17, ఫిబ్రవరి 2014, సోమవారం

అందాల కడలి-1


గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ 



"లలిత" అన్న పేరే ఒక అందం! లలిత లలితమైనది లలిత. విశ్వాంతరాళంలోని కోమలత్వమంతటినీ పోగేసినా ఆ తల్లి ఒక్క తల వెంట్రుకకు సాటి రాదంటే అందుకు శంకరులే సాక్షి. పరదేవత వైభవం, మహిమ వగైరాలన్నీ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోనూ, మార్కండేయ పురాణంలోని శ్రీ దుర్గా సప్తశతి స్తవంలోనూ సమగ్రంగా కనిపిస్తాయి. కాని శంకరాచార్య విరచితమైన ఈ సౌందర్య లహరి మాత్రం అఖిలాండనాయకి బాహ్య, అంతస్సౌందర్యాలకే పెద్దపీట వేసింది. వాస్తవానికి ఇలా దేవతా సౌందర్యాన్ని కీర్తిస్తూ వినుతికెక్కిన కావ్యం మరొకటి లేనేలేదు. 
                       సౌందర్య లహరిలోని తొలి నలభై శ్లోకాలూ పరిపూర్తిగా దివ్యసృష్టి అనడానికి సాక్ష్యంగా వాటిలో సౌందర్య వర్ణన కంటే అత్యంత రహస్యమైన గుహ్యవిద్యే నిగూఢంగా ఉంది. ఆ  నలభై శ్లోకాలూ యంత్ర, తంత్ర విధాన రహస్యాల్ని గోప్యంగా వివరిస్తాయని పండితులు చెబుతారు. అందుకే అవి  నా వంటి సామాన్యులకు కొరుకుడు పడవు. ఆ  నలభై శ్లోకాల్నీ "ఆనంద లహరి" అంటారనీ, తనకు దైవ ప్రసాదంగా లభ్యమైన ఆ శ్లోకాలకు  శంకరులు జోడించిన తరువాయి అరవై శ్లోకాల్నీ మాత్రమే "సౌందర్య లహరి" అంటారనీ ఒక వాదం ఉంది.  అయితే దాన్ని ఖండించేవారు కూడా అందరికందరూ ఉన్నారు. మరొక మాట ఏమిటంటే "ఆనంద లహరి" పేరున శంకరాచార్య విరచితమైనదే మరొక స్తోత్రరాజం ఉంది. అందులో శ్లోకాలు సౌందర్య లహరికి మరింత దీటుగా ఉంటాయి. అయితే అవి కేవలం ఇరవై శ్లోకాలు మాత్రమే. ఆ ఆనంద లహరి ముందు వెనుకల గాధలేమైనా ఉన్నాయేమో   నాకు తెలియదు. అలవాటుగా పుస్తకాల షాపుల్ని గాలిస్తున్నప్పుడు ఆ చిన్ని పొత్తం కనబడి, వెంటనే దాన్ని సొంతం చేసుకున్నాను.  
                                  ఎటూ ఈ రోజు కూడా ఇప్పటిదాకా ఇటువంటి ఉపోద్ఘాతాలతోనే గడిచిపోతోంది కాబట్టి సౌందర్య లహరి గురించి మరో రెండు ముక్కలు చెప్పుకుందాం. సౌందర్య లహరిని నాకు ఒక గురుతుల్యులైన స్నేహితురాలు సరిగ్గా పన్నెండేళ్ల కిందట పరిచయం చేశారు.అప్పట్లో ఆవిడ ఏ శ్లోకం చదివితే ఏ ఫలితమో కూడా ఒక కాగితం మీద రాసి ఇచ్చారు. తర్వాత ఆ కాగితం ఎక్కడో పోయింది. నేను దాని గురించి అంత పట్టించుకోలేదు కూడా. ఎందుకంటే నా ఆరోగ్యం పుట్టుక నించీ అంతంత మాత్రమే. ఎటూ నేను ఏ జపతపాలూ  చెయ్యలేను. రోజూ ఇన్నివందలు లేదా వేల సార్లు అని దేన్నీ జపించలేను/పారాయణ చెయ్యలేను. దేవుడి ముందు దీపం వెలిగించి రెండు చేతులూ జోడించి ఒక్క నమస్కారం చేసి లేచి వచ్చేసిన రోజులే నా జీవితంలో ఎక్కువ. అంచేత నేను ఆవిడ రాసిచ్చిన కాగితాన్ని అసలు పట్టించుకోనేలేదు. కాకపోతే దేవతా స్తోత్రాల దగ్గర్నించీ సమస్త రకాలూ చదవడమనే వ్యసనం కూడా పుట్టుకతోనే అబ్బింది కాబట్టి, అప్పటికే శంకరుల రచనల పట్ల ఆరాధన బాగా పోగై ఉంది కాబట్టి..పురాకృతసుకృతంగా సౌందర్య లహరి గురించి తెలిసిన వెంటనే ఆ పుస్తకం కొనుక్కుని తెచ్చుకుని చదవడం ప్రారంభించాను. అది చదవడం ప్రారంభించే వేళకు నాకు కాస్త అనారోగ్యంగా ఉంది. శారీరకమైన వ్యాధితో బాటు మానసికమైన భయాందోళనలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఆ పరిస్థితిలో నేను నాకు తెలియకపోయినా కేవలం శ్లోకార్ధాన్ని ఊతంగా చేసుకుని "త్వదన్యః పాణిభ్యామభయ వరదో దైవత గణాః" శ్లోకాన్ని (శ్లో : 4)  నాకు భయం వేసినప్పుడల్లా మననం చేసుకోవడం ప్రారంభించాను. అది చదువుకున్నప్పుడల్లా భయం తగ్గి, ఏదో ధైర్యంగా ఉండేది. ఆ తర్వాత నాకు సరైన చికిత్స లభించడం...నేను ఆరోగ్యవంతురాల్ని కావడం జరిగాయి. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే నా స్నేహితురాలు ఇచ్చిన కాగితాన్ని పట్టించుకోకపోయినా నేను అసంకల్పితంగా  అందులో ఉన్న ప్రకారమే  ఆచరించాను, దానికి ఫలితమూ దక్కింది
                ఇక్కడ మరో చిన్న కోతి కొమ్మచ్చి. నాకు ఆది శంకరుల రచనా వైశిష్ట్యాన్ని తొట్టతొలుతగా పరిచయం చేసింది మా నాన్న. ఆయన రాగయుక్తంగా (మా తాతగారి నించి సంగీత వారసత్వం మా నాన్నకి వచ్చింది. ఆయన నించి మా పెద్ద చెల్లికి)శివానందలహరి లోని ఈ శ్లోకాన్ని నాకు చదివి  వినిపించేవారు...
               గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే
               విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జడమతిః
               సమర్ప్యైకం చేతస్సరసిజముమానాధ భవతు
               సుఖేనావస్థాతుం జనయిహ న జానాతి కిమహో
           తండ్రీ..ఉమానాధా..! నీ పూజకి పువ్వులు తీసుకురావడం కోసం జనం లోతైన చెరువుల్లో దిగిపోతున్నారు..నిర్జనాలైన ఘోరారణ్యాల్లోకి పరుగులు తీస్తున్నారు. ఎత్తైన కొండలమీదకీ ఎక్కేస్తున్నారు. తమ మనస్సు అనే తామరను పరిశుద్ధంగా నీకు సమర్పించి...ఈ పరుగులేమీ లేకుండా సుఖంగా ఉండవచ్చునన్న విషయం వారికి ఎందుకు తెలియదో కదా..??
                         ఇదీ దాని భావం. ఇది గాక భజగోవింద శ్లోకాల్ని నాకు మొట్టమొదటగా పరిచయం చేసిందీ, శంకరులు రాసిన ఏ స్తోత్రానికైనా అద్భుతమైన లయ ఉంటుందన్న విషయాన్ని ప్రత్యక్షంగా నాకు తెలియజెప్పిందీ కూడా మా నాన్నే. అలా ఊహ తెలిసీ తెలియక ముందే శంకరుల పట్ల భక్తిభావాన్ని పెంచుకున్న నాకు ఈ సౌందర్య లహరి  కోతికి  కొబ్బరికాయే..! ఇక ఇప్పుడు శంకరులు రాసిందే "భవాన్యష్టకం" చదువుకుని ఈ రోజుకి సెలవు తీసుకుందాం. సంపూర్ణ శరణాగతికి మారుపేరు భవాన్యష్టకం. అది చదివాక నాకు ఏమనిపించిందంటే...అసలు ఏ పూజలూ అక్కర్లేదు...ఏ సహస్ర నామాలూ వల్లించక్కర్లేదు...ఈ ఎనిమిది శ్లోకాల్నీ మనసారా చదువుకుంటే చాలు అనిపించింది. మీరు కూడా చదివి చూడండి మరి...మీకేమనిపిస్తుందో..!!  

న తాతో న మాతా న బంధుర్నదాతా 
 న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా 
 న జాయా న విద్యా న వృత్తిర్మమైవ 
 గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ 


భవాబ్ధావపారే మహా దుఖ భీరుః  
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః 
కుసంసారపాశః ప్రబద్ధః సదాహం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ

న జానామి దానం న చ ధ్యానయోగం 
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం 
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ

న జానామి పుణ్యం న జానామి తీర్ధం 
న జానామి ముక్తిం లయం వా కదాచిత్ 
న జానామి భక్తిం వ్రతం వా పి మాతః 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ 

కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః 
కులాచారహీనః కదాచారలీనః 
కుదృష్టిః కువాక్య ప్రబంధః సదాహం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ

ప్రజేశం రమేశం మహేశం సురేశం 
దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ 
న జానామిచాన్యత్ సదాహం శరణ్యే 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే 
జలేచానలే పర్వతే శత్రుమధ్యే 
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ

అనాధో దరిద్రో జరారోగయుక్తో 
మహాక్షీణ దీనః సదా జాడ్యవక్త్రః 
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ

ఇది చాలా సులువుగా అర్ధం చేసుకోగలిగే స్తోత్రం. కాస్త శ్రద్ధగా చదివి చూస్తే భావం ఇట్టే బోధపడిపోతుంది. తాత అంటే మాత్రం మన తెలుగు తాత కాదు. సంస్కృతంలో తాత అంటే తండ్రి. న తాతో న మాతా అంటే తల్లీ తండ్రీ లేరు అని అర్ధం. అంటే నిజంగా లేరు అని కాదు. వాస్తవంగా మనకు ఏదైనా పెద్ద అవసరం వస్తే "ఆబ్రహ్మకీట జనని" అయిన ఆ లలితా త్రిపురసుందరి తప్ప పాంచభౌతికమైన ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఏమీ చెయ్యలేరు అని అంతరార్ధం. ఇలా అంతరార్ధాలు గ్రహిస్తూ పోతేనే ఏ శ్లోకానికైనా అసలు భావం తెలిసేది!   సెలవా మరి...!! 

అందాల కడలి

త్వదన్యహ్ పాణిభ్యామభయ వరదో దైవత గణా
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా
భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ
                  అమ్మా...నువ్వు ఇతర దేవతలందరిలా "మిమ్మల్ని నేనే కాపాడేస్తానంటూ" గొప్పగా అభయముద్రను ప్రదర్శించవు.వరాలిచ్చేస్తానంటూ అభినయించవు. అయితేమాత్రమేం..మమ్మల్ని మా భయాల నుంచి కాపాడటానికీ, కోరినదానికి రెట్టింపుగా  వాంఛితార్ధాల్ని ప్రసాదించడానికీ  నీ పాదకమలాలే సమర్ధవంతమైనవి   కదా...
                                         (సౌందర్య లహరి...శ్లో : 4 )
                       ఇక్కడ నేను తలపెట్టింది ఇంతింతనరాని ఒక బృహత్కార్యం. కార్యోన్ముఖంగా ముందడుగు వేయబోయేందుకు  మున్ముందుగా నేను చెప్పేదేమంటే...నేను పండితురాల్ని కాదు. కనీసం బాగా చదువుకున్నదాన్ని కూడా కాదు. సప్తసముద్రాలకు సాటి రాగల విద్యావాహినిలో పై పై నురగ వంటిదాన్ని ఓ  గుక్కెడు తీర్ధంగా   పుచ్చుకున్నానేమో.. అంతే. బోలెడు అసలు సారమంతా ఇంకా  కిందనే ఉంది. అదెలా ఉంటుందో నాకు కనీసం తెలియను కూడా తెలియదు. అయితే మరి నోరు మూసుక్కూచోకుండా ఈ తెగువేమిటీ అని మీకు సహజంగానే సందేహం వస్తుంది. అందులోనూ ఇది  సాక్షాత్తూ ఆది శంకరులు రాసిన అనుపమానమైన బృహత్కావ్యం.  మానవులకందరాని అత్యంత రహస్యమైన మంత్ర..తంత్రాలతో కూడిన గుహ్య విద్యకు ఆలవాలమైన "సౌందర్యలహరి".  వంద శ్లోకాలతో శంకరులు జగదంబకు   చేసిన బృహత్ వందనం.  మొదటి నలభై శ్లోకాల్నీ స్వయంగా జగదీశ్వరుడైన ఆ ఉమాపతే శంకరుల చెవిలో చెప్పి పుణ్యం కట్టుకున్నాడన్న మాట ఒకవైపూ...కాదు కాదు..పార్వతీపతి సందర్శనార్ధం కైలాసానికేగి అక్కడ లిఖితమై ఉన్న దీన్ని శంకరులు చదువుతూ ఉండగా అది ఎంతమాత్రమూ మానవమాత్రులకు అందరాని అత్యంత రహస్యమైన తంత్రవిద్యతో కూడినది కాబట్టి విఘ్నాధిపతి దాన్ని అడుగునించీ చెరిపేస్తూ వచ్చాడన్న మాట మరోవైపూ వెనక్కి గుంజుతూ ఉండగా..విక్రమార్క మహారాజును తలచుకుని మరీ ముందుకు సాగుతున్నాను నేను. ఎందుకింత పట్టుదల..ఏం సాధించెయ్యాలని? దీనికి జవాబు నిజానికి నా దగ్గర లేనేలేదు.  కాని జవాబుగా కేవలం నా అనుభూతుల్ని మాత్రం చెప్పగలను నేను. రవీంద్రుని గీతాంజలిలో ఓ లైను ఎక్కడో కంటబడ్డాక మొత్తం చదివేదాకా ప్రియురాలు కనిపించని ఉన్మత్తుని విధాన పలవరించానన్నాడు చలం. వాస్తవానికి చలం రచనల్లో నాకు నచ్చే ఏకైక కృతి గీతాంజలి అనువాదం మాత్రమే. ఎప్పుడో పుష్కర కాలం  వెనుక సౌందర్యలహరి తొలిసారి చదివి నేనూ అలాగే ఊగిపోయాను...భక్తితో కాదు..పరవశంతో. అదేమి కావ్యం...అవేమి ఉపమానాలు..? అవేమి అలంకారాలు..? అదేమి రచనా చాతుర్యం..? సౌందర్యలహరి నాకు ఒక మొక్కుబడి పారాయణ గ్రంధంలా కనిపించలేదు. కాళిదాసు కుమారసంభవంలా...మేఘసందేశంలా  ఒక రసాత్మకమైన అద్భుత కావ్యం అనిపించింది. నేను కేవలం అందులోని చమత్కారాలనూ...వాటికి ఆధారభూతమైన ఆ జగజ్జనని సౌందర్య..విభ్రమ..చలనవలనాలనూ మాత్రం చూసి పరవశించిపోయాను. ఒక దేశపు మహారాణి చేత ఆమె భర్తకు పాదాభివందనం చేయిస్తే వినడానికీ...కళ్ల ముందు ఊహించుకోవడానికీ ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఒక సార్వభౌముణ్ణి ఆయన ఇల్లాలు..అందునా పతివ్రతగా పేరెన్నికగన్న తల్లి...ఒక్క కాలితాపు తన్నిందంటే ఆ మాట నమ్మశక్యమా..?? ఒక భర్త..భార్య కడగంటి చూపులననుసరించి  మాత్రమే అన్ని పనులూ చక్కబెడుతూ ఉంటాడని చెబితే..ఆ భార్యాభర్తల్ని ఎలా ఊహించుకుంటాం? సకలవిద్యాపారంగతురాలూ..సర్వ సమర్ధురాలూ అయిన ఒక గొప్ప స్త్రీ సామాన్యమైన ఆడదానికి మల్లే తన సవతి పట్ల బహిరంగంగా ఈర్ష్యాసూయలు ప్రదర్శిస్తుందని వింటే ఎలా అనిపిస్తుంది..?  ఇవన్నీ శంకరులు సౌందర్యలహరి కావ్యరచనలో  ప్రదర్శించిన విభ్రమవిలాసాలు. 
                                                       సాక్షాత్తూ శంకరుడి వంటి శంకరుల అసామాన్యకృతిని చదివిన తర్వాత నేను ఏ విధంగా అనుభూతి చెందానో దాన్ని సామాన్య పదజాలంతో వర్ణిస్తూ..ఆ వర్ణనల్ని కాకెంగిలి చేసిన జామకాయలా  మీతో పంచుకోవడం తప్ప నా ఈ రచనకు వేరే అర్ధమూ పరమార్ధమూ  లేనేలేవు . వెనకొకసారి రచయిత్రి లత ఏదో ప్రశ్నకి జవాబిస్తూ.."సాక్షాత్తూ ఆ సరస్వతీదేవే రాసి...గొప్పతనాన్ని మాత్రం రచయితలకు అంటగడుతుంది" అన్నారు. ఆ మాట నాకు వేదం. ఇప్పుడు నేను తలా తోకా లేకుండా మొదలెట్టేసిన ఈ  పిచ్చిరాతల్ని ఒక కొలిక్కి తెచ్చి వాటికో రూపాన్నిచ్చి  పూర్తి చేసే భారమూ..బాధ్యతా  ఆ తల్లివే. ఆమెకు బుద్ధి పుట్టిందా..దయ కలిగిందా..మీరు ఈ "అందాల కడలి"లో హాయిగా ఈదులాడగలుగుతారు. లేదూ...మీ ముందునించి ఈ బ్లాగరి ఎకాయెకీ మాయమే అయిపోతుంది. కనుక ఏ రకంగా అయినా మీకు బాధ లేదు. అంచేత మనసు కుదుటపరచుకొని.. ఆకులలములు సైతం మానేసి పంతంగా కోరినవాణ్ణి కొంగుకు ముడేసుకున్న ఆ అపర్ణాదేవి ఏం చెబుతుందోనని రేపటికి ఎదురు చూడండి. ఉంటా మరి...ఈ రోజుకు సెలవు.  

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

గోవిందా...గోఓవింద!!


ఈ రోజు పౌర్ణమి.వెంకన్న నిజరూప దర్శనం చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈ రోజు స్వామికి విశేషాభిషేకాలు చేస్తారు.మేం వెళ్లేసరికి క్షీరసాగరశయనుడికి క్షీరాభిషేకం పూర్తయి..దధ్యాభిషేకానికి వచ్చారు. "రాధా క్యోం గోరీ మై క్యోం కాలా.." అంటూ చిన్నబుచ్చుకున్న నల్లనయ్యకి "శరశ్చంద్ర చంద్రికా ధవళ"మైన పెరుగు మైపూత పూసి తాత్కాలికంగా తెల్లనయ్యను చేశారు.తరువాత తేనెలాంటి మనసున్న తండ్రిని నిలువెల్లా తేనెతో తానమాడించారు. "ఏడుకొండలవాడా...వెంకట రమణా..ఆపదమొక్కులవాడా..అనాధరక్షకా...గోవిందా...గోవింద" అంటూ ఎలుగెత్తి పిలిచే భక్తుల మొర వినీ వినడంతోనే పొయ్యి సెగ సోకిన నేతిలా కరిగిపోయే ఆపద్బాంధవుణ్ణి పూర్తిగా నేతిలో ముంచేసి మరింత కరిగించేశారు.అక్కడితో అయిందా..అమ్మ చూడకుండా గబుక్కుని పందార అందుకుని దొరికినంత తినేద్దామన్న ఆత్రుతతో అల్లరి బుజ్జాయి అలమర పై అరలో ఉన్న పంచదార డబ్బా తీసి పొరబాటున దాన్ని ఒళ్లంతా ఒంపుకున్నట్టు...స్వామి తనువంతటినీ పంచదారతో నింపేశారు. హవ్వ...అసలే యశొదమ్మకి కన్నయ్య మీద బోలెడంత అనుమానం. ఆవిడ చూస్తే ఇంకేమైనా ఉందా.."కన్నా..పాలూ పెరుగుల్తో బాటు పంచదార కూడా తీస్తున్నావా.." అని కూకలేసి మళ్లీ ఏ రోటికో కట్టెయ్యదూ..?? అందుకే...అమ్మకి కూడా కనిపించకుందా కన్నయ్య ఎక్కడో వెళ్లి దాక్కున్నట్టు స్వామిని పూర్తిగా మాయం చేసేస్తూ కరెంటు పోయింది. ఏ కారణం చేతనో గాని వెంటనే జెనరేటర్ కూడా వెయ్యలేదు.
                                        కాస్సేపున్నాక విద్యుత్కాంతి మళ్లీ తిరిగి వచ్చింది. దోబూచాట  పూర్తయినట్టూ  స్వామి మళ్లీ కనిపించాడు. ఇక ఇక్కడి పూజారి గారున్నారేం..ఆయనకి స్వామి ఓ చంటి పిల్లాడు. బుల్లి బాబుకి తిలకం దిద్దీ కాటుక పెట్టీ ఆడపిల్లలా గౌను తొడిగీ అమ్మ ప్రేమ మీరా ఎలా ఆడుకుంటుందో ఆయన వెంకన్నతో అలా ఆడుకుంటారు. అభిషేకాల చివరాఖరున గంధం ముద్దలతో ఆయన చేసే మాయ చూసి తీరవలసిందే గాని చెబితే చాలదు. స్వామి వక్షస్థలం నించి పైకి అలా అలా గంధం ముద్దలు మెదుపుతూ మెదుపుతూ పదంటే పది నిమిషాల్లో రాముణ్ణి కాస్తా రామబంటుని చేసేస్తారాయన. నోటి దగ్గర కాస్త ఎత్తుగా అమర్చిన గంధపు ముద్ద వెంకన్నకి ఇట్టే వానర రూపాన్ని తెచ్చి పెట్టేస్తుంది. అవును మరి...గుండె చీల్చి రామదర్శనం చేయించినవాడు మారుతి..మరిక రామన్న త్వమేవాహం...త్వమేవాహం అనకుండా ఉంటాడా..?? అయిందా..గంధమూ పసుపూ అయ్యాక ఆఖరుగా కుంకుమ. నారాయణి "సర్వారుణ" అవగా లేనిది నారాయణుడికేనా తక్కువ..? ఆపాదమస్తకమూ హరిద్రాకుంకుమాంకితమైన స్వామి రూపం..."నారాయణ-నారాయణి"..!! చూసినవాడి బతుకు పావనం! జేకొట్టినవాడి జీవితం ధన్యం!!



    10, ఫిబ్రవరి 2014, సోమవారం

    అయ్యో చిన్నాన్నా..!

    మొత్తానికి మా తాతగారికీ నాయనమ్మకీ పెళ్లయిపోయింది కదా...తర్వాత జోగయ్యగారు పడ్డ పాట్లు ఆయనకే ఎరుక. పొద్దున్నే మొదటిసారి పొయ్యి రాజేసేటప్పుడు ఆ పొగకి కూతురి కళ్లు మండుతాయని ఆయన రోజూ వచ్చి పొయ్యి రాజేసి వెళ్లేవారుట. అలా బతికి ఉన్నంతకాలమూ కూతుర్ని కాచుకున్నాడు పాపం. అల్లుడు తన మీది కోపం కూతురి మీద చూపిస్తాడని బెంగో ఏమిటో గాని  "నారాయణా...నా కూతుర్ని బాగా చూసుకో బాబూ.." అని తాతగార్ని ప్రాధేయపడేవాడుట. ఏమైతేనేం అలా ఆ ఘటం వెళ్లిపోయింది. తాతగారికీ నాయనమ్మకీ ముచ్చటగా ముగ్గురు బిడ్డలు పుట్టుకొచ్చారు. నాన్నా..చిన్నాన్నా..అత్తా!! తాతగారికి ప్రభుత్వ నౌకరీ కూడా దొరికింది. స్కూల్లో సంగీతం మాస్టారిగా ఉద్యోగం..అదిగాక భుక్తి కోసం చెప్పుకునే సంగీతం ప్రైవేట్లూ ..యధాప్రకారం రాజులతో కలిసి వేటా..కుస్తీపట్లూ వగైరా..ఇలా వాళ్లకి రోజులు హాయిగానే గడిచిపోతూండేవి.
                                      తాతగారి స్కూలు హెడ్మాస్టారు వాళ్ల ఇంటి పక్కనే కాపురం ఉండేవారు. ఈయన రాత్రి తెల్లార్లూ వేటాడి వచ్చి ఆరుబయట మంచం వేసుకుని పడుకుని బారెడు పొద్దెక్కినా లేవకపోతే..పాపం ఆ హెడ్మాస్టారు ..తను స్కూలుకి బయల్దేరుతూ.."నారాయణా...స్కూలుకి టైమయిపోతోంది లేవయ్యా.."అంటూ వెయ్యిన్నొకటోసారి తాతగారికి   మేలుకొలుపు పాడేవారుట. అప్పుడు ఆయన లేచి, స్నానం, జపం, తపం చేసుకుని స్కూలుకి వెళ్లేవారు. అప్పట్లో స్కూళ్లన్నీ పొద్దున్న భోజనం వేళకల్లా అయిపోయేవి. (చిన్నప్పుడు మా స్కూలూ అంతే) అప్పుడాయన ఇంటికొచ్చి హాయిగా నాయనమ్మ వేడి వేడిగా వడ్డించిన భోజనం తిని..రాత్రి నిద్ర లేని కొరత తీర్చుకుంటూ ఎంచక్కా నిద్రపోయేవారు. మళ్లీ మధ్యాహ్నం స్కూలు వేళకల్లా లేచి, నాయనమ్మ సిద్ధంగా ఉంచిన ఓ డజను పళ్లు తిని, ఓ చెంబెడు పాలు తాగి స్కూలుకి వెళ్లేవారు. తాతగారికి కాఫీ అలవాటు ఎప్పుడూ లేదు. ఆయన ఎక్కువగా పాలే తాగేవారు. తర్వాతి రోజుల్లో మాత్రం ఎందుకో గాని ఉత్త పాలు తాగకుండా చాలా కొద్దిగా డికాక్షన్ వేసుకుని తెల్లగా ఉన్న కాఫీ ఒకే ఒక్కసారి తాగేవారు. కార్తీకమాసంలో సోమవారాలు ఉపవాసం ఉంటే, వృద్ధాప్యం వల్ల నీరసం వస్తుందని అమ్మ ఆయనకి మరోసారీ మరోసారీ బలవంతంగా కాఫీ ఇచ్చేది. దానికి ఆయన కోపగించుకుని..."ఉపవాసం ఉండి ఇన్నిసార్లు కాఫీలేమిటి...ఇది కార్తీక సోమవారం కాదు...కాఫీల సోమవారం" అంటూనే   కోడలి బలవంతానికి కట్టుబడి  తప్పనిసరిగా తాగేవారు. 
                                        సరే.. ఆ దంపతులకి ముగ్గురు బిడ్డలు పుట్టారని చెప్పాను కదా...ఓ సారి తాతగారు బజారులో ఎవరో కోయవాడు కనిపిస్తే కుతూహలం కొద్దీ జాతకం చెప్పమన్నారు.వాడు ఆయన మొహం చూస్తూనే "నీకు ఒక్కడే కొడుకు" అంటూ ప్రారంభించాడు. వెంటనే ఈయన, "నీ మొహం, నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు." అన్నారు. వాడు ఆ మాట విని ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి తర్వాత తల అడ్డంగా తిప్పుతూ "లేదు. నీకు ఒక్కడే కొడుకు" అని మళ్లీ అదేమాట ఖచ్చితంగా చెప్పాడు. వాడు రెండోసారి ఆ మాట చెప్పినా తాతగారికి కించిత్ కూడా అనుమానం రాలేదు. వాడు సరిగ్గా చెప్పడం లేదన్న విసుగే కలిగింది. దాంతో ఆయన "నువ్వు నాకేం చెప్పక్కర్లేదు" అంటూ విదిలించుకుని ఇంటికి వచ్చేశారు.  తర్వాత ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు మా చిన్నాన్న గురించి చెప్పాలి. 
                                 మా చిన్నాన్న నాన్న కంటే చాలా బలంగా ఉండేవాడు. నాన్నకీ చిన్నాన్నకీ వయసులో ఎంత తేడాయో గాని నాన్న చదువుకుంటూ ఉంటే మూడేళ్ల వయసులో ఉన్న చిన్నాన్న వచ్చి అన్న చేతిలో పుస్తకం లాక్కోవాలని చూసేవాడు. తమ్ముడికి అందకుండా నాన్న తన చెయ్యి పైకి ఎత్తి పట్టుకుంటే, నాన్న చేతిని బలంగా కిందకి వంచి మరీ పుస్తకం లాక్కునేవాడు.తమ్ముడి నించి విడిపించుకోవడం చేతకాక నాన్న మొర్రోమనేవారు.  అసలు భయమంటే ఏమిటో తెలియనట్టు ఉండే చిన్నాన్న గురించి ఆ వూరు వూరంతా ఎంతో అబ్బురంగా చెప్పుకునేవారు. చిన్న కొడుకు బలం, ధైర్యం గమనించిన తాతగారు బిడ్డకి దిష్టి తగులుతుందని బైటికి ఎక్కడికీ తీసికెళ్లేవారు కాదు. బిడ్డ గురించి బైట ఎక్కడా చెప్పేవారు కూడా కాదు. అయితే ఆ ఊళ్లోనే ఓ పెద్ద మీసాలాయన ఉండేవాడు. ఆయనకి తెగబారెడు మీసాలుండేవి. మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి మురిసిపోయే రోజులవి. ఈ మీసాలాయన మాత్రం అందరికీ భిన్నంగా తన మీసాల్ని గట్టిగా దువ్వుతూ..కళ్లెర్రజేసి పిల్లల్ని భయపెట్టేవాడు. ఆయన మీసాలు చూసి పిల్లలంతా జడిసిపోయి మొర్రోమని ఏడుపు లంకించుకునేవారు. అది ఆయనకి చాలా వినోదంగా ఉండేది. ఓ సారి ఎవరి పిల్లాడినో అలాగే ఏడిపించేసరికి ఆ తండ్రి కాస్త కోపంగా, "ఈ బక్క పిల్లల్ని జడిపించడం కాదు. చేతనైతే నారాయణ చిన్న కొడుకుని జడిపించు.అప్పుడు తెలుస్తుంది.." అన్నాడు. దాంతో అన్నాళ్లూ తాతగారు దాచిపెట్టిన విషయం ఆ మీసాలాయనకి తెలియనే తెలిసింది. ఆయన వెంటనే తాతగారిని పిలిపించుకుని, "ఏం నారాయణా..నీ చిన్నకొడుకు చాలా బలవంతుడు, ధైర్యవంతుడూనట కదా.." అంటూ ఆరా తీశాడు. ఆ మాటకే తాతగారు జడిసి..అబ్బెబ్బే అదేమీ కాదంటూ తప్పించుకోబోయారు. కాని అది ఇట్టే పసిగట్టిన ఆ పెద్దాయన "రేపు పొద్దున్నే నీ చిన్న కొడుకుని నా దగ్గరకు తీసుకురా" అంటూ ఆదేశించాడు.   ఊరంతటికీ పెద్దాయన. అంగబలం, అర్ధబలం ఉన్న మనిషి. దాంతో కాదనడానికి తాతగారికి ధైర్యం చాల్లేదు. దేవుడి మీద భారం వేసి మర్నాడు పొద్దున్నే చిన్నాన్నని ఆయన దగ్గరకి తీసికెళ్లారు. 
                                         ఆయన చిన్నాన్నని ఒక్క క్షణం పరకాయింపుగా చూసి, మీసాలు గట్టిగా దువ్వుతూ...కళ్లెర్రజేసి పెద్దగా హూంకరించాడు.  ఆ హూంకరింపుకి మా చిన్నాన్న భయపడకపోగా...ఒక్క క్షణం అలాగే దీర్ఘంగా చూసి తాతగారి చంకలోంచి ఆ మీసాలాయన మీదికి ఒక్క దూకు దూకి, ఆయన మీసాల్ని రెండు చేతులతోనూ గట్టిగా దొరకబుచ్చుకున్నాడు. అంతే...మా చిన్నాన్న చేతి పట్టుకి అంత పెద్దాయనా గిలగిల్లాడిపోయాడు. మూడేళ్ల పిల్లాడి చేతి పట్టు నించి తన మీసాల్ని విడిపించుకోవడం..ఎంత ప్రయత్నించినా  ఆయన వల్ల కాలేదు.నొప్పితోనూ..అవమానభారంతోనూ ఆయన కళ్లల్లో  నీళ్లు తిరిగాయి. కొడుకు చేసిన పనికి అప్పటికే ఖంగారు పడుతున్న తాతగారు అతి ప్రయత్నం మీద  బిడ్డని సముదాయించి ఆయన మీసాలు విడిపించారు. అంతే...ఆ పెద్దాయన మీసాలు సరి చేసుకుంటూ.. బిడ్డ వైపు ఎర్రగా చూశాడు. తాతగారు మరింకేమీ మాట్లాడకుండా ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చేశారు.  
                                           అంతే...మా చిన్నాన్న బలపరాక్రమాలకి అదే ఆఖరి రోజు. ఆ మీసాలాయన దగ్గర్నించి వచ్చేసిన క్షణం నించీ ఏ కారణమూ లేకుండానే...ఏ జబ్బూ చెయ్యకుండానే అలా అలా కృంగిపోయిన మా చిన్నాన్న సరిగ్గా వారం తిరిగేసరికల్లా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. "నాకు ఇద్దరు కొడుకులు" అంటూ కోయవాడికి గర్వంగా చెప్పుకున్న మా తాతగారికి ఒక్క కొడుకే మిగిలాడు. 
                                           మా చిన్నాన్న బతికి ఉంటే ఎలా ఉండేదో నేను కొన్ని కోట్ల సార్లు ఊహించుకున్నాను. బహుశా మిలిటరీలో చాలా పెద్ద ర్యాంకు లో ఉండి ఉండేవాడేమో అని ఆ ఊహకే ఎంతో పొంగిపోయాను. 
                    నాకే ఇలా ఉంటే మరి మా తాతగారికీ..నాయనమ్మకీ..నాన్నకీ ఎలా ఉండి ఉంటుంది? 
                  మా చిన్నాన్న స్మృతితో...ఈ రోజుకి సెలవు. 

    9, ఫిబ్రవరి 2014, ఆదివారం

    సావిత్రి వెడ్స్ నారాయణ

    మా నాయనమ్మ నిజంగా అలనాటి నటి ఎస్. వరలక్ష్మికి సాటి రాగల హీరోయిన్. మృదువుగానూ, కటువుగానూ కూడా సరిసమానమైన నటనా చాతుర్యం ప్రదర్శించే చాకచక్యం  ఎస్. వరలక్ష్మి సొంతం. మెత్తగానూ..గట్టిగానూ కూడా ఉండగలగటం మా నాయనమ్మ సొంతం. కొడుక్కి పెళ్లయ్యేదాకా ఆవిడ పూర్తిగా రాముడి అవతారంలో జీవించింది. ఆనక రావణాసురుడి అవతారాన్ని పూర్తిగా ఎత్తకపోయినా...ఆ అంశ కొంచెం తెచ్చుకుని అమ్మ దగ్గర ప్రదర్శించింది. సరే..ముందు అసలు ఆవిడకి తాతగారితో పెళ్లి ఎలా అయిందో చెప్పుకోవాలి కదా...
                       మా నాయనమ్మకి ముచ్చటగా మూడు పేర్లు. కన్నవారు ఆవిడకి పెట్టిన పేరు వెంకట రత్నం. దత్తు తీసుకున్న వెంకట జోగయ్యగారు ఆ పేరు మార్చేసి సుబ్బలక్ష్మి అని పెట్టుకున్నారు. మరి మూడో పేరు ఎలా వచ్చిందో అది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక తల్లిదండ్రీ చచ్చిపోయిన మా తాతగారిని  తెచ్చి దగ్గర పెట్టుకున్నారే గాని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశ్యం నాయనమ్మ తండ్రి జోగయ్యగారికి నూటికి నూరుపాళ్లూ లేనేలేదు. మరి ఆయన ఆ కాస్త అయినా ఎందుకు తల ఒగ్గారూ అంటే అది నాయనమ్మ కారణంగానే. ఈ జులపాల బావలో ఏం చూసిందో గాని ఆవిడ పెళ్లంటూ చేసుకుంటే నారాయణ బావనే చేసుకుంటానని తల్లిదండ్రులకి కరాఖండీగా చెప్పేసింది.  
                                   కూతురి మనసు నొప్పించలేక మేనల్లుణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఉద్ధరించడానికి నిశ్చయించుకున్నారే గాని జోగయ్య గారికి మా తాతగారు బాగుపడతారన్న నమ్మకం లేకపోయింది. అంచేత అచ్చం సినిమాలో లాగే  నాయనమ్మకి షరతులూ నియమాలూ విధించారు. బావతో ఆట్టే రాసుకు పూసుకు తిరక్కు...ఊరికే వాగకు వగైరా..వాటన్నిటినీ ఆవిడ కూడా  సినిమా హీరోయిన్ మల్లేనే తుంగలో తొక్కి పారేసి అదను దొరికినప్పుడల్లా బావ క్షేమసమాచారం కనిపెట్టుకోసాగింది.బావ భోజన ప్రియుడన్న విషయం తెలుసు కాబట్టి ఆయనగారికి నచ్చిన తినుబండారాలేవైనా ఉంటే రహస్యంగా కొంగులో మూట గట్టుకుని గుడికో బడికో తీసికెళ్లి అందించనూ అందించింది.   ఇలా రోజులు గడిచిపోతూ ఉండగానే జోగయ్యగారు మా తాతగారికి అంటకత్తెర వేయించెయ్యడం, ఆయన ఇంట్లోంచి పారిపోవడం జరిగాయి. దాంతో జోగయ్యగారు అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. "ఇంక ఆ వెధవకి పిల్లనిచ్చే మాటే లేదు ఫొపొ"మ్మన్నారు. పరిస్థితి అలా మలుపు తిరిగేసరికి మా నాయనమ్మ కూడా మరేమీ చెయ్యలేకపోయింది. ఎంతైనా ఆ పాతతరం సినిమా హీరోయిన్లు కూడా కాస్త నెమ్మదస్తులే కదా...ఈ తరం కుర్రకారంత ఫాస్ట్ కాదు. అంచేత పాపం ఆవిడ కూడా భట్టుమూర్తి నాయికలా బావురుమనడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది.  
                                     అక్కడ తాతగారు ఏం చేశారో..ఎలా ఉన్నారో గాని..ఇక్కడ జోగయ్య గారు మాత్రం మా నాయనమ్మకి జెట్ స్పీడులో సంబంధాలు చూసేశారు. కాని ఏం లాభం...ఒక్కటీ కుదరలేదు. వచ్చిన ప్రతీ సంబంధమూ ఏదో కారణంతో వెనక్కి పోవడమే గాని ముందుకొచ్చింది ఒక్కటీ లేకపోయింది. దాంతో జోగయ్యగారి ఇల్లాలు, అంటే మా నాయనమ్మ పెంపుడు తల్లి కూడా "పోనీలెండి..పిల్ల కూడా ఇష్టపడుతోంది, మన నారాయణకే ఇచ్చి చేద్దాం" అని మొగుడికి చెప్పి చూసింది. అయినా జోగయ్య గారు ససేమిరా అన్నారు. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. నాయనమ్మకి ఏ సంబంధమూ కుదరలేదు. ఆవిడ పొడుగు మనిషి. వయసుతో బాటు పొడుగు ఎదిగేస్తుంటే జోగయ్యగారికి కొత్త కంగారు పుట్టుకొచ్చింది. మరో పక్క మా తాతగారు ప్రభుత్వ పాఠశాలలో సంగీతం మాస్టారిగా ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చదువు రాకపోతే పోయింది గాని ఆయన  చాలా బాగా పాడేవారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు  కూడా. దాంతో  చుట్టాలంతా కలిసి.."వాడికీ దానికే రాసి పెట్టాడేమో భగవంతుడు. పిల్ల అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది గాని అంతా నీ చేతిలో ఉందిటయ్యా? పిల్ల ఎటూ వాణ్ణే చేసుకుంటానని ఏడుస్తోంది. అంచేత మారు మాట్లాడక దాన్ని నారాయణకిచ్చి చెయ్యి. పెళ్లయితే వాడే బాగుపడతాడు.మనిషి చెడ్డవాడేమీ కాదు కదా... " అంటూ నచ్చజెప్పారు. ఇలా పరిస్థితి తన చెయ్యి దాటిపోతూండేసరికి జోగయ్య గారి పట్టు నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. మరో పక్క మా తాతగారు ఎంతకీ దిగి రాకపోయేసరికి ఎంతైనా ఆడపిల్లనిచ్చుకునే తనే తగ్గి ఉండాలన్న సత్యమూ ఆయనకి బోధపడింది. దాంతో జోగయ్యగారు పూర్తిగా డౌన్ అయిపోయి...అల్లుడా మేనల్లుడా...అంటూ మా తాతగారి కోసం పరిగెత్తారు. 
                                                   మొత్తానికి అలా మా తాతగారు-నాయనమ్మల పెళ్లి బాజాలు మోగాయి. ఇక మా నాయనమ్మకి మొత్తం మూడు పేర్లుండేవని చెప్పాను కదా...కన్నవాళ్లు వెంకట రత్నమనీ జోగయ్యగారు సుబ్బ లక్ష్మి అనీ పెట్టుకున్నారని చెప్పాను. మరి మా తాతగారికి మావగారి మీద కోపమో నిజంగా సుబ్బలక్ష్మి అన్న పేరు నచ్చలేదో గాని ఆయన కాబోయే పెళ్లానికి "సావిత్రి" అన్న పేరు స్వయంగా పెట్టుకుని మరీ పెళ్లాడారు. (అప్పటికి మహానటి సావిత్రి అసలు సినిమా రంగానికే రాలేదు. అంచేత ఇది ఆవిడ పేరు కాదు. బహుశా తాతగారికి సావిత్రీ సత్యవంతుల కధ నచ్చి ఉంటుంది..:) ) 
                మా నాయనమ్మ తాతగార్ల పెళ్లి వరకూ అయితే కధ సమాప్తం. అయితే మా తాతగారికి సంబంధించిన విశేషాలు బోలెడన్ని ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందామా మరి..? ఇవేల్టికి సెలవు...

    8, ఫిబ్రవరి 2014, శనివారం

    మా హిప్పీ తాతగారు

                             మా తాతగారు (పితామహులు) సూర్యనారాయణగారు. తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర కోటనందూరు స్వస్థలం. అక్కడ ఓ చిన్న ఇల్లు ఉండేది. నాన్న గాని, తాతగారు గాని నన్ను అక్కడికి ఎప్పుడూ  తీసికెళ్లలేదు. ఏమిటో...చేతిలో ఉన్నంతసేపూ విలువ తెలీదంటారే..అలా నేనూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడా ఏ ఆస్తులూ లేవు. సరే అదలా ఉంచితే, రమణగారు తన కోతి కొమ్మచ్చిలో చెప్పినట్టు...ఇప్పుడు సందర్భవశాత్తూ మా అమ్మా నాన్నల కధ లోంచి తాతామామ్మల లవ్ స్టోరీ లోకి ముందు దూకడం అవశ్యం.   
                                                 మా నాయనమ్మ బొట్టువారి ఆడబడుచు. అక్కడ ఎంతమంది మధ్యన పుట్టిందో గాని, పిల్లలు లేని నడిమింటి వెంకట జోగయ్యగారికి దత్తు వెళ్లింది. దత్తు అంటే ఆయన చేరదీసి పెంచుకున్నారు.. అంతే. ఆయనకి ఎటూ పిల్లలు లేరు కాబట్టి ఉన్న  ఇత్తడి గంగాళాలూ...బిందెలూ కేరేజీలూ (అన్నీ ఇత్తడివే...పుత్తడి కాదు) వగైరాలన్నిటికీ ఆవిడొక్కతే వారసురాలైంది.తాతగారు ఆవిడకి బావ. మరి బంధుత్వం ఏ రకమైనదో నాకు వివరం తెలీదు. అంటే ఆవిడ కన్నవారి వైపు బంధువా లేక పెంచుకున్నవారికి చుట్టమా అన్నది. ఏమైతేనేం...బావామరదళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. మామూలుగా అయితే హాయిగా పెళ్లి చేసెయ్యొచ్చు. కాని తాతగారి స్థితిగతులూ..ఆయన వ్యవహారాలూ జోగయ్యగారికి అడ్డొచ్చాయి. తాతగారు మొత్తం ఆరుగురున్న కుటుంబంలో రెండో సంతానం. ఆయనకి ఒక అక్క, నలుగురు తమ్ముళ్లు. కూతురికి పెళ్లి చేశాక మా తాతగారి తండ్రి ముక్కామల సరవయ్య గారు స్వర్గస్థులయ్యారు.మొగుడు చచ్చిపోతే ఆడదానికి పదోరోజు దాకా పసుపూ కుంకుమా తియ్యరు కదా..మా తాతగారి తల్లికి పసుపు కుంకుమలతోనే పోవాలన్నది ఒక ప్రగాఢవాంఛ. అంచేత మొగుడు పోయిన మూడో రోజు రాత్రి  ఆవిడ ఎంచక్కా వెళ్లి నూతిలో దూకేసింది. దాంతో  తాతగారు ఒకేసారి తల్లీదండ్రీ లేని అనాధ అయిపోయారు. ఆస్తిపాస్తులా పూజ్యం. చదువా సున్నా..వెనకాల చూస్తే నలుగురు తమ్ముళ్లు. అయినా పాపం జోగయ్యగారు వెనకాడలేదు. మేనల్లుణ్ణి తెచ్చి దగ్గర పెట్టుకుని చదివిద్దామని చూశారు. కాస్త పొట్టలోకి నాలుగక్షరమ్ముక్కలు వెళితే వాడి కాళ్లూ వీడి కాళ్లూ పట్టుకుని ఏదో ఉద్యోగం వేయించి అప్పుడు  పిల్లనిచ్చి పెళ్లి చెయ్యాలన్నది ఆయన సదాలోచన. కాని ఈయన లొంగితేనా...??  మా తాతగార్ని సంగీత సరస్వతి చల్లగా చూసింది గాని చదువులమ్మ మాత్రం వెక్కిరించి వదిలేసింది. మళ్లీ ఆయన నిరంతర పాఠకుడు. ఎప్పుడు చూసినా ఏదొ ఒకటి చదువుతూనే ఉండేవారు. తను చదివినదాన్ని విశ్లేషాత్మకంగా నాకు చెబుతూనే ఉండేవారు. మరి అలాంటి మనిషికి చదువు ఎలా అబ్బలేదో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.అయితే ఆయనకి చదువు అబ్బకపోవడానికి గల కారణాల్ని చూస్తే మనకి విషయం ఇట్టే బోధపడిపోతుంది.  
                                    ఈ కాలపు కుర్రాళ్లలో కొందరు తెలివితేటలున్నప్పటికీ సినిమాలూ, షికార్లు మరిగి చదువుని ఎలా అశ్రద్ధ చేస్తున్నారో అప్పట్లో మా తాతగారు కూడా అలాగే చేశారు. ఆయన స్నేహితుల్లో క్షత్రియులే ఎక్కువ. నాకు రాజులంటే  (కేవలం ఒకప్పుడు రాజ్యాలేలిన రాజులే కాదు క్షత్రియ కుల సంజాతులు) అపరిమితమైన అభిమానం కలగడానికి పూర్తి కారణం మా తాతగారే. ఆయన రాజులతోనే ఎక్కువగా స్నేహం చేసేవారు. వాళ్లతో కలిసి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. మరి చేత్తో ఏ ఆయుధాలు పట్టుకునేవారో గాని ఆ రాజుల కుర్రవాళ్లూ, మా తాతగారూ కలిసి రాత్రివేళల్లో వేటకి వెళ్లిపోయేవారు. రాత్రంతా వేటాడటం..తెల్లారి ఇంటికి వచ్చి పగటిపూట పనులన్నీ ఎగ్గొట్టి హాయిగా నిద్దరోడం.     
                                       అక్కడితో అయిందా..."భువనవిజయం" లో పెద్దన కాబోలు మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని నిద్రపోయి లేచి సంపంగి వాసన నూనె రాసి తల  దువ్వుకుని సన్నజాజుల మాలతో అలంకరించుకుని బైటకి వస్తాడు...అలా మా తాతగారు  తన  శిరోజాల్ని తన మరదలి (మా నాయనమ్మ) కంటే శ్రద్ధగా పెంచుకునేవారు..దాంతో బాటే మీసాలూ.  మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు నిజంగానే మింగ మెతుకు లేని పరిస్థితిలో ఆ శిరోజాలన్నిటికీ సంపంగి నూనె రాసి శ్రద్ధగా చూసుకుంటూ ముడి వేసుకునేవారు. దాంతో జోగయ్యగారి కోపం నసాళానికంటింది. పొట్ట చీలిస్తే అక్షరమ్ముక్క లేకపోగా ఈ  హిప్పీ  వేషాలన్నీ ఆయనకి వెర్రెక్కించాయి. ఓ రోజు ఇద్దరు పనివాళ్లని పిలిచి ఒరేయ్...వాణ్ణి కదలకుండా పట్టుకోండిరా అని మేనల్లుణ్ణి బాహుబంధితుణ్ణి చేసి మంగలిని పిలిచి శుభ్రంగా అంటకత్తెర వేయించేసి సగం కోపం తీర్చుకున్నారు. అంతే...మంగలి పని పూర్తయిన ఉత్తరక్షణంలో మా తాతగారు అక్కడ లేరు...ఆ ఇంట్లోనూ లేరు. నెలల తరబడి తను ముద్దుగా పెంచుకున్న జుత్తునంతటినీ ఒక్క కత్తెర వేయించేసిన మేనమామని పైకి ఏమీ అనలేక...కోపం, ఉక్రోషం ఆపుకోలేక మరుక్షణంలో తన  ఊరికి  పారిపోయారు...:)   
              మరి ఆ తర్వాత ఏమైందో ఇంక రేపే చెప్పుకుందాం...ఓకే...ఇంక ఈ రోజుకు సెలవు. 
                                                  ఇక్కడ  కొసమెరుపేమంటే తన జుత్తు కత్తిరింపించేసిన మేనమామ...(తర్వాత మావగారు) అంటే మా తాతగారికి తొంభయ్యేళ్ల వయసులో కూడా కోపం పోలేదు. "ఆ ముండాకొడుకు నా జుత్తంతా కత్తిరింపించేశాడు.." అంటూ ఆయనే నాకు ఇవన్నీ చెప్పుకొచ్చారు. మొగుడు తన తండ్రిని తిడుతూ ఉంటే మా నాయనమ్మ ఏమీ అనేది కాదు సరికదా...కిసుక్కున నవ్వేది...అంటున్నది లవరు కదా మరి...:)     ఓకే బై...

    7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

    బాల సరస్వతి

    మా తాతగారు (మాతామహులు)  వెంకట నరసింహం పంతులుగారు. అనకాపల్లి దగ్గర చోడవరంలో అప్పట్లో పేరెన్నిక గన్న వకీలు.గాంధేయవాది. తను ఖద్దరు కట్టడమే గాక, కూతుళ్లకి సైతం ఖద్దరు బట్టలే కొన్న పెద్దమనిషి. (అందుకే గదా అమ్మ ఖద్దరు పరికిణీ..వోణీ వేసుకుని నాన్నకి తొలి దర్శనం ఇచ్చింది. మా అమ్మకి కొన్ని కొన్ని విషయాల మీద ఎంత తీపి జ్ఞాపకపు పట్టు అంటే..ఆ రోజు తను కట్టుకున్న బట్టల రంగునీ డిజైన్ నీ డెబ్భయ్యేళ్ల వయసులో కూడా ఖచ్చితంగా వర్ణించి చెప్పేది. నేనే మర్చిపోయాను...) ఆయనకి సరిగ్గా వాటాలేసుకున్నట్టూ నలుగురు కూతుళ్లూ..నలుగురు కొడుకులూ. పెద్దదొడ్డ కృష్ణవేణి, చిన్నదొడ్డ కామేశ్వరి,పెద్దమావయ్య సుబ్రహ్మణ్యం, అమ్మ సరస్వతి,చిట్టిపిన్ని, బుచ్చి మావయ్య, శివరాం మావయ్య, సిద్ధాంతి మావయ్య. ఇదీ వరస. చిట్టిపిన్నికీ బుచ్చి మావయ్యకీ సొంత పేర్లున్నాయన్న సంగతి ఎవరికీ ఎప్పుడూ గుర్తు రాదు. బంధువులతో బాటు ఊళ్లోవాళ్లు కూడా కొందరు చిట్టెప్పా...బుచ్చీ అనే పిలిచేవారు వాళ్లని.
                                                        పెద్ద దొడ్డకి వ్యక్తురాలవకుండానే పెళ్లి చేసేశారు. అంత హడావుడిగానూ మా పెద్ద పెదనాన్నగారు పైకెళ్లిపోయారు.  తొమ్మిది-పది సంవత్సరాల వయసులో..అసలు పెళ్లి సంసారం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉన్న పెద్దదొడ్డకి వెంటనే గాజులూ..బొట్టూ తీసేశారు. మా తాతగారు వీధి చావిడి మీద కూర్చుని క్లయింట్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా గాజుల మలారం వస్తే ఆ అలికిడికి దొడ్డ లోపలి నించి పరిగెత్తుకుంటూ వచ్చి రంగు రంగుల గాజులు చూసి మురిసిపోతూ.."ఇవి కావాలి నాన్నగారూ" అంటూ అడిగేదిట. మా తాతగారు కళ్ల నీళ్లు పెట్టుకుని దొడ్డని సముదాయించి మలారాన్ని అవతలికి పంపేసేవారుట. ఓ సారి తాతగారు లేని సమయంలో ఓ గాజుల మలారం పచ్చని పసిమి ఛాయలో మెరిసిపోతున్న దొడ్డని చూసి ముచ్చటపడుతూ తనే స్వయంగా గాజులు తీసి పిల్ల చేతికి తొడిగాట్ట. ఈ లోపున మా అమ్మమ్మ లోపలినించి వచ్చి చూసి ఏడుస్తూ "దీనికి ఆ భాగ్యం లేదు నాయనా.." అని గాజులు తీసెయ్యమందిట. విషయం విని తెల్లబోయిన మలారం తప్పనిసరిగా గాజులు తీసేసి తను కూడా ఏడుస్తూ వెళ్లిపోయాట్ట.
                                                     ఇవీ ఆ రోజులు. ఇంతకీ పెద్దదొడ్డకి పెళ్లి ఎక్కడ చేశారనుకుంటున్నారు...అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం బాల్య వివాహాల్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఎవరైనా చట్టవ్యతిరేకంగా బాల్య వివాహం చెయ్యబోతే పోలీసులు పట్టుకునేవారు.  అంచేత ఆ చట్టం అమలవని యానాం కి తీసికెళ్లి అక్కడ పెళ్లి చేసేశారుట. అదీ సంగతి. గాజులూ బొట్టూ అంటే తీసేశారు గాని పువ్వుల పిచ్చి ఉన్న దొడ్డని పువ్వులు పెట్టుకోకుండా ఆపలేకపోయారు. అక్కడ కన్న పేగు మెలిపడిందేమో పువ్వులు పెట్టుకోనిచ్చారు.రంగు రంగుల చీరలూ కట్టుకోనిచ్చారు.  దొడ్డ మా ఇంటికి వస్తే అమ్మ ప్రత్యేకం మా దొడ్లో పూసిన సన్నజాజులూ, మల్లెపూలూ మాల కట్టి "పెద్దక్కయ్యా...పెట్టుకోవే" అంటూ ప్రేమగా ఇచ్చేది.
                             ఇంక చిన్నదొడ్డకి పెళ్లి ఎప్పుడు చేశారో ఎలా చేశారో నాకు తెలీదు గాని మా అక్క చిన్నపిల్లగా ఉండగా మా చిన్న పెదనాన్నగారు జబ్బు చేసి పోయారు. ఎన్నాళ్లయినా తండ్రిని మర్చిపోకుండా "మా నాన్నని మీరు ఆస్పత్రిలో వదిలేశారు. నాన్న కావాలో" అని ఏడుస్తున్న మా అక్కని సముదాయించలేక మా పెద్ద దొడ్డ ఓ  రోజు దాన్ని విశాఖపట్నం కేజీహెచ్ కి తీసుకుపోయిందిట. అక్కడ మంచం మంచమూ తిప్పి చూపించి ఆఖర్ని దేవుడి ఫోటో దగ్గరకి తీసికెళ్లి మీ నాన్న ఇదిగో ఈ దేవుడి దగ్గరకి వెళ్లిపోయాడు అని చెబితే ఇంక అప్పుడు చేసేదేమీ లేక ఊరుకుందిట అక్క.
                              ఇంక మూడోది మా అమ్మ.కుమారసంభవంలో బాల పార్వతిలా హాయిగా ఆటలాడుకుంటూ బాల్యాన్ని నిశ్చింతగా గడిపిన మనిషి. పెద్దదొడ్డలాగే అమ్మది కూడా పచ్చని పసిమి ఛాయ. మా అమ్మ నాకంటే అందంగా ఉండేది...(నేను మా నాన్న పోలిక కదా...నేనూ మా నాన్నా నల్ల బంగారాలం) పెద్దకూతురు బాల వితంతువు అయినప్పటికీ మూడో కూతురు పెళ్లి కాకుండానే వ్యక్తురాలయ్యేసరికి అమ్మమ్మ ఏడుస్తూ కూచుందిట. గాంధేయానికీ ధర్మానికీ పోయి మొగుడు  రెండు చేతులా విచ్చరూపాయలు సంపాదించుకురాకపోగా మూడోకూతురు పెళ్లి కాకుండానే చాపెక్కడం ఆవిడకి గుండెలమీద మరో పెద్ద బండరాయి అయింది. అయితే అప్పుడు బంధువులే ఆవిణ్ణి ఓదార్చారుట. "అన్నీ మన చేతుల్లో ఉన్నాయిటే అమ్మన్నా..(అమ్మమ్మని అమ్మన్నా అనేవారు. మా నాయనమ్మ అమ్మడు) మరేం గాభరా పడకు. వెంటనే సంబంధం చూసి పెళ్లి చేసేద్దాంలే.." అన్నారుట. అదిగో సరిగ్గా అప్పుడు...మీసాల బావా...అమ్మడూ...వాళ్ల ఒక్కగానొక్క బిడ్డ ప్రకాశిగాడూ అందరికీ గుర్తొచ్చేశారు.
                              మరప్పుడు ఏం జరిగిందో రేపు చెప్పుకుందామేం...ఓకే..సెలవు మరి.