త్వదన్యహ్ పాణిభ్యామభయ వరదో దైవత గణా
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా
భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ
అమ్మా...నువ్వు ఇతర దేవతలందరిలా "మిమ్మల్ని నేనే కాపాడేస్తానంటూ" గొప్పగా అభయముద్రను ప్రదర్శించవు.వరాలిచ్చేస్తానంటూ అభినయించవు. అయితేమాత్రమేం..మమ్మల్ని మా భయాల నుంచి కాపాడటానికీ, కోరినదానికి రెట్టింపుగా వాంఛితార్ధాల్ని ప్రసాదించడానికీ నీ పాదకమలాలే సమర్ధవంతమైనవి కదా...
(సౌందర్య లహరి...శ్లో : 4 )
ఇక్కడ నేను తలపెట్టింది ఇంతింతనరాని ఒక బృహత్కార్యం. కార్యోన్ముఖంగా ముందడుగు వేయబోయేందుకు మున్ముందుగా నేను చెప్పేదేమంటే...నేను పండితురాల్ని కాదు. కనీసం బాగా చదువుకున్నదాన్ని కూడా కాదు. సప్తసముద్రాలకు సాటి రాగల విద్యావాహినిలో పై పై నురగ వంటిదాన్ని ఓ గుక్కెడు తీర్ధంగా పుచ్చుకున్నానేమో.. అంతే. బోలెడు అసలు సారమంతా ఇంకా కిందనే ఉంది. అదెలా ఉంటుందో నాకు కనీసం తెలియను కూడా తెలియదు. అయితే మరి నోరు మూసుక్కూచోకుండా ఈ తెగువేమిటీ అని మీకు సహజంగానే సందేహం వస్తుంది. అందులోనూ ఇది సాక్షాత్తూ ఆది శంకరులు రాసిన అనుపమానమైన బృహత్కావ్యం. మానవులకందరాని అత్యంత రహస్యమైన మంత్ర..తంత్రాలతో కూడిన గుహ్య విద్యకు ఆలవాలమైన "సౌందర్యలహరి". వంద శ్లోకాలతో శంకరులు జగదంబకు చేసిన బృహత్ వందనం. మొదటి నలభై శ్లోకాల్నీ స్వయంగా జగదీశ్వరుడైన ఆ ఉమాపతే శంకరుల చెవిలో చెప్పి పుణ్యం కట్టుకున్నాడన్న మాట ఒకవైపూ...కాదు కాదు..పార్వతీపతి సందర్శనార్ధం కైలాసానికేగి అక్కడ లిఖితమై ఉన్న దీన్ని శంకరులు చదువుతూ ఉండగా అది ఎంతమాత్రమూ మానవమాత్రులకు అందరాని అత్యంత రహస్యమైన తంత్రవిద్యతో కూడినది కాబట్టి విఘ్నాధిపతి దాన్ని అడుగునించీ చెరిపేస్తూ వచ్చాడన్న మాట మరోవైపూ వెనక్కి గుంజుతూ ఉండగా..విక్రమార్క మహారాజును తలచుకుని మరీ ముందుకు సాగుతున్నాను నేను. ఎందుకింత పట్టుదల..ఏం సాధించెయ్యాలని? దీనికి జవాబు నిజానికి నా దగ్గర లేనేలేదు. కాని జవాబుగా కేవలం నా అనుభూతుల్ని మాత్రం చెప్పగలను నేను. రవీంద్రుని గీతాంజలిలో ఓ లైను ఎక్కడో కంటబడ్డాక మొత్తం చదివేదాకా ప్రియురాలు కనిపించని ఉన్మత్తుని విధాన పలవరించానన్నాడు చలం. వాస్తవానికి చలం రచనల్లో నాకు నచ్చే ఏకైక కృతి గీతాంజలి అనువాదం మాత్రమే. ఎప్పుడో పుష్కర కాలం వెనుక సౌందర్యలహరి తొలిసారి చదివి నేనూ అలాగే ఊగిపోయాను...భక్తితో కాదు..పరవశంతో. అదేమి కావ్యం...అవేమి ఉపమానాలు..? అవేమి అలంకారాలు..? అదేమి రచనా చాతుర్యం..? సౌందర్యలహరి నాకు ఒక మొక్కుబడి పారాయణ గ్రంధంలా కనిపించలేదు. కాళిదాసు కుమారసంభవంలా...మేఘసందేశంలా ఒక రసాత్మకమైన అద్భుత కావ్యం అనిపించింది. నేను కేవలం అందులోని చమత్కారాలనూ...వాటికి ఆధారభూతమైన ఆ జగజ్జనని సౌందర్య..విభ్రమ..చలనవలనాలనూ మాత్రం చూసి పరవశించిపోయాను. ఒక దేశపు మహారాణి చేత ఆమె భర్తకు పాదాభివందనం చేయిస్తే వినడానికీ...కళ్ల ముందు ఊహించుకోవడానికీ ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఒక సార్వభౌముణ్ణి ఆయన ఇల్లాలు..అందునా పతివ్రతగా పేరెన్నికగన్న తల్లి...ఒక్క కాలితాపు తన్నిందంటే ఆ మాట నమ్మశక్యమా..?? ఒక భర్త..భార్య కడగంటి చూపులననుసరించి మాత్రమే అన్ని పనులూ చక్కబెడుతూ ఉంటాడని చెబితే..ఆ భార్యాభర్తల్ని ఎలా ఊహించుకుంటాం? సకలవిద్యాపారంగతురాలూ..సర్వ సమర్ధురాలూ అయిన ఒక గొప్ప స్త్రీ సామాన్యమైన ఆడదానికి మల్లే తన సవతి పట్ల బహిరంగంగా ఈర్ష్యాసూయలు ప్రదర్శిస్తుందని వింటే ఎలా అనిపిస్తుంది..? ఇవన్నీ శంకరులు సౌందర్యలహరి కావ్యరచనలో ప్రదర్శించిన విభ్రమవిలాసాలు.
సాక్షాత్తూ శంకరుడి వంటి శంకరుల అసామాన్యకృతిని చదివిన తర్వాత నేను ఏ విధంగా అనుభూతి చెందానో దాన్ని సామాన్య పదజాలంతో వర్ణిస్తూ..ఆ వర్ణనల్ని కాకెంగిలి చేసిన జామకాయలా మీతో పంచుకోవడం తప్ప నా ఈ రచనకు వేరే అర్ధమూ పరమార్ధమూ లేనేలేవు . వెనకొకసారి రచయిత్రి లత ఏదో ప్రశ్నకి జవాబిస్తూ.."సాక్షాత్తూ ఆ సరస్వతీదేవే రాసి...గొప్పతనాన్ని మాత్రం రచయితలకు అంటగడుతుంది" అన్నారు. ఆ మాట నాకు వేదం. ఇప్పుడు నేను తలా తోకా లేకుండా మొదలెట్టేసిన ఈ పిచ్చిరాతల్ని ఒక కొలిక్కి తెచ్చి వాటికో రూపాన్నిచ్చి పూర్తి చేసే భారమూ..బాధ్యతా ఆ తల్లివే. ఆమెకు బుద్ధి పుట్టిందా..దయ కలిగిందా..మీరు ఈ "అందాల కడలి"లో హాయిగా ఈదులాడగలుగుతారు. లేదూ...మీ ముందునించి ఈ బ్లాగరి ఎకాయెకీ మాయమే అయిపోతుంది. కనుక ఏ రకంగా అయినా మీకు బాధ లేదు. అంచేత మనసు కుదుటపరచుకొని.. ఆకులలములు సైతం మానేసి పంతంగా కోరినవాణ్ణి కొంగుకు ముడేసుకున్న ఆ అపర్ణాదేవి ఏం చెబుతుందోనని రేపటికి ఎదురు చూడండి. ఉంటా మరి...ఈ రోజుకు సెలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి