24, మే 2024, శుక్రవారం

       తిరుపతి కి చెందిన "తెలుగు భాషోద్యమ సమితి" వారు ఇటీవల నిర్వహించిన కథల పోటీ లో ప్రథమ బహుమతి గెలుచుకున్న నా కథ

                                               "గూటికి చేరిన పక్షులు"   


                                             గూటికి చేరిన పక్షులు

                 ఎనభై మూడు సంవత్సరాల పండుటాకు సోమయాజులుగారు శివైక్యం చెందారు. ఇల్లంతా బంధుబలగంతో నిండి ఉంది. కొడుకులు ముగ్గురూ  కలిసి కర్మకాండ నిర్వహిస్తున్నారు. యాజులుగారు ఎంత ధార్మికుడో అంత మానవతావాది. తెల్లవారుజామునే గోదావరిలో స్నానం చేసి నమకచమకాలు పారాయణ చెయ్యనిదే పచ్చి గంగ ముట్టని ఆ వృద్ధుడు, అట్టడుగు వర్గాల వారందరినీ ఎంతలా ఆదరించి ఎన్నెన్ని సహాయాలు చేశాడో ఆ భగవంతునికే ఎరుక. చేసేదేదో గుప్తదానమై ఉండాలని విశ్వసించే ఆయన చేసిన పనులేవీ భార్యకి కూడా సాకల్యంగా తెలియవు. యాజులుగారు కన్ను మూసిన క్షణం నుంచీ మాత్రం ఆయన చేసిన ధర్మకార్యాలన్నీ ప్రాణం పోసుకుని గుమ్మంలోకి నడిచొస్తున్నాయి.

         పండక్కీ పబ్బానికీ యాజులుగారి భార్య సావిత్రమ్మగారికి వంటలో సహాయం చేసే కాంతమ్మ పిలవా పెట్టకుండా కూతుర్నీ చెల్లెల్నీ సాయం తీసుకుని, ‘‘వంట నేను చేసి పెడతానమ్మా’’ అంటూ వంటింట్లోకి జొరబడింది. 

    ‘‘బేపనోల్లు తినేదే పప్పూ కూరా’’ అంటూ తట్టల కొద్దీ కూరలు తెచ్చి గుమ్మంలో పోసేసి వెళుతున్నారు కూరలవాళ్లు

 పనిమనిషి ఎల్లమ్మతో బాటు దాని కూతురూ తోడికోడలూ కూడా వచ్చి ఇంటెడు పనీ చేస్తున్నారు.

 ఎవ్వరూ ఒక్క పావలా అడగడం లేదు. ఇచ్చినా తీసుకోవడం లేదు.

   ‘‘ఇన్నాళ్లూ ఆ బాబు మాకు ఎంత చేసేడో లెక్కే లేదు. ఇప్పుడైనా ఆ బాబుకి సెయ్యకపోతే కుక్క జన్మెత్తుతాం’’ అంటున్నారు ముక్తకంఠంతో

    ‘‘మీరెలా ఛస్తే నాకే’’మని చనిపోయినవారి కొడుకుల దగ్గర్నించి వేలకి వేలు గుంజే పురోహితుడు సూరిశాస్త్రి సైతం, ‘‘బాబూ, ఎవరి దగ్గరైనా బేరాలాడతాను గాని యాజులుగారి కొడుకుల దగ్గర మాత్రం కాదు. మీరు రూపాయి బిళ్ల చేతిలో పెట్టినా ఆనందంగా స్వీకరిస్తాను. నాకెంత ఇవ్వాలో అన్న ఆలోచన వదిలేసి, నాన్నగారికి జరగవలసినవన్నీ లోభం లేకుండా జరిపించండి చాలు!’’ అన్నాడు

               పల్లెవాసనలు ఇంకా వదలని పట్నం రాజమండ్రి. పవిత్ర గోదావరీ తీరాన పదిహేను వందల గజాల స్థలంలో లంకంత ఇల్లు యాజులుగారిది. పిత్రార్జితం. గోదావరి స్నానఘట్టాలకి రెండు కిలోమీటర్ల లోపునే ఉన్న ఆ ఇంటిని అపార్టుమెంట్లు కట్టడానికి ఇవ్వమంటూ బిల్డర్లు ఆయన చుట్టూ చాలాసార్లే తిరిగారు. యాజులుగారికి ఆడపిల్లలు లేరు. ముగ్గురూ కొడుకులే. పెద్దవాడు నేవీలో పెద్ద ఆఫీసరు. రెండోవాడు అమెరికాలో డాక్టరు. మూడోవాడు ఇంజనీరు. వాళ్లు కూడా అపార్టుమెంట్లకిచ్చేస్తే లక్షలొస్తాయని  ఉత్సాహపడ్డారు. కాని యాజులుగారు ఒప్పుకోలేదు.

          ఒక సంవత్సరం పనిగట్టుకుని ముగ్గురు కొడుకుల్నీ పండక్కి పిలిచి కూర్చోబెట్టి, ఇలా చెప్పడం సాగించారు.. 

   ‘‘ఒరేయ్‌, నా మనసులో మాట చెబుదామనే మిమ్మల్ని ముగ్గుర్నీ రమ్మన్నాను. చుట్టూ పచ్చని చెట్లూ, పెరట్లో గోశాలా, తులసికోటా..నట్టింట్లో దేవుడి మందిరమూ...యజ్ఞవాటికలాంటి ఈ ఇంటిని జైలుగదుల్లాంటి అపార్టుమెంట్లకి ఇవ్వడం నాకిష్టం లేదురా! నీ జీవితం అయిపోయింది కదా నాన్నా అంటారేమో...నిజమే, నా జీవితం అయిపోతోంది గానీ ఈ ఇల్లు ఉంటుంది కదా. మా తదనంతరం మీరు ముగ్గురూ ఈ ఇంట్లో సహజీవనం చెయ్యాలన్నది నా కోరిక!’’

   ‘‘మేమా...ఇక్కడా...’’ కొడుకులు ముగ్గురూ అరిచినంత పని చేశారు.

  ‘‘అవును. మీరు ఇష్టపడాలే గాని అందులో అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు ముగ్గురూ నచ్చిన చదువులు చదువుకుని, తలోచోటా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. నేను ఏనాడూ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఉండమని కనీసం అడగను కూడా అడగలేదు. జీవితంలో ఎదగాలనుకుంటున్న వాళ్లని నా పిచ్చి చాదస్తంతో ఆపేసే మూర్ఖుణ్ణి  కాను. ఇప్పటిదాకా మీ బతుకుల్ని మీ ఇష్టప్రకారమే నడుపుకున్నారు. మీ పిల్లలు కూడా ఎదిగొచ్చేశారు. మీరు వార్థక్యపు అంచుల్లో ఉన్నారు. రేపో మాపో రిటైరవుతారు. మరిక ఎక్కడో దూరంగా బతకాల్సిన అగత్యం ఏముంది మీకు?! ఇన్నాళ్లూ ధనసంపాదనలో కాలం గడిపారు. ఇహం కోసం కష్టపడ్డారు. ఇక వానప్రస్థాశ్రమం స్వీకరించి, పరం కోసం నిరాడంబరమైన సహజీవనం చెయ్యొచ్చు కదా. సొంతగూటికి వచ్చి, గోదావరిలో పవిత్ర స్నానాలు చేస్తూ, మీకు ఈ పాటి జీవితాల్నిచ్చిన ఆ మార్కండేయస్వామిని దర్శించుకుంటూ, పెరట్లో గోమాతని పూజించుకుంటూ, ఈ విశాలమైన ఇంట్లో, పచ్చని ప్రకృతి మధ్య హాయిగా కలిసీ మెలిసీ ఉమ్మడిగా బతకలేరా?! మన ఇంటిలాంటి విశాలమైన ఇళ్లు ఇప్పుడు కేవలం ధనవంతులకి మాత్రమే ఉన్నాయి. మధ్యతరగతివాళ్లంతా ఒక పువ్వూ పండుకి నోచుకోక, అపార్టుమెంట్లలోనే ఇరుకు బతుకులు బతుకుతున్నారు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి?!’’ 

           తండ్రి మాటకు ఏమని జవాబు చెప్పాలో కొడుకులు ముగ్గురికీ అర్థం కాలేదు. మావగారి మాటలు వింటున్న  కోడళ్లు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారే గాని పెదవి విప్పి ఏమీ మాట్లాడుకోలేదు. వాళ్లందరి మౌనానికీ ఒకటే కారణం...యాజులుగారి మీదున్న గౌరవం. కొడుకుల సంగతి అలా ఉంచితే కోడళ్లు ముగ్గురికీ కూడా మావగారి పద్ధతులూ, ఆయన మంచితనం అంటే చాలా గౌరవం. మావగారి ఎదుట ఒదిగి ఉంటూ, అత్తగార్ని కూచోబెట్టి నడుం బిగించే కోడళ్లే ముగ్గురూ. దానికి తగినట్టే పెద్దకోడలి చేతి వంకాయ కూరా, రెండో కోడలు చేసే పెసరపప్పు పచ్చడీ, మూడో కోడలు కలిపే కాఫీ అంటే యాజులుగారికి చాలా ఇష్టం. ఆయన ఆప్యాయంగా ‘‘అమ్మా’’ అని పిలుస్తూ వాళ్లని అడిగి మరీ ఆ మూడూ చేయించుకుని తృప్తిగా ఆస్వాదిస్తారు. యాజులుగారు అడగకుండానే కోడళ్లు అవి చేసి కన్నతండ్రికి పెడుతున్నంత ఆనందంగా ఆయనకి కొసరి కొసరి వడ్డిస్తారు.

      కొడుకులు నిశ్శబ్దంగా ఉండటం చూసి యాజులుగారే మళ్లీ అన్నారు...‘‘పక్షులు ఆహారం కోసం రోజంతా బైట తిరిగి సాయంత్రానికి గూటికి చేరినట్టే మీరు కూడా మీ వానప్రస్థానికి సొంత గూటికి చేరితే బావుంటుంది! ఆధునిక సదుపాయాలు ఇప్పుడు సర్వత్రా ఉంటున్నాయి. పూర్వంలా కష్టపడవలసిన అవసరం ఎవరికీ లేదు. అటువంటప్పుడు, వయసు మళ్లిన అన్నదమ్ములు సొంత ఊళ్లో సొంతింట్లో కలిసి కాపురాలు చేస్తే అటు ఆర్షధర్మమూ ఇటు కుటుంబవిలువలూ రెండూ చిరకాలం నిలబడతాయి!’’

    ఈసారి కొడుకులు ముగ్గురూ తలలు వంచుకుని మరీ మౌనం వహించారు. కోడళ్లు వంటింట్లోకి తప్పుకున్నారు.

        ఇది జరిగిన మూడేళ్లకి...ఇప్పుడు యాజులుగారు శివైక్యం చెందారు. సావిత్రమ్మగారు భర్తని తన గుండెల్లోకే ఆవాహన చేసుకుని నిశ్శబ్దంగా, కళ్లు మూసుకుని సమస్తమూ త్యజించినదానిలా ఉండిపోయింది.

        పన్నెండు రోజుల కర్మ పూర్తయింది.

      పన్నెండోరోజు సంతర్పణకి ఊరు ఊరంతా కదిలి వచ్చింది. తాము పిలవని వాళ్లంతా కూడా రావడం చూసి కొడుకులు ఆశ్చర్యపోయారు. ‘‘కడసారి పంతులుగారింటి ముద్ద తింటాం...గుప్పెడన్నం పెట్టించండి బాబూ’’ అంటూ తీర్థప్రజలా వస్తున్నవారిని కాదు పొమ్మనలేక మళ్లీ మళ్లీ వండిరచి పెట్టారు. రాత్రయేసరికి అందరూ సెలవు తీసుకోగా కేవలం కొడుకులూ కోడళ్లే మిగిలారు.

   ‘‘పూర్ణక్కా, ఈ రోజు భోజనానికి బిల్డర్‌ నరేంద్ర వచ్చాడు చూశావా...బావగారితో పావుగంట మాట్లాడాడు!’’ మూడో కోడలు పెద్దకోడలు అన్నపూర్ణతో అంది

  ‘‘చూశాను. ఆ మాటలేవిటో విన్నాను కూడా!’’ అంది అన్నపూర్ణ 

       మర్నాడు ఉదయం కాఫీల వేళ, ‘‘అమ్మా...ఎల్లుండి ఫ్లైట్‌కి టిక్కెట్లు తీస్తున్నాను. నువ్వు కూడా మాతో వచ్చేద్దువు గాని!’’ అన్నాడు పెద్ద కొడుకు కేశవ తల్లితో 

   ‘‘నేను రానురా. ఇక్కడే ఉంటాను. కాంతమ్మగారు నాకు తోడుగా ఉంటుంది. మీరు నిష్పూచీగా వెళ్లండి!’’ అంది సావిత్రమ్మగారు

    ‘‘కాంతమ్మగారక్కర్లేదత్తయ్యా...మేం ముగ్గురం ఉంటున్నాం మీకు తోడు!’’ అత్తగారికి కాఫీ గ్లాసు అందిస్తూ అంది పెద్దకోడలు అన్నపూర్ణ

         ఆ మాటకి కేశవతో బాటు నారాయణా, మాధవా కూడా విస్తుపోయారు.

   అత్తగారి ఎదురుగానే భర్తవైపు సూటిగా చూస్తూ ప్రారంభించింది అన్నపూర్ణ...‘‘సంతర్పణ భోజనం పేరుతో మిమ్మల్ని కలుసుకుని బిల్డర్‌ నరేంద్ర ఏం మాట్లాడాడో, మీరు ఏమని జవాబు చెప్పారో అంతా నేను విన్నాను. నా చెల్లెళ్లిద్దరికీ కూడా చెప్పాను. మీరు ముగ్గురూ అనుకుంటున్నట్టు మావయ్యగారి సంవత్సరీకాలు అయిపోయిన తర్వాత ఈ ఇల్లు బిల్డర్‌కి అప్పజెప్పే మాట కల్లో కూడా జరగదు. ఈ పన్నెండు రోజులూ మీ ఖర్చుతో జరిపించామని, భేషుగ్గా దానాలిచ్చామని మీరు అనుకుంటున్నారు. కాని నిజానికి ఇన్నాళ్లూ శ్రమదానమూ వస్తుదానమూ చేసింది ఊళ్లో ఉన్న పేదవాళ్లు. వాళ్ల దానం పుచ్చుకున్నది మీరు. రెక్కాడితేనే గాని డొక్కాడని వాళ్లంతా మావయ్యగారి దగ్గర పొందిన ఉపకారాన్ని గుర్తుంచుకుని ఎంతెంత చేశారో లెక్క లేదు. ఆఖరికి మంత్రం చెప్పిన సూరిశాస్త్రి కూడా నామకః వెయ్యి రూపాయలు మాత్రం తీసుకుని వెళ్లాడు. మనిషి లేకపోయినా ఆయన చేసిన ఉపకారాన్ని వాళ్లు అంతలా గుర్తుంచుకుని, ఆయన నేర్పిన విలువల్ని పాటించి చూపించారు. మాకు కూడా వాళ్ల వల్లే బుద్ధొచ్చింది. కడుపున పుట్టిన కొడుకులు..మీరు మాత్రం ఏదీ పట్టించుకోకుండా, మనిషి కనుమరుగయిందే చాలని మావయ్యగారి కోరికా, ఆయన చేసిన హితబోధా అన్నిటినీ గంగలో కలిపేసి స్వార్థం చూసుకుంటున్నారు. అందరూ మీలాంటి స్వార్థపరులు కాబట్టే ప్రపంచంలో ఎక్కడా పెద్దలు నేర్పిన విలువలు కనిపించడం లేదు. ఇక్కడ మాత్రం మేం మీ ఇష్టాన్ని సాగనివ్వం. అత్తయ్య ఎక్కడికీ రారు. మేం కూడా ఆవిడతో బాటూ ఇక్కడే ఉంటాం. మీరు ముగ్గురూ వచ్చారా కలిసి కాపురం చేస్తాం. లేదంటే మీరక్కడ...మేమిక్కడ!’’

     మిగిలిన ఇద్దరు కోడళ్లూ తాము కూడా పెద్దకోడలి పక్షమే అన్నట్టు నిశ్శబ్దంగా ఆమె పక్కకి వచ్చి నిలబడ్డారు.

         కొడుకులు ముగ్గురికీ తలలు పైకి లేవలేదు. ఒక పది నిమిషాలు పోయాక, పెద్ద కొడుకు కేశవ తల్లి దగ్గరగా వచ్చి కూర్చుని అన్నాడు...‘‘అమ్మా, నాన్న కోడళ్లని గెలుచుకున్నారు. కోడళ్ల చేతే కొడుకులకి బుద్ధి చెప్పిస్తున్నారు. నా నిర్ణయం చెబుతున్నాను విను...నాకింక నాలుగేళ్లే ఉంది సర్వీసు. అంచేత ఇప్పుడు వెళ్లి వాలంటరీ రిటైర్మెంటుకి దరఖాస్తు పెట్టుకుని వచ్చేసి మీతో బాటు ఇక్కడే ఉంటాను! పేదవాళ్లని ఆదుకునే విషయంలో నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుంటాను....’’

     కేశవమాటలు పూర్తిగాకుండానే నారాయణ అందుకున్నాడు...‘‘నేను అమెరికాలోనే వైద్యం చెయ్యక్కర్లేదు. రాజమండ్రీలోనూ చెయ్యొచ్చు. అమెరికా సుఖాలకి అలవాటు పడ్డ నా పెళ్లామే ఇక్కడ  ఉండటానికి సిద్ధపడుతూ ఉంటే నేను అమెరికాలో ఉంటానా...ముక్కామల సోమయాజులుగారి అబ్బాయిని కానా...?! నాన్న పేరిట ఇక్కడే ఒక ఆస్పత్రి ప్రారంభిస్తాను. నేనూ ఇక్కడే!’’

     నారాయణ మాటలు పూర్తి అయీ గాకుండా మాధవ వచ్చి తల్లిని ఆనుకుని కూర్చున్నాడు...‘‘కడసారపు కందిగింజనని అమ్మకి నేనంటే ముద్దు. నేను లేకుండా ఎలారా...నేనిక్కడ ఒక కన్సల్టెన్సీ పెట్టుకుంటా! నాన్న పేరిట ప్రతి ఏడాదీ పేదవాళ్లందరికీ భోజనాలు పెడతా!’’    

             అప్పుడొచ్చింది సావిత్రమ్మగారికి దుఃఖం...కొడుకుల మాటల వెనుక నుంచి చిరునవ్వుతో ఠీవిగా దర్శనమిస్తున్న భర్తని చూసి ఆవిడ భోరుమంది!

       ఆ వృద్ధురాలిని ఓదారుస్తూ ఆరు జతల చేతులు ఆవిడ చుట్టూ చిక్కగా మమతల పందిరి అల్లేశాయి!!     

         

                                      *********************