ఎలా ఉన్నారు
నాన్నా..అమ్మా మీరూ ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఖులాసా గా ఉన్నారని
అనుకుంటున్నా. నిజమే కదా..?! ఎంత ఖులాసాగా
ఉన్నా మీ మనసు మా నలుగురి కోసం పరితపిస్తూనే ఉంటుందని..మాకు ఏ చిన్న సమస్య వచ్చినా
మీకు ఆ స్వర్గం లో కూడా నిద్ర పట్టదని మాకు బాగా తెలుసు. మా చిన్నప్పటి నించి
చూస్తున్నదేగా..?! నాకు ప్రతి క్లాసు లోనూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంటే
ఓ కంట ఆనంద బాష్పాలు..ఆయాసంతో నేను ఊపిరి అందక ఎగిరెగిరి పడుతూ ఉంటే మరో కంట
కన్నీరు కార్చడం మీకు ఉచ్చ్వాసనిశ్వాసాలంత తేలికగా అలవాటైపోయింది. రాధి మీ కంటె బాగా పాడుతూ ఉంటే మీ
హృదయకవాటాల్లో ఒకటి ఆనందంగా లబ్ డబ్ అనడం.. దానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా రెండో
కవాటం అంత నిశ్శబ్దంగానూ కుచించుకుపోవడం మాకు తెలియని విషయం కాదుగా..?! పిల్లల విషయంలో గుండె స్పందించే తీరు ఎంతటి
ప్రముఖ కార్డియాలజిస్టుకీ అందని మహాశ్చర్యం..! అది మేం నలుగురం ఇప్పుడు
అనుభవిస్తున్నాంగా అచ్చం మీలాగే..:) దానాలూ ధర్మాలూ ఆ దానకర్ణుడికే ఎరుక..పిల్లల
కోసం గుండెను సైతం ఒలిచి ఇచ్చెయ్యడం మీలాంటి తండ్రులకే తెలిసిన విద్య. మీలాంటి
అన్నాను గాని...ఇక్కడ మీలాంటివాడు మళ్లీ మీరే అని కూడా మాకు సగర్వంగా తెలుసు. ఇంక బాబు సంగతి..అసలు వంశోద్ధారకుడు పుట్టినందుకే మీరు
ఎంతలా పొంగిపోయేరో..వాడి కంటే అచ్చం పదకొండేళ్లు పెద్దదాన్ని నాకు బాగా తెలుసు.
వాడి నామకరణ మహోత్సవానికి మీరు ప్రత్యేకంగా చేయించిన పెద్ద పెద్ద కాజాల రుచి
(అప్పట్లో కాజాయేగా గొప్ప స్వీటు) నాకిప్పటికీ జిహ్వ మీద ఉంది. వాడు బొంబాయి
ఐఐటీలో చేరినప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని వర్ణిచడం ఆ ఆదిశేషుడికైనా సాధ్యమా..? అలాగే “పాపా కహతే హై బడా
నాం కరేగా..బేటా హమారా అచ్చా కాం కరేగా “ అంటూ
వాడు రాసిన ఉత్తరం చదువుతూ ఆనందవిషాదసమ్మిళితభావోద్వేగం తో మీరు ఎలా ఎగసి
పడ్డారో మీ పక్కనే కూచుని ప్రత్యక్షం గా
చూశాను నేను. మీ నాలుగు ప్రాణాల్లోనూ
ఆఖరి ప్రాణం బుజ్జి...బుతగా..(బుజ్జితల్లిగా) దాని కోసం మీరు పడ్డ ఆతృత అంతా ఇంతా
కాదు. " నీకు ఏ లోటూ చెయ్యనమ్మా..పెద్దక్కకీ చిన్నక్కకీ ఎలా చేశానో నీక్కూడా
అన్నీ అలాగే చేస్తాను" అంటూ నీరసించిన మీ గుండెకి మీరే ధైర్యం చెప్పుకున్నారు
గాని...జాలిమాలిన ఆ దేవుడు మాత్రం క్షణం అటూ ఇటూ అవడానికి వీల్లేదంటూ మిమ్మల్ని
లాక్కెళ్లిపోయేడు. పోన్లెండి
నాన్నా...మిమ్మల్ని భౌతికంగా మా నించి బోల్డు దూరం లాక్కుపోగలడు గాని, మా నాలుగు గుండెల్లోనూ చిరంజీవిగా..సదా నవ్వుతూ ఉండే మిమ్మల్ని..మీ స్మృతిని
తీసెయ్యడం ఆ దేవాధిదేవుడికి కూడా సాధ్యం కాదు. అలాగే మా పట్ల మీ ఆత్మ
స్పందించడాన్ని కూడా ఏ దేవుడూ ఆపలేడు.
మనిద్దరం అర్ధరాత్రి దాకా చెప్పుకున్న కబుర్లు..కలిసి తాగిన స్ట్రాంగ్
కాఫీలు..మీరు నేర్పిన ఇంగ్లీషు..సాహిత్యం..జీవితపు విలువలు..పిల్లల కోసం శరీరాన్నీ
మనసునీ కరగదీసుకునే తీరు ఇవన్నీ నా కొన ఊపిరి దాకా మిమ్మల్ని నాకు గుర్తు చేస్తూనే
ఉంటాయి. అందుకే చెబుతున్నా నాన్నా...హేపీ ఫాదర్స్ డే..!! మీరు నలుగురు పిల్లల
ప్రియాతి ప్రియమైన తండ్రి..!! నాలుగు అద్భుత శిల్పాల్ని చెక్కిన అమర శిల్పి !!
మిమ్మల్ని మేం నలుగురం ఏనాడూ నాన్న "గారూ" అని పిలవలేదు.
"నాన్నా.." "నాన్నా" అంటూ ఏళ్లొచ్చినా మీ దగ్గర పసి పాపలుగానే
ఉన్నాం. అప్పుడూ .. ఇప్పుడూ..ఎప్పుడూ మేం మీ పాపలమే. మా నలుగురి
తరఫునా మీకు మరోసారి హేపీ ఫాదర్స్ డే..!! మదర్స్ డే నాడు అమ్మకి విషెస్ చెప్పలేదు
నాన్నా..! పాపం పిచ్చి అమ్మకి కోపం రాదు గాని...ఈ
ఫాదర్స్ డే సందర్భం గా అమ్మకి కూడా హేపీ మదర్స్ డే అని చెప్పెయ్యండి.
అమ్మా...విన్నావా... నీకు హేపీ మదర్స్ డే
!! నాన్నకి హేపీ ఫాదర్స్ డే..!!
కృష్ణలీలాతరంగిణి
17, జూన్ 2017, శనివారం
30, డిసెంబర్ 2014, మంగళవారం
Happy New year
అనంత పయనం లో మరో ఏడాది గడిచిపోయింది. నవ్వుతూనే ఉన్నామో, నవ్వుతూ..ఏడుస్తూ ఉన్నామో...అసలు ఎప్పటికైనా నవ్వుతామా దేవుడా అనిపించేంతగా శోకాంబుధిలో మునిగిపోయామో...ఎవరికి వారికే తెలిసిన, ప్రత్యేకమైన జీవితగ్రంధమది. అయితే, జీవన గమనం లో మరో కొత్త ప్రస్థానం ప్రారంభించబోయే తరుణాన...ఒక్కసారి అందరం...పరస్పరం శుభకామనలు తెలియజేసుకోవడం మన కనీస విధి...మర్యాద. అందుకే..ఈ బ్లాగులోకి కన్నూనిన ప్రతి ఒక్కరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదామని మళ్లీ మౌసు పెన్ను పట్టుకున్నాను. అందరికీ హేపీ న్యూ ఇయర్...!!! ఆఖరికి 31-12-2015 న ఈ బ్లాగు చూసిన వాళ్లు కూడా నేను మీకు పన్నెండు నెలల కిందటే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేశానని గ్రహించండి చాలు...ఓకే...ఆల్ ది బెస్ట్..!!
13, సెప్టెంబర్ 2014, శనివారం
2, సెప్టెంబర్ 2014, మంగళవారం
6, జూన్ 2014, శుక్రవారం
రాయాలి...
ఏమీ రాయకుండా రోజులు ఎలా గడిచిపోతున్నాయో...?? అవును మరి..నా కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా ఏం...??? కాని, అందాల కడలి ఆగిపోయింది...(అమ్మకి బుగ్గపోటు పొడిచాను కదా..గర్వానికి పోతే ఏమవుతుందేం...) రాయాలమ్మా...రాయాలి....కనీసం అదొక్కటైనా రాయాలి..!! అయితే దానికీ టైం రావాలి కాబోలు...అంతే కదా మరీ...!!!
13, ఏప్రిల్ 2014, ఆదివారం
నా తరమా...
ఫిబ్రవరి ఆరవ తారీఖున బ్లాగు ప్రారంభించాక...ఇన్ని రోజుల పాటు అసలేమీ రాయకుండా లేను. ముఖ్యంగా అందాల కడలి. కాని...ఇప్పటికి పదహారు రోజులైంది...అసలు మౌస్ పట్టుకోవడానికే వీల్లేకపోతోంది. మార్చి 28న అమ్మకో బుగ్గపోటు తగిలించాక...నాక్కూడా బిజీ పోటొచ్చింది.అమ్మకి బుగ్గపోటిస్తే ఏమీ చేతకానిదానిలా ఆవిడ ఊరుకుంటుందా మరి..?? ఇప్పట్లో కుదిరేలా కూడా లేదు...కనీసం ఈ నెల ఇరవయ్యొకటో తారీఖు దాకా...సముద్రతరంగాలైనా కాస్త కుదుటపడతాయేమో గాని సంసారసాగరానికి మాత్రం అసలు విశ్రాంతి లేదు కదా...
ఏ తీరుగ నను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా...నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా...
ఏ తీరుగ నను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా...నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)