25, ఏప్రిల్ 2023, మంగళవారం

 "ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై 
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్"....
                                                                             అన్నాడు భర్తృహరి. 
                  ఎప్పుడో పదేళ్లనాడు అట్టహాసంగా ఆరంభించిన ఈ ‘‘కృష్ణలీలాతరంగిణి’’ బ్లాగుని ఎలాగో కొన్నాళ్లు లాక్కొచ్చి, అక్కడికి ‘విఘ్నాయాస సంత్రస్తురాల’నై ఆపేసిన మధ్యమజాతి మహిళనన్నమాట నేను. ఛీ ఛీ అని నన్ను నేనే ఛీ కొట్టుకుని, ధీరురాలిలా దీన్ని కొనసాగించాలన్న పట్టుదల పూని, (ఈ పూనిక ఎంతవరకూ నిలుస్తుందో నాకే అనుమానం) మళ్లీ మీ ముందుకి వచ్చాను. 
                   ఈ మధ్య నేను రాసిన కథ ఒకదాన్ని మీ ముందు పెడతాను.  కెనడా కి చెందిన ‘‘కథావేదిక", ఇక్కడి "లేఖిని" తో కలిసి  నిర్వహించిన కథల పోటీలో  ప్రధమ బహుమతి గెలుచుకున్న కథ ఇది. కధాసంకలనం లో చోటు చేసుకుంది.  చదవండి...మీ అభిప్రాయాల్ని సెలవివ్వండి...

                                      పెళ్లి పుస్తకం 

 

                         రెండు రోజుల నుంచీ నా ఆలోచనలన్నీ నా ఒక్కగానొక్క సంతానం నితీష్ చుట్టూనే తిరుగుతున్నాయి. నితీష్ బాగా చదువుకున్నాడు. మంచి కంపెనీలో ఉద్యోగంలక్షల్లో జీతం. పిల్లాడు చూడచక్కనివాడు. ఇహ లోటేముంది?! కావలసినన్ని సంబంధాలు వచ్చాయి. సౌందర్యవతీవిద్యావతీఉద్యోగవతీ అయిన పిల్లతో పెళ్లి కూడా కుదిరింది. ఆ పిల్ల గుణవతి అవునో కాదో పెళ్లయితే గాని తెలీదు కదా. గుణవతి అనగానే ఆ పిల్ల సచ్ఛీలతను నేనేదో శంకిస్తున్నాననుకునేరు. నా ఉద్దేశ్యం అది కాదు. సంసారం కడదాకా సవ్యంగా సాగాలంటే ఆడదానికైనా మగవాడికైనా కొన్ని మంచి గుణాలు ఉండాలన్నది నా ఉద్దేశ్యం.

               పరస్పర గౌరవాభిమానాలు ఉండాలి.  సహనంసర్దుకుపోయే గుణం అన్నిటికంటే ముఖ్యం. తన కోపమే తన శత్రువు అన్నది కుటుంబంలో వర్తించదనిబైటవాళ్ల దగ్గర మాత్రమే వర్తిస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్వకుటుంబీకులు అయినవాళ్ల కోపాన్ని పట్టించుకోరని లేదా చాలా తేలికగా తీసుకుంటారని జనంలో ఒక అభిప్రాయం ఉంది. కానీ అది తప్పు. కోపం కుటుంబంలోని  ఆత్మీయుల హృదయాల్లో శత్రుభావాన్ని రేకెత్తిస్తుంది. ఈ శత్రుభావంనివురుగప్పిన నిప్పులా ఉంటూఎప్పుడు పైకి ఎగసిపడుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ నివురుగప్పిన నిప్పు గురించి నాకు తెలిసినట్టు చాలా మందికి తెలీదు. అందుకే నా కొడుకు గురించీనాకు కాబోయే కోడలి గుణగణాల గురించీ నాకింత ఆలోచన!! 

              నా కొడుకు మంచివాడే! కానీ కోపిష్టి!! కుండెడు పాలల్లో ఒక్క బొట్టు విషం... ఊరంత మంచితనంలో అలవిమాలిన కోపం!! 

                ఈ కోపం విషయంలో వాడికి మా నాన్న పోలిక వచ్చిందని  ఎన్ని లక్షల సార్లు అనుకున్నానో! మా నాన్న కోపం వల్ల జరిగిన అనర్ధాలన్నీ ఆయన పెద్ద కొడుకునినాకంటే బాగా ఎవరికి తెలుసు?!   ఇహ నా కొడుకు విషయానికొస్తేఇన్నాళ్లూ వాణ్ణీవాడి కోపాన్నీ మేం భరిస్తూ వచ్చామనే కంటే అసలు వాడికి కోపం రాకుండా ఉండేట్టూ మేం మసలుకున్నామనడం సబబు. వాడికి ఎప్పుడు ఏది ఎలా కావాలో అలా అమర్చి పెడుతుంది వాళ్లమ్మ. నాకు కోపం చాలా తక్కువ కాబట్టి నా కంటే ముందు వాడి అవసరాలే చూస్తుంది. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ శాంతమూర్తులే. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా శాంతంగాసహనంగా ఉండటమే కావాలి. అదే గొప్ప. అందునా ఇప్పుడు పెళ్లి కూడా కుదిరిందాయె!!

                    ఎలాగైనా సరే నితీష్ కి బుద్ధి చెప్పాలి. కానీ ఎలా?!!  కోపిష్టి వాడికి మూర్ఖత్వం కూడా కొద్దో గొప్పో ఉంటుంది. హితబోధలు చెవికెక్కవు. అందుకే విష్ణుశర్మ  పంచతంత్రాలతో కథామార్గం తొక్కాడు. కొన్ని ఉపాయాలు సార్వత్రికమైనవి. మనకి ఇట్టే దారి చూపిస్తాయి. నితీష్ కి కథలంటే చాలా ఇష్టం అవడం నాకో ప్లస్ పాయింట్!! 

               మర్నాడు ఆదివారం. ఉదయం స్పెషల్ టిఫిన్లూ గట్రా అయ్యాకఎప్పటిలా టీవీ చూడటమోబైటికి వెళ్లడమో చెయ్యలేదు నేను. పడక్కుర్చీలో వెనక్కి వాలికళ్లు మూసుకుని కూర్చున్నాను. 

            నేను ఊహించినట్టేపది నిమిషాల్లో నా కొడుకు నన్ను తట్టి లేపుతూ, "ఏంటి నాన్నా అలా కూచున్నావు?!" అని పలకరించాడు. 

   నేను వాడివైపు దీర్ఘంగా చూస్తూ,  "అబ్బేఏమీ లేదురా.... నిన్న ఒక కథ 

చదివాను.  చాలా బావుంది. అదే బుర్రలో తిరుగుతోంది." అన్నాను. 

      "ఏమిటా కథ..?!" నితీష్ గొంతులో కుతూహలం నాకు స్పష్టంగా తెలిసింది. 

   మనసులోనే విష్ణుశర్మకి దండం పెట్టుకుని, "చెప్తా... కూచో." అన్నాను. 

  వాడు కూచున్నాడు! 

నేను ప్రారంభించాను!! 

                                                     *************


        పూర్తిగా తెల్లారను కూడా తెల్లారలేదు. మంచి నిద్దట్లో ఉన్న శ్రీరామ్తల్లి గొంతు గట్టిగా వినిపించేసరికి ఉలిక్కిపడి లేచి బైటికి పరిగెత్తుకొచ్చాడు. 

       హాల్లో కుర్చీలో బిక్కమొహం వేసుకుని కూర్చుని ఉన్నాడు అరవై ఐదేళ్ల నారాయణ మూర్తి. ఎదురుగా నిలబడి కోపంగా చూస్తోంది అరవై ఏళ్ల బాలమ్మ. 

              లోపలి గుమ్మం దగ్గర ఉన్న మైథిలి, "పోన్లెండత్తయ్యా.. " అంటూ ఏదో చెప్పబోతోంది. 

           బాలమ్మ బాలా త్రిపుర సుందరి లాగే రివ్వున ఇటు కోడలి వైపు తిరిగింది.

       "పోన్లెండేవిటే.. పోన్లెండీ?!  నలభై రెండేళ్ల నుంచీ పోన్లెండనుకునే బతుకుతున్నా. ఇహ చచ్చేదాకా ఇంతేనా?! అప్పుడంటే పిల్లలు చిన్నవాళ్లు.. ఎక్కడికి పోతాను.. ఏవిటి చేస్తాను అనుకుని ఎప్పటికప్పుడే అంతా మింగుకుంటూ వచ్చాను. ఇప్పుడిహ  నాకేంరత్నాల్లాంటి పిల్లలు నలుగురున్నారు. ఈయన కోపం సంగతి తెలిసే మా అమ్మానాన్నా పెద్దదాన్ని తమ్ముడికి చేసుకున్నారు. "అమ్మాతమ్ముడు నీకెప్పుడూ అండగా ఉంటాడు. భయపడకు" అని నాకు ఎప్పుడూ ధైర్యం చెబుతూనే ఉండేవారు. ఎందుకో తెలుసా... ఈ కోపిష్టి మనిషి ఏ క్షణంలో నన్ను "ఫో ముండా" అని ఇంట్లోంచి గెంటేస్తాడో అని అందరికీ భయమే!"

              ఆ సరికి శ్రీరామ్ కి విషయం మూడొంతులు అర్ధమైపోయింది. అలా వదిలేస్తే కనీసం పది నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా నిప్పులు చెరిగేస్తుంది తల్లి. నలభై రెండేళ్ల నుంచీ రాజుకుంటున్న నిప్పది!!

               నాలుగడుగులు ముందుకు వెళ్లి తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసిఅనునయంగా ఆమెని వంటింటి వైపు నడిపించాడు శ్రీరామ్. 

           నాగస్వరానికి లొంగిపోయిన నాగినిలా కొడుకు చేతిలో ఒదిగిపోయింది బాలమ్మ. 

  "అది కాదురాచలికో ఏమో రాత్రిళ్లు నడుం పట్టేస్తోంది. తెల్లారే చలికి కూడా తట్టుకోలేక పోతున్నాను. "ఏదో కొంపలంటుకు పోతున్నట్టు తెల్లారకుండా నువ్వు లేవడం దేనికిఆరు దాటే దాకా హాయిగా పడుకో" అందది. ఏ జన్మలో పుణ్యమో ఇంత మంచి కోడలు దొరికింది అనుకుని  హాయిగా పడుకున్నాను! ఆ ప్రధానమంత్రిగారు మాత్రం నాలుగున్నరకల్లా లేవకపోతే ఢిల్లీ నగరం కూలిపోతుంది కదా. ఆయన లేచేశాడు. లేచాడంటే కాఫీ పడాలి. నీకు తెలిసిందే కదా. ఓసారి ఒళ్లు తెలియకుండా నిద్ర పట్టేసి లేవలేకకాఫీ ఇవ్వడం లేటైతే నానా తిట్లూ తిట్టాడు. నేను కాఫీ కూడా తాగకుండా వంటింట్లో రహస్యంగా ఏడుస్తూ ఉంటే నువ్వే వచ్చి నా కళ్లు తుడిచి ఊరుకోబెట్టావు. గుర్తుందా?!"

            శ్రీరామ్ మాట్లాడలేదు. తల్లిని డైనింగ్ టేబిల్ దగ్గర కూచోబెట్టి, "నేను బ్రష్ చేసుకుని వస్తాను. మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం" అని సైగలతో చెప్పిగుండెల్లోంచి దూసుకొస్తున్న నిట్టూర్పుని అణచుకుంటూ బాత్ రూం కి వెళ్లిపోయాడు. 

                కోడలు మైథిలి మావగారికి కాఫీ పట్టుకెళ్లి ఇస్తూ, "రేపటి నుంచి మరికాస్త తొందరగా లేస్తాను మావయ్యా." అనడం వింటూ నిట్టూర్చింది బాలమ్మ. 

              మర్నాడు ఆదివారం. శ్రీరామ్ ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం నాలుగింటికి నారాయణ మూర్తి స్నేహితుడు కూర్మనాధం వచ్చాడు. మైథిలి ఇచ్చిన టీ తాగుతూ తన కష్టాలు చెప్పుకోవడం ప్రారంభించాడు కూర్మనాధం. అతడికి ఒక్కడే కొడుకు. కోడలు అత్తమామల్ని కించిత్తు పట్టించుకోదు. కూర్మనాధం భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఏ పనీ చెయ్యలేదు. కానీ అత్తగారి అశక్తతని కోడలు పట్టించుకోదు. ఒక్కోసారి వంట మొత్తం అప్పజెప్పేసి మొగుడితో కలిసి షికార్లకెళుతుంది. 

                    రెండు రోజుల క్రితం జరిగిన రభస చెబుతున్నాడు కూర్మనాధం. శుక్రవారం అని గుడికి వెళ్లిందిట కోడలు. ఎనిమిదేళ్ల మనవరాలు స్కూలుకి ఏదో సెలవని ఇంట్లోనే ఉంది. వంట చేసి పిల్లకి భోజనం పెట్టమని పురమాయించివెళ్లిపోయింది కోడలు. గంటలో వస్తానన్న మనిషి స్నేహితురాలి ఇంట్లో భోంచేసి సాయంత్రం వచ్చింది. ఇక్కడ నానమ్మ వండిన కూర నచ్చక పిల్ల భోంచెయ్యలేదు. ఆకలో అని ఏడుపు. సాయంత్రం కోడలొచ్చాక మొగుడూ పెళ్లాలిద్దరికీ దండిగా పడ్డాయిట తిట్లు. 

             లోపలి నుంచి అదంతా వింటున్న బాలమ్మ నవ్వుతూ లేచి హాల్లోకొచ్చింది. 

    "పాతికేళ్ల కిందట నాకైన అనుభవం ఈనాడు మీకు రివర్సులో అయిందన్నమాట. దేవీ నవరాత్రుల్లో గుడికి వెళ్లిఅక్కడ హరికథ వింటూండిపోయిఒక్క అరగంట లేటుగా ఇంటికొచ్చానని మీ ఫ్రెండు నన్ను నానా తిట్లూ తిట్టారు గుర్తుందా మీకు...అప్పుడు ఆయన పక్కనే ఉన్నారు మీరు!! ఊరికే కాదుఆయన నన్ను అలా తిడుతూంటే మీరు నవ్వుతూ కూచున్నారు. అయ్యో ఎందుకురా ఆవిడని అలా తిడతావు.. అని కనీసం ఒక్క మాట అనలేదు సరికదా నవ్వుతూ అంతా చూశారు. బహుశా ఇంటికెళ్లాక మీ ఆవిడక్కూడా చెప్పినవ్వి ఉంటారు. ఇప్పుడు మీ కోడలు గుడికెళ్లొచ్చి మిమ్మల్ని తిడుతూ ఉంటే ఎవరూ నవ్వకపోవడం మీ అదృష్టం. బంగారమంటి కోడలు దొరకడం నా అదృష్టం." అంది. 

            బాలమ్మ మాటలకి కూర్మనాథం మొహం వెలవెలబోయింది. భార్య తెగింపుకి నారాయణ మూర్తి మొహం ఎర్రబడింది. కానీ భార్యని పల్లెత్తు మాట అనే సాహసం చెయ్యలేదాయన. ఈ బాలమ్మని తిట్టే ధైర్యం ఎవరికీ లేదు!! 

             బాలమ్మ లోపలికి వచ్చేసింది! 

   మరొక్క ఐదు నిమిషాలు ముళ్లమీద కూచున్నట్టు కూచుని, "వెళ్లొస్తానయ్యా మూర్తీ. మీ ఇంటికి మళ్లీ రాకుండా గొప్పగా బుద్ధి చెప్పింది మీ ఆవిడ. ఇప్పుడంతా ఆవిడ హవా కాబోలు" అని అక్కసంతా తీర్చుకుని మరీ వెళ్లాడు కూర్మనాధం. మిత్రుడు వెళ్లాకలోపలికొచ్చాడు నారాయణ మూర్తి. 

           కొడుకూ కోడళ్లతో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్న భార్య దగ్గర నిలబడి, "బాలా! దగ్గర దగ్గరగా నాలుగేళ్ల నుంచీ ఇలాగే సాధిస్తున్నావు నువ్వు. అయినా నీ కక్ష తీరలేదు. కానీచచ్చిన పాముని ములుగర్ర పుచ్చుకుని ఇంకా ఎంత పొడుస్తావో పొడు!" అనేసి వెళ్లిపోయాడు. 

            బాలమ్మ మాట్లాడలేదు. తలవంచుకుని ఊరుకుంది. 

       శ్రీరామ్ మృదువుగా, "అమ్మానీకు ఇంతకు ముందు నాలుగైదు సార్లు చెప్పాన్నేను గతాన్ని తవ్వకమ్మా అని. నాన్న మంచివారు. ఒళ్లు తెలియని కోపం ఒకప్పుడు ఆయన లోపంగా ఉండేది. కోపం వస్తే నిన్ను నానా తిట్లూ తిట్టితర్వాత పశ్చాత్తాప పడను కూడా పడేవారు కాదు. నీ తప్పు ఏమీ లేకుండానే ఇంట్లోవాళ్ల ముందూబైటవాళ్ల ముందూ కూడా చాలా సార్లు తిట్లు తిని ఏడ్చుకున్నావు. అదంతా నేనూ ఒప్పుకుంటాను. కానీ ముందే చెప్పినట్లు నాన్న మంచివారు. నిన్నూమమ్మల్నీ బాగా చూసుకున్నారు. మనకి ఏ లోటూ చెయ్యలేదు. డబ్బు చాలకపోతే తనకి ముతక  బట్టలు కొనుక్కునిమాకు మంచివి కొనేవారు. నీ పుట్టిన రోజు కూడా గుర్తుంచుకుని మంచి చీర తెచ్చేవారు.  ఇప్పుడు తన పెన్షన్ లోంచి మైథిలికి డబ్బులిస్తున్నారు చీర కొనుక్కోమని. నీ స్వేచ్ఛాస్వాతంత్రాయాలని ఆయన ఏనాడూ కాదనలేదు. ఇక నాన్న కోపం కూడా అలా వయసుతో బాటు చాలా వరకూ తగ్గిపోయింది. ఇంకా ఎందుకు చెప్పు ఆయన్ని బాధపెట్టడం?!" అన్నాడు. 

             బాలమ్మ కళ్లనిండా నీళ్లతో చూస్తూ, "నాకాయన మీద కక్ష ఏమీ లేదురా. నిజమే,  నువ్వు చెప్పినట్లు మీ నాన్న మంచి మనిషే. ఏవిటో ఒక్కోసారి అలా పాతవి గుర్తొస్తే ఆవేశం వచ్చేస్తుంది. అప్పుడు అనుభవించిన బాధ ఈ క్షణంలో మళ్లీ అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది. అనకూడదు అనుకుంటూనే అనేస్తాను! ఇక మీదట జాగర్తగా ఉంటాన్లే" అంది. 

               ఆ తర్వాత నుంచీ బాలమ్మ తగ్గింది. అయితే ఆ సంఘటన తర్వాత నారాయణ మూర్తి పూర్తిగా తగ్గిపోయాడు. కాఫీటిఫిన్భోజనం ఏదీ అడగడం మానేశాడు. ఎప్పుడు ఇస్తే అప్పుడే మహా ప్రసాదం అన్నట్టు తినితాగుతున్నాడు. టీవీలో ఏం పెడితే అదే చూస్తున్నాడు. మాట్లాడటం కూడా బాగా తగ్గిపోయింది. నిశ్శబ్దంగా పుస్తకాలు చదువుకుంటున్నాడు. భర్తలో ఈ మార్పు మొట్టమొదట గమనించింది బాలమ్మే. ఆవిడకి ఏదో తీరని లోటుగా అనిపించింది. 

        "మామూలుగా ఉండండీ" అంటూ భర్తని గదమాయించబోయింది. 

         "బతికినన్నాళ్లు బతకను. నన్నిలా ప్రశాంతంగా ఉండనీ బాలా" అంటూ మృదువుగానే తోసి పారేశాడాయన. 

      బాలమ్మకి ఏం చేయాలో తోచలేదు. భర్త అంత నిశ్శబ్దంగా ఉండటం అన్ని దశాబ్దాల కాపురంలో ఏనాడూ ఎరగదావిడ. చేసేదేమీ లేక తనూ మౌనంగా ఉండటం నేర్చుకుంది. అయితే నిశ్శబ్దంలో ప్రశాంతతను నారాయణ మూర్తి సాధించినట్టు ఆవిడ సాధించలేకపోయింది. గడ్డ కట్టిన నీరు మంచు అయి శరీరాన్ని కోసేసినట్టూ ఆవిడ మాటలన్నీ గడ్డ కట్టి మనసును కోసెయ్యడం ప్రారంభించాయి. ఆ క్షణం ఆవిడకి ఒక మహత్తర సత్యం బోధపడింది. భర్తకి ఎంత కోపం ఉన్నాఇన్నాళ్లూ తను చాలా సుఖంగాహాయిగా బతికిందన్న వాస్తవం ఆవిడకి ఇప్పుడే ఎవరో చెవిలో చెప్పినట్టు బోధపడింది. 

               భర్త కోపం కొద్దీ తనని తిట్టేవాడు...కోపం లేనప్పుడు సరదాగా కబుర్లూ చెప్పేవాడు. తనకి తెలియని ఎన్నో విషయాలు చెప్పాడు. తను చిన్నప్పటి నుంచీ వాగుడుకాయే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన వాక్స్వాతంత్ర్యానికి ఏమీ భంగం కలగలేదు. నిన్న మొన్నటి వరకూ తను భర్త దగ్గర కూర్చుని ఏదో ఒకటి వాగుతూనే ఉండేది. ఆ వాగుడులో పనికొచ్చేవేవీ ఉండవు. అయినా ఆయన ఆనందంగా వినేవాడు. తనకి తోచింది తనూ మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఒకానొక నిశ్శబ్దపు తెర వెనక్కి వెళ్లిపోయాకతనకి మాటలు కరువయ్యాయి. ఒకప్పటి ఆయన కోపంతిట్లు తనని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ అది క్షణికమే. ఇలా తిట్టిఅలా పిలిచేవాడాయన. కానీ ఇప్పుడు ఎంతకీ తరగని ఈ నిశ్శబ్దం భయపెడుతోంది! తనేదో ఒంటరిదైపోయినట్టూభర్త తనని వదిలేసినట్టూ గుండె లోతుల్లోంచి భయమూ ఆందోళనా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి!! 

                 అలా ఓ పది,  పదిహేను రోజులు గడిచాకఓ రోజు అలవాటు ప్రకారం తెల్లవారుజామునే లేచిసెల్ తో కాలక్షేపం చేస్తున్న నారాయణ మూర్తిభార్య మూలగడం విని ఆశ్చర్య పడుతూ దగ్గరికి వెళ్లి చూశాడు. 

         చేత్తో గుండె మీద రాసుకుంటూ, "అమ్మా... అమ్మా" అని మూలుగుతోంది బాలమ్మ. 

           నారాయణ మూర్తి పై ప్రాణాలు పైనే పోయాయి. కొడుకును పిలుస్తూ పరిగెత్తాడు. మరో గంటకల్లా బాలమ్మ ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో ఐసియూలో ఉంది. 

   "నన్ను తిట్టండీ. కోపం తెచ్చుకోండీ.. మాట్లాడ్డం మానెయ్యకండీ!" అని రోజంతా కలవరిస్తూనే ఉంది. 

               డాక్టర్ ఇరవైనాలుగు గంటలు గడిస్తేనే గాని ఏ సంగతీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం వచ్చింది మైల్డ్ స్ట్రోకే. కానీ బీపీ చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఇరవైనాలుగు గంటల లోపున మరో ఎటాక్ రావచ్చుననిసాధ్యమైనంత వరకు ఆ ఎటాక్ రాకుండా ఉండేందుకే ట్రీట్ మెంట్ ఇస్తున్నామని చెప్పారు. 

             సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాస్త పర్వాలేదని చెబుతూ నారాయణ మూర్తిని ఐసీయూలోకి అనుమతించారు. 

           కాళ్లూ చేతులూ వణుకుతూ ఉండగా లోపలికి వెళ్లాడాయన. ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉన్న భార్యని చూసేసరికి ఆయన కళ్లలో నీళ్లు ఆగలేదు. గబుక్కున కళ్లు తుడుచుకునినెమ్మదిగా భార్య చేతి మీద తన చెయ్యి ఆనించాడు. 

        భర్త స్పర్శ తెలిసినట్టు కొద్దిగా కదిలింది బాలమ్మ. 

"నన్ను తిట్టండీ... మాట్లాడ్డం మానెయ్యకండీ" అంటూ కలవరించింది. 

     భార్య మాట నారాయణ మూర్తికి స్పష్టంగానే అర్ధమైంది. తిడితే తిట్టాడంటుంది... నోరు మూసుకుని ఊరుకుంటే తిట్టండంటుంది. ఆయనకి భార్య మీద వల్లమాలిన కోపం వచ్చింది. 

      పెదవులు బిగబట్టినెమ్మదిగానే, "బుద్ధిమాలినదానా...తిట్టడం కాదు. ఇంటికి రా,నీ తోలు వలిచి చెప్పులు కుట్టించుకుంటా" అన్నాడు. 

              మరో పది నిమిషాలకి బాలమ్మ కళ్లు తెరిచింది. మరో అరగంటకల్లా ఆవిడ బీపీ నార్మల్ కొచ్చేసింది. 

            తర్వాత పది సంవత్సరాల పాటు ఆ దంపతులిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూగొడవలాడుకుంటూ సుఖంగా బతికారు. 

                                                    **************

    కథ చెప్పడం ముగించినా కొడుకు మొహంలోకి... సూటిగా చూశాను. వాడు కథ వినిఏదో ఆలోచనలో పడ్డట్టు కనిపించాడు. 

  "కథ విని ఆలోచిస్తున్నావేమిటి.. ఎలా ఉంది కథ?!" అంటూ ప్రశ్నించాను. 

   వాడు జవాబు కోసం కించిత్తు తడుముకోలేదు. 

 "నువ్వు ఇంతసేపూ చెప్పింది కథలా లేదు నాన్నా. మన జీవితాలతో ఏదో సంబంధం ఉన్నట్టే ఉంది. నువ్వు ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చెప్పినట్టున్నావు! అసలు విషయం చెప్పు" అన్నాడు. 

   నాకు నవ్వొచ్చింది. వీడి తెలివితేటలు కూడా మా నాన్నవే. ఆయన ఆ రోజుల్లోనే చాలా పెద్ద ఉద్యోగం చేసేవారు. 

           నితీష్ మాటకి నేనింకా జవాబు చెప్పకుండానే లోపలి నుంచి మా ఆవిడ సీతాలక్ష్మి మా దగ్గరకొచ్చింది. సీరియస్ గా కొడుకు వైపు చూస్తూ, "నువ్వు అడిగినదానికి జవాబు నేను చెబుతాను విను. మీ నాన్న చెప్పిన కథలో మైథిలిని నేనే.  దాన్ని బట్టి మిగతాదంతా నీకు ఇట్టే తెలుస్తుంది. ఇక మీ నాన్న నీకిదంతా ఎందుకు చెప్పారో కూడా నాకు తెలుసు. ఆ విషయం మేమిద్దరం ఈ మధ్య కాలంలో చాలాసార్లే మాట్లాడుకున్నాం. అదంతా కూడా ఆయనే చెబుతారు నీకు. కాకపోతే నువ్వు గ్రహించవలసిందల్లా ఒక్కటే... ఈ విషయంలో నాదీమీ నాన్నదీ కూడా ఒకటే అభిప్రాయంఆలోచన. అంచేత ఆయన చెప్పబోయేది నేను కూడా చెబుతున్నాననుకుని డబల్ అటెన్షన్ తో విను." అనేసి వెళ్లిపోయింది. 

             ఇదంతా ఏదో సీరియస్ వ్యవహారం అని గ్రహించిన నితీష్ బిక్కమొహం వేసుకుని నా వైపు చూశాడు. 

      నేను అనునయంగా, "గాభరా పడవలసిందేమీ లేదు నాన్నా. కథలో నారాయణ మూర్తి మీ తాతగారన్నది నీకు అర్ధమైంది కదా. ఆయన బతికి ఉంటే ఇప్పుడు నూరేళ్లు  ఉండేది వయస్సు. మా అమ్మ ఆయన కంటే ఐదేళ్లు చిన్నది. ఆ తరం మనిషి మా అమ్మే ఆయన కోపాన్నివిసురుబాటుతనాన్నీ భరించలేకపోయింది. అదంతా మనసులో పెట్టుకుని ఆయన్ని వృద్ధాప్యంలో సాధించుకు తింది. ఆ కాలపు మనుషులు కాబట్టిలేత వయసుల్లో దృఢంగా అల్లుకున్న బంధాలు కాబట్టి వాళ్లిద్దరూ కడదాకా అన్యోన్యంగా బతికారు. ఈ కాలపు పెళ్లిళ్లూవ్యవహారాలూ ఎలా ఉన్నాయో నీకు తెలియంది కాదు. అత్తమామల సంగతి అలా ఉంచిమొగుడు కాస్త గట్టిగా తిట్టినా ఆడపిల్లలు సహించడం లేదు. తక్షణం కౌంటర్ ఇస్తున్నారు. పరిస్థితి ఏమైనా హద్దు దాటిందా... పుట్టింటికి వెళ్లిపోతున్నారు. మొగుడు వెళ్లిసారీ చెప్పితన పద్ధతి మార్చుకుంటే సరేసరి. లేదంటే ఏం జరుగుతుందో నేను నీకు విడమరిచి చెప్పక్కర్లేదు. నీకు మా నాన్న కోపం వచ్చిందని మీ అమ్మా నేనూ ఇప్పటికి లక్షసార్లు అనుకుని బెంగపడ్డాం. ఇప్పుడు నీకు పెళ్లి కూడా కుదిరింది. నీకు కాబోయే భార్య నీతో సమానంగా చదువుకునిఉద్యోగం చేస్తోంది. నీలాగే తల్లిదండ్రులకి ఒక్కగానొక్క బిడ్డ.. గారాంగా పెరిగింది. ఆ పిల్ల రేపు నీ కోపాన్ని భరించలేకపోతే ఏమవుతుందో కాస్త ఆలోచించుకో. నీ సంసారం వెయ్యిన్నొక్క కాలానికీ పచ్చగా ఉండాలనీనువ్వు పిల్లా పాపాతో సుఖంగా బతకాలనీ మా కోరిక. అందుకే నీకు ఇదంతా చెప్పాను." అంటూ ముగించాను 

           నితీష్ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. తర్వాత తల వంచుకుంటూ, "రమ్య ఆల్ రెడీ అనేసింది నాన్నా" అన్నాడు. 

      నేను కాస్త గాభరా పడుతూ, "ఏమంది?!" అని ప్రశ్నించాను.

             కొడుకు మాట వినబడి మా ఆవిడ కూడా చప్పున వచ్చి ఆందోళనగా చూస్తూ నిలబడింది.

           నితీష్ అపరాధిలా చూస్తూ, "మొన్న ఏదో చిరాకులో కసిరాను. ఫోన్ లోనే. వెంటనే "నీకు కోపం ఎక్కువలా ఉందే" అంది. నేను మాట్లాడలేదు. "అలా అయితే చాలా కష్టం నితీష్" అని ఫోన్ పెట్టేసింది." అన్నాడు. 

             మేమిద్దరం మరింత ఆందోళనగా చూశాం. 

    వాడు తల పూర్తిగా వంచుకుని, "ఓ గంట పోయాక ఫోన్ చేసి సారీ చెప్పాను. ఇప్పుడు బాగానే మాట్లాడుతోంది. కాకపోతే కోపం పనికిరాదని ఏం చెప్పినా ఫ్రెండ్లీగా చెప్పాలని ఖచ్చితంగా చెప్పింది."

అన్నాడు. 

            నేనూ మా ఆవిడా మొహాలు చూసుకున్నాం. మా మొహాల్లో కనిపిస్తున్న ప్రశ్న వాడికి అర్ధమైంది. 

     మరికొంచెం బిక్కమొహం వేసుకుని, "కోపం బాగా తగ్గించుకుంటానని ప్రామిస్ చేశాను. ఇదంతా జరిగి వారం దాటింది. కోపం తగ్గించుకోవడం కోసం సైకియాట్రిస్ట్ దగ్గర సెషన్స్ కి వెళ్లడం ప్రారంభించిరెండు రోజులైంది!" అన్నాడు.

           మా ఇద్దరి మొహాలూ ఒక్కసారిగా వికసించాయి. మా ఆవిడ ఆనందం పట్టలేక గబుక్కున కొడుకుని పట్టుకునిగట్టిగా ముద్దు పెట్టేసుకుంది. 

       నేను కుర్చీలోంచి లేచి వాడి దగ్గరికి వెళ్లినవ్వుతూ ఆప్యాయంగా వాడి భుజం తట్టాను!!

                         

                                               *******************

 

          



One attachment • Scanned by Gmail
 

2 కామెంట్‌లు:

  1. " తన కోపమే తన శత్రువు అన్నది కుటుంబంలో వర్తించదని, బైటవాళ్ల దగ్గర మాత్రమే వర్తిస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్వకుటుంబీకులు అయినవాళ్ల కోపాన్ని పట్టించుకోరని లేదా చాలా తేలికగా తీసుకుంటారని జనంలో ఒక అభిప్రాయం ఉంది. కానీ అది తప్పు. కోపం కుటుంబంలోని ఆత్మీయుల హృదయాల్లో శత్రుభావాన్ని రేకెత్తిస్తుంది. ఈ శత్రుభావం, నివురుగప్పిన నిప్పులా ఉంటూ, ఎప్పుడు పైకి ఎగసిపడుతుందో ఎవరూ చెప్పలేరు."


    చాలా విలువైన మాటలు. ఇప్పుడు అన్ని సంసారాలు రోజు స్మరించుకొని ఆచరణలో పెట్టదగ్గవి.

    రిప్లయితొలగించండి