26, మార్చి 2014, బుధవారం

మా నాన్న

                         
                           
              నాలుగు రెళ్లు ఎనిమిది చేతులు కలిశాయి. ఎనిమిది రాటల బలమైన పందిరిలా ఆరిందాగా నిలిచాయి. చక్కటి ఆ అనుబంధాల పందిరికి అనురాగలత అల్లిబిల్లిగా.. చిక్కగా అల్లుకుంది. అమ్మలూ, భువనా, బాబూ, బుజ్జీ కలిసి అల్లిన ఆ చిక్కటి పందిరి కింద అమ్మ కూచుంది. పందిరి కింద బతుకు వేడి సోకకుండా ఎంత చల్లగా ఉన్నా..మనసులో రగుల్తున్న దుఃఖాగ్ని తాలూకు వేడీ, భారమూ అమ్మ మొహంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి.
                       అవును మరి..శరీరం ఎలాంటి బాధలకి గురైనా మనసును క్షణక్షణమూ చల్లగా, ఆనందంగా ఉంచే అమ్మ ప్రియస్నేహితుడు..నాన్న ఏరీ..?? "ఇంకెన్నాళ్లే..బుజ్జితల్లిక్కూడా పెళ్లి చేసి పంపించేశామంటే  మన బాధ్యతలు మూడొంతులు తీరిపోతాయి. అప్పుడు నువ్వూ నేనూ ఎంచక్కా ఇలాగే కూచుని బోల్డు కబుర్లు చెప్పుకుందాం." అంటూ ఎంచక్కటి భవిష్యత్తు అందంగా కళ్లముందు కనిపించేలా ఊరించి ఊరించి చెప్పిన నాన్న ఏరీ..??
                బుజ్జితల్లికింకా పెళ్లి చెయ్యనేలేదు నాన్నా..! వయసులో ఉండగా ఏవో సమస్యలూ, బాధలతోనే సరిపోయింది అమ్మకి. ఆవిడతో తనివితీరా కబుర్లు చెప్పనే లేదు. అప్పుడే మిమ్మల్ని హడావిడిగా పిలిచెయ్యడానికి ఆ దేవుడికి మనసెలా ఒప్పింది నాన్నా..?? అంత తొందరేమొచ్చింది? అక్కడ కూడా ఏవైనా రాచకార్యాలు మీ చేత చక్కదిద్దించాలని అల్లప్పటి శ్రీకాకుళం ఎమ్మెల్యేలా దేవుడు కూడా మీకోసం హడావిడి పడ్డాడా..?
                           అమ్మలు ఇంటర్ పరీక్షలు రాస్తుండగా నాన్నకి ఏలూరు ట్రాన్స్ఫరయింది. ఏలూరులోని సెయింట్ థెరిసా కాలేజీలో బిఏలో అమ్మల్ని జాయిన్ చెయ్యాలని కలలుగన్నారు నాన్న. తీరా చేసి అమ్మలు ఇంటర్ రిజల్ట్స్ కూడా ఇంకా రాకుండానే నాన్నని శ్రీకాకుళం వేసేశారు.
ఇంక నాన్న ఎంత బాధపడ్డారో..?! వెంటనే బైల్దేరి రాజధాని వెళ్లి మినిస్టర్ని కలుసుకున్నారు. "నన్ను ఏలూరు వేసి ముచ్చటగా మూణ్ణెల్లు కూడా కాలేదు సార్ ! నా పెద్దకూతురు ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంటు. మూడేళ్లపాటు అక్కడుంటాను గదా దాన్ని థెరిసా కాలేజీలో జాయిన్ చేద్దామని ఆశపడ్డాను. ఇంతలో మళ్లీ నన్ను కదిపెయ్యడం ఏం న్యాయం సార్..??" అంటూ గోల పెట్టారు.
 అప్పుడు మినిస్టర్ ఏమన్నారు...???
                 "నిజమేనయ్యా. కాని ఇది మా పని కాదు. శ్రీకాకుళం పరిస్థితి ఏమీ బాగాలేదని, అదంతా చక్కబెట్టడానికి మంచి ఆఫీసర్ కావాలని ఆ ఎమ్మెల్యే పట్టుబట్టి నిన్ను అక్కడికి వేయించుకున్నాడు. నీకు ఆర్డర్స్ డిస్పాచ్ అయ్యేదాకా ఇక్కణ్ణించి కదిలితే ఒట్టు. నన్నేం చెయ్యమంటావో చెప్పు." అన్నారు.
               అన్నేళ్ల ఉద్యోగజీవితంలో నాన్నకి అటువంటి  రాజగౌరవాలెన్ని జరిగాయో..?! నాన్న పేరు చెబితే చాలు..ప్యూన్ దగ్గర్నించి కలెక్టర్ దాకా అందరూ ఆత్మీయంగా గౌరవంగా ప్రవర్తించేవారు. ఆ గొప్పతనమంతా మనసులో మెదులుతుంది కాబోలు..నాన్న పేరు చెబితే చాలు అమ్మ పెదవులు చిరునవ్వుతో విచ్చుకునేవి. వాళ్లిద్దరికీ పెళ్లి ఎలా అయిందో గుర్తు చేస్తే మరీనూ..ఆ చిరునవ్వు మొహమంతా పాకేది. ఇంతకీ వాళ్లిద్దరికీ పెళ్లి ఎలా అయింది..??
                 అమ్మకీ నాన్నకీ పెళ్లిచూపులు జరగలేదు. "ప్చ్..పెళ్లిచూపుల ముచ్చట తీరనేలేదు." అంటూ నిన్న మొన్నటిదాకా నవ్వుతూ అమ్మని వెక్కిరిస్తూనే ఉండేవారు నాన్న. పెళ్లినాటికి అమ్మకి పదమూడేళ్లు..నాన్నకి పదిహేడేళ్లూను. నాన్న చదువు ఇంకా పూర్తవనేలేదు.
                  తాతగారికి..అంటే అమ్మా వాళ్ల నాన్నగారికి అమ్మ పెళ్లి గురించి ఆలోచిస్తూంటే చప్పున అమ్మడు కొడుకు గుర్తొచ్చాట్ట. సంబంధం వేలు విడిచిందే అయినా అనుబంధం అంతకన్న దగ్గరదే. అందుచేత వెంటనే హుటాహుటిన బైల్దేరి నాయనమ్మా, తాతగారూ ఉంటున్న పల్లెటూరికి వచ్చారుట.
              అప్పటికి నాన్న అక్కడ లేరు. పట్నంలో చదువుకుంటున్నారు. నాన్నతో ఓ ముక్క చెప్పాలన్న ఆలోచన గాని, అమ్మా-నాన్నల (మాకు అమ్మానాన్నా- కాని అప్పటికి పెళ్లికొడుకూ-పెళ్లికూతురూ...:) )  అంగీకారం తీసుకోవాలన్న అభిప్రాయం గాని ఆ ముగ్గురికీ లేవు. అంచేత నరిసిమన్నయ్యా, అమ్మడూ, మీసాలబావా కలిసి అమ్మకీ-నాన్నకీ పెళ్లి నిశ్చయించేసి, అప్పటికప్పుడు హడావుడిగా తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు. నాన్న పరీక్షలు రాసి వచ్చాక అప్పుడు తనకి మరో వారం రోజుల్లో పెళ్లి అని తెలిసిందిట.  నాయనమ్మ విషయం చెప్పగానే నాన్న తెల్లబోయి, "అదేమిటమ్మా, నాకసలు ఆ పిల్ల ఎలా ఉంటుందో కూడా తెలీదు. నేను ముందుగా అమ్మాయిని చూడక్కర్లేదా? ఒకవేళ నాకు నచ్చకపోతేనో..??" అన్నారుట. నాన్న మాటలకి నాయనమ్మ తేలిగ్గా "మేం అలా అనుకోలేదురా. పోన్లే, ఇప్పుడేం మునిగిపోయింది? మరో నాల్రోజుల్లో ఎటూ పెళ్లికి తరలి వెళ్తాం కదా..వెళ్లగానే పిల్లని చూడు. నీకు నచ్చకపోతే మానేద్దాం." అందిట. (నాయనమ్మ నాన్నకి తల్లే గాని అమ్మకి అక్షరాలా అత్తగారు..)
                            ఆ మాటకి నాన్న నొచ్చుకుని "ఏమిటమ్మా నీ మాటలు? పెళ్లికి తరలి వెళ్లి పిల్ల నచ్చలేదని వెనక్కొచ్చేస్తామా? ఏమైనా న్యాయమైన పనేనా అది? నాతో ఒక్క ముక్క చెప్పి మరీ పెళ్లి ఖాయం చెయ్యాలన్న ఆలోచన మీకు ముందే రావాల్సింది. ఇప్పుడిక పిల్ల నాకు నచ్చినా నచ్చకపోయినా వెనక్కి తిరిగే ప్రసక్తి మాత్రం లేదు." అని ఖచ్చితంగా చెప్పారుట. "సరే నాయనా, నీ ఇష్టం" అనేసి చేతులు దులుపుకుంది నాయనమ్మ.
                       పెళ్లి మర్నాడనగా తాతగారూ, నాయనమ్మా, నాన్నా తరలి వెళ్లి గుమ్మంలో దిగేసరికి ఎదురుగా వరండా మీదే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ అమ్మ కనిపించిందిట. పట్టు పరికిణీ, ఖద్దరు వోణీ,బిగుతుగా అల్లి, జడగంటలు వేసి, గొబ్బిపూలదండతో అలంకరించిన పొడుగాటి జడా, కళ్లకు కాటుకా, ముఖాన ఎర్రని తిలకం బొట్టూ, పసిమి పచ్చని మేని ఛాయా...వెరసి కాళిదాసు కుమారసంభవంలో బాల పార్వతిలా ఉన్న అమ్మని చూపిస్తూ నాయనమ్మ, "అదిగో, అదేన్రా అబ్బాయ్ పెళ్లికూతురు. గబుక్కున చూడు" అందిట.
                              నాన్న గబుక్కునే చూశారో, తనివితీరానే చూశారో గాని, ఆ మాటలు విన్న అమ్మ మాత్రం తెల్లని ప్యాంటూ షర్టూ వేసుకుని, సన్నగా, చామన చాయ కంటే కూడా ఓ పిసరు తక్కువ రంగులోనే ఉన్న పెళ్లికొడుకుని చూసి  సిగ్గుతో లోపలికి పారిపోయిందిట.
            అలా చేయీ చేయీ కలుపుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రారంభించిన అమ్మకీ, నాన్నకీ తొలి దశంతా కష్టాలతోనే గడిచింది. పెళ్లయ్యేదాకా నిక్షేపంలా ఉన్న అమ్మకి పెళ్లి ఇలా అవుతూనే అలా వచ్చిన తొలి గర్భం కాస్తా వట్టిపోయి, ఆ మొదటి అబార్షన్ తో ఆరోగ్యమంతా పాడైపోయింది. ఆ తర్వాత ఆరు సార్లు వరస అబార్షన్లు జరిగాయి.
                గర్భస్రావాలతో ఒంట్లో ఉన్న రక్తమంతా పోయి, పాలిపోయి, మంచాన్ని అంటిపెట్టుకుపోయింది అమ్మ. "రోగిష్టిది" "గొడ్రాలు" అన్న బిరుదులు వచ్చి చేరాయి. నాయనమ్మ నాన్నకి మరో పెళ్లి చెయ్యాలన్న నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఆ సంగతి తెలిశాక అమ్మ ఏడుస్తూ, "నాకిక బాగవదు. మీరు మరో పెళ్లి చేసేసుకోండి" అందిట. కాని జరిగినదానికి కించిత్తూ చలించనిది నాన్న ఒక్కరే. మరో పెళ్లికి ఆయన ససేమిరా అన్నారు. "లోపం నాలోనే ఉంటే మీరంతా కలిసి దానికి మరో పెళ్లి చేసేవారా..?? నాకో న్యాయమూ, దానికో న్యాయమూనా..?" అంటూ నాయనమ్మని కసిరేశారు. నాయనమ్మ ఇంకేం మాట్లాడలేక ఓ పెద్ద నమస్కారం చేసేసి ఊరుకుంది.
                    అలా పదహారు సంవత్సరాల వివాహ జీవితాన్ని ఎండమావిలా గడిపి..విసిగెత్తిపోయాక..అమ్మకి ముప్ఫై, నాన్నకి ముప్ఫైనాలుగూ నడుస్తూ ఉండగా, అమ్మకీ నాన్నకీ అపురూపాల అపరంజిలా అమ్మలు పుట్టింది. మళ్లీ తొమ్మిదేళ్లదాకా ఎవ్వరూ లేరు. అమ్మలు పుట్టుకతో  పిల్లల మీద కోరిక మరి కాస్త పెరిగింది అమ్మకీ నాన్నకీ.
                         అమ్మలు పుట్టిన తొమ్మిదేళ్లకి ఎంచక్కా అమ్మని మించిన పచ్చటి పసిమి ఛాయతో భువన పుట్టింది. ఆ తర్వాత రెండేళ్లకి బాబు. వాడు పుట్టడం ఎంత నల్లగా పుట్టాడో వాడి కంటే పదకొండేళ్లు పెద్దదైన అమ్మలుకి బాగా తెలుసు. ఇప్పుడు మాత్రం అమ్మలు చెయ్యి లాక్కుని తన చేతి పక్కన పెట్టి, తలెగరేస్తూ, "చూశావా, ఎంత తెల్లగా ఉన్నానో..! నీ కంటే నేను తెలుపని ఒప్పుకోవే పెద్దక్కా" అంటాడు వాడు. అమ్మలు నవ్వుతుంది.
                    బాబు పుట్టిన రెండేళ్లకి..అమ్మకి నలభై మూడేళ్ల వయసులో బుజ్జి పుట్టింది. నలుగురు పిల్లలు పుట్టుకొచ్చాక ఇంక నాన్న ఆనందానికి అంతే లేదు. నలుగురూ నాలుగు ప్రాణాలూ, అమ్మ ఐదో ప్రాణమూ అయిపోయారు. నాన్న పిల్లల్ని చూసే తీరు, వాళ్లకోసం పెట్టే ఖర్చు చూసి ఎవరైనా, "ఏమిటయ్యా నీ పిచ్చి" అంటూ దెబ్బలాడితే, "అవును. పిచ్చే. పిల్లల కోసం వాచిపోయి ఉన్నాను నేను. నా పిచ్చే నాకానందం" అనేవారు నాన్న. అలా అని నాన్న పిల్లల్ని ఎప్పుడూ మితిమీరిన గారాబం చెయ్యలేదు. శక్తి మీరిన ఖర్చు కూడా పెట్టలేదు. ఉన్నంతలోనే అన్నీ వైభవంగా జరిపించేవారు. కాస్త జ్ఞానం వచ్చింది మొదలు పిల్లలు తమంతట తామే బాధ్యతగా డిసిప్లిండ్ గా మెలిగేలా పెంచారు.
                అమ్మలు బిఏ పూర్తి చెయ్యగానే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకా ఏదీ చూపుల వరకూ కూడా రాలేదు..అంతలో ప్రభుత్వం ఉద్యోగస్తుల సర్వీసు మూడేళ్లు తగ్గిస్తూ యాభై ఐదేళ్లకే రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ లెక్కన నాన్న సర్వీసు ఇంక ఎనిమిది నెలలే ఉందని తేలింది. వెనకాల ఆస్తిపాస్తులేమీ లేవన్న అధైర్యం, తీరని బాధ్యతల బరువుని రెట్టింపు చేస్తూ నాన్న గుండెని ఒక్క కుదుపు కుదిపింది.
                         అర్ధరాత్రి సమయంలో తొలిసారి నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడే  ఎందుకో నిద్ర లేచిన పదమూడేళ్ల భువన నాన్న చెయ్యి పట్టుకుని ధైర్యంగా ఆస్పత్రికి తీసికెళ్లింది. అంతలోనే నిద్ర లేచిన అమ్మలు తనూ పరిగెత్తింది. ఆస్పత్రిలో జాయినైన నాన్న నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకున్నారు. గుండె నిబ్బరాన్ని పెంచుకున్నారు. "నేనే ఇలా అయిపోతే ఇంక పిల్లలకి దిక్కెవరు? పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చెయ్యాలంటే ముందు నేను బావుండాలి" అంటూ తనకి తనే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారు. ఐసియూలో తన మంచం పక్కనే దీనంగా కూచుని ఉన్న అమ్మని దగ్గరకి పిలిచి, "నాకేం పర్వాలేదే. నువ్వు ఇంటికి వెళ్లి స్నానం, భోజనం కానిచ్చి ఓ గంట పడుకుని రా" అని పంపించారు.
             ఆ గుండె నిబ్బరమే నాన్నకి శ్రీరామరక్ష అయింది. ఆస్పత్రి నించి వచ్చాక, "ఇప్పుడు మరింత చలాకీగా ఉన్నారండీ" అంటూ నలుగురూ పరామర్శకి బదులు ప్రశంసలకి దిగేలా చేసింది.
                        తొలి ఎటాక్ తర్వాత దాదాపు పదిహేడేళ్లపాటు అదే నిబ్బరంతో హాయిగా బతికిన నాన్న ఆఖరికి శాశ్వతంగా వెళ్లిపోయే రోజున  గుండెనొప్పితో బాధపడుతూ, ఆంబులెన్స్ లో ఆస్పత్రికి బైల్దేరబోతూ కూడా కళ్లనీళ్లపర్యంతమవుతున్న అమ్మని తనే స్వయంగా ఓదార్చారు. "ఏడవకే..నాకేమీ పర్వాలేదు. ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తాను" అంటూ అమ్మకి ధైర్యం చెప్పి, మరో నాలుగ్గంటల్లోనే ప్రాణం లేని కట్టెగా తిరిగొచ్చారు.
               ఇన్నేళ్ల జీవితంలో పిల్లలు...అమ్మలు, భువన, బాబు, బుజ్జీ నాన్నతో కలిసి పంచుకున్న ఆనందాలు అన్నీ ఇన్నీనా..??!!
                       అమ్మలూ.. నాన్నా కబుర్లలో పడితే గడియారంలో తేదీ మారిపోయేది. ఇంటల్లుడితో సహా ఇంటిల్లిపాదీ నిద్రపోతూనే వీళ్ల మాటలు వినేవారు. ఏ పన్నెండున్నరకో అమ్మ లేచి, నవ్వుకుంటూ.. తనూ కబుర్లు చెబుతూ, ఫ్రిజ్  లోంచి పాలు తీసి పొంగించి,  రాత్రి పడుకోబోయేముందు వేసిన  స్ట్రాంగ్ ఫిల్టర్ డికాక్షన్ కలిపి  కమ్మటి కాఫీ తెచ్చి అమ్మలుకీ నాన్నకీ ఇచ్చేది. తను మాత్రం తెచ్చుకునేది కాదు. ఎటూ నాన్న కాఫీలో తనకి భాగం ఉందని తెలుసుగా...:)
               నాన్న సగం కాఫీ తాగి, "బ్రహ్మాండంగా ఉందే. నువ్వూ రుచి చూడు" అంటూ మిగతా సగమూ అమ్మకిచ్చేవారు.
                             అమృతంలాంటి అమ్మ చేతి కాఫీ తాగేసి, సంగీత సాహిత్య చర్చలకీ, ఇతర ఆత్మావలోకనపు కబుర్లకీ తాత్కాలికంగా కామా పెట్టేసి అమ్మలు వెళ్లి పడుకునేది.
                                     భువన అయితే నాన్న ప్రాణంలో ప్రాణమే. నాన్న మంచి గాయకుడు. శాస్త్రీయ సంగీతం పాడినా..లలిత గీతాలైనా..సినిమా పాటలైనా అద్భుతంగా పాడేవారు. ఆంధ్రా యూనివర్సిటీలో నాన్న బీకాం చదువుతూ ఉండగా జరిగిన ఒక ఫంక్షన్ కి ప్రార్ధనాగీతం పాడటానికి స్నేహితులు నాన్న పేరు సడన్ గా అనౌన్స్ చేశారుట. దాంతో కాస్త కంగారు పడ్డ నాన్న స్టేజి ఎక్కి "మా తెలుగు తల్లికీ మల్లెపూదండ" పాటని ప్రారంభించడమే హెచ్చుస్థాయిలో ప్రారంభించేశారుట. ఇంకేముంది..పాట చివరికి వెళ్లేసరికి "ఓ తెలుగు తల్లీ" "మా తెలుగు తల్లీ" పంక్తులు తారస్థాయికి వెళ్లి అంత పెద్ద గ్యాలరీ హాలూ ఒక ఐదు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
                సభకి అధ్యక్షత వహించిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు (సర్ సి.ఆర్.రెడ్డిగా ప్రముఖులైన కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రా యూనివర్సిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1926-31 మళ్లీ 1936-49 సంవత్సరాల్లో ఆంధ్రా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పని చేశారాయన) నాన్నని దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందిస్తూనే "పాట బ్రహ్మాండంగా పాడావు గాని, తిక్కయ్యకి కలమెక్కడుందయ్యా..తిక్కయ్య రాసింది గంటంతో కదా" అంటూ చమత్కరించారు.
                      నాన్న సంగీత వారసత్వమంతా భువనకి వచ్చింది. నాన్నా భువనా కలిసి పాటలు పాడుకుంటూ, నాన్న భువనకి పాటలు నేర్పుతూ ఉండగా రికార్డ్ చేసిన క్యాసెట్ ఒక్కటే ఇప్పుడు "కామితమిచ్చే మామిడిపండూ కవులకు మిగిలిందీ" అన్నట్టు మిగిలింది.
                                     ఇంక బాబు చదువులో ఎక్కి వస్తూ బాంబే ఐఐటీకి సెలెక్ట్ అయినప్పుడూ, "హి ఈజ్ వెరీ యూజ్ ఫుల్ టు అవర్ డిపార్ట్మెంట్" అంటూ ప్రొఫెసర్ నాన్న దగ్గర వాణ్ని మెచ్చుకున్నప్పుడూ నాన్న పుత్రోత్సాహం చెలియలికట్ట దాటి పొంగి పొర్లేది. వాడు బొంబాయి నించి సెలవులకి ఇంటికొచ్చినప్పుడల్లా వాణ్ని చంటిపిల్లాణ్ని చూసినట్టే చూసేవారు. వాడు ఉద్యోగం ఇంకా దొరకలేదని బాధపడుతూ, "పాపా కహతే హై బడా నాం కరేగా..బేటా హమారా ఐసా కాం కరేగా..మగర్ యే తో తుం భీ న జానే యే ఖాబ్ హై" అంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్నకి ఒక కంట దుఖాశృవులూ, మరో కంట ఆనందబాష్పాలూ వచ్చాయి. "టు అవర్ గ్రేట్ డాడ్" అన్న మొమెంటోని బాబు బాంబే నించి తెచ్చి అందిస్తే ఆనందంగా..సగర్వంగా అందుకున్న నాన్న చివరికి వాడికి ఉద్యోగం రాకుండానే హడావిడిగా వెళ్లిపోయారు.
                     నలుగురిలోకీ ఆఖరుదైన బుజ్జి నాన్నకి ప్రాణం కంటే ఎక్కువ. బుజ్జికున్న పెద్ద క్వాలిఫికేషనల్లా ప్రేమించటం. అది అమ్మనీ, నాన్ననీ, అక్కల్నీ, అన్ననీ ఎంతగా ప్రేమిస్తుందంటే..దానికే గనక సాధ్యమై ఉంటే అది చచ్చిపోయి అయినా నాన్నని బతికించేసి ఉండేది. నాన్నకి దాని గుణం తెలుసు. అందుకే ప్రేమగా "బుతా" (బుజ్జితల్లీ) అంటూ పిలుచుకునేవారు. వయసు మీదపడుతున్నా బాధ్యతలు తీరకపోవడంతో ఎంత కూడగట్టుకున్నా అప్పుడప్పుడూ నాన్న మనోనిబ్బరం సడలిపోతూ ఉండేది. అటువంటి స్థితిలోనే ఒకసారి అమ్మలుకి ఉత్తరం రాస్తూ.."పూర్వపు జవసత్వాలిప్పుడు లేవమ్మా. కాని ఏం చెయ్యను? బుజ్జికీ బాబుకీ కూడా పెళ్లిళ్లయి, వాళ్లు కుడా స్థిరపడేదాకా నేను ఓపికని బజార్లో అరువు తెచ్చుకుని అయినా తిరగాలమ్మా..తప్పదు" అంటూ రాశారు. ధైర్యం తగ్గినప్పుడల్లా, తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ బుజ్జితో, నీకు ఏ లోటూ రానివ్వనమ్మా. పెద్దక్కకీ, చిన్నక్కకీ ఎలా చేశానో నీకూ అంతా అలాగే చేస్తాను." అనేవారు.
                      భువన పెళ్లి అయింది మొదలు బుజ్జికి సంబంధాలు చూడటం మొదలుపెట్టి సారె సామాను కూడా ఒకటీ ఒకటీ చేర్చడం ప్రారంభించారు. బుజ్జికి ఏమేం కొనాలో పొందిగ్గా ముత్యాల్లాంటి అక్షరాల్తో ఒక చిన్న కాగితం మీద రాసుకుని దాన్ని పర్సులో పెట్టుకున్నారు. నాన్న పోయాక ఆ పర్సు తీసి చూసిన అమ్మలుకి పర్సులో ఆ కాగితమూ, ఒకప్పుడు పచ్చనోట్లతో నిండుగా ఉండే ఆ పర్సు ఒకే ఒక్క యాభై నోటుతో చిక్కిపోయి ఉండటమూ కనిపించి తీరని దుఖం కలిగింది. నాన్న గుర్తుగా ఆ పర్సుని అమ్మలు ఇప్పటికీ తన దగ్గరే ఉంచుకుంది.
                      నాన్న చెప్పా పెట్టకుండా సుదూర తీరాలకి పయనమవుతున్నప్పుడు ఆఖరి సెండాఫ్ ఇచ్చింది కూడా అమ్మలే. మామూలుగా నాన్నని ఒకసారి చూసి వెళదామని వచ్చిన అమ్మలు, తను వచ్చిన కొన్ని గంటలకే గుండె చేత్తో పట్టుకుని విలవిల్లాడుతున్న నాన్నని దగ్గరుండి ఆంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తీసికెళ్లి అడ్మిషన్ ఫారం మీద చేజేతులా సంతకం పెట్టి, నాన్నని స్వయంగా మృత్యుదేవతకి అప్పజెప్పేసింది.
                          తను ఉన్నన్నాళ్లూ ఐదుగుర్నీ రెండు చేతులా గుండెల్లో దాచుకున్న నాన్న ఎవరి ఖర్మానికి వాళ్లని వదిలేసి వెళ్లిపోక తప్పని స్థితి దాపురించేసరికి భువనకి ఏడోనెల.తొలిసారి గర్భవతి అయిన భువనని సీమంతానికి, పురిటికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న నాన్నని ఆ దయమాలిన దేవుడు, "ఇంక చాల్లే..పద పద" అంటూ కర్కశంగా వెంటబెట్టుకెళ్లాడు.
                               ఫోను మోగేసరికి అలవాటుగా "ఏరా తల్లీ, ఎలా ఉన్నావ్" అంటూ పలకరించే నాన్న మాటల కోసం చూసిన భువనకి అసలు నాన్నే ఇక లేరన్న వార్త అశనిపాతంలా వినిపించింది.
         పళ్లూ, పాలూ, కోరినవీ కోరనివీ ఫలహారాలూ క్షణంలో అమర్చిన నాన్ననే తలచుకుంటూ నిండు కడుపు ఎగిరెగిరి పడేలా కుమిలి కుమిలి ఏడ్చింది భువన. పొట్టలో ఉన్న బిడ్డకోసం అన్నట్టు బలవంతాన నాలుగు ముద్దలు మింగుతూ ఎలాగో బతికింది. నాన్నకీ, భువనకీ బాగా తెలిసిన డాక్టరుగారు భువనకి స్కానింగ్ చేస్తూ, "మీ నాన్నగారు ఎక్కడికీ వెళ్లలేదమ్మా..నీ కడుపునే పుట్టి మళ్లీ నీ దగ్గరకే రాబోతున్నారు. నీకు పుట్టబోయేది బాబమ్మా" అంటూ చెప్పేసరికి అక్కడే వెక్కిపడిన భువన ఇంటికొస్తూనే..అమ్మ గుండెల్లో తల దాచుకుని.."అమ్మా..నాన్నమ్మా, నాన్న" అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. 
                                        ఇంక ఎక్కడో దూరంగా బాంబేలో ఉన్న బాబు ఉద్యోగపు ఇంటర్వ్యూ కోసం మరికొన్ని గంటల్లో బైల్దేరతాడనగా "ఫాదర్ ఎక్స్పైర్డ్" అన్న వార్త వాణ్ని పిడుగులా తాకింది. వాడికి శుభాకాంక్షలు చెబుతూ బెంగళూరు ట్రైను ఎక్కించడానికి సన్నధ్ధమవుతున్న వాడి స్నేహితులు తలా ఇంతా అని చందాలేసుకుని ఉన్న పాటున వాణ్ణి విమానమెక్కించి నాన్నకి తుది వీడ్కోలు చెప్పడం కోసం పంపించేశారు.ఎప్పుడూ తనకి స్వాగతం చెప్పడానికి స్టేషన్ లోనే నవ్వుతూ నిలబడి ఉండే నాన్న తను గుమ్మంలోకొచ్చినా కదలక మెదలక కట్టెలా పడి ఉండేసరికి తట్టుకోలేని బాబు గేటు దగ్గరే "నాన్నా" అంటూ కుప్పకూలిపోయాడు.  
                                      అమ్మలూ బుజ్జీ మొదటినించీ నాన్న పక్కనే ఉన్నారు. బాబూ భువనా వచ్చేశారు. నలుగురూ కలిసి కనలి.. కనలి.. రగిలి రగిలి శోకిస్తున్న అమ్మని చుట్టుముట్టారు. నాన్న లేని పిల్లల్ని చూసి అమ్మ మరింత బావురుమంది. నాన్న లేని అమ్మని చూసి పిల్లలు ఇంకా ఇంకా విలపించారు. 
                  నెమ్మదిగా రోజులు గడిచాయి. ఏనాడూ ఒంటరిగా ఏ పనీ చెయ్యని అమ్మకి గాఢాంధకారంగా తోచిన భవిష్యత్తులో నాలుగు ఆశాకిరణాలు కనిపించాయి. "సింహంలాంటి మనిషి...వెళ్లిపోయారు" అంటూ ఏడుస్తున్న అమ్మని, "సింహపు కొదమలు ఉన్నాయి కదమ్మా" అన్న ఆత్మీయుల మాటలు కాస్తలో కాస్త ఓదార్పునిచ్చాయి. 
             నాలుగు రెళ్లు ఎనిమిది చేతులు కలిశాయి. అమ్మలూ, భువనా, బాబూ, బుజ్జీ కలిసి చిక్కగా అల్లిన మమతల పందిరి కింద అమ్మని కూచోబెట్టారు. నెమ్మదిగా కాలం ముందుకి కదిలింది. నాన్న లేని లోటుని ఎత్తి చూపిస్తూనే రోజులు గడిచాయి.  
                                    భువనకి బాబు పుట్టాడు. "బుల్లి నాన్న" అంటూ వాణ్ని పదిలంగా చేతుల్లోకి తీసుకుంది అమ్మలు. పెద్దకూతుర్ని గుర్తుపట్టినట్టు  బుల్లి నాన్న బోసినవ్వు నవ్వాడు. 
                                బాబుకి ఉద్యోగం వచ్చింది. వాడు అమ్మనీ బుజ్జినీ అపురూపంగా బెంగళూరు తీసికెళ్లిపోయాడు. 
                                మరికొన్నాళ్లకి బుజ్జికి పెళ్లయిపోయింది. నాన్న కాగితంలో రాసి పెట్టుకున్నవన్నీ ఒక్కటీ మర్చిపోకుండా అమర్చి బుజ్జికి ఏ లోటూ లేకుండా అత్తవారింటికి పంపించారు అక్కలూ అన్నా. నాన్న లేని లోటుని మాత్రం ఎవరు పూడ్చగలరు? 
           కాలం ముందుకి నడుస్తూనే ఉంది. అమ్మ పిల్లల నీడలో నిశ్చింతగానే ఉంది. కాని అమ్మ కళ్లలో మునుపటి కాంతి కరువైందన్న నిజం పిల్లలకి తెలుసు. అందరూ నవ్వుతూనే ఉన్నారు.  కాని, అందరి హృదయాలూ ఎంత లోతైన విషాదసాగర ఘోషతో  ఘూర్ణిల్లుతున్నాయో వారికే తెలుసు...ఆ పైవాడికే తెలుసు...తనవారిని వదిలి నిస్సహాయంగా తరలిపోయిన నాన్నకే తెలుసు. 
                 అమ్మ రెండు కళ్లల్లోనూ ఒక కన్ను పిల్లల కోసం నవ్వుతూంటే మరో కన్ను నాన్న కోసం ఎడతెగని దుఖాశృవుల్ని కురిపిస్తూనే ఉంది. ఒక కన్ను పిల్లల్ని తనివిదీరా చూస్తుంటే మరో కన్ను దూరాకాశవీధుల్లో నాన్న కనబడి, "రావే, ఇంక నా దగ్గరకొచ్చెయ్" అని పిలుస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. 
         అమ్మా...వద్దమ్మా, నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోకు. నాన్న లేని పిల్లలం. నువ్వే మాకు అమ్మా...నువ్వే మాకు నాన్నా. నువ్వైనా మా దగ్గరుండమ్మా. నీలో మేము, మాలో నువ్వు నాన్నని చూసుకుంటూ బతుకుదాం. సరేనా...అమ్మా...సరే అనమ్మా...అమ్మా...!! 

                           2000 మార్చి 27వ తేదీ... మా నాన్నని చూడటం కోసం బైల్దేరిన  మేం పొద్దున్న పదిన్నరకి ఇల్లు చేరుకున్నాం. మా పిల్లలిద్దరూ స్నానాలు చేసి అమ్మమ్మ చేత జడలు వేయించుకున్నారు. మనవరాళ్లు వస్తున్నారంటే మా అమ్మ పెరట్లో పూసిన పువ్వులన్నీ కోసి, డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో దాచి ఉంచేది. కనకాంబరాలైతే ఇద్దరికీ చిన్న చిన్న మాలలు కట్టి మరీ ఉంచేది. అలాగే సిధ్ధంగా ఉంచిన కనకాంబరాల దండలు ఇద్దరూ పెట్టుకున్నారు. మరో గంటకి మావాఅల్లుళ్లిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. మార్చి నెల...టెంపరరీగా పెట్టిన కొత్తావకాయతో కమ్మని భోజనం వడ్డించింది మా అమ్మ. భోజనాలయ్యాక మావారు హాయిగా శయనించారు. నేను (అమ్మల్ని)అలవాటుగా నాన్నతో కబుర్లకి దిగాను. మధ్యాహ్నం మూడు దాకా కబుర్లు సాగాయి. మూడింటికి సడన్ గా నాన్న ఏదో పని గుర్తొచ్చి.."ఇప్పుడే వెళ్లొస్తా" అంటూ తన లూనా మీద బైటికెళ్లారు. నేను వీధి కటకటాల్లో సోఫాలో  కూచుని చందమామలో పడుతున్న నా సీరియల్ "స్వర్ణ సింహాసనం" మార్చి నెల భాగాన్ని చదువుతున్నాను. 
                             అంతలో గేటు చప్పుడైంది. చూసేసరికి నాన్న..!! అప్పుడే వచ్చేశారు. రావడమే గబగబా వస్తూ..."అమ్మా..బుజ్జీ నా సార్బిట్రేట్ మాత్రలు తీసుకురా" అంటూ కేకేశారు. "ఏం నాన్నా...గుండెల్లో నొప్పిగా ఉందా" అంటూ నేను గబగబా నాన్న దగ్గరకి వెళ్లాను. క్షణంలో నేనూ, బుజ్జీ, అమ్మా, మా పిల్లలూ నాన్న చుట్టూ చేరిపోయాం. నాన్న వరసగా మూడు  సార్బిట్రేట్ మాత్రలు వేసుకున్నారు. అయినా నొప్పి తగ్గలేదు. నేను పరుగు పరుగున వెళ్లి మా ఫేమిలీ డాక్టరుగారిని తీసుకొచ్చాను. ఆ రోజులకే డాక్టర్లు ఎవరింటికీ వెళ్లడం మానేశారు. కాని నాన్న మీదున్న అభిమానం కొద్దీ ఆ డాక్టరుగారు ఇంటికొచ్చి చూశారు. చూస్తూనే.."హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా ఉంది. కనీసం పన్నెండు గంటలపాటు అబ్జర్వేషన్ లో పెట్టాలి. వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చెయ్యండి" అన్నారు. ఇంట్లో కానీ లేదు. ఇప్పట్లా అప్పుడు ఏటీఎంలూ లేవు. ఒక్క పరుగున నేను ఎదురింటికి వెళ్లాను. ఆ ఇంట్లో ఉండే ఆయన నగరం లో పేరు మోసిన వకీలు. మా కుటుంబమంటే ఆయనకి ఎంతో అభిమానం. సంగతి వింటూనే ఆయన ఒక్క గంతులో లోపలికి వెళ్లి బీరువా లోంచి యాభై రూపాయల కట్ట తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతూ, "నాన్నని వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లమ్మా" అన్నారు. 
                     ఆస్పత్రికి ఫోన్ చేశాం. ఆంబులెన్స్ వచ్చింది. హార్ట్ ఎటాక్ వచ్చినవాడు నడవకూడదన్న కనీసపు జ్ఞానం ఉంది నాకు. అందుకని "స్ట్రెచర్ తీసుకురండి" అని ఆంబులెన్స్ వాళ్లని అడిగాను."స్ట్రెచర్ ఏమీ లేదు. నడిచొచ్చెయ్యమనండి" అన్నారు వాళ్లు. ఏం చేస్తాం...నేనూ, మావారూ,బుజ్జీ కలిసి నెమ్మదిగా నాన్నని నడిపించుకుంటూ వీధిలోకి తీసికెళ్లి ఆంబులెన్స్ ఎక్కించి పడుకోబెట్టాం. ఆస్పత్రి చేరాక మళ్లీ స్ట్రెచర్ కోసం అడిగాం. "అదేం లేదు. నడిపించి తీసుకొచ్చెయ్యండి" అన్నారు. చేసేదేమీ లేక అలాగే చేశాం.  
                                  "డిపాజిట్ ఐదు వేలు కట్టాలి. అప్పుడే ట్రీట్ మెంట్ ఇస్తాం" అన్నారు. దగ్గరున్నదే ఐదు వేలు. అది కాస్తా వీళ్లకి సమర్పించేస్తే...??? దేవుడి దయ వల్ల తెలిసినాయన ఒకరు కల్పించుకుని డిపాజిట్ లేకుండా అడ్మిషన్ ఇప్పించారు. 
                నాన్నని ఎమర్జెన్సీ లోకి తీసికెళ్లారు. నగరంలోకెల్లా పేరుకెక్కిన కార్డియాలజిస్టుని పిలిపిస్తున్నామని చెప్పారు. సరేనన్నాం. ఓ ఇరవై నిమిషాల్లో ఆయన వచ్చారు. పేషంట్ తాలూకా ఎవరు అని అడిగారు. నేను వెళ్లాను. నాన్న గుండె చరిత్ర అడిగారు. 1983 ఏప్రిల్ లో నాన్నకి తొలిసారి హార్ట్ ఎటాక్ రావడం నించి అంతా రెండు ముక్కల్లో చెప్పాను. "పేషంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్ మెంట్ ఇవ్వడమే చాలా రిస్కీ. వైద్యం చెయ్యమంటారా వద్దా" అని అడిగారాయన. నేనేం చెప్పను...? వైద్యం చేసి మా నాన్నని బతికించండి  అని చెప్పనా...వైద్యమే ప్రమాదమన్న స్థితిలో వద్దు వదిలెయ్యండి అని చెప్పనా..???
                       డాక్టరుగారికి రెండు చేతులూ జోడించి నమస్కారం చేశాను. "నాకు తెలియదు డాక్టర్. మీరు వైద్యులు. మీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి" అన్నాను. ఆయన కనీ కనిపించనట్టు చిన్న నవ్వు నవ్వి, "సరే, మీరు వెళ్లండి" అన్నారు. నేను ఇవతలికి వచ్చేశాను. ఆస్పత్రి ఆవరణలో బుజ్జి బిక్కు బిక్కుమంటూ నిలబడి గుడ్ల నీరు కుక్కుకుంటోంది. నన్ను చూడగానే.."అక్కా, నాన్నకి ప్రమాదంగా ఉందా" అంటూ బావురుమంది. దాన్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నట్టే ఓదారుస్తూ నేనూ ఏడుస్తున్నాను. ఇంటి దగ్గర అమ్మ ఒక్కత్తీ ఉంది. అమ్మ...అమాయకమైన అమ్మ. నాన్న తన చెయ్యి పట్టుకుంటే చాలు, నిశ్చింతగా కళ్లు మూసుకుని నరకానికైనా ప్రయాణం కట్టగల అమ్మ. నాన్న దగ్గర లేకపోతే స్వర్గానికి సైతం ససేమిరా అనే అమ్మ. 
            ఆ క్షణం నేను దేవుణ్ని తలచుకున్నానో..లేదో..మా నాన్నని బతికించమని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకున్నానో లేదో...ఏదీ నాకు గుర్తు లేదు. ఒక్క పావుగంట గడిచాక మావారు నా దగ్గరకొచ్చి...నోట్లోంచి మాట రాని పరిస్థితిలో చెప్పలేక చెప్పలేక చెబుతూ..."అంతా అయిపోయిందిట" అన్నారు. అంతే. ఆ క్షణం నేను బిగ్గరగా ఏడవలేదు. సినిమాల్లోలా నాన్నా అని అరవలేదు. ఒక్క క్షణం కొయ్యయిపోయాను. అంతే. తర్వాత నాన్నని పడుకోబెట్టిన వార్డు దగ్గరకి వెళ్లాను. అక్కడున్న నర్సుని "ఒక్కసారి మా నాన్నని చూస్తాను" అని అడిగాను. నర్సు ఒప్పుకోలేదు. "పక్క బెడ్స్ వాళ్లకి ఇబ్బందండీ" అంది. నాకు అర్ధమైంది. నాన్న శవాన్ని చూసి నేను భోరుమంటే ఆ ఏడుపు పక్కవాళ్లకి ప్రమాదం కదా.."నేను ఏడవనమ్మా...ఒక్కసారి మా నాన్నని చూసి వస్తానంతే" అన్నాను నిశ్చలంగా. మరి నా మొహం చూసి ఆ నర్సు ఏమనుకుందో గాని "సరే వెళ్లండి" అంది. వెళ్లాను. ఒక్కత్తినే...నాన్న దగ్గరకి. నొప్పంతా తగ్గిపోయినట్టూ నిశ్చింతగా  నిద్రపోతున్నట్టూ ఉన్నారు నాన్న. మరిక లేవరు. నా గుండెల్లో సుడి తిరిగింది. నాన్న శవం ఉన్న బల్ల దగ్గర నిలబడి, వంగి నాన్న నుదురు నిమిరాను. శవాల్ని చూస్తేనే భయపడే నాకు అది శవం అన్న భయం వెయ్యలేదు. నాన్న బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. మరో సారి చూసి నిశ్శబ్దంగా ఇవతలికి వచ్చేశాను. ఆ తర్వాత జరగవలసినవన్నీ యధాప్రకారం జరిగిపోయాయి. నాన్న ట్రీట్ మెంట్ కని ఎదురింటి వకీలంకుల్ ఇచ్చిన ఐదువేలల్లో మూడు వేలు ఖర్చుపెట్టి నాన్న శవం పాడైపోకుండా బాబు వచ్చేదాకా తాజాగా ఉండేందుకు గాను ఇంజెక్షన్ ఇప్పించాను. తర్వాత నాన్నని దగ్గరుండి ఇంటికి తీసికెళ్లాను.ఎప్పుడూ నాన్న నన్ను తీసికెళ్లేవారు..ఈసారి రివర్స్ అన్నమాట.  అమ్మ మా పిల్లలకోసం కోసి డబ్బాలో పెట్టి దాచిన పువ్వులన్నీ కలిపి పెద్ద మాలగా కట్టి మర్నాడు మా నాన్న మెడలో వేసి ఆయన్ని ఘనంగా సాగనంపాం..!! 
                    అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కాని నాన్న...మా నాన్న లేరన్న దుఖం మాత్రం నా గుండెల్లో ఇసుమంత కూడా తగ్గలేదు సరికదా మరింత బరువెక్కింది. ఈ లోగా నా సీరియల్ స్వర్ణ సింహాసనం ముగింపుకొచ్చింది. ఎందుకో ఆ బంగారు గద్దె మీద నాన్నని కూర్చోబెడదామనిపించింది. "తండ్రి, స్నేహితుడు, గురువుగా నన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ హఠాత్తుగా మాయమైన నాన్నకి ఈ స్వర్ణ సింహాసనం బహూకృతి" అని ఆఖరి భాగం చివర్లో ప్రచురించమని చందమామ కి రాశాను. అప్పటి చందమామ రథసారథి దాసరి సుబ్రహ్మణ్యం గారు, "తప్పకుండా అలాగే వేస్తామమ్మా. మీ నాన్నగారి మృతికి మా ప్రగాఢ సానుభూతి" అంటూ జవాబిచ్చారు. అలాగే స్వర్ణ సింహాసనం ఆఖరి భాగంలో నాన్నకి అంకితం పడింది. 
                      మరో రెండేళ్లు గడిచాయి. అయినా నా బాధ తగ్గలేదు. "నాన్న" అన్నశీర్షికతో  కథ రాసి స్వాతి వీక్లీకి పంపించాను. కథలో అమ్మల్ని నేను. నాకిద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. వాళ్లే భువనా, బాబూ, బుజ్జీ. ఆ కథ నేను రాసే వేళకి మా అమ్మ బతికే ఉంది. అది 24-10-2003 స్వాతి వీక్లీ లో ప్రచురించబడే వేళకి అమ్మ కూడా హాయిగా నాన్న దగ్గరకి వెళ్లిపోయింది. ఇప్పుడిక అమ్మా నాన్నా లేని పిల్లలం...మేమే మిగిలాం...మా మా బతుకుల్లో ఎగుడు దిగుళ్లని మాకు మేమే తట్టుకుంటూ... మరో విచిత్రమేమంటే మరొక్క వారం లోనే మా అమ్మ ప్రయాణమైన రోజు. 2003 ఏప్రిల్ 4వ తేదీన అమ్మ నాన్న దగ్గరకి వెళ్లిపోయింది.  
              రేపు 27-03-2014. మా నాన్న మాకు దూరమై పధ్నాలుగేళ్లు. నాన్నకీ మాకూ గల అనుబంధం ఎంత చిక్కనిదో...చక్కనిదో మాకే..మా హృదయాలకే తెలుసు...! ఈ రోజు ఈ పోస్టు మీ ముందు పరిచిన మా నలుగురి ఏకీకృత హృదయం...! అదొక గుడి. అందులో మాకు దేవుళ్లు మా అమ్మా-నాన్నే...!!  
                          ఇప్పటిదాకా మీరు చదివింది ఆనాడు స్వాతిలో ప్రచురించబడ్డ ఆ కథే. అదే ఈ "మా నాన్న" పోస్టు. (ఎర్రటి అక్షరాలకు పైనున్నదంతా అప్పటి స్వాతి కథ)  స్వాతి కథ "నాన్న" అన్న పేరుతో వస్తే ఇక్కడ "మా" అన్న అక్షరం అదనంగా చేర్చాను..అంతే. 


అమ్మా-నాన్నా  

ఇదిగో మా నాన్న 

5 కామెంట్‌లు: