్వి, "సరే, మీరు వెళ్లండి" అన్నారు. నేను ఇవతలికి వచ్చేశాను. ఆస్పత్రి ఆవరణలో బుజ్జి బిక్కు బిక్కుమంటూ నిలబడి గుడ్ల నీరు కుక్కుకుంటోంది. నన్ను చూడగానే.."అక్కా, నాన్నకి ప్రమాదంగా ఉందా" అంటూ బావురుమంది. దాన్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నట్టే ఓదారుస్తూ నేనూ ఏడుస్తున్నాను. ఇంటి దగ్గర అమ్మ ఒక్కత్తీ ఉంది. అమ్మ...అమాయకమైన అమ్మ. నాన్న తన చెయ్యి పట్టుకుంటే చాలు, నిశ్చింతగా కళ్లు మూసుకుని నరకానికైనా ప్రయాణం కట్టగల అమ్మ. నాన్న దగ్గర లేకపోతే స్వర్గానికి సైతం ససేమిరా అనే అమ్మ.
ఆ క్షణం నేను దేవుణ్ని తలచుకున్నానో..లేదో..మా నాన్నని బతికించమని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకున్నానో లేదో...ఏదీ నాకు గుర్తు లేదు. ఒక్క పావుగంట గడిచాక మావారు నా దగ్గరకొచ్చి...నోట్లోంచి మాట రాని పరిస్థితిలో చెప్పలేక చెప్పలేక చెబుతూ..."అంతా అయిపోయిందిట" అన్నారు. అంతే. ఆ క్షణం నేను బిగ్గరగా ఏడవలేదు. సినిమాల్లోలా నాన్నా అని అరవలేదు. ఒక్క క్షణం కొయ్యయిపోయాను. అంతే. తర్వాత నాన్నని పడుకోబెట్టిన వార్డు దగ్గరకి వెళ్లాను. అక్కడున్న నర్సుని "ఒక్కసారి మా నాన్నని చూస్తాను" అని అడిగాను. నర్సు ఒప్పుకోలేదు. "పక్క బెడ్స్ వాళ్లకి ఇబ్బందండీ" అంది. నాకు అర్ధమైంది. నాన్న శవాన్ని చూసి నేను భోరుమంటే ఆ ఏడుపు పక్కవాళ్లకి ప్రమాదం కదా.."నేను ఏడవనమ్మా...ఒక్కసారి మా నాన్నని చూసి వస్తానంతే" అన్నాను నిశ్చలంగా. మరి నా మొహం చూసి ఆ నర్సు ఏమనుకుందో గాని "సరే వెళ్లండి" అంది. వెళ్లాను. ఒక్కత్తినే...నాన్న దగ్గరకి. నొప్పంతా తగ్గిపోయినట్టూ నిశ్చింతగా నిద్రపోతున్నట్టూ ఉన్నారు నాన్న. మరిక లేవరు. నా గుండెల్లో సుడి తిరిగింది. నాన్న శవం ఉన్న బల్ల దగ్గర నిలబడి, వంగి నాన్న నుదురు నిమిరాను. శవాల్ని చూస్తేనే భయపడే నాకు అది శవం అన్న భయం వెయ్యలేదు. నాన్న బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. మరో సారి చూసి నిశ్శబ్దంగా ఇవతలికి వచ్చేశాను. ఆ తర్వాత జరగవలసినవన్నీ యధాప్రకారం జరిగిపోయాయి. నాన్న ట్రీట్ మెంట్ కని ఎదురింటి వకీలంకుల్ ఇచ్చిన ఐదువేలల్లో మూడు వేలు ఖర్చుపెట్టి నాన్న శవం పాడైపోకుండా బాబు వచ్చేదాకా తాజాగా ఉండేందుకు గాను ఇంజెక్షన్ ఇప్పించాను. తర్వాత నాన్నని దగ్గరుండి ఇంటికి తీసికెళ్లాను.ఎప్పుడూ నాన్న నన్ను తీసికెళ్లేవారు..ఈసారి రివర్స్ అన్నమాట. అమ్మ మా పిల్లలకోసం కోసి డబ్బాలో పెట్టి దాచిన పువ్వులన్నీ కలిపి పెద్ద మాలగా కట్టి మర్నాడు మా నాన్న మెడలో వేసి ఆయన్ని ఘనంగా సాగనంపాం..!!
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కాని నాన్న...మా నాన్న లేరన్న దుఖం మాత్రం నా గుండెల్లో ఇసుమంత కూడా తగ్గలేదు సరికదా మరింత బరువెక్కింది. ఈ లోగా నా సీరియల్ స్వర్ణ సింహాసనం ముగింపుకొచ్చింది. ఎందుకో ఆ బంగారు గద్దె మీద నాన్నని కూర్చోబెడదామనిపించింది. "తండ్రి, స్నేహితుడు, గురువుగా నన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ హఠాత్తుగా మాయమైన నాన్నకి ఈ స్వర్ణ సింహాసనం బహూకృతి" అని ఆఖరి భాగం చివర్లో ప్రచురించమని చందమామ కి రాశాను. అప్పటి చందమామ రథసారథి దాసరి సుబ్రహ్మణ్యం గారు, "తప్పకుండా అలాగే వేస్తామమ్మా. మీ నాన్నగారి మృతికి మా ప్రగాఢ సానుభూతి" అంటూ జవాబిచ్చారు. అలాగే స్వర్ణ సింహాసనం ఆఖరి భాగంలో నాన్నకి అంకితం పడింది.
మరో రెండేళ్లు గడిచాయి. అయినా నా బాధ తగ్గలేదు. "నాన్న" అన్నశీర్షికతో కథ రాసి స్వాతి వీక్లీకి పంపించాను. కథలో అమ్మల్ని నేను. నాకిద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. వాళ్లే భువనా, బాబూ, బుజ్జీ. ఆ కథ నేను రాసే వేళకి మా అమ్మ బతికే ఉంది. అది 24-10-2003 స్వాతి వీక్లీ లో ప్రచురించబడే వేళకి అమ్మ కూడా హాయిగా నాన్న దగ్గరకి వెళ్లిపోయింది. ఇప్పుడిక అమ్మా నాన్నా లేని పిల్లలం...మేమే మిగిలాం...మా మా బతుకుల్లో ఎగుడు దిగుళ్లని మాకు మేమే తట్టుకుంటూ... మరో విచిత్రమేమంటే మరొక్క వారం లోనే మా అమ్మ ప్రయాణమైన రోజు. 2003 ఏప్రిల్ 4వ తేదీన అమ్మ నాన్న దగ్గరకి వెళ్లిపోయింది.
రేపు 27-03-2014. మా నాన్న మాకు దూరమై పధ్నాలుగేళ్లు. నాన్నకీ మాకూ గల అనుబంధం ఎంత చిక్కనిదో...చక్కనిదో మాకే..మా హృదయాలకే తెలుసు...! ఈ రోజు ఈ పోస్టు మీ ముందు పరిచిన మా నలుగురి ఏకీకృత హృదయం...! అదొక గుడి. అందులో మాకు దేవుళ్లు మా అమ్మా-నాన్నే...!!
ఇప్పటిదాకా మీరు చదివింది ఆనాడు స్వాతిలో ప్రచురించబడ్డ ఆ కథే. అదే ఈ "మా నాన్న" పోస్టు. (ఎర్రటి అక్షరాలకు పైనున్నదంతా అప్పటి స్వాతి కథ) స్వాతి కథ "నాన్న" అన్న పేరుతో వస్తే ఇక్కడ "మా" అన్న అక్షరం అదనంగా చేర్చాను..అంతే.
అమ్మా-నాన్నా |
ఇదిగో మా నాన్న |
16, మార్చి 2014, ఆదివారం
ఇదీ మా లలితా పీఠం
నిన్న పౌర్ణమి. మామూలుగా అయితే పట్టాభిరెడ్డి తోటలో కొలువుదీరి ఉన్న వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళతాను. కాని ఈ సారి మాత్రం కించిత్కార్యార్ధం అక్కయ్యపాలెంలో ఉన్న లలితా పీఠానికి వెళ్లాను. తెల్లవారుజాము ఐదుంపావుకి నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి మధ్యలోంచి దూసుకుపోతున్న ఆటోలో లలితా సహస్రం వల్లె వేసుకుంటూ నేనొక్కత్తినే. దట్టంగా ఉన్న చీకట్లలోకి అప్పుడప్పుడే కాంతి కిరణాలు చొచ్చుకొస్తున్నాయి.... నిరాశతో మూసుకుపోయిన హృదయకవాటాల్ని తెరచుకుని ఆశాకిరణాలు దూసుకొస్తున్నట్టు. ఏమైనా తెల్లారుజాము ప్రయాణాలు బావుంటాయి...ఒంటరిగా అయినా సరే..నిజానికి ఒంటరిగా అయితేనే బావుంటాయేమో..గుంపులో బతకాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉన్నా, మన మనసుని మనకి తగినట్టూ నింపుకుని, ట్యూన్ చేసుకోవాలంటే ఇలాంటి ఒంటరితనం కూడా అప్పుడప్పుడూ అవసరమే.
సరే...అక్కయ్యపాలెం లలితా పీఠం విశాఖపట్నంలో చాలా పేరుకెక్కిన గుడి. కాస్త గ్రాంధికంగా ఉండేవాళ్లు లలితా పీఠం అనీ..జనసామాన్యం లలిత గుడి అనీ అంటూ ఉంటారు. దాదాపు శతాబ్దం కిందటి పీఠమిది. అమ్మవారి విగ్రహం ఎత్తుగా ఉన్న పీఠం మీద ఉంటుంది. తల్లి కాస్త పొట్టిది. (పొట్టిది కాబట్టే గట్టిది..:) ) ఆవరణలో పీఠం వ్యవస్థాపక స్వాముల విగ్రహాలతో బాటు, మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, లలితా సహస్రాన్ని పరస్పర సంవాదరూపంలో వెలికి తెచ్చిన హయగ్రీవాగస్త్యుల విగ్రహాలు విడి విడి తిన్నెల మీద ఉంటాయి. చిత్రమేమిటంటే దక్షిణామూర్తి వగైరా విగ్రహాలకు కట్టిన బుల్లి బుల్లి ప్రాకారాల కంటే స్వాములిద్దరి గుళ్లూ పెద్దవి. అవి దాటి వెళితే జగన్నాధ, సుభద్ర, బలభద్రులకో గుడి, దాని కెదురుగా అశ్వత్థ వృక్షం, పక్కనే పద్ధెనిమిది మెట్ల పంక్తికి పైన కొలువు దీరిన అయ్యప్ప దర్శనమిస్తారు. ఆ వెనుక నవగ్రహ మండపం. ఇది కాస్త పెద్దదే. నవగ్రహాలకు పూజలు కూడా ఇక్కడ బాగా చేస్తారు.
అయిందా...ఇక చెప్పుకోవాల్సిన మాటేమిటంటే...త్రిమతాచార్యుల్లో ప్రధముడూ, అద్వైత మత ప్రవక్తా, గొప్ప కవీ సాక్షాత్తూ శైవాంశ సంభూతుడూ అయిన శంకర భగవత్పాదులది..ఓ చిన్న విగ్రహం..ఓ బుల్లి ప్రాకారంలో నవగ్రహ మండపానికి ముందు ఉంటుంది. గుళ్లో కొలువుదీరిన తల్లి దివ్య సౌందర్యాన్ని అనితరసాధ్యంగా వర్ణించి...అందాల కడలిని కళ్ల ముందు ప్రవహింపజేసిన ఆది శంకరులకు దక్కింది ఆ పాటి గౌరవమే..!!
సరే మళ్లీ ఓ రెండడుగులు వెనక్కి వస్తే అక్కడ "మణిద్వీపం" ఉంటుంది. ఇది మొదట్లో లేదు. ఒకానొకప్పుడు సువిశాలమైన ప్రాంగణాలతో "దేవుడు ప్రకృతిలోనే ఉన్నాడ"న్నట్టు పరిఢవిల్లిన ఆలయాల ఆవరణలన్నిటినీ దరిమిలా ఏవేవో గుళ్లతో నింపేసి "టెంపుల్ కాంప్లెక్స్"లుగా మార్చేస్తున్న ఆధునిక ఆధ్యాత్మికతకు లలితాపీఠం మినహాయింపేమీ కాదు. దాదాపు దశాబ్దం కిందట కట్టిన ఈ మణిద్వీపంలో సరస్వతి, దుర్గ, ఈశ్వరుడు, మహిషాసుర మర్దిని, వారాహి, ప్రత్యంగిర (ఈ ప్రత్యంగిరాదేవి విగ్రహం చూడటానికే ఎంత భయంకరంగా ఉంటుందో...) రాజరాజేశ్వరీ విగ్రహాలతో బాటు మండపం మధ్యభాగంలో "లలితాకామేశ్వరులు" కొలువై ఉంటారు. మధ్యలో ఈ లలితాకామేశ్వరులు ఉండగా చుట్టూ ఎత్తుగా కట్టిన వేదికల మీద మిగిలిన విగ్రహాలన్నీ ఉంటాయి.
ఈ మణిద్వీపం నిర్మాణదశలో ఉండగా దాని గురించిన ప్రకటనలు విని నేను చాలా ఆశపడ్డాను. అమృత సముద్రమధ్యంలో ఉండే మణిద్వీపాన్ని వాస్తవంగా నేలకు దింపడమనేది పూర్తిగా దుస్సాధ్యమన్న మాట తెలిసినా, కనీసం మణిద్వీపానికి దగ్గర్లో ఉండే ఒక చక్కని నిర్మాణాన్ని వాస్తవంగా చూడగలుగుతాం కదా అని ఆనందించాను. ఇప్పటిదాకా కేవలం ఊహల్లో మాత్రమే దర్శించుకుంటున్న అమ్మ నివాసాన్ని ఇక మీదట లలితాపీఠంలో హాయిగా చూస్తూ లోపలికి ఎంటరైపోవచ్చు కూడా కదా అని దురాశే పడ్డాను. కాని మధ్యలో లలితాకామేశ్వరుల విగ్రహాలూ...చుట్టూ సగం సగం కట్టిన వేదికలూ (కొన్ని వేదికలకు సరైన ప్లాస్టింగ్ కూడా లేదు) ఆయా విగ్రహాలకు ఏదో చేశామంటే చేశామన్నట్టున్న అలంకరణలూ...ఇవన్నీ చూశాక అసలు అటువైపు పోబుద్ధే పుట్టడం లేదు.
మణిద్వీపం పక్కనించి వెళితే అమ్మవారి గర్భగుడి. ఇదంతా ఒక పెద్ద హాలు. మధ్యలో గర్భాలయం ఉండగా, చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేసేందుకు గాను ఖాళీ జాగా ఉంటుంది. శుక్రవారాల్లోనూ, పౌర్ణమి నాడూ ఓ చిన్న పెన్సిలు ముక్క పుచ్చుకుని, ఆలయం వాళ్లిచ్చే 108 అంకెలున్న కాగితంలో టిక్కులు పెట్టేసుకుంటూ పరిగెడుతున్నట్టే అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసే భక్తులు బోలెడంతమంది కనిపిస్తారు. గంట తొమ్మిదైతే చాలు ఈ ప్రదక్షిణల్ని ఆపెయ్యాలి.
గర్భాలయంలో కొలువుదీరి ఉన్న లలితా త్రిపురసుందరి దర్శనం చేసుకుని అలా ముందుకు వెళితే అక్కడ మరో ఆలయం ఉంటుంది. అదో పెద్ద హాలు. అక్కడ వరుసగా బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకన్న, సీతారామచంద్రమూర్తి, స్వామికి ఎదురుగా హనుమన్న, రాముడికి పక్కనే సాయిబాబా, ఆ పక్కన అన్నిటికంటే పెద్ద వేదిక మీద గో,గోపికా పరివేష్టితులై ఉన్న రాధాకృష్ణులు. వీటిలో బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే శిలలో మలిచినది. వెంకన్న ఒక పెద్ద ఫోటోలో మాత్రమే దర్శనమిస్తాడు. . మిగతావన్నీ పాలరాతి విగ్రహాలు. మాంఛి కళ ఉట్టిపడుతూ చాలా బావుంటాయి. ముఖ్యంగా పచ్చని పచ్చిక బయలు మీద, చుట్టూ ఆవులూ, దూడలూ, నెమళ్లూ, లేళ్లూ తదితరాలతో,కడవలు నెత్తికెత్తుకుని వొయ్యారంగా ఉన్న గోపికలతో కొలువుదీరి ఉన్న రాధాకృష్ణుల వేదిక బృందావనాన్నే తలపిస్తుంది.
లలితా పీఠానికి వెలుపల బోలెడంతమంది పువ్వులవాళ్లుంటారు. గులాబీలూ, చామంతులతో బాటు ఎర్రని మందారపువ్వులు కూడా అమ్ముతారు. ఇక్కడి పువ్వులు బావుంటాయి కూడా. కాని, ఎంత డబ్బు పోసి పువ్వులు కొన్నా అమ్మవారి గర్భాలయం ఇవతల వేలాడదీసిన ఓ ప్లాస్టిక్ కవర్లో వాటిని పడెయ్యడమే. మనం అపురూపంగా పట్టికెళ్లి అక్కడున్న పళ్లెంలో పెట్టినా పూజారి గారు తీసి కవర్లోకి ఒక్క గిరాటు కొడతారు. పసుపు, కుంకుమ వగైరాలకూ అదే గతి. మరి నలిగిపోయిన తర్వాత గాని ఆ పువ్వులు పూజకి పనికిరావేమో...:(
ఏమిటో...ఆలయాలు ఆలయాలంటూ కలవరించడమే గాని, తీరా వెళితే అక్కడ మనసు కోరుకున్న ప్రశాంతత దొరకదు. అయినప్పటికీ లలితా పీఠంలో నాకు నచ్చేది ఏమిటంటే అక్కడికి వెళ్లి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది...తిరుపతిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నా వెంకన్న మూలవిగ్రహాన్ని చూసి ఇవతలికొచ్చాక "ఇంక మనకేం భయం" అనిపించినట్టు. బహుశా ఇదంతా ఆయా ఆలయాల నిర్మాణక్రమంలో అక్కడ నెలకొల్పిన యంత్రాల మహిమ అయి ఉంటుంది. దాదాపు శతాబ్దం కిందట లలితా పీఠాన్ని నెలకొల్పుతున్నప్పుడు శ్రీచక్రాన్ని భూస్థాపితం చేసి ఉంటారు కదా...అక్కడ మన మనసును తాకేది అదే. అక్కడి గాలిలో సుళ్లు తిరుగుతూ అణువణువునా ఆవరించుకుని ఉన్న శ్రీచక్రపు మహిమ.. పవిత్రత..అమ్మ కరుణతో కలగలిసి మనసును నెమ్మదింపజేస్తాయి.
అందుకే వెనక మిట్టూరోడి కతలకు తన మాట రాస్తూ బాపు.."దేవుడు అంతటా ఉన్నాడని తెలిసినా అప్పుడప్పుడూ అన్నారమో భద్రాద్రో తిరుపతో వెళ్లి ఓ దండం పెట్టి వస్తూ ఉంటాం కదా" అన్నారు. అలాంటిదే మా లలితా పీఠమూను. నిన్న అక్కడ కలిసిన ఒకావిడ పీఠం గురించి మాట్లాడుతూ..."ఇది చాలా మహిమ గల పీఠమండీ...దేవుడి పుస్తకంలో ఉన్న గొప్ప గొప్ప పీఠాల జాబితాలో దీని పేరూ ఉందిట" అన్నారు. "దేవుడి పుస్తకమా..అదెక్కడుంటుంది" వెంటనే ఆత్రుతగా అడిగేశాను నేను...లలితా పీఠం నించి సరాసరి అక్కడికే వెళ్లి ఆ పుస్తకం కొనేసుకోవడానికి నా పర్సులో తగినంత డబ్బు ఉందా లేదా అని మనసులో లెక్కలు కట్టేసుకుంటూ..:) "పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గరుంటుందిట. వాళ్లే దాన్ని చూడగలరుట." అన్నారావిడ, నా ఆత్రుతని పట్టించుకోకుండా. హ్మ్మ్మ్ అని ఓక్క నిట్టూర్పు వదిలేశాను. పోన్లే ఏమైతేనేం...దేవుడి పుస్తకమనేది ఒహటుంది గదా...అందులో మా లలితా పీఠం పేరు ఉంది గదా...అక్కడికి నేను ఎప్పుడంటే అప్పుడు హాయిగా ఒక్క పాతిక రూపాయల ఖర్చుతో వెళ్లి రాగలను గదా...అది చాలు నాకు.
న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ
నాకు దానం చెయ్యడం తెలియదు. ధ్యానం రాదు. మంత్రతంత్రాలూ, స్తోత్రపాఠాలూ రావు. పూజాపునస్కారాలూ, అంగన్యాసకరన్యాసాదులూ తెలియవు. నాకున్న ఏకైక దిక్కల్లా నువ్వే. తల్లీ భవానీ...నువ్వొక్కత్తివే నాకు గతి. ఇదే నా శరణాగతి..!!

14, మార్చి 2014, శుక్రవారం
12, మార్చి 2014, బుధవారం
నేనూ-జగన్నాధుడూ..
సంసార సాగరంలో నిండా మునిగిపోయి ఉన్నాను.
వెనకటికి ఎవరో సరిగ్గా గుర్తు లేదు గాని..(బహుశా నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారేమో) పూరీలో దారువిగ్రహ రూపంలో అవతరించిన జగన్నాధస్వామి మీద ఇలా శ్లోకం చెప్పారట...
ఏకా భార్యా ప్రకృతిరచలా చంచలా సా ద్వితీయా
పుత్రోనంగస్త్రిభువనచరీ మన్మధో దుర్నివారః
శేషశ్శయ్యా ప్యుదధిశయనం వాహనం పన్నగారిః
స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారీ...
విష్ణుమూర్తికి ఒకరు కాదు ఇద్దరు భార్యలు. హాయిగా ఇద్దరితోనూ ముచ్చట్లాడుకుంటూ ఖులాసాగా ఉందామంటే మాత్రం "ఏకా భార్యా ప్రకృతిరచలా.." మొదటి భార్య భూదేవి అచల. పెళ్లిపుస్తకంలో రాజేంద్రప్రసాద్ చెప్పినట్టు "చలించదు..క్షమించదు". తిట్టినా..ముద్దాడినా..ఏం చేసినా ఒకటే నిర్వికార స్వరూపం. పోన్లే ఈవిడ కాకపోతే ఆవిడ ఉంది కదా అనుకుంటే ఆ రెండో భార్య శ్రీ మహాలక్ష్మి సృష్టికంతటికీ బహు గొప్ప చంచల స్వభావురాలు. ఏ క్షణం దగ్గరుంటుందో..ఏ క్షణం లేచి చక్కా పోతుందో ఆవిడకే ఎరుక. ఇహ ఆ మహాతల్లితో ఏం సుఖం..? పోన్లే..పెళ్లాల వల్ల సుఖం లేకపోయినా పిల్లల్ని చూసుకుని ఆనందిద్దామంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు..ముల్లోకాల్లోనూ ఎదురే లేనివాడు..సమస్త ప్రపంచాన్నీ జయించగల శక్తిమంతుడు మన్మధునికి శరీరమే లేదు..అవయవాలు లేని బిడ్డ వాడు...హ్మ్మ్..పోనీ ఇవన్నీ ఎలా ఉన్నా ఇంట్లో కాస్త సుఖంగా బతకగలిగే సౌఖ్యాలున్నాయా అంటే పాము పక్క..ఎప్పుడది బుస్సుమంటుందో తెలీదు...ఆ పాము కూడా సముద్రమధ్యంలో తేలుతోంది.ఖర్మ కాలితే మునిగిపోవడమే. పోనీలేవయ్యా వాహనమైనా ఏ అమితాబ్బచ్చన్ కారు లాంటి కారో ఉందా అంటే పాముల్ని తినే పక్షి వాహనం.
ఇల్లు-ఇల్లాళ్లు-బిడ్డలు-సౌఖ్యాలు అన్నీ ఇంత కమ్మగా ఉంటే ఇక ఏం చూసుకుని ఆనందించమంటావయ్యా...స్వగృహ చరితాన్ని తలచుకుని తలచుకుని కొయ్యయిపోయాట్ట స్వామి. ఆ కొయ్యే పూరీ జగన్నాధుడు.
"లోకబంధుర్లోకనాధు"డైన పురుషోత్తముని గతే ఇలా ఉంటే ఇక బీచ్ లో ఇసుకరేణువులాంటిదాన్ని నా గతేమిటి...????
కాబట్టి...సెలవు...:) :) :)

7, మార్చి 2014, శుక్రవారం
అందాల కడలి-10
మన శరీరమే అమ్మకు ఆలయం..!
శ్లో : 9మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృదిమరుత మాకాశముపరి
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే
ఇది సౌందర్య లహరిలోని తొమ్మిదవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమంటే "తల్లీ, జగజ్జననీ, మూలాధార చక్రమందు భూతత్వాన్ని, మణిపూరమందు జలతత్వాన్ని, స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని, హృదయమందున్న అనాహత చక్రమందు వాయుతత్వాన్ని, విశుద్ధియందు ఆకాశతత్వాన్ని, భ్రూమధ్యభాగమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వాన్ని కలిగియుండి..ఇలా సుషుమ్నా మార్గాన్ని భేదించుకుంటూ చిట్ట చివరకు సహస్రారపద్మంలో నీ పతియైన సదాశివునితో కలిసి విహరిస్తున్నావు కదా.."
కిందటి శ్లోకం నించి సౌందర్య లహరిలోని శ్లోకాలు పారాయణ చేస్తే కలిగే ఫలితాలు కూడా చెప్పుకుంటున్నాం కదా. అయితే కిందటి శ్లోకం (ఎనిమిదవది) పారాయణే చాలా తక్కువ సంఖ్యలో ఉంది. (కేవలం పన్నెండుసార్లు) సౌందర్య లహరిలో అంత తక్కువ సంఖ్యలో పారాయణ చెయ్యగలిగే శ్లోకాలు మరేవీ లేవు. దరిదాపుగా అన్నీ రోజుకు వెయ్యేసి సార్లు పారాయణ చెయ్యవలసినవే. ప్రస్తుత శ్లోకానికే వస్తే..(తొమ్మిదో శ్లోకం) దీన్ని రోజుకు వెయ్యిసార్లు జపించాలి. అలా పది రోజులు గాని నలభై ఐదు రోజులు గాని పారాయణ చెయ్యాలి. నైవేద్యం పాలతో తయారు చేసిన పాయసం. దీనికి ఫలితం దేశాంతరాలు పట్టిపోయినవాళ్లు తిరిగి రావటం..పంచభూతాల వల్ల (భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ ఐదూ పంచభూతాలు) మనకు ఎటువంటి కీడూ కలగకుండా ఉండటం. సౌందర్య లహరిలోని శ్లోకాల పారాయణకు సంబంధించి యంత్రాలు, బీజాక్షరాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా చెయ్యాలన్న వివరణలున్నాయి. కాని నేను అవేవీ నా బ్లాగులో ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను అవన్నీ చెప్పేంత గొప్పదాన్నీ కాదు..వాటిని వివరించే ఉద్దేశ్యమూ నాకు లేదు. అంచేత అటువంటివన్నీ కావలసిన వాళ్లు పుస్తకాల షాపుల్లో వెతికితే తదనుగుణమైన పుస్తకాలు దొరుకుతాయి. నేను కేవలం ఏ శ్లోకం చదివితే ఏ ఫలితమో మాత్రమే చెబుతున్నాను. ఎవరికి వారు వారి వారి శక్త్యానుసారం ఆ పారాయణ చేస్తే...(వెయ్యిసార్లూ జపించలేకపోయినా..చెయ్యగలిగినన్ని సార్లు) అందులో కనీసం పావు వంతు ఫలితమైనా దక్కుతుంది గదా అన్నది నా ఆలోచన.
ఇక భావార్ధంలోకొస్తే..ప్రస్తుత శ్లోకం శ్రీవిద్యా ఉపాసకులకు, కుండలినీ యోగసాధనకు చాలా ముఖ్యమైనదట. దేవుడూ..పూజా అంటే తెలుస్తాయి గాని కుండలిని, మూలాధార చక్రం అంటే నా బోటి పామరులకేం తెలుస్తాయి..? నా పాలిటికి, వేదాల దగ్గర్నించీ సమస్తమూ చిన్నికృష్ణుడిలా నోట్లోనే దాచుకున్న గూగులమ్మ ఒకతి ఉంది కాబట్టి,అక్కడే శరణు జొచ్చాను. మొత్తానికి కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి అనీ,మనిషి శరీరంలోని వెన్నుపాములో దాగి ఉంటుందనీ తెలియవచ్చింది. అమ్మవారు ఎటూ ప్రతి ప్రాణిలోనూ "శక్తి"గా అంతర్భూతమై ఉంటుందని ముందుగా తెలుసుకునే ఉన్నాం కాబట్టి..ఆ శక్తే ఇదని భావించుకోవచ్చు. అయితే ఈ కుండలిని ప్రతి మనిషిలోనూ నిద్రాణమై ఉంటుందనీ, మూలాధారచక్రంలో దాగి ఉన్న ఈ కుండలినీ శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి నుంచి పైనున్న సహస్రారపద్మం లేదా సహస్రార కమలం వరకూ తీసుకువెళ్లగలిగేదాన్నే కుండలినీ యోగమంటారనీ యోగశాస్త్రం చెబుతోంది. అంటే మనిషి శరీరంలో నిద్రాణంగా ఉన్న శక్తిని కొన్ని పద్ధతుల ద్వారా జాగృతం చేసి దాన్ని శరీరమంతటా వ్యాపింపజేసేదే కుండలినీ యోగం. అంటే మనలో ఉన్న అమ్మవారిని మనం తెలుసుకుని, మన శరీరపు అణువణువునా నింపుకోవడమన్నమాట. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనం దేవీ విషయ సంబంధమైన చైతన్య రహిత సుషుప్తావస్థ లోంచి జాగ్రదవస్థలోకి రావడమన్నమాట. ఒక దేవాలయం ఉందంటే..దాని గర్భగుడితో బాటు ఆవరణ అంతటినీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం తీర్చిదిద్దినప్పుడే కదా అది నిజమైన ఆలయం అనిపించుకుంటుంది. అలాగేనన్నమాట. ఒకానొక దైవశక్తి మన శరీరంలోని ప్రత్యణువునా వ్యాపించి ఉంటే ఎలా ఉంటుంది...మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటాం..ఎటువంటి రోగాలూ మన దరిదాపుల్లోకి రావు. అంతే కదా. ఇదే మాటను యోగశాస్త్రం చెబుతోంది. "యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండండనే" మాట ఈ రోజుల్లో వేనోళ్ల వినబడుతున్న సలహా. కుండలినీ శక్తిని జాగృతం చెయ్యడానికి ప్రాణాయామం ఒక ముఖ్యమైన సాధన అని చెబుతోంది యోగశాస్త్రం. మన శరీర సంరక్షణకు అతి ముఖ్యమైన వాటిలో ప్రాణాయామం ఒకటన్నది మనకందరికీ తెలిసిందే.
ఇక పోతే, మన శరీరంలో చక్రాలంటూ కొన్ని ఉన్నాయనీ, వాటిని ఫలానా ఫలానా పేర్లతో పిలుస్తారనీ, అవి ఫలానా ఫలానా చోట్ల ఉన్నాయనీ...ఈ విషయాలేవీ మనకు సరిగ్గా తెలియవు. తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో ప్రస్తుత శ్లోకంలో ప్రస్తావించబడ్డ "మూలాధార" "మణిపూర" "స్వాధిష్టాన" "సహస్రార పద్మం" అన్నవాటిని గుర్తించవచ్చు. "షట్చక్రోపరిసంస్థితా" అంది లలితా సహస్రం. అంటే ఆరు చక్రాలకు పైన గలది అని అర్ధం. ఆ ఆరు చక్రాలూ ఇవే. "మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలకు పైనున్న సహస్రారపద్మంలో గల తల్లి" అన్నది లలితా సహస్రంలో చెప్పిన మాట. అయితే ప్రస్తుత శ్లోకంలో అన్ని చక్రాల పేర్లూ లేవన్న సందేహం కలగవచ్చు. "హృదిమరుతమాకాశముపరి" అంటే, హృదయభాగమందుండే అనాహత చక్రమందు మరుత అంటే వాయు తత్వం, ఆకాశం+ఉపరి=ఆకాశముపరి అంటే హృదయానికి ఉపరిభాగంలో ఉన్న విశుద్ధి చక్రమందు ఆకాశతత్వం అని అర్ధం. అలాగే భ్రూమధ్యే అంటే కనుబొమల మధ్య గల ఆజ్ఞాచక్రమందు అని అర్ధం. కులపధం అంటే సాంప్రదాయకమైన సుషుమ్నామార్గం అని అర్ధం.
-------------(గూగుల్ సౌజన్యంతో)
ఇదంతా ఇలా ఉంచితే..పూర్వకాలంలో పూజ చేసుకోవడానికి ఎలా కూర్చోవాలన్న విషయంలో సైతం కొన్ని నియమనిబంధనలుండేవి. రాను రాను అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో కాపురాలు, ఎక్కడో ఓ చోట ఓ గూట్లో దేవుడి ఫోటో ఒకటి పెట్టేసి నిలబడే దండం పెట్టెయ్యడాలు...ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులనేకం మనిషిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తున్నాయన్నది విస్పష్టం. నా చిన్నప్పుడు (మూడేళ్ల వయసులో) నేను బుల్లి పట్టు లాగూ తొడుక్కుని మా తాతగారి పక్కన పద్మాసనం వేసుకుని కూర్చునేదాన్ని. ఇప్పుడు ఓ చిన్న ప్లాస్టిక్ స్టూలు మీద కూర్చుని నా చేతికందే ఎత్తున బల్ల మీద ఉన్న దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను. ఆ పసి వయసులో నాకు పద్మాసనం ఎలా వెయ్యాలో నేర్పించింది మా తాతగారే. కాని ఇప్పుడు ఎంతమంది తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తమ వారసులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిస్తున్నారు..? అసలు ఎంతమంది తల్లిదండ్రులు పరంపరాగతమైన విషయపరిజ్ఞానానికి తమ ఇళ్లల్లో అవకాశం కల్పిస్తున్నారు..? మనిషికి దేని మీదైనా సరే బాల్యంలోనే సరైన అవగాహన కలగాలి...దైవ చింతన అయినా, యోగసాధన అయినా..!! అప్పుడే ఆ లేతమొక్క తద్విషయమృత్తికలో దృఢంగా నాటుకుని ఏపుగా ఎదుగుతుంది.
ఈ శ్లోకంలో మనకు తెలియని, అంత సులువుగా అర్ధం కాని యోగ పరిభాష ఏదో ఉంది కదా. ఊరికే కష్టపడి దాన్ని తెలుసుకోవాలని ఆతృత పడిపోనక్కర్లేదు. ఈ శ్లోక సారాంశం అతి సులువుగా బోధపడుతూనే ఉంది. అమ్మవారు శక్తి రూపంలో మనలో నిద్రితమై ఉంది. ఆ దైవీశక్తి మన అణువణువునా వ్యాపించి, మనకు రక్షాకవచంగా ఉండాలంటే మనం యోగశాస్త్రంలో చెప్పిన కొన్ని పద్ధతుల్ని పాటించాలి. ఇదే ఈ శ్లోకం మనకు చేస్తున్న హితబోధ. మన శరీరంలోని ప్రత్యణువునూ కూలంకషంగా వివరిస్తున్న ఈ శ్లోకం చదివిన తర్వాత మనం చెయ్యవలసిన పని ఏమిటంటే...పాంచభౌతికమైన ఈ శరీరం అమ్మకు ఆలవాలమైనదని గ్రహించి...దీన్ని పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నలోపం లేకుండా కృషి చెయ్యటం. అంతే. ఈ శ్లోకం చదివాక నాలో కలిగిన స్పందనా..నేను మీకు చెప్పగలిగినదీ ఇదే.
ఇక్కడ మరో చిన్న విషయం...వైద్యశాస్త్రం అత్యద్భుతంగా పరిగణించే ఎన్నెన్నో అమూల్యమైన విషయాలను అరటిపండు ఒలిచినట్టు అతి సులువుగా మనకు వివరించి చెప్పిన యోగశాస్త్రం మనకు మన పూర్వీకులు ప్రసాదించిన ఒక గొప్ప వరం. దైవికమూ-యోగమూ పరస్పరానుసంధానంతో వికసిస్తాయన్న విషయాన్ని మాత్రమే ఈ శ్లోకం కొత్తగా మనకు తెలియజెబుతోంది. ఈ మాట కూడా న్యాయానికి కొత్తదేమీ కాదు. పురాతనంగా వినవస్తున్నదే. ఇక దీన్ని జీవితంలోకి ఎలా అనుసంధానించుకుంటామన్నది ఎవరికి వారికే పూర్తిగా స్వవిషయం.అరవయ్యేళ్ల వయసువాళ్లయినా, రోగభూయిష్టమైన శరీరంతో ఉన్నవాళ్లయినా సరే యోగా చెయ్యవచ్చుననే ఆచార్యులు చెబుతున్నారు. యోగానికి ప్రధమ సోపానమైన ప్రాణాయామంతో ముందు ప్రారంభిస్తే సహస్రార పద్మం దాకా ఎగబాకలేకపోయినా కనీసం ఓ రెండు మూడు మెట్లయినా ఎక్కొచ్చు. నెలకోసారి డాక్టరు దర్శనం చేసుకునే బదులు ఆర్నెల్లకోసారి చేసుకోవచ్చు. అదీ సంగతి...!!
అమ్మ మనలో ఎలా దాగి ఉందన్న మహిమాన్వితమైన విషయాన్ని..పాంచభౌతికమైన ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనే సూచనతో మిళాయించి..రసరమ్యమైన పదజాలంతో మనకందించిన భిషక్కవివరులు శంకర భగవత్పాదులు. ముందు లలితా త్రిపురసుందరికీ...తరువాత ఆ మహనీయునికీ ప్రణమిల్లుతూ...ఇక సెలవా మరి...!!
5, మార్చి 2014, బుధవారం
నా మనోగతం
"సౌందర్య లహరిని గురించి ఇంతకుముందు విన్నాముగానీ, ఇంత వివరంగా తెలుసుకోవటం మీ పోస్టుల ద్వారానే. చాలా బాగుంది. కృతజ్ఞతలు. ఇవాళ్టి శ్లోక పారాయణంవలన కలిగే ఫలంగురించి తెలియజెప్పినట్లే, ప్రతి శ్లోకాన్నీ వివరించేటపుడు వాటి ఫలాన్నికూడా పేర్కొనగలరు. ఎంతైనా సగటు జీవులంకదా. ఆ ఫలం తెలుసుకుని తదనుగుణంగా జపంద్వారా ఫలితాలు పొందొచ్చనే స్వార్ధం. మీ పోస్టులు మనసుకు చాలా ఊరటనిస్తాయి."
ఇది ఒక పాఠకురాలు అందాల కడలి-9 కి రాసిన కామెంట్. దీనికి జవాబుగానే ఇది రాస్తున్నాను.
నా పోస్టులు మనసుకు ఊరటనిస్తాయన్నారామె. నా పోస్టులు మనస్సుకు తశ్శాంతినిస్తున్నందుకు సంతోషమే గాని...నేనూ సగటు జీవినేనండీ... పాఠకులు నా పోస్టులు చదివి ఊరట పొందుతూంటే నేనవి రాస్తూ ఊరట పొందుతున్నాను...:) అందరూ సర్వసాధారణంగా అనుకునేట్టు, సమస్యలతో నిండిన సగటు జీవులకే (ఈ కలికాలంలో) సర్వాంతర్యామి ఎక్కువ గుర్తొస్తాడు. దేవుడా నాకేది దిక్కు...నన్నేం చెయ్యదలచుకున్నావయ్యా అన్న తపన అధికమవుతుంది.
నేను వృత్తి రీత్యా జర్నలిస్టుని. నా సహోద్యోగి ఒకరు ఒకసారి రాశారు..."ప్రార్ధన అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. ఈ ప్రార్ధన వల్ల మన జీవితాల్లో ఏదో మార్పు వచ్చేస్తుందనీ..మన సమస్యలన్నీ తీరిపోతాయనీ, ఆపదల నించి గట్టెక్కేస్తామనీ అనుకోవడం ఉత్తమాట. దేనిదారి దానిదే. అయితే, సమస్యలున్నప్పటికీ ధైర్యంగా బతకగలిగే ఓపికని, ఆపదలొచ్చినా నిభాయించుకోగల శక్తినీ ప్రార్ధన ఇస్తుంది" అని.
నాకా మాట ఎంతగానో నచ్చింది. ఆయన చెప్పింది ఎంత వాస్తవమైనదో అందరికీ తెలుసు. "ఇన్ని పూజలు చేస్తున్నాను. అయినా నాకీ కష్టాలేమిటి" అనుకునేవాళ్లు కోకొల్లలు. "నా పూజలో ఏదో లోపం ఉంది..అందుకే భగవంతుడు నన్ను కరుణించడం లేదు" అనుకునేవాళ్లకూ లోటు లేదు.
"ఏమీ కోరుకోనివాడికి జీవితం అన్నీ ఇస్తుంది. అన్నీ కోరుకునేవాడికి మిగిలేది నిరాశే" నంటారు. అయితే ఇక్కడ ఓ చిన్న కిటుకుంది. ఏమీ కోరుకోనివాడు దొరికినదాన్నే మహాభాగ్యంగా భావిస్తాడు. అంచేత...వాడు ఎటూ భాగ్యశాలే. ఏ మనిషికీ ఎప్పుడూ అన్నీ దొరకవు. అంచేత అన్నీ కోరుకునేవాడు ఎటూ దౌర్భాగ్యుడే. ఇదిలా ఉంచితే.."ఏమీ కోరుకోకపోవడం" అన్నది సాధ్యమా...? ఏ సోనియా గాంధీలాగో ఉండాలని కోరుకుంటే తప్పు కావచ్చు గాక...కాని మధ్యతరగతి ఇల్లాలు తనకో సొంత ఇల్లూ...ఓ బుల్లి కారూ ఉండాలని కోరుకుంటే అందులో తప్పేముంది? పిల్లలు బాగా చదవాలని..మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని..కోరుకున్నవాళ్లని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కోరుకోవడం సమంజసం కాదని ఎవరైనా అనగలరా...? కాని ఈ కోరికలు కూడా ఎంతమందికి తీరుతున్నాయి..? కోరికలు తీరనప్పుడు ఎంతమంది భగవంతుణ్ణి తప్పుబడుతున్నారు..??
సరిగ్గా ఇలా భగవంతుణ్ణి నెపమెన్నే సమయంలోనే ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం..మనం కోరుకుంటున్నాం సరే..కాని ఆ కోరినదాన్ని పొందే అర్హత మనకు ఎంతవరకూ ఉంది..? మనం పాపాలేమీ చెయ్యలేదని అనుకుంటున్నాం...కాని, "కరచరణ కృతంవా..కర్మ వాక్కాయజంవా...శ్రవణ నయనజంవా..మానసంవాపరాధం..విహితమవిహితంవా..సర్వమేతత్ క్షమస్వ" అన్నారు శంకరులు. పాపాలు పదికోట్ల రకాలు. తెలిసే చెయ్యం..తెలియకా చేస్తాం. చేతుల్తోనూ, కాళ్లతోనూ, పనులద్వారానూ, మాటలతోనూ, విని, చూసి..మనసుతోనూ..ఇలా ఏ పాపమూ చెయ్యలేదు నేనని చెప్పగలిగే ఆత్మస్థైర్యం ఎవరికుంది..? మన స్థితిగతులు బాగాలేక...మన కుటుంబంలోనే మరొకరు అదృష్టదీపుడిలా వెలిగిపోతూ ఉంటే కోతిలాంటి మన మనస్సు బాధతో..దుఖంతో..ఈర్ష్యతో..ఆయా భావాల ఫలితంగా వచ్చే నానారకాలైన ఆలోచనలతో కునారిల్లకుండా ఉంటుందా..అది మానసికమైన పాపం కాదా...అత్యంత సహజంగా తోసుకొచ్చే ఈ పాపానికి మనం అతీతులం కాదే.. మరి చేసిన పాపాలు ఊరికే పోతాయా..?! ఈ జన్మలో ఏ పాపమూ చెయ్యలేదేమో..గాని హిందూమతం చెప్పే ప్రకారం.."పురాకృతం" మనకు ఎంతవరకూ అనుకూలం..? మన జీవితాలు సక్రమంగా నడవకుండా ఏ లింకు అడ్డుపడుతోందో మనకు ససేమిరా తెలీదు. అటువంటప్పుడు..."పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు తాళము దప్పిన తప్పుగాక..చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ పలికినా అపశృతుల్ పలుకుగాక.." గాని ధర్మాన్ని అమలుచేయడంలో కించిత్తూ తేడా రానివ్వని ఆ భువనేశ్వరి మనకి ఎందుకింత శిక్ష విధించిందో..అని ఒక్క క్షణం ఆలోచించాలి కదా..!! అలా ఆలోచించి..తప్పు మనదే అయి ఉంటుందని సరిపెట్టుకుని..బాధ పడితే పడొచ్చు గాని దేవుణ్ణి తప్పులెన్నడం మాత్రం మానెయ్యాలి.
అయితే ఇది చెప్పినంత సులువు కాదు. నా మట్టుకు నేనే..నా కుటుంబానికి ఒకానొక మహా విపత్తు దాపురించిన దౌర్భాగ్యపువేళ వరుసగా ఒక వారం రోజులేమో...అసలు దేవుడి జోలికే పోలేదు. దీపారాధనే చెయ్యలేదు. "నేనింక నీ జోలికి రాను. నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో..." అని తెగించి చెప్పేశాను.
అలా ఓ వారం రోజులు గడిచాక...అప్పుడు ప్రారంభమైన అంతర్మధనం లోంచి వచ్చిందే ఇప్పుడు రాస్తున్న ఈ సోదంతా.
ఇక పోతే మా సహోద్యోగి చెప్పినట్టు, ప్రార్ధన మన జీవితాల్ని మార్చదూ అన్న మాటని మాత్రం మనం పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే దేవతారాధన వల్లనే మన జీవితాలు ఓ ఒడ్డెక్కుతాయన్నది అనాదిగా వస్తున్న మాట కాబట్టి. అంచేత..చివరిగా చెప్పొచ్చే మాటేమిటంటే..దేవతారాధన విషయంలో కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి...
మనకి ముక్కోటి దేవుళ్లున్నారు. వారిలో మీ మనసుకు నచ్చిన దేవుణ్ణి ముందుగా ఎంచుకోండి. రాముడంటే మీకు చాలా ఇష్టమైతే ఇరవై నాలుగ్గంటలూ రాముణ్ణే ప్రార్ధించండి. అలాగే గణపతి..ఆంజనేయుడు..లలితమ్మ. మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించినప్పుడే మీరు ఆ పూజలో తల్లీనమవగలరు. ఏదో వాళ్లు సాయిబాబాని పూజిస్తున్నారు..మనం కూడా ఆ పూజ చేస్తే ఒడ్డేక్కుతామేమో ఇలాంటి లాటరీలు వద్దు గాక వద్దు. దాని వల్ల ఫలితం ఉండకపోగా వ్రతం కూడా సరిగ్గా సాగదు.
దాదాపు పది-పన్నెండేళ్ల కిందటి మాట. అప్పట్లో నా ఆరోగ్యం అంత బావుండేది కాదు. లలితా సహస్రం చదువుకుంటూ ఉంటే చాలా హాయిగా..ఆ తల్లి నా పక్కనే నిలబడి నన్ను కాపాడుతున్నట్టు ధైర్యంగా అనిపించేది. ఎప్పుడు పడితే అప్పుడు లలిత చదివేసుకుంటూ ఉండేదాన్ని. అయితే అలా చదవకూడదూ అని కొందరు "పెద్దలు" చెప్పారు. శుచిగా స్నానం చేసి, దేవుడి పీఠం దగ్గర కూచుని మాత్రమే లలిత చదవాలి అని. కాని నాకు అలా కుదిరేది కాదు. పనంతా చేసేసుకుని ఆఫీస్ కి బైల్దేరి బస్సులో కూచున్నాక తీరిగ్గా హాయిగా లలిత చదువుకునేదాన్ని. కాని అలా చదవడం తప్పు అని పెద్దలన్నవాళ్లు చెప్పారు కదా...అందుకని నిజంగా ఓ పెద్దాయనకి ఫోన్ చేసి, విషయం చెప్పాను. అప్పుడాయన..."ఎప్పుడైతే మీకు ఒక దేవుడికి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉంటే హాయిగా ఉందో...ఆ దేవత మీకు సిద్ధించిందన్నమాట. అప్పుడిక మీకు ఆ శ్లోకాలు గానీ స్తోత్రాలు గానీ చదువుకోవడానికి నియమాలు ఏమీ ఉండవు. హాయిగా చదువుకోండి" అని చెప్పారు. అయితే ఇది కేవలం స్తోత్రాలకే...బీజాక్షర జపాలకూ, నామాలు చదవడానికీ మాత్రం కాదు. అది గుర్తు పెట్టుకోండి. "శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ.."అంటూ మనం చదివేది లలితా సహస్రనామ స్తోత్రం. "ఓం శ్రీమాత్రే నమః" అంటూ ప్రతి నామానికీ ముందు ఓంకారం..చివర నమః అన్నవి చేర్చి చదివేవి నామాలు. స్తోత్రాలు మనం ఎలాగైనా చదువుకోవచ్చు. నామాలకు మాత్రం నియమనిష్టలు అవసరం. అలాగే బీజాక్షర జపాలకు కూడా. (మనకెటూ చేతకానప్పుడు ఆ బీజాక్షరాలూ అవీ అన్నీ మనకెందుకు..హాయిగా ముక్కోటి దేవుళ్లకూ ముఫ్ఫై కోట్ల స్తోత్రాలుండగా..ప్రధానమైనది భక్తి మాత్రమే...బీజాక్షరాలు కాదు. గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పింది కూడా ఇదే.) కాని రామ నామం జపించడానికి మాత్రం ఏ నియమాలూ లేవు. "ర" కారం అగ్నిబీజం. "మ" కారం క్షేమ బీజం. "రామ"అంటూ జపించినప్పుడు మన పాపాలన్నీ దగ్ధమై, క్షేమం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నా..స్నానపానాదులు లేకుండా ఉన్న వేళ మనసు ఏదైనా ఆందోళనకు లోనవుతున్నా నిక్షేపంలా రామనామాన్ని జపిస్తూ ఉపశమనం పొందవచ్చు. నిరుడు నాకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయినప్పుడు థియేటర్ లోకి వెళ్లే క్షణం దాకా నేను జపించింది రామనామాన్నే. నా శరీరం లోంచి ఒక అవయవం పోతే పోయింది గాని...నా పిల్లలకి నేను క్షేమంగా దక్కాను. ఇక్కడ నాకు ఆనందం కలిగించే మరో విషయం ఏమంటే...ఇది నిజం అవునో కాదో తెలీదు గాని...ఎక్కడో చదివాను...రాముడు లలితాదేవి పురుషరూపమట. సౌందర్య లహరి చదువుతున్నప్పుడు అనుకుంటూ ఉంటాను..."నిజంగా రాముడు అమ్మవారి పురుషరూపమే...లేకపోతే "పుంసాం మోహనరూపాయ" ఎలా అవుతాడు" అని...:)
ఇక చివరాఖరుగా చెప్పేదేమంటే..మీకు నచ్చిన దేవుణ్ణి ఊరికే అలా ప్రార్ధించుకోండి..స్తుతించండి..అంతే. ఇది ఎలాగంటే మీకు మీ అమ్మో నాన్నో ఇష్టమైతే వాళ్ల గురించి ఎలా ఆలోచిస్తారు..నలుగురికీ ఎలా చెబుతారు..అలా. మీకో ప్రేమికుడుంటే అతన్ని / ప్రేమికురాలుంటే ఆమెని తలచుకుని ఎలా పరవశించిపోతారు...అలా. ఏమీ కోరకండి. నా జీవితాన్ని కాస్త చూడు తండ్రీ..తప్పులు కాయి దేవుడా.. అనండి అంతే చాలు. ఇక మీ జీవితం ఎలా ఉన్నా...మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.మీ జీవితాన్ని / మీ పిల్లల జీవితాల్ని ఆ పరంధాముని చేతుల్లో పెట్టెయ్యండి...మీ అమ్మ..మీ నాన్న మీకు ఎలా అన్యాయం చెయ్యరో..అలాగే ఆ దేవుడూ అన్యాయం చెయ్యడు అని కనీసం నమ్మండి. ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే..తప్పొప్పుల గురించి ఆలోచించకుండా...మీ దారిన మీ ప్రార్ధనలు మీరు కొనసాగించండి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. మనం కోరినదల్లా మనకి జరగకపోవచ్చు. కాని...జరిగేదల్లా మన మంచికేనని నమ్మక తప్పదు.
ఏం చెప్పానో...ఎంతవరకూ సరిగ్గా చెప్పగలిగానో..నాకైతే ఏమీ తెలియడం లేదు. అవసరంలో ఉన్నవాళ్లకి ఈ సోది ఏమైనా ఉపకరిస్తే...నాకదే పదివేలు. దేవుడా..వాళ్లకి కాస్త ఉపకారం చేశాను..నా లిస్టులో మరో పది మార్కులు వెయ్యవూ అని దేవుణ్ణి ప్రార్ధించుకుంటాను...చూశారా..ఇదీ స్వార్ధమంటే..మరి ఇదీ లేకుండా బతకగలమా...:)
"దుష్టదూరా..దురాచార శమనీ దోషవర్జితా" (దుష్టుల నుండి దూరం చేసేది, దురాచారాల్ని రూపుమాపేదీ, సమస్త దోషాల్నీ పోగొట్టేదీ ఆ లలితాంబికే. ఆ తల్లిని ఊరికే అలా ప్రార్ధిస్తూ ఉండండి చాలు. మిగతాదంతా ఆవిడే చూసుకుంటుంది.)
సెలవా మరి...
3, మార్చి 2014, సోమవారం
అందాల కడలి-9
అమృతసముద్రం మధ్య అమృతానందమయి
శ్లో : 8
సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం !
ఇది సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకం. అమ్మవారి నివాసస్థలాన్ని తెలియజేసేది. క్లుప్తంగా దీని భావమేమంటే, "అమృతసముద్రం మధ్యన, దేవతా వృక్షాలైన కల్పవృక్షాలు చుట్టూ పరివేష్టించి ఉన్న మణిద్వీపంలో కదంబవృక్షాలతో నిండిన ఉద్యానవనంలో గల చింతామణీ గృహంలో శివాత్మకమైన మంచం మీద..పరమశివుడనే తల్పమందు జ్ఞానానందతరంగరూపమై ఉన్న నిన్ను కొందరు ధన్యులు సేవించి తరిస్తున్నారు. "
ఇప్పటిదాకా నేను మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సౌందర్య లహరిలోని వంద శ్లోకాలకీ వంద యంత్రాలున్నాయి..వంద బీజాక్షరాలున్నాయి. ఏ శ్లోకానికి ఏ యంత్రమో..ఏ బీజాక్షరమో..జపవిధానం ఎలాగో..నైవేద్యం ఏమిటో..ఫలితం ఏమిటో ఆ వివరాలన్నీ తెలియజేసే పుస్తకాలున్నాయి. (బజార్లో దొరుకుతాయి) అవన్నీ మనకెందుకు గాని, ఏ శ్లోకాన్ని పారాయణ చేస్తే ఏ ఫలితమో మాత్రం ఇక మీదట చెప్పుకుందాం. శాస్త్రం చెప్పినట్టు వేలల్లో దాన్ని జపించలేకపోయినా, తోచినన్నిసార్లు జపించి, అమ్మ దయకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుత "సుధాసింధోర్మధ్యే" శ్లోకానికి సకల కార్య జయం ఫలసిద్ధిగా చెప్పబడింది. రోజూ జపించవలసిన సంఖ్య కూడా చాలా తక్కువ. రోజుకి పన్నెండు సార్ల చొప్పున పన్నెండు రోజులు. అంతే. నైవేద్యం కూడా చాలా సులువైనది..నల్ల మిరియాలు. అంచేత ఆసక్తి గలవారు యంత్రాలు, బీజాక్షరాల జోలికి పోకుండా చేతనైనంత మేరకు ఈ శ్లోకాన్ని రోజుకు పన్నెండుసార్లు చొప్పున 12 రోజులు జపించి తదనుగుణమైన ఫలితాన్ని పొందండి.
ఇక ఈ శ్లోకపు భావార్ధాన్ని చూద్దాం..బ్రహ్మకు నివాసం సత్యలోకం. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు. శివుడు సరేసరి..కైలాసంలో ఉంటాడన్నది అందరూ ఎరిగిందే. మరి ముజ్జగాలకూ మూలపుటమ్మ అయిన ఆ లలితా మహా త్రిపురసుందరి ఎక్కడుంటుంది..?? ఆ తల్లి ఉండే నెలవేది..? దాని పేరేమిటి..లలితా సహస్రం చదివేవారిలో కూడా చాలామందికి ఈ ప్రశ్నలకు జవాబులు తెలియవు. ఈ శ్లోకం దానికి జవాబు చెబుతుంది గాని, సవిస్తరమైన జవాబు తెలుసుకోవాలంటే దేవీ భాగవతం చదవాల్సిందే. అందులోని మణిద్వీప వర్ణనను తెలుగులో 32 చిన్న చిన్న పద్యాలుగా వ్రాసి కూర్చిన "మణిద్వీప వర్ణన" పాట ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యాన్ని గడించుకుంది. "మహాశక్తి మణిద్వీప నివాసిని..ముల్లోకాలకు మూలప్రకాశిని" అన్న పాదంతో మొదలై, "భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం..దేవదేవుల నివాసం అదియే కైవల్యం" అన్న పల్లవి పునరావృతమవుతూ సాగే ఆ పాట పుణ్యమా అని పరదేవత మణిద్వీపంలో ఉంటుందన్న విషయం జగద్వ్యాపితమైంది. "నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు"చదివితే చాలా శుభమంటూ ఆ పాటలో ఉన్న ప్రకారం గృహప్రవేశ మహోత్సవాలు మణిద్వీపవర్ణన పారాయణలతో మారుమ్రోగుతున్నాయి. గృహప్రవేశవేళ మణిద్వీపవర్ణన చిరు పొత్తాల్ని అందరికీ కానుకగా ఇవ్వడం కూడా పలుచోట్ల ఆనవాయితీ అయింది.
మొత్తానికి దేవి ఉండేది మణిద్వీపంలో అని చెప్పుకున్నాం కదా. లలితా సహస్రం తల్లిని "సుధాసాగర మధ్యస్థా" "చింతామణి గృహాంతస్థా" అంటూ వర్ణించింది. అయితే మనకు మొదటినించీ పాలసముద్రం గురించి మాత్రమే తెలుసు గాని ఈ అమృతసముద్రం గురించి ఆట్టే తెలియదు..!
"సప్త సముద్రాలు" అన్న మాట మనం తరచూ వినేదే. అవి వరుసగా లవణ (ఉప్పు సముద్రం..మనకి ఉన్నది ఇదే) ఇక్షు (చెరకురసం) సురా (మద్యం..కల్లు) సర్పి (నేతి సముద్రం) క్షీర (పాల సముద్రం) దధి (పెరుగు సముద్రం) జల (మంచినీటి సముద్రం)సముద్రాలు. ఆయా సముద్రాల చెంత వరుసగా జంబూ (మన ద్వీపమే) ప్లక్ష, శాల్మలీ, కుశ, పుష్కర, క్రౌంచ, శాక ద్వీపాలున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కడా అమృత సముద్రం మాటే లేదు. అయితే, జంబూద్వీపంలో ఆరు కులగిరులు (కుల పర్వతాలు...అంటే ప్రళయమే వచ్చినా..భూదేవి ఎన్నెన్ని మార్పులకు గురైనా గాని ఈ పర్వతాలు మాత్రం తమ సరిహద్దుల్ని అతిక్రమించే నైచ్యానికి పాల్పడవట) ఉన్నాయని (కొన్ని కొన్ని చోట్ల ఈ పర్వతాల్ని ఏడుగా పేర్కొనడం కూడా జరిగింది) ఈ కులగిరుల్లో మేరుపర్వతం ఒకటని విష్ణుపురాణం పేర్కొంది.
ఆ మేరు పర్వతం చుట్టూ కూడా మహా పర్వతాలు ఉన్నాయనీ, వాటి మీద మంచినీళ్లు, తేనె, చెరకురసం, పాల సరస్సులు ఉన్నాయనీ, అక్కడ సర్వతోభద్రమనే దేవతల ఉద్యానవనం ఉందనీ శ్రీమద్భాగవతం పేర్కొంది. ఇక్కడ కూడా ఎక్కడా మణిద్వీపం గురించి గాని, అమృతసముద్రం గురించి గాని ప్రస్తావనే లేదు. అయితే దేవీ భాగవతం మాత్రం, బ్రహ్మలోకానికి పైన "సర్వలోకం" అని ఉంది. దానికే మణిద్వీపం అని నామాంతరం అని తెలిపింది. దానికి సాటి పధ్నాలుగు లోకాల్లోనూ మరేదీ లేదంటూ సాగిన మణిద్వీప వర్ణన చదువుతుంటే శరీరం ఒక్కసారిగా రోమాంచనమవుతుంది. ఆనందమూ, ఏదో తెలియని భయమూ, విభ్రమా...అసలు అదీ ఇదీ అని చెప్పుకోలేని ఒకానొక గాఢమైన అనుభూతీ కలుగుతాయి. అవన్నీ స్వయంగా అనుభవించాలంటే శ్రీ దేవీ భాగవతం చదవండి. అందులో చెప్పినదానికి సంక్షిప్త స్వరూపమే ప్రస్తుత శ్లోకంలోని వర్ణన.
అయితే...నాకు ఎప్పుడూ ఒక పెద్ద దరిద్రపు సందేహం కలుగుతూ ఉంటుంది. దేవీ భాగవతం ప్రకారం...త్రిమూర్తులకు సైతం మూలం ఆ పరదేవతే. అంతే కాదు...సమస్త హిందూ ఆధ్యాత్మిక చరిత్రకూ శిఖరం వంటిది శ్రీచక్రం. దాన్ని మించిన యంత్రరాజం గాని..ఉపాసనా దీక్షగాని ఉన్నట్టు నేను వినలేదు. (అఫ్ కోర్స్, నాకు తెలిసింది చాలా తక్కువని నేను మొదటినించీ చెబుతూనే ఉన్నాను...కాబట్టి ఇందులో ఏదైనా తప్పుంటే పాఠకులు పెద్దమనసుతో క్షమించగలరు.)
అయితే..."పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట" అన్న పోతనామాత్యుడంతటి పరమ భాగవతోత్తముడే
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ !
అంటూ పరదేవత విభవాన్నీ, మహిమనూ కీర్తించినా భాగవతంలో ఎక్కడా మణిద్వీప ప్రసక్తి గాని, అమృతసముద్రం ప్రసక్తి గాని వచ్చినట్టు నాకు తెలియదు. దేవీపురాణాలు తప్ప మిగతా సమస్తమూ విష్ణువునే కీర్తించాయి.ఎక్కడా ముగురమ్మల మూలపుటమ్మ ఊసే ఎత్తలేదు. ఇదే నాకు గొప్ప సందేహం..బాధా..లోటూను.
సరే మిడిమిడిజ్ఞానంతో వచ్చే ఈ సందేహాల మాటకేం గాని...ఈ "సుధాసింధోర్మధ్యే" అన్న శ్లోకాన్ని చదివినప్పుడల్లా నాకు కాళిదాసు "శ్యామలా దండకం" గుర్తొస్తూ ఉంటుంది.
"సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే"
అంటూ కాళిదాసు ఆశువుగా చెప్పిన శ్యామలాదండకాన్ని మన మధుర గాయకుడు ఘంటసాల పాడగా విని..నాకసలు ఒళ్లు తెలియలేదు.
"సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం..."
అన్న శ్యామలాదండకమొక్కటీ చాలు ఆ జగన్మాతృకను తలచుకుని పరవశించిపోవడానికి.
ఇక్కడ ఓ చిన్న కోతి కొమ్మచ్చి. మా నాన్న లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ జిల్లాపరిషత్ కి డెప్యుటేషన్ మీద వెళ్లారు. అక్కడ ఓసారి, (శ్రీకాకుళం లో) జిల్లాపరిషత్ సెక్రటరీ తదితర ఐదు పోస్ట్ ల్లో ఎవరూ లేక, ఎకౌంట్స్ ఆఫీసర్ అయిన మా నాన్న సెక్రటరీ పోస్ట్ తో సహా ఎకాయెకీ ఐదు పోస్ట్ లకి ఇన్ చార్జ్ గా వ్యవహరించారు. డిపార్ట్మెంట్ లో అత్యంత సమర్ధుడంటూ మా నాన్నకున్న పేరు దాంతో మూడు రెట్లు పెరిగింది.అది తలచుకుంటే ఇప్పటికీ (మా నాన్న చనిపోయే పధ్నాలుగేళ్లు) నాకు ఎంతో గర్వంగా ఉంటుంది.
అలాగే అనుకోండి...మన అమ్మ...సర్వ మంత్రాలూ, తంత్రాలూ, యంత్రాలూ, తీర్ధాలూ, చక్రాలు, శక్తులు, వేదాలు, విద్యలు, యోగాలు, వర్ణాలు, గీతాలు...ఒకటేమిటి...సమస్తమూ ఆమేనని తెలిస్తే...శృతులు, కాళీవరప్రసాదులు, సాక్షాత్ శివస్వరూపులు అంతా ఆమెను కీర్తిస్తుంటే మనకు ఆనందంతో..పరవశంతో..ఇంకా ఏదో తెలియని ఒకానొక అపురూపమైన భావంతో ఒళ్లు గగుర్పొడచదూ...???!!!
ఆ తల్లి...ఏ అమృతంకోసమైతే దేవతలూ, రాక్షసులూ కొట్టుకున్నారో..ఆ అమృతం సముద్రంలా తనుండే ద్వీపం చుట్టూ పారుతూ ఉండగా..దేవతలందరూ పూజించే కల్పవృక్షాలు ఇంటి చుట్టూ కంచెగా అమరగా..మణిమయమైన ద్వీపంలో వర్ష సంబంధమైన కడిమి చెట్లు తోటగా అమరి ఉండగా..నవరత్నాలకు తలమానికమైన, కోరినదల్లా ప్రసాదించే మహిమ గల చింతామణులతో (ఇది కూడా లక్ష్మీదేవితో బాటు క్షీరసముద్రంలోంచి పుట్టిందని గతంలో చెప్పుకున్నాం)నిర్మితమైన గృహంలో ఉంటుంది.
ఆఫీసర్ గారి దాకా వెళ్లే శ్రమ లేకుండా ఆయన ఇంటి కాపలాదారే ఆశ్రితుల అవసరాలు కనిపెట్టినట్టు, అమ్మ ఇంటి చుట్టూ ఉన్న కల్పవృక్షాలు, చింతామణులే భక్తుల కోర్కెల్ని తీర్చి పారెయ్యగలవు. ఇంటి ముందున్న కడిమిచెట్లు కోరిన వర్షధారల్ని కురిపించి భూతలాన్ని సస్యశ్యామలం చెయ్యగలవు.
సరే ఇక అమ్మ ఉండేది శివాకారమైన మంచం మీద...శివ అంటే ఆనందం.రూపుదాల్చిన ఆనందమే ఆ తల్లి ఆసనం. అంటే ఆయమ ఆసనం కూడా మనకు సుఖప్రదాతే...
పోతే..ఈ "పరమశివ పర్యంక"మన్న పదానికి వేరే సంకేతార్ధం ఉందనీ..అది మన శరీరంలోని చక్రాలకూ, గ్రంధులకూ సంబంధించినదనీ చెప్పుకునే మాటను వివరించే ప్రయత్నం నేను చెయ్యను. అది నా శక్తికి అతీతమైనది. నేను చెప్పగలిగేది ఒక్కటే...పెళ్లికాని ఆడపిల్లలు కాత్యాయనీ వ్రతం చేసే ఆనవాయితీ మన వైపు ఉంది. ఆ వ్రతానికి శివుని వామాంకమందున్న అమ్మవారి ఫోటో కావాలి. సరిగ్గా అదే ఇది. పరమశివ పర్యంకమందున్నదంటే పరమశివుని అంకమనే పర్యంకము పై ఆసీన అయి ఉన్నదని మనం భావించాలి.
ఆఖరుగా చెప్పుకోవలసినదేమంటే అమ్మ "చిదానందలహరి" అంటే జ్ఞానానందలహరి. జ్ఞానప్రసూనాంబిక అయిన ఆ దేవి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా ఆనందప్రదాత అవుతుంది. ఇటువంటి తల్లిని భజించి ధన్యులవుతున్నవారు మాత్రం "కతిచన".... కొందరే..! ఎందుకంటే మణిద్వీపం మన పక్కింట్లో లేదు. త్రిగుణాత్మకమైన తల్లిని కేవలం అంతర్ముఖంగా మాత్రమే తెలుసుకోవాలి తప్పితే మరొక రకంగా దేవి ప్రసన్నురాలు కాదు. అంచేత...శివుడికి మానస పూజ చేసినట్టు అమ్మను కూడా ఆత్మలో ప్రత్యక్షం చేసుకుని భజించగలవారు నిజంగా ధన్యులే కదా...అటువంటి అదృష్టం ఏ కొద్దిమందికో...??!!
సరే ఇక సెలవా మరి...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)