25, జూన్ 2024, మంగళవారం

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద

 





                             ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద 

సరిగ్గా పదేళ్ళ కిందట ఒక పౌర్ణమి కి మా వైభవ వెంకన్న పంచామృతాభిషేకం చూసి వచ్చి ఆ ఆనందపు మత్తు లో దాని గురించి నా బ్లాగులో రాసుకున్నాను ఇలా...... చదవాలనుకున్నవారు చదవండి

                            ఈ రోజు పౌర్ణమి.వెంకన్న నిజరూప దర్శనం చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈ రోజు స్వామికి విశేషాభిషేకాలు చేస్తారు.మేం వెళ్లేసరికి క్షీరసాగరశయనుడికి క్షీరాభిషేకం పూర్తయి..దధ్యాభిషేకానికి వచ్చారు. "రాధా క్యోం గోరీ మై క్యోం కాలా.." అంటూ చిన్నబుచ్చుకున్న నల్లనయ్యకి "శరశ్చంద్ర చంద్రికా ధవళ"మైన పెరుగు మైపూత పూసి తాత్కాలికంగా తెల్లనయ్యను చేశారు.తరువాత తేనెలాంటి మనసున్న తండ్రిని నిలువెల్లా తేనెతో తానమాడించారు.    "ఏడుకొండలవాడా...వెంకటరమణా..ఆపదమొక్కులవాడా..అనాధరక్షకా...గోవిందా...గోవింద" అంటూ ఎలుగెత్తి పిలిచే భక్తుల మొర వినీ వినడంతోనే పొయ్యి సెగ సోకిన నేతిలా కరిగిపోయే ఆపద్బాంధవుణ్ణి పూర్తిగా నేతిలో ముంచేసి మరింత కరిగించేశారు.అక్కడితో అయిందా..అమ్మ చూడకుండా గబుక్కుని పందార అందుకుని దొరికినంత తినేద్దామన్న ఆత్రుతతో అల్లరి బుజ్జాయి అలమర పై అరలో ఉన్న పంచదార డబ్బా తీసి పొరబాటున దాన్ని ఒళ్లంతా ఒంపుకున్నట్టు...స్వామి తనువంతటినీ పంచదారతో నింపేశారు. హవ్వ...అసలే యశొదమ్మకి కన్నయ్య మీద బోలెడంత అనుమానం. ఆవిడ చూస్తే ఇంకేమైనా ఉందా.."కన్నా..పాలూ పెరుగుల్తో బాటు పంచదార కూడా తీస్తున్నావా.." అని కూకలేసి మళ్లీ ఏ రోటికో కట్టెయ్యదూ..?? అందుకే...అమ్మకి కూడా కనిపించకుందా కన్నయ్య ఎక్కడో వెళ్లి దాక్కున్నట్టు స్వామిని పూర్తిగా మాయం చేసేస్తూ కరెంటు పోయింది. ఏ కారణం చేతనో గాని వెంటనే జెనరేటర్ కూడా వెయ్యలేదు.

                                        కాస్సేపున్నాక విద్యుత్కాంతి మళ్లీ తిరిగి వచ్చింది. దోబూచాట  పూర్తయినట్టూ  స్వామి మళ్లీ కనిపించాడు. ఇక ఇక్కడి పూజారి గారున్నారేం..ఆయనకి స్వామి ఓ చంటి పిల్లాడు. బుల్లి బాబుకి తిలకం దిద్దీ కాటుక పెట్టీ ఆడపిల్లలా గౌను తొడిగీ అమ్మ ప్రేమ మీరా ఎలా ఆడుకుంటుందో ఆయన వెంకన్నతో అలా ఆడుకుంటారు. అభిషేకాల చివరాఖరున గంధం ముద్దలతో ఆయన చేసే మాయ చూసి తీరవలసిందే గాని చెబితే చాలదు. స్వామి వక్షస్థలం నించి పైకి అలా అలా గంధం ముద్దలు మెదుపుతూ మెదుపుతూ పదంటే పది నిమిషాల్లో రాముణ్ణి కాస్తా రామబంటుని చేసేస్తారాయన. నోటి దగ్గర కాస్త ఎత్తుగా అమర్చిన గంధపు ముద్ద వెంకన్నకి ఇట్టే వానర రూపాన్ని తెచ్చి పెట్టేస్తుంది. అవును మరి...గుండె చీల్చి రామదర్శనం చేయించినవాడు మారుతి..మరిక రామన్న త్వమేవాహం...త్వమేవాహం అనకుండా ఉంటాడా..?? అయిందా..గంధమూ పసుపూ అయ్యాక ఆఖరుగా కుంకుమ. నారాయణి "సర్వారుణ" అవగా లేనిది నారాయణుడికేనా తక్కువ..? ఆపాదమస్తకమూ హరిద్రాకుంకుమాంకితమైన స్వామి రూపం..."నారాయణ-నారాయణి"..!! చూసినవాడి బతుకు పావనం! జేకొట్టినవాడి జీవితం ధన్యం!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి