21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

అందాల కడలి-4


అమ్మకు అందరూ సమానమే 


శ్లో :
       అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ
       జడానాం చైతన్యస్తబక మకరంద సృతిఝరీ
       దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ
       నిమగ్నానాం దంష్ర్టా మురరిపు వరాహస్య భవతి !!
                            ఇది సౌందర్య లహరిలోని మూడవ శ్లోకం. ఈ శ్లోకం మొదటి పాదంలో "తిమిర మిహిర ద్వీపనగరీ" అన్నది కొన్ని కొన్ని పుస్తకాల్లో తిమిర మిహిరోద్దీపనకరీ" అని ఉంది. అర్ధం ప్రకారం చూస్తే బహుశా అదే సరైనదేమోననిపిస్తుంది. ఇక క్లుప్తంగా ఈ శ్లోక భావం ఏమిటంటే "తల్లీ, నీ పాదధూళి అజ్ఞానులకు అజ్ఞానమనే చీకటిని పోగొట్టే సూర్యకాంతిని ప్రేరేపించునది.(మిహిర ద్వీపనగరీ..అంటే సూర్యుడు ఉదయించే పట్టణము వంటిది.)మందబుద్ధులైన జడులకు జ్ఞానమనే పూదేనె ప్రవాహం.దరిద్రులకది (నీ పాదధూళి) చింతామణుల హారం. సంసార సాగరంలో మునిగిన వారికి అది ఆదివరాహపు కోర..!!"
                                    ఇక భావార్ధంలోకి వెళితే..శంకరులు ఇంకా ఆ తల్లి పాదధూళి పరవశంలోంచి తేరుకోలేదు. సాక్షాత్తూ త్రిమూర్తులే దేవి పాదాలకు మొక్కి పరదేవత పాదధూళిని గ్రహించి దానితోనే సమస్త వ్యాపారాలూ సాగిస్తారని చెప్పినా కూడా ఇంకా ఆయనకు తనివి తీరలేదు. ఇక్కడ శంకరులు అటు దేవికి, ఇటు భక్తులకూ కూడా   తండ్రే అయ్యారు. తండ్రికి తన బిడ్డ గొప్పతనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఇంకా ఇంకా వేర్వేరు రకాలుగా చెబుతూనే ఉంటాడు. అలాగే బిడ్డకు ఒక కొత్త విషయం చెప్పినప్పుడు దాన్ని అన్ని కోణాల్లోంచీ వివరించి  ఓ పిసరు ఎక్కువగా చెబితే తప్ప తండ్రికి "బిడ్డకు అర్ధమైంది"అన్న తృప్తి కలగదు..  శంకరాచార్యుల వారికి  కూడా అలాగే "తనీయాంసం పాంసుం" శ్లోకంతో అటు త్రిపురసుందరి పాదధూళి మహిమను, గొప్పతనాన్నీ  సాకల్యంగా వర్ణించిన తృప్తి గాని ఇటు భక్తులకు పరిపూర్ణమైన సమాచారాన్ని అందించిన తృప్తి గాని కలగలేదు. "దేవి పాదధూళి త్రిమూర్తులకు ఉపకరిస్తుందేమో. మరి మా సంగతేమిటి" అని సామాన్యులు, అజ్ఞానులు, జడులు, సంసారసాగరంలో మునిగితేలుతున్నవారు తెల్లమొహం వేస్తున్నట్టే ఆయనకు తోచింది.  అందుకే ఆయన..ఇప్పుడు సాధారణ మానవులకు అమ్మ పాదధూళి ఏ రకమైనదో చెబుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్లోకాల్లో గాని, మరెక్కడ గాని కవులు చెప్పిన మాటల్లో అంతరార్ధాన్ని గ్రహించాలే గాని, వారు చెప్పినదాన్ని యధాతధంగా తీసుకుని వితండవాదానికి దిగరాదు. ప్రస్తుత శ్లోకంలో అజ్ఞానులు, జడులు, దరిద్రులు,సంసారబాధల్లో ఉన్నవారికి తల్లి పాదధూళి సూర్యకాంతిగానూ, పూదేనె ప్రవాహంగానూ, చింతామణుల హారంగానూ, ఆది వరాహమూర్తి కోరగానూ ఉంటుందంటే.."అయితే ఏమిటి? ఆ కనిపించే సూర్యకాంతి మనల్ని ఉద్ధరిస్తుందా..తాగడనికిన్ని మంచినీళ్లే లేవు..ఇంక పూదేనె ప్రవాహాలేమిటి..మెళ్లో ఓ బంగారు హారానికి దిక్కు లేదు..చింతామణుల దండ కూడానూ.. "  అంటూ  శ్లోకాల్లోని కవితాత్మకతను అర్ధం చేసుకోకుండా వాదించేవారు బోలెడంతమంది మనకు కనిపిస్తారు. సూర్యకాంతేమిటి, పూదేనె ఏమిటి, చింతామణుల దండేమిటీ అని తెల్లమొహం వేసేవారూ అందరికందరే..!  అటువంటివారికి ప్రస్తుత శ్లోకం గురించి చెప్పే మాట ఏమిటంటే.. సూర్యకాంతి..పూదేనె..చింతామణుల దండ..వరాహమూర్తి కోర ఇవన్నీ పక్కన పెడితే  అజ్ఞానులు, జడులు, దరిద్రులు, సంసార సాగరంలో నిండా మునిగిపోయి ఉన్నవారు..ఈ రకమైనవారంతా కూడా అమ్మ కృపకు అనర్హులేమీ కాదని చెప్పడమే శంకరుల మాటల  అంతరార్ధం.  త్రిమూర్తులు జ్ఞానులకు సంకేతమనుకుంటే జ్ఞానులైనవారే గాక అజ్ఞానులు  కూడా తల్లి పాదాలనాశ్రయించి  ఇబ్బడి ముబ్బడిగా ఫలితాన్ని పొందవచ్చునన్నదే  శంకరాచార్యులు గొంతెత్తి ప్రకటించదలచుకున్న విషయం. అయితే అది ఎలా..ఆ ఫలితం ఏ విధంగా కలుగుతుందన్నదే ప్రశ్న. "మాకు నిత్యమూ పూజలు చేసే తీరుబాటు లేదు. స్తోత్రాలు చదవలేము. మరింక ఎలా" అనేది కోట్లాదిమంది సందేహం. దీనికి జవాబు లలితా సహస్రంలో ఉంది. ఆ తల్లి "భక్త మానస హంసిక" "భక్తివశ్య" ఈ రెండింటినీ మించి ఆమె "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా.." అంటే మనలో అంతర్ముఖంగా ఉన్న తన అంశని గుర్తించి, మనలో ఉన్న తనని భక్తిగా ఆరాధించినప్పుడే ఆ లలితా మహా త్రిపురసుందరీ దేవి ఆరాధ్యురాలయి, ప్రసన్నురాలవుతుంది. అంతర్ముఖత లేకుండా కేవలం బహిర్ముఖంగా విగ్రహాలు, పటాలకు చేసే బాహ్యాడంబర పూజలన్నీ  మన తృప్తికే గాని దానివల్ల ఫలితం సున్నా. మనలో ఉన్న తల్లిని గుర్తించడమెలా..మరేమీ లేదు..ఆ తల్లికుండే దేవతాగుణాలన్నిటినీ తు.చ. తప్పకుండా అనుసరించడమే. సత్యం, అహింస, భూతదయ ఇత్యాది దైవీగుణాలన్నిటినీ అనుసరిస్తూ ఉంటే దేవిని గుర్తించి అనుసరిస్తున్నట్టే కదా..ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే సమాజం ఎలా ఉంటుంది..ఒక్కసారి ఆలోచించండి..!  
                                   ఇక భావార్ధ వివరణలోకి వెళదాం..అజ్ఞానులు వేరు, జడులు వేరు. "మాకు తెలియదు. ఎవరైనా తెలియజెబితే బావుణ్ణు" అనుకునేవారు అజ్ఞానులు. వీరు చీకటిలో ఉండి వెలుగు కోసం తపించిపోతున్నవారు.  అటువంటివారికి పరదేవత సేవ వల్ల అజ్ఞానాంధకారం తొలగి, జ్ఞానసూర్య దర్శనం అవుతుంది.వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే బుద్ధికుశలత పెరిగి చాలా విషయాలు వాటికవే స్ఫురిస్తాయి..పందితులు చెప్పేవి ఇట్టే గ్రాహ్యమవుతాయి. ఇక జడులు చైతన్య రహితులు. వారికి అసలు తాము అజ్ఞానులమన్న విషయం కూడా తెలియదు. జడులకు ముందు కావలసినది చైతన్యం. త్రిపురసుందరీ ఆరాధన వారిలోని ఆ జడత్వాన్ని పోగొడుతుంది. జిహ్వ చచ్చిన నోటికి మధుసేవ అమృతోపమానమైనది. చైతన్యమనే జిహ్వ చచ్చి, జడత్వం ఆవరించుకుని ఉన్నవారికి త్రిపురసుందరి సేవ పూదేనె వంటిది. అలాగే దరిద్రులకు చింతామణి వంటిది. చింతామణి మామూలు రత్నం కాదు. క్షీరసాగర మధన సమయంలో శ్రీలక్ష్మితో బాటు పుట్టిన అనేకానేక వస్తువుల్లో చింతామణి ఒకటి. ఇది కోరిన కోర్కెల్ని తీర్చే మహత్తు గలది. దరిద్రులకు పరదేవత సేవ ఎకాయెకీ చింతామణుల హారంతో సమానమైన ఫలితాల్ని ఇస్తుంది. 
                    ఇక్కడ మరొక అద్భుతమైన విషయాన్ని చెబుతాను వినండి...అక్షరాల ద్వారా అంకెల్ని వ్యక్తపరచే ఒక చిత్రమైన పద్ధతిని వరరుచి చెప్పాడట. ఆ ప్రకారం గుణిస్తే..ప్రస్తుత శ్లోకంలోని "గుణనికా" అన్న పదానికి 1053 సంఖ్య వస్తుంది.లలితా సహస్ర నామస్తోత్రంలోని అమ్మవారి నామాల్ని 1053 గా విడదీసి చెప్పే పద్ధతి కూడా ఉందట. ఆ రకంగా చూస్తే దరిద్రులకు అమ్మవారి సేవ వల్ల లలితాసహస్రాన్ని పారాయణ చేసే మహద్భాగ్యం కలిగి..తద్వారా జన్మజన్మలకూ సరిపడా సుఖసౌఖ్యాలు లభిస్తాయన్నది అంతరార్ధం. 
                              ఇక ఆఖరుగా చెప్పుకునేది సంసారంలోని ఈతిబాధలకు గురవుతున్నవారి గురించి. పూర్వం హిరణ్యాక్షుడు భూదేవిని చెరబట్టినప్పుడు విష్ణువు ఆదివరాహమూర్తి అవతారాన్ని ధరించి తన కోరలతో భూమిని జలగర్భంలోంచి  ఏ విధంగా పైకెత్తి కాపాడాడో అదే విధంగా అమ్మవారి సేవ సంసారసాగరంలో మునిగిపోతున్నవారిని ఉద్ధరించి ఆదుకుంటుంది. 
                   అదీ సంగతి. మొత్తమ్మీద చెప్పుకునే మాట ఏమంటే..జ్ఞానీ-అజ్ఞానీ అన్న తేడా లేకుండా అమ్మకు అంతా సమానులే..అందర్నీ ఆ తల్లి ఒకేలా కరుణించి కాపాడుతుంది..! స్వస్తి..! ఇక ముగింపు శ్లోకానికి వెళదాం..
 
  ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా 
 లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా 
 స్ఫురత్కాంచీ శాటీ పృధుకటితటే హాటకమయీ 
 భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీమవిరతం 

 భావం : నోటికి ఎర్రని తాంబూల రక్తిమ..కళ్లకు నల్లని కాటుక..నొసట ఉదయసూర్యునిలా కుంకుమతిలకం..మెడలో తెల్లని మంచి ముత్యాల దండ..ఒంటిమీద బంగారు జలతారు చీర..నడుమున రత్నాలు తాపిన వడ్డాణం..ధగ ధగ మెరిసే ఈ రకమైన వేషభూషలతో విరాజిల్లే ఓ గిరిరాజనందినీ..నేను సదా నిన్నే ఆరాధిస్తాను తల్లీ..! 
                        --------------- (శంకరాచార్య విరచితం )
 ఈ రోజుకు సెలవా మరి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి