24, ఫిబ్రవరి 2014, సోమవారం

అందాల కడలి-6


అంతా అమ్మ చలవే 



శ్లో :


 హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ
 పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
 స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
 మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం !

ఇది సౌందర్య లహరిలోని ఐదవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమిటంటే.."ప్రణమిల్లే భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించు ఓ జగజ్జననీ! పూర్వం విష్ణువు నిన్ను ఆరాధించే స్త్రీరూపాన్ని పొంది పురారిని కూడా ఇంతింతనరాని క్షోభకు గురి చేశాడు.అలాగే మన్మధుడు కూడా నిన్ను పూజించినాకనే తన భార్య రతీదేవి కన్నులకు ఇంపైన సుందరాకృతిని పొంది, మహా మహా మునులను సైతం మోహపరవశుల్ని చేస్తున్నాడు."
                             ఇక భావార్ధం లోకి వెళితే..ఇది పరదేవత గొప్పదనాన్ని వేనోళ్ల చాటే శ్లోకమైనప్పటికీ..దీనికి ఎన్ని అర్ధాలైనా చెప్పుకోవచ్చు.  ఆది శంకరులు ఆది నుండి చెబుతున్నట్టు..పిపీలికాది బ్రహ్మ పర్యంతానికీ అధిదేవత ఆ భువనేశ్వరే కదా. ఆ తల్లిని కరుణ లేనిదే సృష్టి సాగదు..ప్రభవించిన సృష్టి నిలవదు..నిలిచిన సృష్టి పునరుజ్జీవానికి నాందిగా లయమొందదు. అంచేత నిత్య వ్యాపారాలకే త్రిమూర్తులు అమ్మను ఆశ్రయించి ఉన్నప్పుడు, ఇక ప్రత్యేక కార్యాలన్నీ పరిపూర్ణంగా ఆ భువనేశ్వరి అండదండలతో నడవవలసినవే కదా..! 
                                 త్రిమూర్తుల్లో దుష్టశిక్షణా..శిష్ట రక్షణా హరివే. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత..అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అన్న గీతాకారుడు..పూర్ణావతారాలైన దశావతారాలే గాక, వెంకటేశ్వరుని వంటి  అర్చావతారాల్ని కూడా ధరించినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక ప్రత్యేకావసరం కోసం విష్ణువు ధరించిన మరో అవతారం జగన్మోహిని. దేవదానవులకు నిర్విరామంగా జరిగే యుద్ధాల్లో రక్కసులు మాయాబలంతో జయం సాధించడమూ, దేవతలు ఓడిపోయి నశిస్తూ ఉండటంతో, దేవతాజాతిని "అమర"జాతిగా చేసేందుకు సంకల్పించినదే అమృతోత్పాదన.  దేవదానవులు క్షీరసాగరాన్ని మధించి..ఎలాగైతేనేం అమృతాన్ని సాధించాక.. రాక్షసులు దాన్ని తమ వశం చేసుకుందామని ప్రయత్నించారు. మళ్లీ పోరాటం ప్రారంభం. ఇక ఆ క్షణంలో విష్ణుమూర్తి కల్పించుకోక తప్పలేదు. ఏదో  రకంగా రాక్షసుల దృష్టి మరల్చి అమృతాన్ని పూర్తిగా దేవతల పరం చెయ్యాలి. అందుకోసం విష్ణుమూర్తి ఎత్తిన ప్రత్యేకావతారమే జగన్మోహినీ అవతారం. దశావతారాల్లోకి లెక్కరాని ఈ అవతారం కేవలం అమృతం పంచేవరకే. మధ్యలో రాహుకేతువులు కాస్త కాస్త తాగేసినా, మిగతా అమృతాన్నంతటినీ దిగ్విజయంగా దేవతలకు పంచేసిన జగన్మోహిని, న్యాయం చొప్పున అయితే మరిక కనబడకుండా మాయమైపోవలసిందే. కాని అవలేదు...త్రిపురసుందరిని అర్ధాంగిగా కలిగిన మహాదేవుడు..తనను ఇంద్రియ వికారానికి లోను చెయ్యబోయిన మన్మధుణ్ణి భస్మం చేసేసి "మదనారి"గా ప్రసిద్ధికెక్కిన ముక్కంటి..జగన్మోహిని సౌందర్య విలాసాన్ని చూసి..విభ్రమ చెంది వెంటబడ్డాడట.  
                             ఈ కధను వెనక చందమామ పిల్లల పత్రికలో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు "వినాయకుడు" సీరియల్ లో అద్భుతంగా వర్ణించారు. "మీ నాన్న..ఆ శంకర మహాదేవుడికే పిచ్చెక్కి   జగన్మోహిని వెంట పడ్డాడు" అంటుంది పార్వతి పెద్దకొడుకుతో. "అవునా..అయితే అప్పుడేం జరిగిందమ్మా" అని కౌతుకంగా ప్రశ్నిస్తాడు గజముఖుడు. "ఏదో అయిందిలే. అప్పుడో నల్లని భూతపిల్లడు పుట్టాట్ట.." అంటుంది పార్వతి. "అంటే నాకు తమ్ముడన్నమాట..ఎక్కడున్నాడమ్మా" అని అడుగుతాడు గజాననుడు మరింత కుతూహలంగా. "ఎక్కడో ఉంటాడు. నల్లని బట్టలు కడతాట్ట. పొరబాటున కూడా అటు వెళ్లకుమీ...జడుసుకుంటావు" అంటుంది పార్వతి పుత్రవాత్సల్యంతో. కానీ వినాయకుడు అటు వెళ్లనే వెళతాడు...దిగులుమొహంతో శబరుల మధ్య తిరుగుతున్న నల్లపిల్లాణ్ణి చూసి, అతని శరీరమంతా నిమిరి..అరటిదవ్వలా తెల్లగా చేసి.."ఇతను మీకు స్వామి. "స్వామీ శరణం" అనండి..కాపాడతాడు.." అని శబరులకు చెప్పి వస్తాడు. ఆ స్వామే హరిహరపుత్రుడు అయ్యప్ప.
అంటే అంగజహరుడు అయ్యప్ప జననం కోసమే జగన్మోహిని వెంటపడ్డాడా..?? లేకపోతే కామారికి కామ వికారమేమిటి..?? 
                   అదలా ఉంచితే..స్వయంగా తండ్రి ఆదేశంతో తన మానసచోరుడైన త్రినేత్రుణ్ణి సేవించుకున్న శైలరాణ్ణందన, తన కట్టెదుటే అతడు మన్మధుణ్ణి భస్మం చేసెయ్యడంతో బిత్తరపోయింది. కలువకాడలా వేలాడిపోయింది. అయినా సరే  సౌందర్యానికే వన్నె తేగల తనని చూసి కూడా చలించక మూడోకన్ను తెరిచిన ఆ జితేంద్రియునితోనే తన జీవితాన్ని ముడేసుకోవాలని దీక్షగా ఆకులలములు మానేసి మరీ తపస్సు చేసి  అచ్చంగా అతని అర్ధాంగి  అయిపోయింది.తన మగడు భక్తికే గాని భామినులకు లొంగని వాడని  ఆనందపడుతుండగా..దేవతలందరికీ తెలిసిన ఆ పగటివేషగాణ్ణి అచ్చమైన ఆడదని భ్రమించి శంకర మహాదేవుడు వెంటపడటం కంటే ఆ తల్లికి వేరే అవమానం ఏముంటుంది గనక..??  పెళ్లికి ముందు తనవైపు కన్నెత్తి కూడా చూడనివాడు, పెళ్లయి, ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యాక మరో ఆడదాని వెనక పడటం చూస్తే ఆ ఇల్లాలి కడుపు దహించుకుపోదూ..?? ఆ మంట అంతా చక్కగా గ్రహించుకున్నారు శంకరులు. "అమ్మా..ఇదంతా నీ లీలే కదమ్మా" అంటూ తల్లిని ఓదార్చారు. "ఆ హరి తనకు తానుగా ఏమంత గొప్పవాడు కాదమ్మా...నిన్ను ఆరాధించి, నీ చలవ వల్లనే జగన్మోహినిగా రూపెత్తి శివుణ్ణి క్షోభపెట్టాడు. ఇదంతా నీ కనుగవ కదలిక వల్ల జరిగిందే కదమ్మా" అంటూ...విశ్వరచనకు పునాది వేసే అమ్మను మరపించారు. 
                          మరొక మాట ఏమిటంటే వాస్తవానికి శివపత్ని పార్వతి వేరు..ముజ్జగాలనేలే ముగురమ్మల మూలపుటమ్మ భువనేశ్వరి వేరు. కాని శంకరులు సౌందర్య లహరి పొడవునా తల్లిని "హిమగిరితనయా" అనే కీర్తించారు. ఇది కేవలం కవిత్వానికి ఆలంబన అయిన విషయం తప్ప వేరు కాదు. ఎందుకంటే..భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పాడో..అదే విధంగా దేవీ భాగవతంలో శ్రీదేవి కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తూ..హిమవంతాదులతో "త్రిమూర్తులూ..వాణీ, లక్ష్మీగౌరులూ నేనే" అని చెబుతుంది. "దొంగల్లో, వ్యాధుల్లో, చండాలురలో నేనున్నాను" అన్న పరదేవతను శైలపుత్రి గిరిజగా కీర్తించకపోతే ఇక ఆ కవిత్వానికి వస్తువేది? అయినప్పటికీ...శంకరాచార్యులవారి ఈ సౌందర్య లహరి భువనేశ్వరి దివ్య సౌందర్యానికీ..మహిమకూ..వీటన్నిటినీ మించిన ఒకానొక అద్వితీయ అనుభూతికీ...అంతకు మించిన యోగవైశిష్ట్యానికీ ఆధారభూతమైంది.  చెప్పుకున్న కొద్దీ సౌందర్య లహరికి వ్యాఖ్యానాలు పెరుగుతాయే తప్ప తరగవు. 
                            ఇక ప్రస్తుత శ్లోకం రెండో భాగాన్ని చూద్దాం. ఇది కూడా శివుడి కోసం పార్వతి తపస్సు చేసిన వైనానికి సంబంధించిందే. కాకపోతే శివుడి కంటే పార్వతికే ఓ నాలుగు మార్కులు ఎక్కువ వేసిన ఘట్టమిది. తపోదీక్షలో ఉన్న తనను శైలజ పట్ల అనురక్తుణ్ణిగా చేయబోయినందుకు గాను ఆగ్రహించిన ముక్కంటి, మన్మధుణ్ణి దహించివేసిన మరుక్షణం అక్కడ లేనేలేడు. మాయమైపోయాడు. మరోవైపు హిమవంతుడు వచ్చి..రుద్రుని కోపతీవ్రతకు జడిసి తోటకూరకాడలా వేలాడిపోతున్న కూతుర్ని,  కలువపువ్వును తొండంతో పట్టుకున్న మదగజంలా అతి సున్నితంగా చేతుల్లోకి తీసుకుని భవనానికి వెళ్లిపోయాడు. ఇక మిగిలిందల్లా భర్త బూడిద కుప్ప దగ్గర వెక్కి వెక్కి రోదిస్తున్న రతీదేవి మాత్రమే. అలా ఏడ్చి ఏడ్చి డస్సిపోయిన రతి...చివరికి శివపార్వతుల కళ్యాణ సమయాన ముక్కంటి ఇల్లాలిని ప్రార్ధించి తన భర్తను "అనంగుడి"లా పునరుజ్జీవింపజేసుకుని,ఓదార్పు పొందింది. అలా ఆ తల్లి దయ వల్ల మళ్లీ బతికి బట్ట కట్టిన మన్మధుడు మరింత విజృంభించి మహా మహా ఋషుల్ని సైతం లొంగదీసుకుంటున్నాడు. 
                           ఇక్కడ మరో వైచిత్రి ఉంది. శివుడి చేతిలో భస్మమైపోయిన మన్మధుణ్ణే గనక పార్వతి మళ్లీ తిరిగి బతికించకుండా ఉంటే శంకర మహాదేవుడు అసలు జగన్మోహిని వెనక కూడా పడేవాడు కాదేమో. అంచేత.."తల్లీ కోరి కోరి కొరివితో తల గోక్కున్నావు కదా" అంటున్నారా శంకరులు...వద్దు వద్దు. ఇలాంటి వెటకారపు వ్యాఖ్యానాలు చెయ్యనే వద్దు. నేరుగా..సూటిగా..ముచ్చటగా చెప్పుకుందాం. "అమ్మా...హరి జగన్మోహినీ అవతారమెత్తి సాక్షాత్తూ ఆ మదనారి మతే పోగొట్టినా...ఒకసారి చచ్చి బూడిదైపోయిన కాముడు తిరిగి పునర్జన్మెత్తి మహర్షుల్ని సైతం లొంగదీసుకుంటున్నా...ఆ అసంభవాలు సంభవాలవుతున్నాయంటే అందుకు కారణభూతురాలివి నువ్వే కదమ్మా. నువ్వు తలచుకుంటే ఎలాంటిదాన్నయినా సంభవంగా చెయ్యగలవు."  
                         ఇదండీ  సంగతి. ఇంక ముగింపు శ్లోకానికి వెళదామా...
                   నవీనార్క భ్రాజన్మణి కనక భూషా పరికరైః 
                   వృతాంగీ సారంగీ రుచిరనయనాంగీకృత శివా 
                   తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా 
                   మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ ! 
 (భావం : హే జగన్మాతా..! అప్పుడే ఉదయించిన బాలభానునిలా దేదీప్యమానంగా తేజరిల్లే సువర్ణ మణిమయాది భూషణాలతో సర్వాంగ భూషితవు. ఆడలేడి కన్నులవంటి సుందరమైన కన్నులు గలదానవు. పరమశివుని పతిగా స్వీకరించినదానవు. మెరుపులాంటి పచ్చని మేనికాంతి కలదానవు. పసిడి పీతాంబరం...పాదమంజీరాలతో కళకళ్లాడే అయిదవరాలా..ఓ ఆనందస్వరూపిణీ..అపర్ణా..నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని ప్రసాదించు తల్లీ..!)
 ------------శంకరచార్య విరచితం. 
 ఈ రోజుకు ఇంక సెలవా మరి...
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి