16, మార్చి 2014, ఆదివారం

ఇదీ మా లలితా పీఠం

                           నిన్న పౌర్ణమి. మామూలుగా అయితే పట్టాభిరెడ్డి తోటలో కొలువుదీరి ఉన్న వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళతాను. కాని ఈ సారి  మాత్రం కించిత్కార్యార్ధం అక్కయ్యపాలెంలో ఉన్న లలితా పీఠానికి వెళ్లాను. తెల్లవారుజాము ఐదుంపావుకి నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి మధ్యలోంచి దూసుకుపోతున్న ఆటోలో లలితా సహస్రం వల్లె వేసుకుంటూ నేనొక్కత్తినే. దట్టంగా ఉన్న చీకట్లలోకి అప్పుడప్పుడే కాంతి కిరణాలు చొచ్చుకొస్తున్నాయి.... నిరాశతో మూసుకుపోయిన హృదయకవాటాల్ని తెరచుకుని ఆశాకిరణాలు దూసుకొస్తున్నట్టు. ఏమైనా తెల్లారుజాము ప్రయాణాలు బావుంటాయి...ఒంటరిగా అయినా సరే..నిజానికి ఒంటరిగా అయితేనే బావుంటాయేమో..గుంపులో బతకాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉన్నా, మన మనసుని మనకి తగినట్టూ నింపుకుని, ట్యూన్ చేసుకోవాలంటే ఇలాంటి ఒంటరితనం కూడా అప్పుడప్పుడూ అవసరమే.
                      సరే...అక్కయ్యపాలెం లలితా పీఠం విశాఖపట్నంలో చాలా పేరుకెక్కిన గుడి. కాస్త గ్రాంధికంగా ఉండేవాళ్లు లలితా పీఠం అనీ..జనసామాన్యం లలిత గుడి అనీ అంటూ ఉంటారు. దాదాపు శతాబ్దం కిందటి పీఠమిది. అమ్మవారి విగ్రహం ఎత్తుగా ఉన్న పీఠం మీద ఉంటుంది. తల్లి కాస్త పొట్టిది. (పొట్టిది కాబట్టే గట్టిది..:) ) ఆవరణలో పీఠం వ్యవస్థాపక   స్వాముల విగ్రహాలతో బాటు, మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, లలితా సహస్రాన్ని పరస్పర సంవాదరూపంలో వెలికి తెచ్చిన హయగ్రీవాగస్త్యుల విగ్రహాలు విడి విడి తిన్నెల మీద ఉంటాయి. చిత్రమేమిటంటే దక్షిణామూర్తి వగైరా విగ్రహాలకు కట్టిన బుల్లి బుల్లి ప్రాకారాల కంటే స్వాములిద్దరి గుళ్లూ పెద్దవి. అవి దాటి వెళితే జగన్నాధ, సుభద్ర, బలభద్రులకో గుడి, దాని కెదురుగా అశ్వత్థ వృక్షం, పక్కనే పద్ధెనిమిది మెట్ల పంక్తికి పైన కొలువు దీరిన అయ్యప్ప దర్శనమిస్తారు. ఆ వెనుక నవగ్రహ మండపం. ఇది కాస్త పెద్దదే. నవగ్రహాలకు పూజలు కూడా ఇక్కడ బాగా చేస్తారు.
                               అయిందా...ఇక చెప్పుకోవాల్సిన మాటేమిటంటే...త్రిమతాచార్యుల్లో ప్రధముడూ, అద్వైత మత ప్రవక్తా, గొప్ప కవీ సాక్షాత్తూ శైవాంశ సంభూతుడూ అయిన శంకర భగవత్పాదులది..ఓ చిన్న విగ్రహం..ఓ బుల్లి ప్రాకారంలో  నవగ్రహ మండపానికి ముందు ఉంటుంది. గుళ్లో కొలువుదీరిన తల్లి దివ్య సౌందర్యాన్ని అనితరసాధ్యంగా వర్ణించి...అందాల కడలిని కళ్ల ముందు ప్రవహింపజేసిన ఆది శంకరులకు దక్కింది ఆ పాటి గౌరవమే..!!
                           సరే మళ్లీ ఓ రెండడుగులు వెనక్కి వస్తే అక్కడ "మణిద్వీపం" ఉంటుంది. ఇది మొదట్లో లేదు. ఒకానొకప్పుడు సువిశాలమైన ప్రాంగణాలతో "దేవుడు ప్రకృతిలోనే ఉన్నాడ"న్నట్టు పరిఢవిల్లిన ఆలయాల ఆవరణలన్నిటినీ దరిమిలా ఏవేవో గుళ్లతో నింపేసి "టెంపుల్ కాంప్లెక్స్"లుగా మార్చేస్తున్న ఆధునిక ఆధ్యాత్మికతకు లలితాపీఠం మినహాయింపేమీ కాదు.  దాదాపు దశాబ్దం కిందట కట్టిన ఈ మణిద్వీపంలో సరస్వతి, దుర్గ, ఈశ్వరుడు, మహిషాసుర మర్దిని, వారాహి, ప్రత్యంగిర (ఈ ప్రత్యంగిరాదేవి విగ్రహం చూడటానికే ఎంత భయంకరంగా ఉంటుందో...) రాజరాజేశ్వరీ విగ్రహాలతో బాటు మండపం మధ్యభాగంలో "లలితాకామేశ్వరులు" కొలువై ఉంటారు. మధ్యలో ఈ లలితాకామేశ్వరులు ఉండగా చుట్టూ  ఎత్తుగా కట్టిన వేదికల మీద మిగిలిన విగ్రహాలన్నీ ఉంటాయి.
                                              ఈ మణిద్వీపం నిర్మాణదశలో ఉండగా దాని గురించిన ప్రకటనలు విని నేను చాలా ఆశపడ్డాను. అమృత సముద్రమధ్యంలో ఉండే మణిద్వీపాన్ని వాస్తవంగా నేలకు దింపడమనేది పూర్తిగా దుస్సాధ్యమన్న మాట తెలిసినా, కనీసం మణిద్వీపానికి దగ్గర్లో ఉండే ఒక చక్కని నిర్మాణాన్ని వాస్తవంగా చూడగలుగుతాం కదా అని ఆనందించాను. ఇప్పటిదాకా కేవలం ఊహల్లో మాత్రమే దర్శించుకుంటున్న అమ్మ నివాసాన్ని ఇక మీదట లలితాపీఠంలో హాయిగా చూస్తూ లోపలికి ఎంటరైపోవచ్చు కూడా కదా అని దురాశే పడ్డాను.  కాని మధ్యలో లలితాకామేశ్వరుల విగ్రహాలూ...చుట్టూ సగం సగం కట్టిన వేదికలూ (కొన్ని వేదికలకు సరైన ప్లాస్టింగ్ కూడా లేదు) ఆయా విగ్రహాలకు ఏదో చేశామంటే చేశామన్నట్టున్న అలంకరణలూ...ఇవన్నీ చూశాక అసలు అటువైపు పోబుద్ధే పుట్టడం లేదు.
                                  మణిద్వీపం పక్కనించి వెళితే అమ్మవారి గర్భగుడి. ఇదంతా  ఒక పెద్ద హాలు. మధ్యలో గర్భాలయం ఉండగా, చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేసేందుకు గాను ఖాళీ జాగా ఉంటుంది. శుక్రవారాల్లోనూ, పౌర్ణమి నాడూ ఓ చిన్న పెన్సిలు ముక్క పుచ్చుకుని, ఆలయం వాళ్లిచ్చే 108 అంకెలున్న కాగితంలో  టిక్కులు పెట్టేసుకుంటూ పరిగెడుతున్నట్టే అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసే భక్తులు బోలెడంతమంది కనిపిస్తారు. గంట తొమ్మిదైతే చాలు ఈ ప్రదక్షిణల్ని ఆపెయ్యాలి.
                           గర్భాలయంలో కొలువుదీరి ఉన్న లలితా త్రిపురసుందరి దర్శనం చేసుకుని అలా ముందుకు వెళితే అక్కడ మరో ఆలయం ఉంటుంది. అదో పెద్ద హాలు. అక్కడ వరుసగా బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకన్న, సీతారామచంద్రమూర్తి, స్వామికి ఎదురుగా హనుమన్న, రాముడికి పక్కనే సాయిబాబా, ఆ పక్కన అన్నిటికంటే పెద్ద వేదిక మీద గో,గోపికా పరివేష్టితులై ఉన్న  రాధాకృష్ణులు. వీటిలో బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే శిలలో మలిచినది. వెంకన్న ఒక పెద్ద ఫోటోలో మాత్రమే దర్శనమిస్తాడు. . మిగతావన్నీ పాలరాతి విగ్రహాలు. మాంఛి కళ ఉట్టిపడుతూ చాలా బావుంటాయి. ముఖ్యంగా  పచ్చని పచ్చిక బయలు మీద, చుట్టూ ఆవులూ, దూడలూ, నెమళ్లూ, లేళ్లూ తదితరాలతో,కడవలు నెత్తికెత్తుకుని వొయ్యారంగా ఉన్న గోపికలతో కొలువుదీరి ఉన్న రాధాకృష్ణుల వేదిక బృందావనాన్నే తలపిస్తుంది.
                  లలితా పీఠానికి వెలుపల బోలెడంతమంది పువ్వులవాళ్లుంటారు. గులాబీలూ, చామంతులతో బాటు ఎర్రని మందారపువ్వులు కూడా అమ్ముతారు. ఇక్కడి పువ్వులు బావుంటాయి కూడా. కాని, ఎంత డబ్బు పోసి పువ్వులు కొన్నా అమ్మవారి గర్భాలయం ఇవతల వేలాడదీసిన ఓ ప్లాస్టిక్ కవర్లో వాటిని పడెయ్యడమే. మనం అపురూపంగా పట్టికెళ్లి అక్కడున్న పళ్లెంలో పెట్టినా పూజారి గారు తీసి కవర్లోకి ఒక్క గిరాటు కొడతారు. పసుపు, కుంకుమ వగైరాలకూ అదే గతి. మరి నలిగిపోయిన తర్వాత గాని ఆ పువ్వులు పూజకి పనికిరావేమో...:( 
                   ఏమిటో...ఆలయాలు ఆలయాలంటూ కలవరించడమే గాని, తీరా వెళితే అక్కడ మనసు కోరుకున్న ప్రశాంతత దొరకదు. అయినప్పటికీ లలితా పీఠంలో నాకు నచ్చేది ఏమిటంటే అక్కడికి వెళ్లి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది...తిరుపతిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నా వెంకన్న మూలవిగ్రహాన్ని చూసి ఇవతలికొచ్చాక "ఇంక మనకేం భయం" అనిపించినట్టు. బహుశా ఇదంతా ఆయా ఆలయాల నిర్మాణక్రమంలో అక్కడ నెలకొల్పిన యంత్రాల మహిమ అయి ఉంటుంది. దాదాపు శతాబ్దం కిందట లలితా పీఠాన్ని నెలకొల్పుతున్నప్పుడు శ్రీచక్రాన్ని భూస్థాపితం చేసి ఉంటారు కదా...అక్కడ మన మనసును తాకేది అదే. అక్కడి గాలిలో సుళ్లు తిరుగుతూ అణువణువునా ఆవరించుకుని ఉన్న శ్రీచక్రపు మహిమ.. పవిత్రత..అమ్మ కరుణతో కలగలిసి మనసును నెమ్మదింపజేస్తాయి. 
                                     అందుకే వెనక మిట్టూరోడి కతలకు తన మాట రాస్తూ బాపు.."దేవుడు అంతటా ఉన్నాడని తెలిసినా అప్పుడప్పుడూ అన్నారమో భద్రాద్రో తిరుపతో వెళ్లి ఓ దండం పెట్టి వస్తూ ఉంటాం కదా" అన్నారు. అలాంటిదే మా లలితా పీఠమూను. నిన్న అక్కడ కలిసిన ఒకావిడ పీఠం గురించి మాట్లాడుతూ..."ఇది చాలా మహిమ గల పీఠమండీ...దేవుడి పుస్తకంలో ఉన్న గొప్ప గొప్ప పీఠాల జాబితాలో దీని పేరూ ఉందిట" అన్నారు. "దేవుడి పుస్తకమా..అదెక్కడుంటుంది" వెంటనే ఆత్రుతగా అడిగేశాను నేను...లలితా పీఠం నించి సరాసరి అక్కడికే వెళ్లి ఆ పుస్తకం కొనేసుకోవడానికి నా పర్సులో తగినంత డబ్బు ఉందా లేదా అని మనసులో లెక్కలు కట్టేసుకుంటూ..:) "పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గరుంటుందిట. వాళ్లే దాన్ని చూడగలరుట." అన్నారావిడ, నా ఆత్రుతని పట్టించుకోకుండా. హ్మ్మ్మ్ అని ఓక్క నిట్టూర్పు వదిలేశాను. పోన్లే ఏమైతేనేం...దేవుడి పుస్తకమనేది ఒహటుంది గదా...అందులో మా లలితా పీఠం పేరు ఉంది గదా...అక్కడికి నేను ఎప్పుడంటే అప్పుడు హాయిగా ఒక్క పాతిక రూపాయల ఖర్చుతో వెళ్లి రాగలను గదా...అది చాలు నాకు. 
న జానామి దానం న చ ధ్యానయోగం 
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం
న జానామి పూజాం న చ న్యాసయోగం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ 
                                  నాకు దానం చెయ్యడం తెలియదు. ధ్యానం రాదు. మంత్రతంత్రాలూ, స్తోత్రపాఠాలూ రావు. పూజాపునస్కారాలూ, అంగన్యాసకరన్యాసాదులూ తెలియవు. నాకున్న ఏకైక దిక్కల్లా నువ్వే. తల్లీ భవానీ...నువ్వొక్కత్తివే నాకు గతి. ఇదే నా శరణాగతి..!! 

12, మార్చి 2014, బుధవారం

నేనూ-జగన్నాధుడూ..

సంసార సాగరంలో నిండా మునిగిపోయి ఉన్నాను. 

           వెనకటికి ఎవరో సరిగ్గా గుర్తు లేదు గాని..(బహుశా నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారేమో) పూరీలో దారువిగ్రహ రూపంలో అవతరించిన జగన్నాధస్వామి మీద ఇలా శ్లోకం చెప్పారట...
 ఏకా భార్యా ప్రకృతిరచలా  చంచలా సా ద్వితీయా 
 పుత్రోనంగస్త్రిభువనచరీ మన్మధో దుర్నివారః 
  శేషశ్శయ్యా ప్యుదధిశయనం వాహనం పన్నగారిః 
 స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారీ...
                 విష్ణుమూర్తికి ఒకరు కాదు ఇద్దరు భార్యలు. హాయిగా ఇద్దరితోనూ ముచ్చట్లాడుకుంటూ ఖులాసాగా ఉందామంటే మాత్రం  "ఏకా భార్యా ప్రకృతిరచలా.." మొదటి భార్య భూదేవి అచల. పెళ్లిపుస్తకంలో రాజేంద్రప్రసాద్ చెప్పినట్టు "చలించదు..క్షమించదు". తిట్టినా..ముద్దాడినా..ఏం చేసినా ఒకటే నిర్వికార స్వరూపం.  పోన్లే ఈవిడ కాకపోతే ఆవిడ ఉంది కదా అనుకుంటే ఆ రెండో భార్య శ్రీ మహాలక్ష్మి సృష్టికంతటికీ బహు గొప్ప చంచల స్వభావురాలు. ఏ క్షణం దగ్గరుంటుందో..ఏ క్షణం లేచి చక్కా పోతుందో ఆవిడకే ఎరుక. ఇహ ఆ మహాతల్లితో ఏం సుఖం..? పోన్లే..పెళ్లాల వల్ల సుఖం లేకపోయినా పిల్లల్ని చూసుకుని ఆనందిద్దామంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు..ముల్లోకాల్లోనూ ఎదురే లేనివాడు..సమస్త ప్రపంచాన్నీ జయించగల శక్తిమంతుడు మన్మధునికి శరీరమే లేదు..అవయవాలు లేని బిడ్డ వాడు...హ్మ్మ్..పోనీ ఇవన్నీ ఎలా ఉన్నా ఇంట్లో కాస్త సుఖంగా బతకగలిగే సౌఖ్యాలున్నాయా అంటే పాము పక్క..ఎప్పుడది బుస్సుమంటుందో తెలీదు...ఆ పాము కూడా సముద్రమధ్యంలో తేలుతోంది.ఖర్మ కాలితే మునిగిపోవడమే. పోనీలేవయ్యా వాహనమైనా ఏ అమితాబ్బచ్చన్ కారు లాంటి కారో ఉందా అంటే పాముల్ని తినే పక్షి వాహనం. 
                     ఇల్లు-ఇల్లాళ్లు-బిడ్డలు-సౌఖ్యాలు అన్నీ ఇంత కమ్మగా ఉంటే ఇక ఏం చూసుకుని ఆనందించమంటావయ్యా...స్వగృహ చరితాన్ని తలచుకుని తలచుకుని కొయ్యయిపోయాట్ట స్వామి. ఆ కొయ్యే పూరీ జగన్నాధుడు. 
            "లోకబంధుర్లోకనాధు"డైన పురుషోత్తముని గతే ఇలా ఉంటే ఇక బీచ్ లో ఇసుకరేణువులాంటిదాన్ని నా గతేమిటి...???? 
 కాబట్టి...సెలవు...:) :) :) 
                        

7, మార్చి 2014, శుక్రవారం

అందాల కడలి-10

మన శరీరమే అమ్మకు ఆలయం..! 

శ్లో : 9
        మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
        స్థితం స్వాధిష్ఠానే హృదిమరుత మాకాశముపరి
        మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
        సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే
                  ఇది సౌందర్య లహరిలోని తొమ్మిదవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమంటే "తల్లీ, జగజ్జననీ, మూలాధార చక్రమందు భూతత్వాన్ని, మణిపూరమందు జలతత్వాన్ని, స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని, హృదయమందున్న అనాహత చక్రమందు వాయుతత్వాన్ని, విశుద్ధియందు ఆకాశతత్వాన్ని, భ్రూమధ్యభాగమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వాన్ని కలిగియుండి..ఇలా సుషుమ్నా మార్గాన్ని భేదించుకుంటూ చిట్ట చివరకు సహస్రారపద్మంలో నీ పతియైన సదాశివునితో కలిసి విహరిస్తున్నావు కదా.."
                                    కిందటి శ్లోకం నించి సౌందర్య లహరిలోని శ్లోకాలు పారాయణ చేస్తే కలిగే ఫలితాలు కూడా చెప్పుకుంటున్నాం కదా. అయితే కిందటి శ్లోకం (ఎనిమిదవది) పారాయణే చాలా తక్కువ సంఖ్యలో ఉంది. (కేవలం పన్నెండుసార్లు) సౌందర్య లహరిలో అంత తక్కువ సంఖ్యలో పారాయణ చెయ్యగలిగే శ్లోకాలు మరేవీ లేవు. దరిదాపుగా అన్నీ రోజుకు వెయ్యేసి సార్లు పారాయణ చెయ్యవలసినవే. ప్రస్తుత శ్లోకానికే వస్తే..(తొమ్మిదో శ్లోకం) దీన్ని రోజుకు వెయ్యిసార్లు జపించాలి. అలా పది రోజులు గాని నలభై ఐదు రోజులు గాని పారాయణ చెయ్యాలి. నైవేద్యం పాలతో తయారు చేసిన పాయసం. దీనికి ఫలితం దేశాంతరాలు పట్టిపోయినవాళ్లు తిరిగి రావటం..పంచభూతాల వల్ల (భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ ఐదూ పంచభూతాలు) మనకు ఎటువంటి కీడూ కలగకుండా ఉండటం. సౌందర్య లహరిలోని శ్లోకాల పారాయణకు సంబంధించి యంత్రాలు, బీజాక్షరాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా చెయ్యాలన్న వివరణలున్నాయి. కాని నేను అవేవీ నా బ్లాగులో ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను అవన్నీ చెప్పేంత గొప్పదాన్నీ కాదు..వాటిని  వివరించే ఉద్దేశ్యమూ నాకు లేదు. అంచేత అటువంటివన్నీ కావలసిన వాళ్లు పుస్తకాల షాపుల్లో వెతికితే తదనుగుణమైన పుస్తకాలు దొరుకుతాయి. నేను కేవలం ఏ శ్లోకం చదివితే ఏ ఫలితమో మాత్రమే చెబుతున్నాను. ఎవరికి వారు వారి వారి శక్త్యానుసారం ఆ పారాయణ చేస్తే...(వెయ్యిసార్లూ జపించలేకపోయినా..చెయ్యగలిగినన్ని సార్లు) అందులో కనీసం పావు వంతు ఫలితమైనా దక్కుతుంది గదా అన్నది నా ఆలోచన.
                                  ఇక భావార్ధంలోకొస్తే..ప్రస్తుత శ్లోకం శ్రీవిద్యా ఉపాసకులకు, కుండలినీ యోగసాధనకు చాలా ముఖ్యమైనదట. దేవుడూ..పూజా అంటే తెలుస్తాయి గాని కుండలిని, మూలాధార చక్రం అంటే నా బోటి పామరులకేం తెలుస్తాయి..? నా పాలిటికి, వేదాల దగ్గర్నించీ సమస్తమూ చిన్నికృష్ణుడిలా నోట్లోనే దాచుకున్న గూగులమ్మ ఒకతి ఉంది కాబట్టి,అక్కడే శరణు జొచ్చాను. మొత్తానికి  కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి అనీ,మనిషి శరీరంలోని వెన్నుపాములో దాగి ఉంటుందనీ తెలియవచ్చింది. అమ్మవారు ఎటూ ప్రతి ప్రాణిలోనూ "శక్తి"గా అంతర్భూతమై ఉంటుందని ముందుగా తెలుసుకునే ఉన్నాం కాబట్టి..ఆ శక్తే ఇదని భావించుకోవచ్చు. అయితే ఈ కుండలిని ప్రతి మనిషిలోనూ నిద్రాణమై ఉంటుందనీ, మూలాధారచక్రంలో దాగి ఉన్న ఈ కుండలినీ శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి నుంచి పైనున్న సహస్రారపద్మం లేదా సహస్రార కమలం వరకూ తీసుకువెళ్లగలిగేదాన్నే కుండలినీ యోగమంటారనీ యోగశాస్త్రం చెబుతోంది.  అంటే మనిషి శరీరంలో నిద్రాణంగా ఉన్న శక్తిని కొన్ని పద్ధతుల ద్వారా జాగృతం చేసి దాన్ని శరీరమంతటా వ్యాపింపజేసేదే కుండలినీ యోగం. అంటే మనలో ఉన్న అమ్మవారిని మనం తెలుసుకుని, మన శరీరపు అణువణువునా నింపుకోవడమన్నమాట. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనం దేవీ విషయ సంబంధమైన చైతన్య రహిత సుషుప్తావస్థ లోంచి జాగ్రదవస్థలోకి రావడమన్నమాట. ఒక దేవాలయం ఉందంటే..దాని గర్భగుడితో బాటు ఆవరణ అంతటినీ  కూడా ఆగమ శాస్త్రం ప్రకారం తీర్చిదిద్దినప్పుడే కదా అది నిజమైన ఆలయం అనిపించుకుంటుంది. అలాగేనన్నమాట.  ఒకానొక దైవశక్తి మన శరీరంలోని ప్రత్యణువునా వ్యాపించి ఉంటే ఎలా ఉంటుంది...మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటాం..ఎటువంటి రోగాలూ మన దరిదాపుల్లోకి రావు. అంతే కదా. ఇదే మాటను యోగశాస్త్రం చెబుతోంది. "యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండండనే" మాట ఈ రోజుల్లో వేనోళ్ల వినబడుతున్న సలహా.   కుండలినీ శక్తిని జాగృతం చెయ్యడానికి ప్రాణాయామం ఒక ముఖ్యమైన సాధన అని చెబుతోంది యోగశాస్త్రం. మన శరీర సంరక్షణకు అతి ముఖ్యమైన వాటిలో ప్రాణాయామం ఒకటన్నది మనకందరికీ తెలిసిందే.    
                    ఇక పోతే, మన శరీరంలో చక్రాలంటూ కొన్ని ఉన్నాయనీ, వాటిని ఫలానా ఫలానా పేర్లతో పిలుస్తారనీ, అవి ఫలానా ఫలానా చోట్ల ఉన్నాయనీ...ఈ విషయాలేవీ మనకు సరిగ్గా తెలియవు.  తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో ప్రస్తుత శ్లోకంలో ప్రస్తావించబడ్డ "మూలాధార" "మణిపూర" "స్వాధిష్టాన" "సహస్రార పద్మం" అన్నవాటిని గుర్తించవచ్చు. "షట్చక్రోపరిసంస్థితా" అంది లలితా సహస్రం. అంటే ఆరు చక్రాలకు పైన గలది అని అర్ధం. ఆ ఆరు చక్రాలూ ఇవే. "మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలకు పైనున్న సహస్రారపద్మంలో గల తల్లి" అన్నది లలితా సహస్రంలో చెప్పిన మాట. అయితే ప్రస్తుత శ్లోకంలో అన్ని చక్రాల పేర్లూ లేవన్న సందేహం కలగవచ్చు. "హృదిమరుతమాకాశముపరి" అంటే, హృదయభాగమందుండే అనాహత చక్రమందు మరుత అంటే వాయు తత్వం, ఆకాశం+ఉపరి=ఆకాశముపరి అంటే హృదయానికి ఉపరిభాగంలో ఉన్న విశుద్ధి చక్రమందు ఆకాశతత్వం అని అర్ధం. అలాగే భ్రూమధ్యే అంటే కనుబొమల మధ్య గల ఆజ్ఞాచక్రమందు అని అర్ధం. కులపధం అంటే సాంప్రదాయకమైన సుషుమ్నామార్గం అని అర్ధం. 


                                                     
                                                                   -------------(గూగుల్ సౌజన్యంతో) 

                      ఇదంతా ఇలా ఉంచితే..పూర్వకాలంలో పూజ చేసుకోవడానికి ఎలా కూర్చోవాలన్న విషయంలో సైతం కొన్ని నియమనిబంధనలుండేవి. రాను రాను అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో కాపురాలు, ఎక్కడో ఓ చోట ఓ గూట్లో దేవుడి ఫోటో ఒకటి పెట్టేసి నిలబడే దండం పెట్టెయ్యడాలు...ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులనేకం మనిషిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తున్నాయన్నది విస్పష్టం.  నా చిన్నప్పుడు (మూడేళ్ల వయసులో) నేను బుల్లి పట్టు లాగూ తొడుక్కుని మా తాతగారి పక్కన పద్మాసనం  వేసుకుని కూర్చునేదాన్ని. ఇప్పుడు ఓ చిన్న ప్లాస్టిక్ స్టూలు మీద కూర్చుని నా చేతికందే ఎత్తున బల్ల మీద ఉన్న దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను. ఆ పసి వయసులో నాకు పద్మాసనం ఎలా వెయ్యాలో నేర్పించింది మా తాతగారే. కాని ఇప్పుడు ఎంతమంది తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తమ వారసులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిస్తున్నారు..? అసలు ఎంతమంది తల్లిదండ్రులు పరంపరాగతమైన విషయపరిజ్ఞానానికి తమ ఇళ్లల్లో అవకాశం కల్పిస్తున్నారు..? మనిషికి దేని మీదైనా సరే బాల్యంలోనే సరైన అవగాహన కలగాలి...దైవ చింతన అయినా, యోగసాధన అయినా..!! అప్పుడే ఆ లేతమొక్క తద్విషయమృత్తికలో దృఢంగా నాటుకుని ఏపుగా ఎదుగుతుంది.  
                           ఈ శ్లోకంలో మనకు తెలియని, అంత సులువుగా అర్ధం కాని యోగ పరిభాష ఏదో ఉంది కదా. ఊరికే కష్టపడి దాన్ని తెలుసుకోవాలని ఆతృత పడిపోనక్కర్లేదు. ఈ శ్లోక సారాంశం అతి సులువుగా బోధపడుతూనే ఉంది. అమ్మవారు శక్తి రూపంలో మనలో నిద్రితమై ఉంది. ఆ దైవీశక్తి మన అణువణువునా వ్యాపించి, మనకు రక్షాకవచంగా ఉండాలంటే మనం యోగశాస్త్రంలో చెప్పిన కొన్ని పద్ధతుల్ని పాటించాలి. ఇదే ఈ శ్లోకం మనకు చేస్తున్న హితబోధ. మన శరీరంలోని ప్రత్యణువునూ కూలంకషంగా వివరిస్తున్న ఈ శ్లోకం చదివిన తర్వాత మనం చెయ్యవలసిన పని ఏమిటంటే...పాంచభౌతికమైన ఈ శరీరం అమ్మకు ఆలవాలమైనదని గ్రహించి...దీన్ని పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నలోపం లేకుండా కృషి చెయ్యటం. అంతే. ఈ శ్లోకం చదివాక నాలో కలిగిన స్పందనా..నేను మీకు చెప్పగలిగినదీ ఇదే.    
                                 ఇక్కడ మరో చిన్న విషయం...వైద్యశాస్త్రం అత్యద్భుతంగా పరిగణించే ఎన్నెన్నో అమూల్యమైన విషయాలను అరటిపండు ఒలిచినట్టు అతి సులువుగా మనకు వివరించి చెప్పిన యోగశాస్త్రం మనకు మన పూర్వీకులు ప్రసాదించిన ఒక గొప్ప వరం. దైవికమూ-యోగమూ పరస్పరానుసంధానంతో వికసిస్తాయన్న విషయాన్ని మాత్రమే ఈ శ్లోకం కొత్తగా మనకు తెలియజెబుతోంది. ఈ మాట కూడా న్యాయానికి కొత్తదేమీ కాదు. పురాతనంగా వినవస్తున్నదే. ఇక దీన్ని జీవితంలోకి ఎలా అనుసంధానించుకుంటామన్నది ఎవరికి వారికే పూర్తిగా స్వవిషయం.అరవయ్యేళ్ల వయసువాళ్లయినా, రోగభూయిష్టమైన శరీరంతో ఉన్నవాళ్లయినా సరే యోగా చెయ్యవచ్చుననే ఆచార్యులు చెబుతున్నారు. యోగానికి  ప్రధమ సోపానమైన ప్రాణాయామంతో ముందు ప్రారంభిస్తే సహస్రార పద్మం దాకా ఎగబాకలేకపోయినా కనీసం ఓ రెండు మూడు మెట్లయినా ఎక్కొచ్చు. నెలకోసారి డాక్టరు దర్శనం చేసుకునే బదులు ఆర్నెల్లకోసారి చేసుకోవచ్చు. అదీ సంగతి...!! 
                                  అమ్మ మనలో ఎలా దాగి ఉందన్న మహిమాన్వితమైన విషయాన్ని..పాంచభౌతికమైన ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనే సూచనతో మిళాయించి..రసరమ్యమైన పదజాలంతో మనకందించిన భిషక్కవివరులు శంకర భగవత్పాదులు. ముందు లలితా త్రిపురసుందరికీ...తరువాత ఆ మహనీయునికీ ప్రణమిల్లుతూ...ఇక సెలవా మరి...!!    

5, మార్చి 2014, బుధవారం

నా మనోగతం


                                 "సౌందర్య లహరిని గురించి ఇంతకుముందు విన్నాముగానీ, ఇంత వివరంగా తెలుసుకోవటం మీ పోస్టుల ద్వారానే. చాలా బాగుంది. కృతజ్ఞతలు.  ఇవాళ్టి శ్లోక పారాయణంవలన కలిగే ఫలంగురించి తెలియజెప్పినట్లే, ప్రతి శ్లోకాన్నీ వివరించేటపుడు వాటి ఫలాన్నికూడా పేర్కొనగలరు. ఎంతైనా సగటు జీవులంకదా. ఆ ఫలం తెలుసుకుని తదనుగుణంగా జపంద్వారా ఫలితాలు పొందొచ్చనే స్వార్ధం. మీ పోస్టులు మనసుకు చాలా ఊరటనిస్తాయి."
                             ఇది  ఒక పాఠకురాలు అందాల కడలి-9 కి రాసిన కామెంట్. దీనికి జవాబుగానే ఇది రాస్తున్నాను. 
                                     నా పోస్టులు మనసుకు ఊరటనిస్తాయన్నారామె.   నా పోస్టులు మనస్సుకు తశ్శాంతినిస్తున్నందుకు సంతోషమే గాని...నేనూ సగటు జీవినేనండీ... పాఠకులు  నా పోస్టులు చదివి ఊరట పొందుతూంటే నేనవి రాస్తూ ఊరట పొందుతున్నాను...:) అందరూ సర్వసాధారణంగా అనుకునేట్టు, సమస్యలతో నిండిన సగటు జీవులకే (ఈ కలికాలంలో) సర్వాంతర్యామి ఎక్కువ గుర్తొస్తాడు. దేవుడా నాకేది దిక్కు...నన్నేం చెయ్యదలచుకున్నావయ్యా అన్న తపన అధికమవుతుంది. 
                                నేను వృత్తి రీత్యా జర్నలిస్టుని. నా సహోద్యోగి ఒకరు ఒకసారి రాశారు..."ప్రార్ధన అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. ఈ ప్రార్ధన వల్ల మన జీవితాల్లో ఏదో మార్పు వచ్చేస్తుందనీ..మన సమస్యలన్నీ తీరిపోతాయనీ, ఆపదల నించి గట్టెక్కేస్తామనీ అనుకోవడం ఉత్తమాట. దేనిదారి దానిదే. అయితే, సమస్యలున్నప్పటికీ ధైర్యంగా బతకగలిగే ఓపికని, ఆపదలొచ్చినా నిభాయించుకోగల శక్తినీ ప్రార్ధన ఇస్తుంది" అని. 
                                  నాకా మాట ఎంతగానో నచ్చింది. ఆయన చెప్పింది ఎంత వాస్తవమైనదో అందరికీ తెలుసు. "ఇన్ని పూజలు చేస్తున్నాను. అయినా నాకీ కష్టాలేమిటి" అనుకునేవాళ్లు కోకొల్లలు. "నా పూజలో ఏదో లోపం ఉంది..అందుకే భగవంతుడు నన్ను కరుణించడం లేదు" అనుకునేవాళ్లకూ లోటు లేదు. 
                                "ఏమీ కోరుకోనివాడికి జీవితం అన్నీ ఇస్తుంది. అన్నీ కోరుకునేవాడికి మిగిలేది నిరాశే" నంటారు. అయితే ఇక్కడ ఓ చిన్న కిటుకుంది. ఏమీ కోరుకోనివాడు దొరికినదాన్నే మహాభాగ్యంగా భావిస్తాడు. అంచేత...వాడు ఎటూ భాగ్యశాలే. ఏ మనిషికీ ఎప్పుడూ అన్నీ దొరకవు. అంచేత అన్నీ కోరుకునేవాడు ఎటూ దౌర్భాగ్యుడే. ఇదిలా ఉంచితే.."ఏమీ కోరుకోకపోవడం" అన్నది సాధ్యమా...? ఏ సోనియా గాంధీలాగో ఉండాలని కోరుకుంటే తప్పు కావచ్చు గాక...కాని మధ్యతరగతి ఇల్లాలు తనకో సొంత ఇల్లూ...ఓ బుల్లి కారూ ఉండాలని కోరుకుంటే అందులో తప్పేముంది? పిల్లలు బాగా చదవాలని..మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని..కోరుకున్నవాళ్లని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కోరుకోవడం సమంజసం కాదని ఎవరైనా అనగలరా...? కాని ఈ కోరికలు కూడా ఎంతమందికి తీరుతున్నాయి..? కోరికలు తీరనప్పుడు ఎంతమంది భగవంతుణ్ణి తప్పుబడుతున్నారు..?? 
                                 సరిగ్గా ఇలా భగవంతుణ్ణి నెపమెన్నే సమయంలోనే ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం..మనం కోరుకుంటున్నాం సరే..కాని ఆ కోరినదాన్ని పొందే అర్హత మనకు ఎంతవరకూ ఉంది..? మనం పాపాలేమీ చెయ్యలేదని అనుకుంటున్నాం...కాని, "కరచరణ కృతంవా..కర్మ వాక్కాయజంవా...శ్రవణ నయనజంవా..మానసంవాపరాధం..విహితమవిహితంవా..సర్వమేతత్ క్షమస్వ" అన్నారు శంకరులు. పాపాలు పదికోట్ల రకాలు. తెలిసే చెయ్యం..తెలియకా చేస్తాం. చేతుల్తోనూ, కాళ్లతోనూ, పనులద్వారానూ, మాటలతోనూ, విని, చూసి..మనసుతోనూ..ఇలా ఏ పాపమూ చెయ్యలేదు నేనని చెప్పగలిగే ఆత్మస్థైర్యం ఎవరికుంది..? మన స్థితిగతులు బాగాలేక...మన కుటుంబంలోనే మరొకరు అదృష్టదీపుడిలా వెలిగిపోతూ ఉంటే కోతిలాంటి మన మనస్సు   బాధతో..దుఖంతో..ఈర్ష్యతో..ఆయా భావాల ఫలితంగా వచ్చే నానారకాలైన ఆలోచనలతో కునారిల్లకుండా ఉంటుందా..అది మానసికమైన పాపం కాదా...అత్యంత సహజంగా తోసుకొచ్చే ఈ  పాపానికి మనం అతీతులం కాదే..  మరి చేసిన పాపాలు ఊరికే పోతాయా..?! ఈ జన్మలో ఏ పాపమూ చెయ్యలేదేమో..గాని హిందూమతం చెప్పే ప్రకారం.."పురాకృతం" మనకు ఎంతవరకూ అనుకూలం..? మన జీవితాలు సక్రమంగా నడవకుండా ఏ లింకు అడ్డుపడుతోందో మనకు ససేమిరా తెలీదు. అటువంటప్పుడు..."పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు తాళము దప్పిన తప్పుగాక..చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ పలికినా అపశృతుల్ పలుకుగాక.." గాని ధర్మాన్ని అమలుచేయడంలో కించిత్తూ తేడా రానివ్వని ఆ భువనేశ్వరి మనకి ఎందుకింత శిక్ష విధించిందో..అని ఒక్క క్షణం ఆలోచించాలి కదా..!!   అలా ఆలోచించి..తప్పు మనదే అయి ఉంటుందని సరిపెట్టుకుని..బాధ పడితే పడొచ్చు గాని దేవుణ్ణి తప్పులెన్నడం మాత్రం మానెయ్యాలి. 
                 అయితే ఇది చెప్పినంత సులువు కాదు. నా మట్టుకు నేనే..నా కుటుంబానికి ఒకానొక మహా విపత్తు దాపురించిన దౌర్భాగ్యపువేళ వరుసగా ఒక వారం రోజులేమో...అసలు దేవుడి జోలికే పోలేదు. దీపారాధనే చెయ్యలేదు. "నేనింక నీ జోలికి రాను. నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో..." అని తెగించి చెప్పేశాను. 
             అలా ఓ వారం రోజులు గడిచాక...అప్పుడు ప్రారంభమైన అంతర్మధనం లోంచి వచ్చిందే ఇప్పుడు రాస్తున్న ఈ సోదంతా.  
                       ఇక పోతే మా సహోద్యోగి చెప్పినట్టు, ప్రార్ధన మన జీవితాల్ని మార్చదూ అన్న మాటని మాత్రం మనం పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే దేవతారాధన వల్లనే మన జీవితాలు ఓ ఒడ్డెక్కుతాయన్నది అనాదిగా వస్తున్న మాట కాబట్టి. అంచేత..చివరిగా చెప్పొచ్చే మాటేమిటంటే..దేవతారాధన విషయంలో కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి...
                  మనకి ముక్కోటి  దేవుళ్లున్నారు. వారిలో  మీ మనసుకు నచ్చిన దేవుణ్ణి ముందుగా ఎంచుకోండి. రాముడంటే మీకు చాలా ఇష్టమైతే ఇరవై నాలుగ్గంటలూ రాముణ్ణే ప్రార్ధించండి. అలాగే గణపతి..ఆంజనేయుడు..లలితమ్మ. మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించినప్పుడే మీరు ఆ పూజలో తల్లీనమవగలరు. ఏదో వాళ్లు సాయిబాబాని పూజిస్తున్నారు..మనం కూడా ఆ పూజ చేస్తే ఒడ్డేక్కుతామేమో ఇలాంటి లాటరీలు వద్దు గాక వద్దు. దాని వల్ల ఫలితం ఉండకపోగా వ్రతం కూడా సరిగ్గా సాగదు. 
                 దాదాపు పది-పన్నెండేళ్ల కిందటి మాట. అప్పట్లో నా ఆరోగ్యం అంత బావుండేది కాదు. లలితా సహస్రం చదువుకుంటూ ఉంటే చాలా హాయిగా..ఆ తల్లి నా పక్కనే నిలబడి నన్ను కాపాడుతున్నట్టు ధైర్యంగా అనిపించేది. ఎప్పుడు పడితే అప్పుడు లలిత చదివేసుకుంటూ ఉండేదాన్ని. అయితే అలా చదవకూడదూ అని కొందరు "పెద్దలు" చెప్పారు. శుచిగా స్నానం చేసి, దేవుడి పీఠం దగ్గర కూచుని మాత్రమే లలిత చదవాలి అని. కాని నాకు అలా కుదిరేది కాదు. పనంతా చేసేసుకుని ఆఫీస్ కి బైల్దేరి బస్సులో కూచున్నాక తీరిగ్గా హాయిగా లలిత చదువుకునేదాన్ని.  కాని అలా చదవడం తప్పు అని పెద్దలన్నవాళ్లు చెప్పారు కదా...అందుకని నిజంగా ఓ పెద్దాయనకి ఫోన్ చేసి, విషయం చెప్పాను. అప్పుడాయన..."ఎప్పుడైతే మీకు ఒక దేవుడికి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉంటే హాయిగా ఉందో...ఆ దేవత మీకు సిద్ధించిందన్నమాట. అప్పుడిక మీకు ఆ శ్లోకాలు గానీ స్తోత్రాలు గానీ చదువుకోవడానికి నియమాలు ఏమీ ఉండవు. హాయిగా చదువుకోండి" అని చెప్పారు. అయితే ఇది కేవలం స్తోత్రాలకే...బీజాక్షర జపాలకూ, నామాలు చదవడానికీ మాత్రం కాదు. అది గుర్తు పెట్టుకోండి. "శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ.."అంటూ మనం చదివేది లలితా సహస్రనామ స్తోత్రం. "ఓం శ్రీమాత్రే నమః" అంటూ ప్రతి నామానికీ ముందు ఓంకారం..చివర నమః అన్నవి చేర్చి చదివేవి నామాలు. స్తోత్రాలు మనం ఎలాగైనా చదువుకోవచ్చు. నామాలకు మాత్రం నియమనిష్టలు అవసరం. అలాగే బీజాక్షర జపాలకు కూడా. (మనకెటూ చేతకానప్పుడు ఆ బీజాక్షరాలూ అవీ అన్నీ  మనకెందుకు..హాయిగా ముక్కోటి దేవుళ్లకూ ముఫ్ఫై కోట్ల స్తోత్రాలుండగా..ప్రధానమైనది భక్తి మాత్రమే...బీజాక్షరాలు కాదు. గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పింది కూడా ఇదే.) కాని రామ నామం జపించడానికి మాత్రం ఏ నియమాలూ లేవు. "ర" కారం అగ్నిబీజం. "మ" కారం క్షేమ బీజం. "రామ"అంటూ జపించినప్పుడు మన పాపాలన్నీ దగ్ధమై, క్షేమం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నా..స్నానపానాదులు లేకుండా ఉన్న వేళ మనసు ఏదైనా ఆందోళనకు లోనవుతున్నా నిక్షేపంలా రామనామాన్ని జపిస్తూ ఉపశమనం పొందవచ్చు. నిరుడు నాకు గాల్ బ్లాడర్  ఆపరేషన్ అయినప్పుడు థియేటర్ లోకి వెళ్లే క్షణం దాకా నేను జపించింది రామనామాన్నే. నా శరీరం లోంచి ఒక అవయవం పోతే పోయింది గాని...నా పిల్లలకి నేను క్షేమంగా దక్కాను. ఇక్కడ నాకు ఆనందం కలిగించే మరో విషయం ఏమంటే...ఇది నిజం అవునో కాదో తెలీదు గాని...ఎక్కడో చదివాను...రాముడు లలితాదేవి పురుషరూపమట. సౌందర్య లహరి చదువుతున్నప్పుడు అనుకుంటూ ఉంటాను..."నిజంగా రాముడు అమ్మవారి పురుషరూపమే...లేకపోతే "పుంసాం మోహనరూపాయ" ఎలా అవుతాడు" అని...:)  
                                   ఇక చివరాఖరుగా చెప్పేదేమంటే..మీకు నచ్చిన దేవుణ్ణి ఊరికే అలా ప్రార్ధించుకోండి..స్తుతించండి..అంతే. ఇది ఎలాగంటే మీకు మీ అమ్మో నాన్నో ఇష్టమైతే వాళ్ల గురించి ఎలా ఆలోచిస్తారు..నలుగురికీ ఎలా చెబుతారు..అలా. మీకో ప్రేమికుడుంటే అతన్ని / ప్రేమికురాలుంటే ఆమెని తలచుకుని ఎలా పరవశించిపోతారు...అలా. ఏమీ కోరకండి. నా జీవితాన్ని కాస్త చూడు తండ్రీ..తప్పులు కాయి దేవుడా.. అనండి అంతే చాలు. ఇక మీ జీవితం ఎలా ఉన్నా...మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.మీ జీవితాన్ని / మీ పిల్లల జీవితాల్ని ఆ పరంధాముని చేతుల్లో పెట్టెయ్యండి...మీ అమ్మ..మీ నాన్న మీకు ఎలా అన్యాయం చెయ్యరో..అలాగే ఆ దేవుడూ అన్యాయం చెయ్యడు అని కనీసం నమ్మండి. ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే..తప్పొప్పుల గురించి ఆలోచించకుండా...మీ దారిన మీ ప్రార్ధనలు మీరు కొనసాగించండి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. మనం కోరినదల్లా మనకి జరగకపోవచ్చు. కాని...జరిగేదల్లా మన మంచికేనని నమ్మక తప్పదు.    
            ఏం చెప్పానో...ఎంతవరకూ సరిగ్గా చెప్పగలిగానో..నాకైతే ఏమీ తెలియడం లేదు. అవసరంలో ఉన్నవాళ్లకి ఈ సోది ఏమైనా ఉపకరిస్తే...నాకదే పదివేలు. దేవుడా..వాళ్లకి కాస్త ఉపకారం చేశాను..నా లిస్టులో మరో పది మార్కులు వెయ్యవూ అని దేవుణ్ణి ప్రార్ధించుకుంటాను...చూశారా..ఇదీ స్వార్ధమంటే..మరి ఇదీ లేకుండా బతకగలమా...:) 
   "దుష్టదూరా..దురాచార శమనీ దోషవర్జితా" (దుష్టుల నుండి దూరం చేసేది, దురాచారాల్ని రూపుమాపేదీ, సమస్త దోషాల్నీ పోగొట్టేదీ ఆ లలితాంబికే. ఆ తల్లిని ఊరికే అలా ప్రార్ధిస్తూ ఉండండి చాలు. మిగతాదంతా ఆవిడే చూసుకుంటుంది.)       
          సెలవా మరి... 
                       

3, మార్చి 2014, సోమవారం

అందాల కడలి-9


అమృతసముద్రం మధ్య అమృతానందమయి   


శ్లో : 8
       సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
       మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే
       శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
       భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం !
                               ఇది సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకం. అమ్మవారి నివాసస్థలాన్ని తెలియజేసేది. క్లుప్తంగా దీని భావమేమంటే, "అమృతసముద్రం మధ్యన, దేవతా వృక్షాలైన కల్పవృక్షాలు  చుట్టూ పరివేష్టించి ఉన్న మణిద్వీపంలో కదంబవృక్షాలతో నిండిన ఉద్యానవనంలో ల చింతామణీ గృహంలో శివాత్మకమైన మంచం మీద..పరమశివుడనే తల్పమందు జ్ఞానానందతరంగరూపమై  ఉన్న నిన్ను కొందరు ధన్యులు సేవించి తరిస్తున్నారు. "
                ఇప్పటిదాకా నేను మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సౌందర్య లహరిలోని వంద శ్లోకాలకీ వంద యంత్రాలున్నాయి..వంద బీజాక్షరాలున్నాయి. ఏ శ్లోకానికి ఏ యంత్రమో..ఏ బీజాక్షరమో..జపవిధానం ఎలాగో..నైవేద్యం ఏమిటో..ఫలితం ఏమిటో   వివరాలన్నీ తెలియజేసే పుస్తకాలున్నాయి. (బజార్లో దొరుకుతాయి) అవన్నీ మనకెందుకు గాని, ఏ శ్లోకాన్ని పారాయణ చేస్తే ఏ ఫలితమో మాత్రం ఇక మీదట చెప్పుకుందాం. శాస్త్రం చెప్పినట్టు వేలల్లో దాన్ని జపించలేకపోయినా, తోచినన్నిసార్లు జపించి, అమ్మ దయకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది.  ప్రస్తుత "సుధాసింధోర్మధ్యే" శ్లోకానికి సకల కార్య జయం ఫలసిద్ధిగా చెప్పబడింది.  రోజూ జపించవలసిన సంఖ్య కూడా చాలా తక్కువ. రోజుకి పన్నెండు సార్ల చొప్పున పన్నెండు రోజులు. అంతే. నైవేద్యం కూడా చాలా సులువైనది..నల్ల మిరియాలు. అంచేత  ఆసక్తి గలవారు యంత్రాలు, బీజాక్షరాల జోలికి పోకుండా చేతనైనంత మేరకు ఈ శ్లోకాన్ని రోజుకు పన్నెండుసార్లు చొప్పున 12 రోజులు జపించి తదనుగుణమైన ఫలితాన్ని పొందండి.
                                 ఇక ఈ శ్లోకపు భావార్ధాన్ని చూద్దాం..బ్రహ్మకు నివాసం సత్యలోకం. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు. శివుడు సరేసరి..కైలాసంలో ఉంటాడన్నది అందరూ ఎరిగిందే. మరి ముజ్జగాలకూ మూలపుటమ్మ అయి ఆ లలితా మహా త్రిపురసుందరి ఎక్కడుంటుంది..?? ఆ తల్లి ఉండే నెలవేది..? దాని  పేరేమిటి..లలితా సహస్రం చదివేవారిలో కూడా చాలామందికి ఈ ప్రశ్నలకు జవాబులు తెలియవు. ఈ శ్లోకం దానికి జవాబు చెబుతుంది గాని, సవిస్తరమైన జవాబు తెలుసుకోవాలంటే దేవీ భాగవతం చదవాల్సిందే. అందులోని మణిద్వీప వర్ణనను తెలుగులో 32 చిన్న చిన్న పద్యాలుగా వ్రాసి కూర్చిన "మణిద్వీప వర్ణన" పాట ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యాన్ని గడించుకుంది.  "మహాశక్తి మణిద్వీప నివాసిని..ముల్లోకాలకు మూలప్రకాశిని" అన్న పాదంతో మొదలై, "భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం..దేవదేవుల నివాసం అదియే కైవల్యం" అన్న పల్లవి పునరావృతమవుతూ సాగే  ఆ పాట పుణ్యమా అని పరదేవత మణిద్వీపంలో ఉంటుందన్న విషయం జగద్వ్యాపితమైంది. "నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు"చదివితే చాలా శుభమంటూ ఆ పాటలో ఉన్న ప్రకారం గృహప్రవేశ మహోత్సవాలు మణిద్వీపవర్ణన పారాయణలతో మారుమ్రోగుతున్నాయి. గృహప్రవేశవేళ మణిద్వీపవర్ణన చిరు పొత్తాల్ని అందరికీ కానుకగా ఇవ్వడం కూడా పలుచోట్ల ఆనవాయితీ అయింది.  
                             మొత్తానికి దేవి ఉండేది మణిద్వీపంలో అని చెప్పుకున్నాం కదా. లలితా సహస్రం తల్లిని "సుధాసాగర మధ్యస్థా" "చింతామణి గృహాంతస్థా" అంటూ వర్ణించింది. అయితే మనకు మొదటినించీ పాలసముద్రం గురించి మాత్రమే తెలుసు గాని ఈ అమృతసముద్రం గురించి ఆట్టే తెలియదు..!
                                         "సప్త సముద్రాలు" అన్న మాట మనం తరచూ వినేదే. అవి వరుసగా లవణ (ఉప్పు సముద్రం..మనకి ఉన్నది ఇదే) ఇక్షు (చెరకురసం) సురా (మద్యం..కల్లు) సర్పి (నేతి సముద్రం) క్షీర (పాల సముద్రం) దధి (పెరుగు సముద్రం) జల (మంచినీటి సముద్రం)సముద్రాలు. ఆయా సముద్రాల చెంత వరుసగా జంబూ (మన ద్వీపమే) ప్లక్ష, శాల్మలీ, కుశ, పుష్కర, క్రౌంచ, శాక ద్వీపాలున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కడా అమృత సముద్రం మాటే లేదు. అయితే, జంబూద్వీపంలో ఆరు కులగిరులు (కుల పర్వతాలు...అంటే ప్రళయమే వచ్చినా..భూదేవి ఎన్నెన్ని మార్పులకు గురైనా గాని ఈ పర్వతాలు మాత్రం తమ సరిహద్దుల్ని అతిక్రమించే నైచ్యానికి పాల్పడవట) ఉన్నాయని (కొన్ని కొన్ని చోట్ల ఈ పర్వతాల్ని ఏడుగా పేర్కొనడం కూడా జరిగింది) ఈ కులగిరుల్లో మేరుపర్వతం ఒకటని విష్ణుపురాణం పేర్కొంది.
                                            ఆ మేరు పర్వతం చుట్టూ కూడా మహా పర్వతాలు ఉన్నాయనీ, వాటి మీద మంచినీళ్లు, తేనె, చెరకురసం, పాల సరస్సులు ఉన్నాయనీ, అక్కడ సర్వతోభద్రమనే దేవతల ఉద్యానవనం ఉందనీ శ్రీమద్భాగవతం పేర్కొంది. ఇక్కడ కూడా  ఎక్కడా మణిద్వీపం గురించి గాని, అమృతసముద్రం గురించి గాని ప్రస్తావనే లేదు. అయితే దేవీ భాగవతం మాత్రం, బ్రహ్మలోకానికి పైన "సర్వలోకం" అని ఉంది. దానికే మణిద్వీపం అని నామాంతరం అని తెలిపింది. దానికి సాటి పధ్నాలుగు లోకాల్లోనూ మరేదీ లేదంటూ సాగిన మణిద్వీప వర్ణన చదువుతుంటే శరీరం ఒక్కసారిగా రోమాంచనమవుతుంది. ఆనందమూ, ఏదో తెలియని భయమూ, విభ్రమా...అసలు అదీ ఇదీ అని చెప్పుకోలేని ఒకానొక గాఢమైన అనుభూతీ కలుగుతాయి. అవన్నీ స్వయంగా అనుభవించాలంటే శ్రీ దేవీ భాగవతం చదవండి. అందులో చెప్పినదానికి సంక్షిప్త స్వరూపమే ప్రస్తుత శ్లోకంలోని వర్ణన.
                        అయితే...నాకు ఎప్పుడూ ఒక పెద్ద దరిద్రపు సందేహం కలుగుతూ ఉంటుంది. దేవీ భాగవతం ప్రకారం...త్రిమూర్తులకు సైతం మూలం ఆ పరదేవతే. అంతే కాదు...సమస్త హిందూ ఆధ్యాత్మిక చరిత్రకూ శిఖరం వంటిది శ్రీచక్రం. దాన్ని మించిన యంత్రరాజం గాని..ఉపాసనా దీక్షగాని ఉన్నట్టు నేను వినలేదు. (అఫ్ కోర్స్, నాకు తెలిసింది చాలా తక్కువని నేను మొదటినించీ చెబుతూనే ఉన్నాను...కాబట్టి ఇందులో ఏదైనా తప్పుంటే పాఠకులు పెద్దమనసుతో క్షమించగలరు.)
అయితే..."పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట" అన్న పోతనామాత్యుడంతటి పరమ భాగవతోత్తముడే  
  అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ  చాల పె
  ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లో
  నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
  యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ! 
                                    అంటూ పరదేవత విభవాన్నీ, మహిమనూ కీర్తించినా భాగవతంలో ఎక్కడా మణిద్వీప ప్రసక్తి గాని, అమృతసముద్రం ప్రసక్తి గాని వచ్చినట్టు నాకు తెలియదు. దేవీపురాణాలు తప్ప మిగతా సమస్తమూ విష్ణువునే కీర్తించాయి.ఎక్కడా ముగురమ్మల మూలపుటమ్మ ఊసే ఎత్తలేదు.  ఇదే నాకు గొప్ప సందేహం..బాధా..లోటూను. 
                               సరే మిడిమిడిజ్ఞానంతో వచ్చే ఈ సందేహాల మాటకేం గాని...ఈ "సుధాసింధోర్మధ్యే" అన్న శ్లోకాన్ని చదివినప్పుడల్లా నాకు కాళిదాసు "శ్యామలా దండకం" గుర్తొస్తూ ఉంటుంది. 
  "సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే" 
                                         అంటూ కాళిదాసు ఆశువుగా చెప్పిన  శ్యామలాదండకాన్ని మన మధుర గాయకుడు ఘంటసాల పాడగా విని..నాకసలు ఒళ్లు తెలియలేదు. 
                         "సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం..." 
                                            అన్న శ్యామలాదండకమొక్కటీ చాలు ఆ జగన్మాతృకను తలచుకుని పరవశించిపోవడానికి. 
                   ఇక్కడ ఓ చిన్న కోతి కొమ్మచ్చి. మా నాన్న లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ జిల్లాపరిషత్ కి డెప్యుటేషన్ మీద వెళ్లారు. అక్కడ ఓసారి, (శ్రీకాకుళం లో) జిల్లాపరిషత్ సెక్రటరీ తదితర ఐదు పోస్ట్ ల్లో ఎవరూ లేక, ఎకౌంట్స్ ఆఫీసర్ అయిన మా నాన్న సెక్రటరీ పోస్ట్ తో సహా ఎకాయెకీ ఐదు పోస్ట్ లకి ఇన్ చార్జ్ గా వ్యవహరించారు. డిపార్ట్మెంట్ లో అత్యంత సమర్ధుడంటూ మా నాన్నకున్న పేరు దాంతో మూడు రెట్లు పెరిగింది.అది తలచుకుంటే ఇప్పటికీ (మా నాన్న చనిపోయే పధ్నాలుగేళ్లు) నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. 
                                      అలాగే అనుకోండి...మన అమ్మ...సర్వ మంత్రాలూ, తంత్రాలూ, యంత్రాలూ, తీర్ధాలూ, చక్రాలు, శక్తులు, వేదాలు, విద్యలు, యోగాలు, వర్ణాలు, గీతాలు...ఒకటేమిటి...సమస్తమూ ఆమేనని తెలిస్తే...శృతులు, కాళీవరప్రసాదులు, సాక్షాత్ శివస్వరూపులు అంతా ఆమెను కీర్తిస్తుంటే మనకు ఆనందంతో..పరవశంతో..ఇంకా ఏదో తెలియని ఒకానొక అపురూపమైన భావంతో ఒళ్లు గగుర్పొడచదూ...???!!!   
                                                 ఆ తల్లి...ఏ అమృతంకోసమైతే దేవతలూ, రాక్షసులూ కొట్టుకున్నారో..ఆ అమృతం సముద్రంలా తనుండే ద్వీపం చుట్టూ పారుతూ ఉండగా..దేవతలందరూ పూజించే కల్పవృక్షాలు ఇంటి చుట్టూ కంచెగా అమరగా..మణిమయమైన ద్వీపంలో వర్ష సంబంధమైన కడిమి చెట్లు తోటగా అమరి ఉండగా..నవరత్నాలకు తలమానికమైన, కోరినదల్లా ప్రసాదించే మహిమ గల చింతామణులతో  (ఇది కూడా లక్ష్మీదేవితో బాటు క్షీరసముద్రంలోంచి పుట్టిందని గతంలో చెప్పుకున్నాం)నిర్మితమైన గృహంలో ఉంటుంది. 
                             ఆఫీసర్ గారి దాకా వెళ్లే శ్రమ లేకుండా ఆయన ఇంటి కాపలాదారే ఆశ్రితుల అవసరాలు కనిపెట్టినట్టు, అమ్మ ఇంటి చుట్టూ ఉన్న కల్పవృక్షాలు, చింతామణులే భక్తుల కోర్కెల్ని తీర్చి పారెయ్యగలవు. ఇంటి ముందున్న కడిమిచెట్లు కోరిన వర్షధారల్ని కురిపించి భూతలాన్ని సస్యశ్యామలం చెయ్యగలవు. 
                 సరే ఇక అమ్మ ఉండేది శివాకారమైన మంచం మీద...శివ అంటే ఆనందం.రూపుదాల్చిన ఆనందమే  ఆ తల్లి  ఆసనం. అంటే ఆయమ ఆసనం కూడా మనకు సుఖప్రదాతే...
                                         పోతే..ఈ "పరమశివ పర్యంక"మన్న పదానికి వేరే సంకేతార్ధం ఉందనీ..అది మన శరీరంలోని చక్రాలకూ, గ్రంధులకూ సంబంధించినదనీ చెప్పుకునే మాటను వివరించే ప్రయత్నం నేను చెయ్యను. అది నా శక్తికి అతీతమైనది. నేను చెప్పగలిగేది ఒక్కటే...పెళ్లికాని ఆడపిల్లలు కాత్యాయనీ వ్రతం చేసే ఆనవాయితీ మన వైపు ఉంది. ఆ వ్రతానికి శివుని వామాంకమందున్న అమ్మవారి ఫోటో కావాలి. సరిగ్గా అదే ఇది. పరమశివ పర్యంకమందున్నదంటే పరమశివుని అంకమనే పర్యంకము పై ఆసీన అయి ఉన్నదని మనం భావించాలి. 
                                   ఆఖరుగా చెప్పుకోవలసినదేమంటే అమ్మ "చిదానందలహరి" అంటే జ్ఞానానందలహరి. జ్ఞానప్రసూనాంబిక అయిన ఆ దేవి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా ఆనందప్రదాత అవుతుంది. ఇటువంటి తల్లిని భజించి ధన్యులవుతున్నవారు మాత్రం "కతిచన".... కొందరే..! ఎందుకంటే మణిద్వీపం మన పక్కింట్లో లేదు. త్రిగుణాత్మకమైన తల్లిని కేవలం అంతర్ముఖంగా మాత్రమే తెలుసుకోవాలి తప్పితే మరొక రకంగా  దేవి ప్రసన్నురాలు కాదు. అంచేత...శివుడికి  మానస పూజ చేసినట్టు అమ్మను కూడా ఆత్మలో ప్రత్యక్షం చేసుకుని భజించగలవారు నిజంగా ధన్యులే కదా...అటువంటి అదృష్టం ఏ కొద్దిమందికో...??!!  
                                   సరే ఇక సెలవా మరి...

1, మార్చి 2014, శనివారం

పద్మవ్యూహం

                     "మొగుడు వెధవ ఒకడు కొంపలో ఉన్నాడన్న సంగతి కాస్త గుర్తుంచుకో. ఇరవైనాలుఘ్ఘంటలూ  ఆ దిక్కుమాలిన కంప్యూటర్ దగ్గరే వేలాడతావ్.."
                     కుటుంబం కోసం బైట చచ్చే చాకిరీ  చేసి..అలసి సొలసి ఇంటికొచ్చిన యజమానికి బాపు పెళ్లిపుస్తకంలో గుమ్మడి పెళ్లాంలా ఎదురేగి..చేతిలో బరువులందుకుని..ఫేను వేసి చల్లని మంచినీళ్లు చేతికిచ్చి...కార్యేషు దాసీ అనే కదా "పుస్తకాలు" చెబుతున్నాయి. మరి వాటిలో  చెప్పిందాన్ని పాటించకుండా ఆ పుస్తకాల్నే పురుగులా పట్టుకుని వేలాడుతుంటే ఎంత భరించేవాడైతే మాత్రం (భర్త అనగా భరించువాడు కదా) భరించలేక ఆ మాత్రం మాట విసిరాడంటే అందులో అతని తప్పేముంది..?
        1) కనుక ముందు  భార్యగా భర్త విధులు చక్కబెట్టాలి...!! 
                    "అమ్మా...ఈ టాప్ డబల్ కుట్టు వేస్తానని కిందటి ఆదివారం చెప్పావు. ఇప్పటి దాకా దాని జోలికి వెళ్లలేదు. నీకెంతసేపూ చదువూ-రాతా..! పోనీ టైలర్ కి ఇచ్చుకుంటానమ్మా అంటే ఇరవై రూపాయలెందుకు దండగా అంటావు. నాకు తెలీదు.. రేప్పొద్దున్నకల్లా నాకు ఆ టాప్ సిద్ధంగా ఉండాలంతే..!"
                         ఇది ఎంతమాత్రమూ పిల్ల అవిధేయత కాదు. ఇరవై రూపాయల ఖర్చుకీ ఒప్పుకోక..దానికి వేళకల్లా బట్టా అందించకపోతే మరి అది విసుక్కుపోయిందంటే  దాని తప్పు ఎంతమాత్రమూ లేదు..!
    2) కాబట్టి  తల్లిగా పిల్లల అవసరాలు చూడాలి...!!  
                  "ఏటమ్మా ఊరికే నస పెడతారు..నాను తక్కినోళ్ల ఇళ్లల్లో కూడా ఇలాగే సేత్తన్నాను. ఇట్టమైతే సేయించుకోండి..లేపోతే నా డబ్బులు నా మొహాన పారేయండి.."
               ధరలు మండిపోతున్నాయి. ఓపికలు తగ్గిపోతున్నాయి. పనిమనుషులూ మనుషులే కదా...ఎంత జీతానికి అంత పని.ఇంకా నయం ఇది నమ్మకస్తురాలు. ఎదురింటివాళ్ల పనమ్మాయిలా చేతికందింది బొడ్లో దోపుకు పోదు. ఇంతకంటే ఇచ్చే స్తోమత ఎటూ లేదు. అంచేత నోరు మూసుకుని దీన్ని నిలబెట్టుకోవడమే ఉత్తమం..!
         3) అంచేత..మధ్యతరగతి ఇల్లాలిగా పనిమనిషికి అసిస్టెంటు అవతారం ఎత్తాలి...!!
                 "ఏమిటో..లక్ష్మిగారు అసలు బొత్తిగా కనిపించడమే మానేశారు. మాతో కాస్సేపు కబుర్లు చెప్పే తీరుబాటు కూడా లేదా.."
                      ఇరుగూ పొరుగూ మంచివాళ్లే. కలిస్తే సరదాగా మాట్లాడతారు..అవసరానికి సాయమూ చేస్తారు. నలుగురితో కలిస్తేనే ప్రపంచమంటే ఏమిటో కూడా  తెలుస్తుంది. కేవలం పుస్తక జ్ఞానమే అయితే "పిడికిట్లో ఉన్న వర్తులాకార వస్తువు" బండి చక్రమే  అవుతుంది..!
          4) కాబట్టి ఇరుగూ పొరుగుతో రోజూ ఓ గంటో రెండు గంటలో కాలక్షేపం చెయ్యాలి...!!
                      "అక్కా...బియ్యే చదువుకున్నావు. ఇంగ్లీషూ..తెలుగూ దంచి కొడతావు. అస్తమానూ ఆ పుస్తకాలతో కాలక్షేపం చేసేకంటే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదే..ఇద్దరాడపిల్లలున్నారు కూడానూ.."
            అవును మరి. క్లాసు పుస్తకం తప్ప మరోటి ముట్టుకోని చెల్లి...చదువుతో సరాసరిగా బేంకు పరీక్షలు కూడా రాసి ఇట్టే ఉద్యోగం తెచ్చుకుని..చూస్తుండగానే మేనేజరమ్మ అయిపోయి..ఎంచక్కటి ఇల్లు కూడా కట్టేసుకున్న బుల్లి..అక్క పరిస్థితి చూసి భూమ్మీద నిలబెట్టే సలహా ఇచ్చిందంటే అది ఎంత కరెక్టో గదా...!
          5) అంచేత పుస్తకాల రాదారుల్లోంచి వాస్తవమైన నేలకు దిగి ఉద్యోగం చెయ్యాలి...!! (ఇది మాత్రం అనుమానమే)
          "ఏబీసీడీ చానెల్లో మధ్యాహ్నం వేళ మంచి సీరియల్ వస్తోంది చూస్తున్నారా.."
               చూడట్లేదంటే మూతి విరుస్తారు. టీవీలో వచ్చే అన్నిటినీ తీసి పారెయ్యక్కర్లేదు. ఏవో కొన్నయినా చూడొచ్చు..నిత్యాగ్నిహోత్రం నించి కాస్త మార్పు.
         6) కనుక స్వార్ధం కోసం టీవీ కాస్సేపైనా చూస్తూ ఉండాలి...!!
                 "రాత్రి ఒంటిగంట దాకా పడుకోరట. మళ్లీ తెల్లారుజామునే లేచిపోతారట. అలా చేస్తే నిద్ర చాలక ఇలాగే అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.."
             ధైరాయిడూ, బీపీ ఉన్నది చాలక ఇంకా ఏమైనా వస్తే మరీ కష్టం గదా..అంచేత..
          7) డాక్టరు చెప్పినట్టు రోజుకి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి...!!
               "నువ్వు ఏ రోజూ పట్టుమని పది నిమిషాలు కూడా పూజ చెయ్యవు..ఎలా చెప్పు మరీ" 
                     ఈ మాటలు ఎవరూ అనరు...పైకీ వినబడవు..ఇంట్లో ఓ మూలనున్న దేవుడి కొలువు లోంచి గుండెల్లోకి దూసుకుపోతాయి . సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడూ, శుక్రవారం అమ్మవారూ, శనివారం వెంకన్నా దిగులుగా చూస్తారు..."ఏనాడూ పుస్తకం పట్టుకున్న పాపాన ఫోకపోతే మరి మంచి మార్కులు ఎలా వస్తాయమ్మా"  అని దీనంగా అడుగుతున్న అమ్మాఅబ్బల్లా..
          8) సో...దేవుడు కాస్త కళకళ్లాడటం కోసం వారానికో ఘంటైనా పూజ చెయ్యాలి...!! 
                                      అర్జునుడు సవ్యసాచి. కుడిచేతా ఎడమచేతా కూడా బాణాలు ప్రయోగించగల నేర్పరి. దశకంఠుడికి పది తలలు..అంటే ఇరవై చేతులు..(అంతే కదా) ఒకేసారి బోలెడన్ని పన్లు చెయ్యొచ్చు. కార్తవీర్యార్జునునికి వెయ్యి చేతులు...అబ్బో అబ్బో..
                      అమ్మా,సహస్రాక్షీ...మేం, అంటే సాహితీ ప్రియులైన మధ్యతరగతి ఇల్లాళ్లం అభిమన్యుడిలాంటివాళ్లం. మాకు చదువుసంధ్యలతో కూడిన  సంసారమనే ఈ పద్మవ్యూహంలోకి జొరబడిపోవడమే చేతనైంది. కాని దీన్ని దిగ్విజయంగా ఎలా జయించుకు రావాలో తెలీడం లేదు. మాకు పది తలలు, వెయ్యి చేతులూ లేవు. సవ్యసాచులం కాము.కలాల హలాల్ని నడిపిస్తూ జీవితక్షేత్రాల్ని దున్నుకుంటున్నవాళ్లం. మమ్మల్ని కాస్త దయజూడు తల్లీ...నీకిదే మా వందనం...పాదాభివందనం!!