అమ్మగారు లేనిదే అయ్యగారు లేరు
శ్లో.. శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి !!
ఇది సౌందర్య లహరిలోని మొట్టమొదటి శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే.."అమ్మా..శివుడు శక్తితో (నీతో) కూడి ఉన్నప్పుడే సృష్టించగలడు. లేని పక్షంలో ఆ మహాదేవుడు కదలడానికి సైతం అశక్తుడే.అందుకే త్రిమూర్తులకు ఆరాధ్యురాలవగు నిన్ను స్తుతించడానికి గాని,నీకు ప్రణమిల్లడానికి గాని పూర్వపుణ్యం లేనివాడు ఎలా సమర్ధుడవుతాడు..??
ఇక ఇప్పుడు ఈ శ్లోకపు భావార్ధం లోకి వెళదాం. మనకు తెలిసినంతవరకూ శివుదు లయకారుడు. త్రిమూర్తులు ముగ్గురిలో సత్వగుణ ప్రధానుడైన బ్రహ్మ సృష్టికీ, రజోగుణమూర్తి అయిన నారాయణుడు స్థితికీ, తమోగుణసంపన్నుడైన ఈశ్వరుడు లయకూ అధిపతులు. బ్రహ్మ పని సృష్టించడం..విష్ణుమూర్తి పని ఆ సృష్టిని పరిరక్షించడం..శంకరుని పని దాన్ని లయమొందించడం. మరి ఈ సౌందర్య లహరి ఆదిలోనే ఆదిశంకరులు శివుడికి సృష్టితో ఎలా ముడిపెట్టారో నాకు అర్ధం కాలేదు. ఆఖరికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారిదంటూ కనబడిన (ఇంటర్నెట్ లో) ఒకానొక వ్యాఖ్యానంలో కూడా అలాగే ఉంది. సరే పెద్దలు చెప్పినదాంట్లో తప్పులు వెతకడమన్నది అపభ్రంశపు పనేనని దాన్ని అలా వదిలేశాను. అంచేత మిగతా విషయాల్లోకి వెళదాం. ఈ విషయంలో ఎవరైనా ఎమైనా తమకు తెలిసింది చెప్పదలచుకుంటే...వారికి స్వాగతం...నిరభ్యంతరంగా ఈ కింద వ్యాఖ్యల జాగాలో వారు తమకు తెలిసినది రాయవచ్చు. నేను పండితపుత్రికనని మరోసారి గుర్తు చేస్తున్నాను.
సరే...ఆదిలోనే వ్యతిరేకపు పలుకు పలికినందుకు శంకరులకు క్షమార్పణ చెప్పుకుంటూ..తరువాయిలోకి వెళదాం. శక్తి తోడు లేనిదే శివుడు కదలను కూడా కదలలేడట. ఆ శివుడు ఎటువంటివాడు..? జగదీశ్వరుడు. క్షీరసాగరమధనవేళ అమృతానికి బదులు హాలాహలం ఉద్భవించగా..దాన్ని నిర్భయంగా తాగబుచ్చుకుని..నోట ప్రవేశించినది జర్రున కడుపులోకి జారకుండా "ఆగక్కడ" అంటూ దాన్ని గొంతులోనే నిలబెట్టి అక్కడే ఇముడ్చుకున్న గరళకంఠుడాయన..!!
తాతముత్తాతలకు సద్గతుల కోసం భగీరధుడు భూమ్మీదకు దింపజూసిన దివిజగంగ ఉరుకులు పరుగులు పెడుతూ..దిగివస్తుండగా ఆ దూకుడు ధాటికి కులగిరులే కంపించిన వేళ..
"కులనగపంక్తులు సడలెను కువలయమండలమడలెను
కూర్మరాజు సర్దుకొనె కపర్ది కాలు కదుపలేదు"
ఇక లాభం లేదని "పరమపురుష నీ దానను..పరమేశ్వర నీ చానను..దయగొనుమీ జడదారిని" అంటూ భగీరధుని తరఫున వియద్గంగ తనే శంకరుణ్ణి వేడుకోగా తన జటాకలాపం నుండి ఒకే ఒక్క చుక్కను మాత్రం విడుదల చేసి...మిగిలిన "కురులన్నియు వడి ముచ్చట ముడి చుట్టు"కున్న త్రిపురాంతకుడాతడు..!!
సౌందర్య లహరి గురించి చెబుతానంటూ శివుడి గురించి వల్లిస్తుందేమిటీవిడ అనుకుంటున్నారు కదూ...అక్కడికే వస్తున్నా...మీ ఆఫీసులో ఓ బాసు ఉన్నాడండీ...అత్యంత సమర్ధుడూ... మంచివాడూను. ఆయనకి యెకాయెకీ ఏదో అవార్డు కూడా వచ్చింది. ఉన్నట్టుండి వాళ్ల పక్కింటాయన.."అబ్బే..అంతా అమ్మగారి మహిమే. ఆవిడ లేకపోతే ఈయన కానీకి కొరగాడు." అంటూ తేల్చి పారేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాసు మీది అభిమానాన్ని చంపుకోనూలేము..అలా అని "అమ్మగార్ని" కూసింత ఎక్కువగా ఆరాధించకుండా ఉండనూ లేము. అయ్యగారి కంటే అమ్మగారిపట్లే ఓ పిసరు ఎక్కువ మొగ్గు చూపిస్తాం. అవునా కాదా..?? దిగంబరుడు..ఆదిమధ్యాంతరహితుడు అయిన పరమేశ్వరుడికి ఆయన పేరు పెట్టుకుని మరీ శంకరులు చేసిన ఉపకారమిది...వహ్వా..!! పోనీ కాదందామా అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే.."ఆమె లేక మనం లేము" అని చెప్పినట్టు దేవీ భాగవతం వేనోళ్ల చాటుతోంది.
సందర్భం వచ్చింది కాబట్టి మరో ముక్క చెబుతా...ఒక్క శంకరులే కాదు..శ్రీనాధుడు కూడా అమ్మగారికే ఓటు వేశాడు.
మ్రింగెడిది గరళమని తెలిసి
మ్రింగెడివాడు ప్రాణవిభుడని, మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వ మంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో...
అన్నాడు చూశారా..."ఆవిడ" మింగమంది కాబట్టే ఆయన మింగాడు. అదండీ సంగతి..! అందుకే మనవాళ్లు కూడా ఎవరైనా మొగాడు ఏ యాక్సిడెంట్ లోనో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనై ఇల్లు చేరితే.."వాళ్లావిడ తాళి గట్టిది" అంటారు. యధా రాజా తధా ప్రజా..!!
అయితే ముందు ముందు ఆ ఆదిదంపతుల అన్యోన్యతనూ..ఆయమ ఆయన పట్ల ప్రదర్శించే భక్త్యనురాగాల్నీ శ్లోకాల మాధ్యమంలో దర్శించుకున్నాక..అసలు వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న అనుమానం కూడా కలిగేలా చేశారు లెండి శంకరులు.
సరే..అదలా ఉంచితే,ఈ శ్లోకంలో వాడిన "శక్తి" అన్న పదం ఉంది చూశారూ...ఆ పదమే ఒక అఖండం. "ఎండవేడికి తట్టుకోలేక సోలిపోతున్నారా...తక్షణ శక్తి కోసం తాగండి గ్లూకోస్" అంటుంది గ్లూకోస్ వ్యాపార ప్రకటన. "కదలడానికి బొత్తిగా శక్తి లేదమ్మా" అంటారు వయోవృద్ధులు. శక్తి అంటే బలం అన్న సామాన్యార్ధంలో మనం వాడతాం. కాని అది జగన్మాతృక అంశ అన్న భావాన్నే సమస్త పురాణేతిహాసాలూ వ్యక్తం చేస్తాయి. రెండిటినీ కలగలుపుకుంటే ఆయమ అంశ ఉంటేనే మనకి జవం..జీవం..బలం..అన్నది విస్పష్టం..!! దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది.. "సర్వశక్తిమయి" "సర్వమయి" అయిన ఆ జగన్మాత అంశ పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ వ్యాపించి ఉందని..సమస్త జగత్తుకూ "ప్రాణదాత్రి" ఆమేనని. ఆ అంశ ఎంత కొరవడితే మనం అంతగానూ సోలిపోతామని..! అందుకే ఈ చరాచర ప్రపంచమంతటినీ సోదరభావంతో చూడాలన్నది హిందూమత మూలసూత్రం.
ఇక ఈ శ్లోకం మనకు తెలియజెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే...భగవత్ప్రార్ధనకు సైతం పురాకృతం సహకరించాలని."ఆ..తల్చుకుంటే ఆ పూజలన్నీ మనమూ చేసెయ్యగలం" అనుకుంటాం. కానీ అది తప్పు. మన రెండు చేతులూ మనవే కావచ్చు. కానీ ఆ రెండింటినీ జోడించి భగవంతునికి ఒక్క నమస్కారం చెయ్యాలన్నా కూడా మనకి అది రాసిపెట్టి ఉండాలి.ఈ విషయాన్ని సోదాహరణంగా నిరూపించడానికి లక్ష సంగతులు చెప్పుకోవచ్చు. కాస్త శ్రద్ధగా గమనించాలే గాని నిత్య జీవితంలో మీక్కూడా అలాంటివి బోలెడన్ని తటస్థపడతాయి. ఆ మధ్య ఓ పెద్దమనిషి చెప్పిన మాటని ఇక్కడ ఉదాహరణగా చెబుతాను వినండి..ఆయన దాదాపు యాభై ఏళ్లవాడు. వాళ్లింట్లో అందరూ వెంకటేశ్వరస్వామి భక్తులు. శనివారం రాత్రి ఫలహారమే గాని ఎవరూ అన్నం తినరు. కాని ఈయన చిన్నప్పుడు "అలా ఎందుకు చెయ్యాలి.." అని పంతగించి ఏదేదో వితండవాదం చేసి, అసలు దేవుడికి దండమే పెట్టకుండా, శనివారం రాత్రి ప్రత్యేకంగా తనకొక్కడికీ పేచీ పెట్టి అన్నం వండించుకు తినేవాట్ట. "ఇప్పుడు నేను శనివారం అసలు ఏమీ తిననమ్మా...పూర్తి ఉపవాసం. ఏడాదికోసారి తిరుపతి వెళ్లి ఆ స్వామిని దర్శించుకు రానిదే స్తిమితం ఉండదు" అన్నాడాయన నవ్వుతూ. అంటే ఆయన పురాకృతం ఇప్పటికి ఫలించిందన్నమాట.
అదండీ సంగతి. అంచేత ముగురమ్మల మూలపుటమ్మ...చాల పెద్దమ్మకు ప్రణమిల్లాలన్నా, ఏ లలితా సహస్రమో చదివి ఆ తల్లిని స్తుతించాలన్నా మనకు పూర్వపుణ్యం ఉండి తీరాలి. అందుకోసమూ మళ్లీ ఆ దేవినే ప్రార్ధించాలి. వేరు గతి లేదు. అందుకే గదా శంకరులు "గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ" అన్నారు. సరే...ఇక్కడొక లలితలలితమైన శ్లోకం చెప్పుకుని సెలవు తీసుకుందామా మరి...
భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిన్న వదనైః
ప్రజానామీశాన స్త్రిపురమధనః పంచభిరపి
న షడ్భిస్సేనానీ ర్దశశతముఖై రప్యహిపతిః
తదాన్యేషాం కేషాం కధయ కధమస్మిన్నవసరః
(ఇది సౌందర్య లహరిలోది కాదు గాని శంకరాచార్యులవారిదే)
తెలుగు బ్లాగ్ ప్రపంచానికి మరో మంచి ఆధ్యాత్మిక బ్లాగ్ వచ్చి చేరినందుకు ఆనందంగా ఉంది.
రిప్లయితొలగించండిగాయత్రీలక్ష్మిగారూ! చాలా బాగున్నాయండి మీ పోస్ట్‌లు, సత్సంగంలో కూర్చున్నట్లు ఉంది మీ పోస్టులు చదువుతుంటే.
ధన్యవాదాలు, శుభాభినందనలు.
అమ్మలేక సృష్టి లేదు, జగమే లేదు.బాగుంది
రిప్లయితొలగించండి@kastephale...శర్మగారూ...చిర్రావూరి భాస్కర శర్మ గారు కదా...నేనండీ..మీకు గతం లో మెయిల్స్ పంపిన గాయత్రిని. గుర్తుపట్టారా...మీవంటి పెద్దవాళ్లు బాగుందనడమే మహద్భాగ్యం.. నూరేళ్ల దీవెన...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండితేజస్విగారూ...ధన్యవాదాలండీ..:)
రిప్లయితొలగించండికృష్ణలీలాతరంగిణి ఎంత బాగుందో..
రిప్లయితొలగించండిధన్యవాదాలు మీకు..:)
ధన్యవాదాలు ధాత్రి గారూ..:)
రిప్లయితొలగించండిఅమ్మ యందె జగతి ఆవిర్భవించెను
రిప్లయితొలగించండిఅమ్మె మూడు మూర్తులయి జగతిని
కరుణ జూపి కాచి కాపాడు చున్నది
అమ్మ కంటె జగతి నధిపు లెవరు ?
‘ త్రిగుణాతీత ’ పరాత్పర
జగతీశులు బ్రహ్మ విష్ణు శంకరులు తగన్
భగవతి ముమ్మూర్తులుగా
జగముల రక్షించు చుంద్రు జననీ వశులై .
----- బ్లాగు : సుజన-సృజన