7, మార్చి 2014, శుక్రవారం

అందాల కడలి-10

మన శరీరమే అమ్మకు ఆలయం..! 

శ్లో : 9
        మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
        స్థితం స్వాధిష్ఠానే హృదిమరుత మాకాశముపరి
        మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
        సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే
                  ఇది సౌందర్య లహరిలోని తొమ్మిదవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమంటే "తల్లీ, జగజ్జననీ, మూలాధార చక్రమందు భూతత్వాన్ని, మణిపూరమందు జలతత్వాన్ని, స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని, హృదయమందున్న అనాహత చక్రమందు వాయుతత్వాన్ని, విశుద్ధియందు ఆకాశతత్వాన్ని, భ్రూమధ్యభాగమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వాన్ని కలిగియుండి..ఇలా సుషుమ్నా మార్గాన్ని భేదించుకుంటూ చిట్ట చివరకు సహస్రారపద్మంలో నీ పతియైన సదాశివునితో కలిసి విహరిస్తున్నావు కదా.."
                                    కిందటి శ్లోకం నించి సౌందర్య లహరిలోని శ్లోకాలు పారాయణ చేస్తే కలిగే ఫలితాలు కూడా చెప్పుకుంటున్నాం కదా. అయితే కిందటి శ్లోకం (ఎనిమిదవది) పారాయణే చాలా తక్కువ సంఖ్యలో ఉంది. (కేవలం పన్నెండుసార్లు) సౌందర్య లహరిలో అంత తక్కువ సంఖ్యలో పారాయణ చెయ్యగలిగే శ్లోకాలు మరేవీ లేవు. దరిదాపుగా అన్నీ రోజుకు వెయ్యేసి సార్లు పారాయణ చెయ్యవలసినవే. ప్రస్తుత శ్లోకానికే వస్తే..(తొమ్మిదో శ్లోకం) దీన్ని రోజుకు వెయ్యిసార్లు జపించాలి. అలా పది రోజులు గాని నలభై ఐదు రోజులు గాని పారాయణ చెయ్యాలి. నైవేద్యం పాలతో తయారు చేసిన పాయసం. దీనికి ఫలితం దేశాంతరాలు పట్టిపోయినవాళ్లు తిరిగి రావటం..పంచభూతాల వల్ల (భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ ఐదూ పంచభూతాలు) మనకు ఎటువంటి కీడూ కలగకుండా ఉండటం. సౌందర్య లహరిలోని శ్లోకాల పారాయణకు సంబంధించి యంత్రాలు, బీజాక్షరాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా చెయ్యాలన్న వివరణలున్నాయి. కాని నేను అవేవీ నా బ్లాగులో ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను అవన్నీ చెప్పేంత గొప్పదాన్నీ కాదు..వాటిని  వివరించే ఉద్దేశ్యమూ నాకు లేదు. అంచేత అటువంటివన్నీ కావలసిన వాళ్లు పుస్తకాల షాపుల్లో వెతికితే తదనుగుణమైన పుస్తకాలు దొరుకుతాయి. నేను కేవలం ఏ శ్లోకం చదివితే ఏ ఫలితమో మాత్రమే చెబుతున్నాను. ఎవరికి వారు వారి వారి శక్త్యానుసారం ఆ పారాయణ చేస్తే...(వెయ్యిసార్లూ జపించలేకపోయినా..చెయ్యగలిగినన్ని సార్లు) అందులో కనీసం పావు వంతు ఫలితమైనా దక్కుతుంది గదా అన్నది నా ఆలోచన.
                                  ఇక భావార్ధంలోకొస్తే..ప్రస్తుత శ్లోకం శ్రీవిద్యా ఉపాసకులకు, కుండలినీ యోగసాధనకు చాలా ముఖ్యమైనదట. దేవుడూ..పూజా అంటే తెలుస్తాయి గాని కుండలిని, మూలాధార చక్రం అంటే నా బోటి పామరులకేం తెలుస్తాయి..? నా పాలిటికి, వేదాల దగ్గర్నించీ సమస్తమూ చిన్నికృష్ణుడిలా నోట్లోనే దాచుకున్న గూగులమ్మ ఒకతి ఉంది కాబట్టి,అక్కడే శరణు జొచ్చాను. మొత్తానికి  కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి అనీ,మనిషి శరీరంలోని వెన్నుపాములో దాగి ఉంటుందనీ తెలియవచ్చింది. అమ్మవారు ఎటూ ప్రతి ప్రాణిలోనూ "శక్తి"గా అంతర్భూతమై ఉంటుందని ముందుగా తెలుసుకునే ఉన్నాం కాబట్టి..ఆ శక్తే ఇదని భావించుకోవచ్చు. అయితే ఈ కుండలిని ప్రతి మనిషిలోనూ నిద్రాణమై ఉంటుందనీ, మూలాధారచక్రంలో దాగి ఉన్న ఈ కుండలినీ శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి నుంచి పైనున్న సహస్రారపద్మం లేదా సహస్రార కమలం వరకూ తీసుకువెళ్లగలిగేదాన్నే కుండలినీ యోగమంటారనీ యోగశాస్త్రం చెబుతోంది.  అంటే మనిషి శరీరంలో నిద్రాణంగా ఉన్న శక్తిని కొన్ని పద్ధతుల ద్వారా జాగృతం చేసి దాన్ని శరీరమంతటా వ్యాపింపజేసేదే కుండలినీ యోగం. అంటే మనలో ఉన్న అమ్మవారిని మనం తెలుసుకుని, మన శరీరపు అణువణువునా నింపుకోవడమన్నమాట. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనం దేవీ విషయ సంబంధమైన చైతన్య రహిత సుషుప్తావస్థ లోంచి జాగ్రదవస్థలోకి రావడమన్నమాట. ఒక దేవాలయం ఉందంటే..దాని గర్భగుడితో బాటు ఆవరణ అంతటినీ  కూడా ఆగమ శాస్త్రం ప్రకారం తీర్చిదిద్దినప్పుడే కదా అది నిజమైన ఆలయం అనిపించుకుంటుంది. అలాగేనన్నమాట.  ఒకానొక దైవశక్తి మన శరీరంలోని ప్రత్యణువునా వ్యాపించి ఉంటే ఎలా ఉంటుంది...మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటాం..ఎటువంటి రోగాలూ మన దరిదాపుల్లోకి రావు. అంతే కదా. ఇదే మాటను యోగశాస్త్రం చెబుతోంది. "యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండండనే" మాట ఈ రోజుల్లో వేనోళ్ల వినబడుతున్న సలహా.   కుండలినీ శక్తిని జాగృతం చెయ్యడానికి ప్రాణాయామం ఒక ముఖ్యమైన సాధన అని చెబుతోంది యోగశాస్త్రం. మన శరీర సంరక్షణకు అతి ముఖ్యమైన వాటిలో ప్రాణాయామం ఒకటన్నది మనకందరికీ తెలిసిందే.    
                    ఇక పోతే, మన శరీరంలో చక్రాలంటూ కొన్ని ఉన్నాయనీ, వాటిని ఫలానా ఫలానా పేర్లతో పిలుస్తారనీ, అవి ఫలానా ఫలానా చోట్ల ఉన్నాయనీ...ఈ విషయాలేవీ మనకు సరిగ్గా తెలియవు.  తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో ప్రస్తుత శ్లోకంలో ప్రస్తావించబడ్డ "మూలాధార" "మణిపూర" "స్వాధిష్టాన" "సహస్రార పద్మం" అన్నవాటిని గుర్తించవచ్చు. "షట్చక్రోపరిసంస్థితా" అంది లలితా సహస్రం. అంటే ఆరు చక్రాలకు పైన గలది అని అర్ధం. ఆ ఆరు చక్రాలూ ఇవే. "మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలకు పైనున్న సహస్రారపద్మంలో గల తల్లి" అన్నది లలితా సహస్రంలో చెప్పిన మాట. అయితే ప్రస్తుత శ్లోకంలో అన్ని చక్రాల పేర్లూ లేవన్న సందేహం కలగవచ్చు. "హృదిమరుతమాకాశముపరి" అంటే, హృదయభాగమందుండే అనాహత చక్రమందు మరుత అంటే వాయు తత్వం, ఆకాశం+ఉపరి=ఆకాశముపరి అంటే హృదయానికి ఉపరిభాగంలో ఉన్న విశుద్ధి చక్రమందు ఆకాశతత్వం అని అర్ధం. అలాగే భ్రూమధ్యే అంటే కనుబొమల మధ్య గల ఆజ్ఞాచక్రమందు అని అర్ధం. కులపధం అంటే సాంప్రదాయకమైన సుషుమ్నామార్గం అని అర్ధం. 


                                                     
                                                                   -------------(గూగుల్ సౌజన్యంతో) 

                      ఇదంతా ఇలా ఉంచితే..పూర్వకాలంలో పూజ చేసుకోవడానికి ఎలా కూర్చోవాలన్న విషయంలో సైతం కొన్ని నియమనిబంధనలుండేవి. రాను రాను అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో కాపురాలు, ఎక్కడో ఓ చోట ఓ గూట్లో దేవుడి ఫోటో ఒకటి పెట్టేసి నిలబడే దండం పెట్టెయ్యడాలు...ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులనేకం మనిషిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తున్నాయన్నది విస్పష్టం.  నా చిన్నప్పుడు (మూడేళ్ల వయసులో) నేను బుల్లి పట్టు లాగూ తొడుక్కుని మా తాతగారి పక్కన పద్మాసనం  వేసుకుని కూర్చునేదాన్ని. ఇప్పుడు ఓ చిన్న ప్లాస్టిక్ స్టూలు మీద కూర్చుని నా చేతికందే ఎత్తున బల్ల మీద ఉన్న దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను. ఆ పసి వయసులో నాకు పద్మాసనం ఎలా వెయ్యాలో నేర్పించింది మా తాతగారే. కాని ఇప్పుడు ఎంతమంది తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తమ వారసులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిస్తున్నారు..? అసలు ఎంతమంది తల్లిదండ్రులు పరంపరాగతమైన విషయపరిజ్ఞానానికి తమ ఇళ్లల్లో అవకాశం కల్పిస్తున్నారు..? మనిషికి దేని మీదైనా సరే బాల్యంలోనే సరైన అవగాహన కలగాలి...దైవ చింతన అయినా, యోగసాధన అయినా..!! అప్పుడే ఆ లేతమొక్క తద్విషయమృత్తికలో దృఢంగా నాటుకుని ఏపుగా ఎదుగుతుంది.  
                           ఈ శ్లోకంలో మనకు తెలియని, అంత సులువుగా అర్ధం కాని యోగ పరిభాష ఏదో ఉంది కదా. ఊరికే కష్టపడి దాన్ని తెలుసుకోవాలని ఆతృత పడిపోనక్కర్లేదు. ఈ శ్లోక సారాంశం అతి సులువుగా బోధపడుతూనే ఉంది. అమ్మవారు శక్తి రూపంలో మనలో నిద్రితమై ఉంది. ఆ దైవీశక్తి మన అణువణువునా వ్యాపించి, మనకు రక్షాకవచంగా ఉండాలంటే మనం యోగశాస్త్రంలో చెప్పిన కొన్ని పద్ధతుల్ని పాటించాలి. ఇదే ఈ శ్లోకం మనకు చేస్తున్న హితబోధ. మన శరీరంలోని ప్రత్యణువునూ కూలంకషంగా వివరిస్తున్న ఈ శ్లోకం చదివిన తర్వాత మనం చెయ్యవలసిన పని ఏమిటంటే...పాంచభౌతికమైన ఈ శరీరం అమ్మకు ఆలవాలమైనదని గ్రహించి...దీన్ని పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నలోపం లేకుండా కృషి చెయ్యటం. అంతే. ఈ శ్లోకం చదివాక నాలో కలిగిన స్పందనా..నేను మీకు చెప్పగలిగినదీ ఇదే.    
                                 ఇక్కడ మరో చిన్న విషయం...వైద్యశాస్త్రం అత్యద్భుతంగా పరిగణించే ఎన్నెన్నో అమూల్యమైన విషయాలను అరటిపండు ఒలిచినట్టు అతి సులువుగా మనకు వివరించి చెప్పిన యోగశాస్త్రం మనకు మన పూర్వీకులు ప్రసాదించిన ఒక గొప్ప వరం. దైవికమూ-యోగమూ పరస్పరానుసంధానంతో వికసిస్తాయన్న విషయాన్ని మాత్రమే ఈ శ్లోకం కొత్తగా మనకు తెలియజెబుతోంది. ఈ మాట కూడా న్యాయానికి కొత్తదేమీ కాదు. పురాతనంగా వినవస్తున్నదే. ఇక దీన్ని జీవితంలోకి ఎలా అనుసంధానించుకుంటామన్నది ఎవరికి వారికే పూర్తిగా స్వవిషయం.అరవయ్యేళ్ల వయసువాళ్లయినా, రోగభూయిష్టమైన శరీరంతో ఉన్నవాళ్లయినా సరే యోగా చెయ్యవచ్చుననే ఆచార్యులు చెబుతున్నారు. యోగానికి  ప్రధమ సోపానమైన ప్రాణాయామంతో ముందు ప్రారంభిస్తే సహస్రార పద్మం దాకా ఎగబాకలేకపోయినా కనీసం ఓ రెండు మూడు మెట్లయినా ఎక్కొచ్చు. నెలకోసారి డాక్టరు దర్శనం చేసుకునే బదులు ఆర్నెల్లకోసారి చేసుకోవచ్చు. అదీ సంగతి...!! 
                                  అమ్మ మనలో ఎలా దాగి ఉందన్న మహిమాన్వితమైన విషయాన్ని..పాంచభౌతికమైన ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనే సూచనతో మిళాయించి..రసరమ్యమైన పదజాలంతో మనకందించిన భిషక్కవివరులు శంకర భగవత్పాదులు. ముందు లలితా త్రిపురసుందరికీ...తరువాత ఆ మహనీయునికీ ప్రణమిల్లుతూ...ఇక సెలవా మరి...!!    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి