24, జూన్ 2024, సోమవారం

యోగక్షేమం వహామ్యహం

 

   తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ప్రత్యేక సంచిక "తెలంగాణ తోరణం" లో ప్రచురించబడిన నా కథ

                                     యోగక్షేమం వహామ్యహం 

   "మీకోసం ఎవరో ఒక పెద్దావిడ, ఒకాయన వచ్చారు సార్.ఈ కాగితం మీకిమ్మన్నారు..." వినయంగా అంటూ చిన్న కాగితం ముక్క ఇచ్చాడు  సెక్రటరీ జీవన్. 

 "పెద్దావిడా... " ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. "అమ్మేమో" అన్న ఆశ మనసులో చిచ్చుబుడ్డిలా గుప్పున వెలిగి... ఆరిపోయింది. అమ్మ ఎలా వస్తుంది?!  ఇందు అమ్మ ఊసే ఎత్తదు. ఉన్న ఒక్కగానొక్క సంతానం హృదయ్ కి నానమ్మ గురించే తెలియదు. ఇంక తను లివర్ కేన్సర్ తో ఆస్పత్రిలో ఉన్నట్టు అమ్మకెలా తెలుస్తుంది?!  

  మూర్తి అనాసక్తిగానే కాగితం చదివాడు..."మూర్తీ, నీ గురించి తెలిసి, అమ్మా నేనూ వచ్చాం...రాఘవ"

           అది చదువుతూనే ఒక్క ఉదుటున లేచి కూచున్నాడు మూర్తి. 

 "వాళ్లని లోపలికి తీసుకురా జీవన్. బైట డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టు." గబగబా చెప్పి, వెనక్కి జేరబడ్డాడు. 

  జీవన్ మొహంలో ఆశ్చర్యం దాచుకుంటూ తల ఊపి వెళ్లిపోయాడు. 

 మూర్తి తలుపు వైపే దృష్టి కేంద్రీకరించాడు. 

          అమ్మని చూసి పదేళ్ళూ,  తనింటి నుంచి గెంటేసి...ఇరవై సంవత్సరాలు అయింది!! అవును.. ఒక మనిషి తనంతట తాను ఇంట్లోంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తే అది గెంటెయ్యడమే. ఇందు అలాంటి పరిస్ధితుల్ని భేషుగ్గా కల్పించింది. తను చూసీ చూడనట్లు ఊరుకున్నాడు. నాన్న కూడా లేని అమ్మ.. ఏకాకి అయి, అయినా సరే దర్జాగా వెళ్లిపోయింది. అమ్మ ధీరోదాత్తురాలు! అలాంటి అమ్మని తను వెళ్లగొట్టేశాడు!  అమ్మ వెళ్లిపోయినందుకు తను ఏనాడూ బాధపడలేదు సరికదా అమ్మకి పల్లెలోనే బావుంటుందని కూడా అనుకున్నాడు. 

      ఇదిగో, వారం రోజుల క్రితం డాక్టర్ తనకి లివర్ కేన్సర్ అని ఖరారు చేశాక, మళ్లీ అమ్మ పదే పదే గుర్తుకు రావడం మొదలైంది.  పెద్దయాక కూడా తనకేమైనా ఒంట్లో బాగాలేకపోతే అమ్మ ఎలా లాలించేదో గుర్తొచ్చింది. ఈ యాభై ఏళ్ల వయసులో, మృత్యువు పొంచి చూస్తున్న వేళ, మళ్లీ అలాంటి లాలన కోసం మనసు కొట్టుకుపోయింది!

           తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లగా, పొట్టిగా, బక్కపల్చగా ఉన్న  ఆకృతి లోపలికి వచ్చింది. నిర్మలంగా ఉన్న ఆ మొహంలో.. కళ్లజోడు వెనుక నుంచీ కూడా ఆ చూపు ఎంత దయార్ద్రంగా ఉందీ?! ఎంత నిష్కల్మషంగా, ప్రేమగా ఉందో?! 

 "అమ్మా.. " మూర్తి అప్రయత్నంగా చెయ్యి చాపాడు. 

  సావిత్రమ్మ చప్పున ముందుకొచ్చి కొడుకు చెయ్యి అందుకుంది. 

 "అమ్మా.... " మూర్తి కళ్లు నీళ్లతో నిండిపోయాయి.   "నేనూ నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నానమ్మా"

  "నీ మొహం" సావిత్రమ్మ  ప్రేమగా కొడుకు బుగ్గలు పుణికింది. "నన్ను దాటించకుండా నువ్వెక్కడికి వెళతావురా.. నా పూజలన్నీ ఏమైపోవాలీ?" అంటూ పక్కనే ఉన్న రాఘవ వైపు చూసి "చిన్నప్పటి నుంచీ ఇంతే... ఉత్త భయస్ధుడు." అంటూ నవ్వింది

      అమ్మ మాటకి ఒక్కసారిగా పుంజుకున్నాడు మూర్తి. ధైర్యాన్ని సిరంజిలోకి ఎక్కించి, నరాల్లోకి పంపించినట్టయింది. అవును... ఇప్పట్లో తనకేమీ కాదు. అమ్మ ఎక్కడున్నా తను బావుండాలని పూజలు చేస్తూనే ఉంటుంది. డాక్టర్లు చెబుతూనే ఉన్నారు కదా... చాలా ఎర్లీ స్టేజి.. భయపడవలసిందేమీ లేదూ అని. అది అమ్మ పూజల వల్లే! అమ్మ ఎంత నిష్టగా పూజ చేస్తుందో తనకి తెలుసు. ఇందుకి షో ఎక్కువ.

 "అమ్మా.. నీకెలా తెలిసింది?!"

 "కాకొచ్చి కబురు చెప్పింది గాని, నాన్నా, నేను నీ దగ్గర ఓ వారం రోజులు ఉందామనుకుంటున్నానురా."

"అమ్మా...!" మూర్తి ఆనందం రెట్టింపు అయింది. "నన్ను చూసేసి వెళ్లిపోతావేమోనని భయపడుతున్నానమ్మా!"

"పిచ్చితండ్రి..అలా ఎలా వెళతాను? వీలైతే నిన్ను నాతో బాటు తీసుకువెళ్లాలని ఉంది నాకు!"

   మూర్తి మాట్లాడలేదు.. అయిష్టతతో కాదు.. "అమ్మతో కలిసి వెళతానా" అన్న అపనమ్మకంతో.

  రాఘవ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

  "కాలక్షేపానికి విను..!" సావిత్రమ్మ  తన సెల్ కొడుకు తల పక్కన పెట్టింది. 

  "న కాంక్షే విజయం కృష్ణ.. నచ రాజ్యం సుఖానిచ" ఘంటసాల భగవద్గీత వస్తోంది. 

  "అమ్మా.. " చప్పున మళ్లీ మృత్యుభయం కమ్ముకుంది మూర్తిని. "నేను చచ్చిపోతానని.. చచ్చిపోబోయే ముందు భగవద్గీత వినిపిస్తున్నావా..?!"

 సావిత్రమ్మ  చల్లగా నవ్వింది. "ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచీ భగవద్గీత నిత్యం పారాయణ చేస్తున్నాను నేను. చచ్చిపోతాననే చదువుతున్నానా?!"

   మూర్తి మాట్లాడలేదు! 

 "ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈనాడు చెబుతున్నారు చూశావా... యుగయుగాల కిందటే ఆ ఆర్ట్ ని గ్రంధస్థం చేసి మనకి అందించాడు  కృష్ణ పరమాత్మ! ఆ స్వామి ఉన్నాడూ అని నువ్వు ఎంత దృఢంగా నమ్ముతావో, సమస్త రకాల బాధల నుంచీ నువ్వు అంత దూరమవుతావు! శారీరకంగా సుఖపడటానికి సంపాదన ఎంత అవసరమో, మనశ్శాంతికి ఆధ్యాత్మికత అంత అవసరం! పెద్దవాళ్లు మనతో బాటే ఉంటే, మన చెయ్యి పుచ్చుకుని ఆధ్యాత్మికత బాట పట్టిస్తారు! నేనిప్పుడు చేస్తున్నది అదే! ప్రశాంతంగా, ఏమీ ఆలోచించకుండా విను! నీ మనసుకి శాంతి దొరుకుతుందో లేదో చూడు!"

 మంత్రముగ్ధుడిలా భగవద్గీత వినడం ప్రారంభించాడు మూర్తి.

"దేహినోస్మిన్ యధా దేహి.. కౌమారం యవ్వనం జరా.. "

   అవును. చిన్నప్పుడు పరిగెడుతూ క్రికెట్ ఆడిన శక్తి తనకిప్పుడు లేదు. బాల్యం, యవ్వనం దాటేశాడు. బీపీ, సుగర్ శరీరాన్ని లొంగదీసుకున్నాయి. స్టేజి మీద తన పాత్ర చివరికి వస్తుంటే, ఇహ తెర వెనక్కి తప్పుకోవలసిన సమయం ఆసన్నమైందని వేరే ఎవరో చెప్పాలా?! ఎటూ తెరమరుగవడం తప్పనిసరి అయినప్పుడు, ఏ రకంగా అయితేనేమీ?! 

 "అమ్మా... "

"ఏమిటి నాన్నా?!"

"డిశ్చార్జ్ చేశాక, నువ్వూ, నేనూ కలిసి మన ఊరు వెళదాం! నీ దగ్గర కొన్నాళ్లుంటానమ్మా"

                                                    **********

        చిన్న డాబా ఇల్లు! ముందు వైపు మథు మాలతి, సన్నజాజి, విరజాజి, వెనుక వైపు ఆనప, బీర, కాకర తీగెలతో కప్పుకుపోయి, లతాగృహంలా కనిపిస్తోంది. విశాలమైన పెరట్లో, తూర్పున గోశాల. తాటాకు కప్పిన ఆ పాక మీద కాశీరత్నం పూలతీగె నిండుగా విస్తరించి, పాకలో గోమాతకి పువ్వుల గొడుగు పట్టినట్టుంది! 

      ఇంట్లో కాలు పెడుతూనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్లి, కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కుని, గోశాల వైపు నడిచింది సావిత్రమ్మ. చిన్నపిల్లాడిలా తల్లి వెనకే వస్తున్న మూర్తి, తనూ కాళ్లూ, చేతులూ కడుక్కుని, గోశాలలోకి వెళ్లాడు! 

  "బావున్నావా తల్లీ.. " ఆవు గంగడోలు నిమురుతూ ఆప్యాయంగా అడిగింది సావిత్రమ్మ. 

   ఆవు ఆమె రాకకి ఆనందిస్తున్నట్టు మెడ సాచి సావిత్రమ్మకి మరింత దగ్గరగా మొహం పెట్టింది. పక్కనే మరో చిన్న గుంజకి కట్టేసి ఉన్న దూడ, తల్లిని రాసుకుంటూ ముందుకొచ్చి సావిత్రమ్మ తొడల్ని తలతో పొడిచింది. 

"అయ్యో, నిన్ను మర్చిపోలేదురా నాన్నా.. " సావిత్రమ్మ వంగి దూడని నిమురుతూ ముద్దు చేసింది. 

 "ఇది సురభి! ఈ బుజ్జి దూడ గౌరి!" అని చెబుతూ,  కొడుకు జబ్బ పట్టుకుని సురభి దగ్గరగా తీసుకువెళ్లింది. మూర్తి చెయ్యి పట్టుకుని సురభి గంగడోలు నిమిరించింది. 

      తర్వాత చేతులు జోడించి నమస్కారం చేస్తూ, "అమ్మా, సురభీ! నీకు తెలియనిదేముంది.. వీడు నా ఒక్కగానొక్క పిల్లాడు! వీణ్ణి చల్లగా చూడాలి నువ్వు!" అంది. 

       ఆ మర్నాటి నుంచీ మూర్తి దినచర్య సరికొత్తగా మొదలైంది. తెల్లవారుజామునే అమ్మతో బాటూ లేవడం, స్నానం చేసి, దేవుడి ముందు దీపం వెలిగించి ఒక పావుగంట సేపు నిశ్చలంగా ధ్యానం చేయడం. తర్వాత గోశాలకు వెళ్లి, సురభి, గౌరి ఇద్దరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, సురభి గంగడోలు నిమురుతూ మృత్యుంజయ మహా మంత్రాన్ని ముమ్మారు చెప్పడం. అదయాక, అలా పొలాల వైపు వాకింగ్! 

           సావిత్రమ్మ కబురంపగా వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఏదో లేహ్యం, గుళికలూ ఇచ్చాడు. వేళకల్లా అవి వేసుకోవడం. అమ్మ పెట్టే సాత్వికాహారాన్ని తీసుకోవడం! రెండు పూటలా గోరువెచ్చని ఆవుపాలు తాగడం! పుస్తకాలు చదువుకోవడం...!!

     తల్లి బుక్ షెల్ఫ్ లో కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు కూడా కనిపించాయి మూర్తికి. అవి ఎవరు చదువుతారా అనుకుంటుండగా, ఒకరోజు ఒక పుస్తకం తెచ్చిస్తూ, "చదువు. చాలా బావుంది" అంది సావిత్రమ్మ.

 అమిత్ వైద్య రాసిన “Holy Cancer - How a Cow saved my life అనే  పుస్తకం అది. 

మూర్తి ఆశ్చర్యంగా, “చాలా బావుందా...అమ్మా  నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు?!" అని అడిగాడు.

"చెబుతాను. విను. ఆరోజు ఆస్పత్రిలో నీ గురించి నాకు ఎలా తెలిసిందీ అని అడిగావు కదా.. నాకు ఇంగ్లీష్ నేర్పిందీ..స్మార్ట్ ఫోన్ కొనిచ్చి, దాని వాడకం నేర్పిందీ, నీ అనారోగ్యం గురించి చెప్పిందీ అంతా ఒకరే.. "

"ఎవరమ్మా. ." మూర్తి కుతూహలం రెట్టింపు అయింది. 

"చెబుతున్నా..! నేను నీ దగ్గర నుంచి వచ్చేసిన చాలా కాలానికి  ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. "నానమ్మా... నేను నీ మనవణ్ణి" అన్నాడు అవతలి నుంచి. నేను నిలువునా చలించిపోయాను. నేను వచ్చేసే టైంకి వాడు ఏడాది వాడు. ఇప్పుడు పదహారేళ్లు. "నానమ్మా....నేను నీ దగ్గరకి రావచ్చా" అని అడిగాడు. కళ్లనీళ్లొచ్చాయి నాకు. రమ్మన్నాను. వచ్చాడు. 

          "మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు... ఆ సైలెన్స్.. ఐ హేట్ నానమ్మా" అని వాడు అంటూంటే నాకు మీ నాన్నగారే గుర్తొచ్చారు. ఇల్లనేది సందడిగా ఉండాలనేవారాయన. నీ సెల్ లో నా ఫోన్ నంబర్ పట్టుకుని, రహస్యంగా వచ్చాడు వాడు. ఇప్పుడు కనీసం నెలకోసారైనా వస్తాడు. సురభి, గౌరి వాడు పెట్టిన పేర్లే. ఈ ఇల్లు ప్రస్తుతం నడుస్తున్నది వాడి ఊపిరితోనే!!"

                మూర్తి నోట మాట రాలేదు! కానీ రక్తం ఉరకలేస్తోంది. గుండె గంగావతరణంలా "తొందర తొందర నడకల వెను వెన్కనె వేల్పుటేరు" లా పొంగుతోంది!! 

                                                    **********

     పదేళ్ల తర్వాత.. 

  "ఇందిరా ఫార్మా" కంపెనీ అధినేత హృదయ్ తండ్రి రామమూర్తి షష్ఠిపూర్తి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి! ఎనభై ఏళ్ల ముదివగ్గు మూర్తి తల్లి సావిత్రమ్మ సోఫాలో కూర్చుని ఉంది. 

      మూర్తి లేచి, "నేను ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ లేదు గానీ, రెండే రెండు మాటలు చెబుతాను. మొదటిది... మీ ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లని పెన్నిధిలా కాపాడుకోండి. మనం ఎలా బతకాలో... ఎలా బతికితే జీవిస్తామో చెప్పగలిగేది వాళ్లే! రెండోది కోరిక తీరడం కోసం భగవత్ప్రార్ధన చెయ్యకండి. ఫలితం ఉండదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆ పరమేశ్వరుని ఆశ్రయించండి. ఫలితం చక్రవడ్డీలా పెరుగుతుంది!! ఇక అందరూ లేచి తృప్తిగా భోజనం చెయ్యండి!" అన్నాడు. 

              సావిత్రమ్మ, హృదయ్ ఇద్దరూ చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు! 

  "అనన్యాశ్చింతయంతో మాం.." మైక్ లోంచి ఘంటసాల స్వరంతో శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నాడు! 

                                              ************

                        

 

                     



  


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి