10, ఫిబ్రవరి 2014, సోమవారం

అయ్యో చిన్నాన్నా..!

మొత్తానికి మా తాతగారికీ నాయనమ్మకీ పెళ్లయిపోయింది కదా...తర్వాత జోగయ్యగారు పడ్డ పాట్లు ఆయనకే ఎరుక. పొద్దున్నే మొదటిసారి పొయ్యి రాజేసేటప్పుడు ఆ పొగకి కూతురి కళ్లు మండుతాయని ఆయన రోజూ వచ్చి పొయ్యి రాజేసి వెళ్లేవారుట. అలా బతికి ఉన్నంతకాలమూ కూతుర్ని కాచుకున్నాడు పాపం. అల్లుడు తన మీది కోపం కూతురి మీద చూపిస్తాడని బెంగో ఏమిటో గాని  "నారాయణా...నా కూతుర్ని బాగా చూసుకో బాబూ.." అని తాతగార్ని ప్రాధేయపడేవాడుట. ఏమైతేనేం అలా ఆ ఘటం వెళ్లిపోయింది. తాతగారికీ నాయనమ్మకీ ముచ్చటగా ముగ్గురు బిడ్డలు పుట్టుకొచ్చారు. నాన్నా..చిన్నాన్నా..అత్తా!! తాతగారికి ప్రభుత్వ నౌకరీ కూడా దొరికింది. స్కూల్లో సంగీతం మాస్టారిగా ఉద్యోగం..అదిగాక భుక్తి కోసం చెప్పుకునే సంగీతం ప్రైవేట్లూ ..యధాప్రకారం రాజులతో కలిసి వేటా..కుస్తీపట్లూ వగైరా..ఇలా వాళ్లకి రోజులు హాయిగానే గడిచిపోతూండేవి.
                                  తాతగారి స్కూలు హెడ్మాస్టారు వాళ్ల ఇంటి పక్కనే కాపురం ఉండేవారు. ఈయన రాత్రి తెల్లార్లూ వేటాడి వచ్చి ఆరుబయట మంచం వేసుకుని పడుకుని బారెడు పొద్దెక్కినా లేవకపోతే..పాపం ఆ హెడ్మాస్టారు ..తను స్కూలుకి బయల్దేరుతూ.."నారాయణా...స్కూలుకి టైమయిపోతోంది లేవయ్యా.."అంటూ వెయ్యిన్నొకటోసారి తాతగారికి   మేలుకొలుపు పాడేవారుట. అప్పుడు ఆయన లేచి, స్నానం, జపం, తపం చేసుకుని స్కూలుకి వెళ్లేవారు. అప్పట్లో స్కూళ్లన్నీ పొద్దున్న భోజనం వేళకల్లా అయిపోయేవి. (చిన్నప్పుడు మా స్కూలూ అంతే) అప్పుడాయన ఇంటికొచ్చి హాయిగా నాయనమ్మ వేడి వేడిగా వడ్డించిన భోజనం తిని..రాత్రి నిద్ర లేని కొరత తీర్చుకుంటూ ఎంచక్కా నిద్రపోయేవారు. మళ్లీ మధ్యాహ్నం స్కూలు వేళకల్లా లేచి, నాయనమ్మ సిద్ధంగా ఉంచిన ఓ డజను పళ్లు తిని, ఓ చెంబెడు పాలు తాగి స్కూలుకి వెళ్లేవారు. తాతగారికి కాఫీ అలవాటు ఎప్పుడూ లేదు. ఆయన ఎక్కువగా పాలే తాగేవారు. తర్వాతి రోజుల్లో మాత్రం ఎందుకో గాని ఉత్త పాలు తాగకుండా చాలా కొద్దిగా డికాక్షన్ వేసుకుని తెల్లగా ఉన్న కాఫీ ఒకే ఒక్కసారి తాగేవారు. కార్తీకమాసంలో సోమవారాలు ఉపవాసం ఉంటే, వృద్ధాప్యం వల్ల నీరసం వస్తుందని అమ్మ ఆయనకి మరోసారీ మరోసారీ బలవంతంగా కాఫీ ఇచ్చేది. దానికి ఆయన కోపగించుకుని..."ఉపవాసం ఉండి ఇన్నిసార్లు కాఫీలేమిటి...ఇది కార్తీక సోమవారం కాదు...కాఫీల సోమవారం" అంటూనే   కోడలి బలవంతానికి కట్టుబడి  తప్పనిసరిగా తాగేవారు. 
                                    సరే.. ఆ దంపతులకి ముగ్గురు బిడ్డలు పుట్టారని చెప్పాను కదా...ఓ సారి తాతగారు బజారులో ఎవరో కోయవాడు కనిపిస్తే కుతూహలం కొద్దీ జాతకం చెప్పమన్నారు.వాడు ఆయన మొహం చూస్తూనే "నీకు ఒక్కడే కొడుకు" అంటూ ప్రారంభించాడు. వెంటనే ఈయన, "నీ మొహం, నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు." అన్నారు. వాడు ఆ మాట విని ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి తర్వాత తల అడ్డంగా తిప్పుతూ "లేదు. నీకు ఒక్కడే కొడుకు" అని మళ్లీ అదేమాట ఖచ్చితంగా చెప్పాడు. వాడు రెండోసారి ఆ మాట చెప్పినా తాతగారికి కించిత్ కూడా అనుమానం రాలేదు. వాడు సరిగ్గా చెప్పడం లేదన్న విసుగే కలిగింది. దాంతో ఆయన "నువ్వు నాకేం చెప్పక్కర్లేదు" అంటూ విదిలించుకుని ఇంటికి వచ్చేశారు.  తర్వాత ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు మా చిన్నాన్న గురించి చెప్పాలి. 
                             మా చిన్నాన్న నాన్న కంటే చాలా బలంగా ఉండేవాడు. నాన్నకీ చిన్నాన్నకీ వయసులో ఎంత తేడాయో గాని నాన్న చదువుకుంటూ ఉంటే మూడేళ్ల వయసులో ఉన్న చిన్నాన్న వచ్చి అన్న చేతిలో పుస్తకం లాక్కోవాలని చూసేవాడు. తమ్ముడికి అందకుండా నాన్న తన చెయ్యి పైకి ఎత్తి పట్టుకుంటే, నాన్న చేతిని బలంగా కిందకి వంచి మరీ పుస్తకం లాక్కునేవాడు.తమ్ముడి నించి విడిపించుకోవడం చేతకాక నాన్న మొర్రోమనేవారు.  అసలు భయమంటే ఏమిటో తెలియనట్టు ఉండే చిన్నాన్న గురించి ఆ వూరు వూరంతా ఎంతో అబ్బురంగా చెప్పుకునేవారు. చిన్న కొడుకు బలం, ధైర్యం గమనించిన తాతగారు బిడ్డకి దిష్టి తగులుతుందని బైటికి ఎక్కడికీ తీసికెళ్లేవారు కాదు. బిడ్డ గురించి బైట ఎక్కడా చెప్పేవారు కూడా కాదు. అయితే ఆ ఊళ్లోనే ఓ పెద్ద మీసాలాయన ఉండేవాడు. ఆయనకి తెగబారెడు మీసాలుండేవి. మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి మురిసిపోయే రోజులవి. ఈ మీసాలాయన మాత్రం అందరికీ భిన్నంగా తన మీసాల్ని గట్టిగా దువ్వుతూ..కళ్లెర్రజేసి పిల్లల్ని భయపెట్టేవాడు. ఆయన మీసాలు చూసి పిల్లలంతా జడిసిపోయి మొర్రోమని ఏడుపు లంకించుకునేవారు. అది ఆయనకి చాలా వినోదంగా ఉండేది. ఓ సారి ఎవరి పిల్లాడినో అలాగే ఏడిపించేసరికి ఆ తండ్రి కాస్త కోపంగా, "ఈ బక్క పిల్లల్ని జడిపించడం కాదు. చేతనైతే నారాయణ చిన్న కొడుకుని జడిపించు.అప్పుడు తెలుస్తుంది.." అన్నాడు. దాంతో అన్నాళ్లూ తాతగారు దాచిపెట్టిన విషయం ఆ మీసాలాయనకి తెలియనే తెలిసింది. ఆయన వెంటనే తాతగారిని పిలిపించుకుని, "ఏం నారాయణా..నీ చిన్నకొడుకు చాలా బలవంతుడు, ధైర్యవంతుడూనట కదా.." అంటూ ఆరా తీశాడు. ఆ మాటకే తాతగారు జడిసి..అబ్బెబ్బే అదేమీ కాదంటూ తప్పించుకోబోయారు. కాని అది ఇట్టే పసిగట్టిన ఆ పెద్దాయన "రేపు పొద్దున్నే నీ చిన్న కొడుకుని నా దగ్గరకు తీసుకురా" అంటూ ఆదేశించాడు.   ఊరంతటికీ పెద్దాయన. అంగబలం, అర్ధబలం ఉన్న మనిషి. దాంతో కాదనడానికి తాతగారికి ధైర్యం చాల్లేదు. దేవుడి మీద భారం వేసి మర్నాడు పొద్దున్నే చిన్నాన్నని ఆయన దగ్గరకి తీసికెళ్లారు. 
                                     ఆయన చిన్నాన్నని ఒక్క క్షణం పరకాయింపుగా చూసి, మీసాలు గట్టిగా దువ్వుతూ...కళ్లెర్రజేసి పెద్దగా హూంకరించాడు.  ఆ హూంకరింపుకి మా చిన్నాన్న భయపడకపోగా...ఒక్క క్షణం అలాగే దీర్ఘంగా చూసి తాతగారి చంకలోంచి ఆ మీసాలాయన మీదికి ఒక్క దూకు దూకి, ఆయన మీసాల్ని రెండు చేతులతోనూ గట్టిగా దొరకబుచ్చుకున్నాడు. అంతే...మా చిన్నాన్న చేతి పట్టుకి అంత పెద్దాయనా గిలగిల్లాడిపోయాడు. మూడేళ్ల పిల్లాడి చేతి పట్టు నించి తన మీసాల్ని విడిపించుకోవడం..ఎంత ప్రయత్నించినా  ఆయన వల్ల కాలేదు.నొప్పితోనూ..అవమానభారంతోనూ ఆయన కళ్లల్లో  నీళ్లు తిరిగాయి. కొడుకు చేసిన పనికి అప్పటికే ఖంగారు పడుతున్న తాతగారు అతి ప్రయత్నం మీద  బిడ్డని సముదాయించి ఆయన మీసాలు విడిపించారు. అంతే...ఆ పెద్దాయన మీసాలు సరి చేసుకుంటూ.. బిడ్డ వైపు ఎర్రగా చూశాడు. తాతగారు మరింకేమీ మాట్లాడకుండా ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చేశారు.  
                                       అంతే...మా చిన్నాన్న బలపరాక్రమాలకి అదే ఆఖరి రోజు. ఆ మీసాలాయన దగ్గర్నించి వచ్చేసిన క్షణం నించీ ఏ కారణమూ లేకుండానే...ఏ జబ్బూ చెయ్యకుండానే అలా అలా కృంగిపోయిన మా చిన్నాన్న సరిగ్గా వారం తిరిగేసరికల్లా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. "నాకు ఇద్దరు కొడుకులు" అంటూ కోయవాడికి గర్వంగా చెప్పుకున్న మా తాతగారికి ఒక్క కొడుకే మిగిలాడు. 
                                       మా చిన్నాన్న బతికి ఉంటే ఎలా ఉండేదో నేను కొన్ని కోట్ల సార్లు ఊహించుకున్నాను. బహుశా మిలిటరీలో చాలా పెద్ద ర్యాంకు లో ఉండి ఉండేవాడేమో అని ఆ ఊహకే ఎంతో పొంగిపోయాను. 
                నాకే ఇలా ఉంటే మరి మా తాతగారికీ..నాయనమ్మకీ..నాన్నకీ ఎలా ఉండి ఉంటుంది? 
              మా చిన్నాన్న స్మృతితో...ఈ రోజుకి సెలవు. 

1 కామెంట్‌:

  1. ఇలా మొదలెట్టగానే అలా అయిపోతోంది. కొంచెం త్వరగా చెబుదురూ..

    అన్నట్లు ఆ వార్డ్ వెరిఫికేషన్ కూడా తీసేయండి. వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి