21, జులై 2023, శుక్రవారం

                 

                                                   నా మదిలో....

                "మొగుడు వెధవ ఒకడు కొంపలో ఉన్నాడన్న సంగతి కాస్త గుర్తుంచుకో. ఇరవైనాలుఘ్ఘంటలూ ఆ దిక్కుమాలిన కంప్యూటర్ దగ్గరే వేలాడతావ్.." 
                            కుటుంబం కోసం బైట చచ్చే చాకిరీ చేసి..అలసి సొలసి ఇంటికొచ్చిన యజమానికి బాపు పెళ్లిపుస్తకంలో గుమ్మడి పెళ్లాంలా ఎదురేగి..చేతిలో బరువులందుకుని..ఫేను వేసి చల్లని మంచినీళ్లు చేతికిచ్చి...కార్యేషు దాసీ అనే కదా "పుస్తకాలు" చెబుతున్నాయి. మరి వాటిలో చెప్పిందాన్ని పాటించకుండా ఆ పుస్తకాల్నే పురుగులా పట్టుకుని వేలాడుతుంటే ఎంత భరించేవాడైతే మాత్రం (భర్త అనగా భరించువాడు కదా) భరించలేక ఆ మాత్రం మాట విసిరాడంటే అందులో అతని తప్పేముంది..? 
                 1) కనుక ముందు భార్యగా భర్త విధులు చక్కబెట్టాలి...!! 
                       "అమ్మా...ఈ టాప్ డబల్ కుట్టు వేస్తానని కిందటి ఆదివారం చెప్పావు. ఇప్పటి దాకా దాని జోలికి వెళ్లలేదు. నీకెంతసేపూ చదువూ-రాతా..! పోనీ టైలర్ కి ఇచ్చుకుంటానమ్మా అంటే ఇరవై రూపాయలెందుకు దండగా అంటావు. నాకు తెలీదు.. రేప్పొద్దున్నకల్లా నాకు ఆ టాప్ సిద్ధంగా ఉండాలంతే..!" 
                          ఇది ఎంతమాత్రమూ పిల్ల అవిధేయత కాదు. ఇరవై రూపాయల ఖర్చుకీ ఒప్పుకోక..దానికి వేళకల్లా బట్టా అందించకపోతే మరి అది విసుక్కుపోయిందంటే దాని తప్పు ఎంతమాత్రమూ లేదు..! 
                        2) కాబట్టి తల్లిగా పిల్లల అవసరాలు చూడాలి...!! 
                             "ఏటమ్మా ఊరికే నస పెడతారు..నాను తక్కినోళ్ల ఇళ్లల్లో కూడా ఇలాగే సేత్తన్నాను. ఇట్టమైతే సేయించుకోండి..లేపోతే నా డబ్బులు నా మొహాన పారేయండి.." 
                       ధరలు మండిపోతున్నాయి. ఓపికలు తగ్గిపోతున్నాయి. పనిమనుషులూ మనుషులే కదా...ఎంత జీతానికి అంత పని.ఇంకా నయం ఇది నమ్మకస్తురాలు. ఎదురింటివాళ్ల పనమ్మాయిలా చేతికందింది బొడ్లో దోపుకు పోదు. ఇంతకంటే ఇచ్చే స్తోమత ఎటూ లేదు. అంచేత నోరు మూసుకుని దీన్ని నిలబెట్టుకోవడమే ఉత్తమం..!            
               3) అంచేత..మధ్యతరగతి ఇల్లాలిగా పనిమనిషికి అసిస్టెంటు అవతారం ఎత్తాలి...!! 
                                 "ఏమిటో..లక్ష్మిగారు అసలు బొత్తిగా కనిపించడమే మానేశారు. మాతో కాస్సేపు కబుర్లు చెప్పే తీరుబాటు కూడా లేదా.." 
                                  ఇరుగూ పొరుగూ మంచివాళ్లే. కలిస్తే సరదాగా మాట్లాడతారు..అవసరానికి సాయమూ చేస్తారు. నలుగురితో కలిస్తేనే ప్రపంచమంటే ఏమిటో కూడా తెలుస్తుంది. కేవలం పుస్తక జ్ఞానమే అయితే "పిడికిట్లో ఉన్న వర్తులాకార వస్తువు" బండి చక్రమే అవుతుంది..! 
                      4) కాబట్టి ఇరుగూ పొరుగుతో రోజూ ఓ గంటో రెండు గంటలో కాలక్షేపం చెయ్యాలి...!! 
                           "అక్కా...బియ్యే చదువుకున్నావు. ఇంగ్లీషూ..తెలుగూ దంచి కొడతావు. అస్తమానూ ఆ పుస్తకాలతో కాలక్షేపం చేసేకంటే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదే..ఇద్దరాడపిల్లలున్నారు కూడానూ.." అవును మరి. క్లాసు పుస్తకం తప్ప మరోటి ముట్టుకోని చెల్లి...చదువుతో సరాసరిగా బేంకు పరీక్షలు కూడా రాసి ఇట్టే ఉద్యోగం తెచ్చుకుని..చూస్తుండగానే మేనేజరమ్మ అయిపోయి..ఎంచక్కటి ఇల్లు కూడా కట్టేసుకున్న బుల్లి..అక్క పరిస్థితి చూసి భూమ్మీద నిలబెట్టే సలహా ఇచ్చిందంటే అది ఎంత కరెక్టో గదా...! 
                        5) అంచేత పుస్తకాల రాదారుల్లోంచి వాస్తవమైన నేలకు దిగి ఉద్యోగం చెయ్యాలి...!! (ఇది మాత్రం అనుమానమే) 
             "ఏబీసీడీ చానెల్లో మధ్యాహ్నం వేళ మంచి సీరియల్ వస్తోంది చూస్తున్నారా.." 
                  చూడట్లేదంటే మూతి విరుస్తారు. టీవీలో వచ్చే అన్నిటినీ తీసి పారెయ్యక్కర్లేదు. ఏవో కొన్నయినా చూడొచ్చు..నిత్యాగ్నిహోత్రం నించి కాస్త మార్పు. 
                                 6) కనుక స్వార్ధం కోసం టీవీ కాస్సేపైనా చూస్తూ ఉండాలి...!! 
                       "రాత్రి ఒంటిగంట దాకా పడుకోరట. మళ్లీ తెల్లారుజామునే లేచిపోతారట. అలా చేస్తే నిద్ర చాలక ఇలాగే అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.." 
            ధైరాయిడూ, బీపీ ఉన్నది చాలక ఇంకా ఏమైనా వస్తే మరీ కష్టం గదా..అంచేత.. 
                    7) డాక్టరు చెప్పినట్టు రోజుకి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి...!! 
                              "నువ్వు ఏ రోజూ పట్టుమని పది నిమిషాలు కూడా పూజ చెయ్యవు..ఎలా చెప్పు మరీ" ఈ మాటలు ఎవరూ అనరు...పైకీ వినబడవు..ఇంట్లో ఓ మూలనున్న దేవుడి కొలువు లోంచి గుండెల్లోకి దూసుకుపోతాయి . సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడూ, శుక్రవారం అమ్మవారూ, శనివారం వెంకన్నా దిగులుగా చూస్తారు..."ఏనాడూ పుస్తకం పట్టుకున్న పాపాన ఫోకపోతే మరి మంచి మార్కులు ఎలా వస్తాయమ్మా" అని దీనంగా అడుగుతున్న అమ్మాఅబ్బల్లా.. 
                   8) సో...దేవుడు కాస్త కళకళ్లాడటం కోసం వారానికో ఘంటైనా పూజ చెయ్యాలి...!! 
                     అర్జునుడు సవ్యసాచి. కుడిచేతా ఎడమచేతా కూడా బాణాలు ప్రయోగించగల నేర్పరి. దశకంఠుడికి పది తలలు..అంటే ఇరవై చేతులు..(అంతే కదా) ఒకేసారి బోలెడన్ని పన్లు చెయ్యొచ్చు. కార్తవీర్యార్జునునికి వెయ్యి చేతులు...అబ్బో అబ్బో..
                           అమ్మా,సహస్రాక్షీ...మేం, అంటే సాహితీ ప్రియులైన మధ్యతరగతి ఇల్లాళ్లం అభిమన్యుడిలాంటివాళ్లం. మాకు చదువుసంధ్యలతో కూడిన సంసారమనే ఈ పద్మవ్యూహంలోకి జొరబడిపోవడమే చేతనైంది. కాని దీన్ని దిగ్విజయంగా ఎలా జయించుకు రావాలో తెలీడం లేదు. మాకు పది తలలు, వెయ్యి చేతులూ లేవు. సవ్యసాచులం కాము.కలాల హలాల్ని నడిపిస్తూ జీవితక్షేత్రాల్ని దున్నుకుంటున్నవాళ్లం. మమ్మల్ని కాస్త దయజూడు తల్లీ...నీకిదే మా వందనం...పాదాభివందనం!! 
                               ఎప్పుడో రాసుకున్నదిది...ఏళ్లూ పూళ్లూ గడిచినా కించిత్తు మారని నిత్యనూతన గాథాలహరి...నాలాంటి మధ్యతరగతి ఇల్లాలి సాహిత్యలహరి!!
                                                     ******************

2 కామెంట్‌లు: