పోట్లాడుకోని వాళ్ళు పతీపత్నులే కారన్నది జగమెరిగిన మాట. భార్యాభర్తల మధ్య చాలా సీరియస్ గా పరిధిని మించి జరిగే గొడవ ఎంతటి భయోత్పాతాన్ని కలిగిస్తుందో, పరస్పర అనురాగంతో కమ్మని కాపురం లోని మాధుర్యాన్ని అనుభవించే దంపతుల మధ్య, ఇద్దరు చంటి పిల్లలు బొమ్మ కోసం తగువాడుకున్న రీతిలో చోటు చేసుకునే కలహం కాపురానికి మరింత కమ్మదనాన్నీ చూసేవారికి మరింత వినోదాన్నీ పంచిపెడతాయి. ఇదిగో...సరిగ్గా అలాంటి కలహమే ఈ “కమ్మని కాపురం”లో చోటు చేసుకుని, మనకి ఇంతింతనరాని హాస్యాన్ని బహుమతి గా అందిస్తోంది. చదవండి మరి....“సహరి” ఆన్ లైన్ పత్రికలో వచ్చిన నా కథ “కమ్మని కాపురం”
కమ్మని కాపురం
"రోజుకో టైము దానికి. నా పుణ్యం ఎలా ఉంటే అలా. ఓ రోజు
ఆరింటికే వస్తుంది. ఓ రోజు ఏడూ..ఏడున్నరా అయినా అయిపూ అజా ఉండదు. నాకా నడుం
నొప్పి. అదొచ్చి చీపురేశాక దేవుడికి దీపం పెట్టేసరికి ఓ రోజు ఆరున్నరా, ఓ రోజు తొమ్మిదీ!! ఎనిమిదైతే చాలు.. తద్దినం భోక్తలా
చెంబుతో నీళ్లెట్టుక్కూచుంటాడీయన ఫలహారానికి. ఇడ్లీలోకి చట్నీ లేకపోతే అల్లుడైనా
ఆవకాయ వేసుకు తింటాడు గాని మీ బావ మాత్రం నన్ను చట్నీ చేసుకుని
నంజుకుంటాడు!" ఫోన్ లో చెల్లెలితో వాపోతోందావిడ.
"అంతా నీ చవటతనవేఁ.. పొద్దున్న ఆరింటికల్లా వస్తే రా... లేకపోతే
ఫో అని పని మనిషికి గట్టిగా చెప్పలేవు. నా గురించి
మాత్రం ఊరూ వాడా చాడీలు చెప్పి నా పరువు తియ్యగలవు"
ఫోన్ ఠక్కుమని
ఆపేసిందావిడ.
"ఇదిగో, పనిమనిషి జోలికి రావద్దని ఇప్పటికి లక్షసార్లు చెప్పాను
మీకు. ఇవి గవర్నెంటుద్యోగాలు కావు హాఠ్ టూఠ్ అనడానికి. ఏ పని మనిషీ తిట్లు పడదు.
దానిగ్గనక కోపం వచ్చి పని మానీసిందంటే నా పాట్లు కుక్కలు పడవు.. "
"ఆ భయంతోనే నువ్వు
దానికి లోకువైపోతున్నావు. ఇది గాకపోతే మరొహత్తి. అసలు నువ్విచ్చే రెండు వేలకి అది
ఒరగబెడుతున్నదేవిఁటి.. ఇలా ఒయ్యారంగా చీపురు పట్టుకుని కాస్సేపు డాన్సాడుతుంది. తడిగుడ్డ
కూడా రోజూ పెట్టదు. నాగాలు సరేసరి. ఈ నెల్లో ఎన్ని రోజులు నాగా పెట్టిందో నేను
నోట్ చేశాను. రానీ దాన్ని.. నేనే మాట్లాడతా"
"ఇదిగో. .."
ఆవిడ గొంతు పెరిగింది.
"పనిమనిషి
జోలికెళ్లారా... జాగర్త"
"గాడిద గుడ్డు. ఆఫ్ట్రాల్ పనిదానికి భయపడతావేమిటే నువ్వూ.. ఇవాళే దాని సంగతి తేల్చేస్తాన్
చూడు!"
ఆవిడ భద్రకాళిలా
చూస్తూ ఫోన్ టకటకా నొక్కింది. అవతలివాళ్లు ఫోన్ ఎత్తలేదు. ఆవిడ మళ్లీ మళ్లీ వాళ్లు
ఫోన్ ఎత్తేదాకా చేస్తూనే ఉంది.
"అబ్బా...
ఏవిఁటమ్మా పొద్దున్నే.. " అవతలి నుంచి విసుగ్గా వినిపించింది.
"మీ నాన్ననడుగు ఆ
మాట. ఆయనకి చెప్పు ముందు. ఏ ముహూర్తాన రిటైరయేడో కానీ నా ప్రాణం
తీసేస్తున్నాడు. దేవుడమ్మ ఎంత నమ్మకమైందో నీకు తెలుసు. బంగారం కనబడ్డా ముట్టుకోదు.
పని శుభ్రంగా చేస్తుంది. అందుకే దానికి బోల్డు డిమాండ్. దాంతో ఆల్రెడీ ఒకసారి గొడవ
పడ్డాడీయన. ఎలాగో బతిమాలీ బామాలీ నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్లీ గొడవాడతానని
పూటకోసారి బెదిరిస్తున్నాడు. నాకు బీపీ పెరిగిపోతోంది. అసలు రిటైరయాక గొడవల మనిషైపోయాడు
మీ నాన్న. మొన్న అపార్ట్ మెంట్ సెక్రటరీతో
ఎందుకో గొడవాడేట్ట. ఇంతకు ముందు నన్ను చూస్తే ఎంతో గౌరవంగా పలకరించే మనిషి.. ఇప్పుడు
ఆయనా పెళ్లామూ కూడా నన్ను చూసి మొహాలు తిప్పుకుని పోతున్నారు. ఏవండీ అంటే గవర్నర్
గారి రూల్సన్నీ మాట్లాడతాడీయన. భారత రాజ్యాంగం తిరగేస్తాడు. నా వల్ల కాదు. మీ
నాన్నతో నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. నిన్నటికి నిన్న ఏం చేశాడో తెలుసా....
"
తన చేతిలో ఫోన్
ఛటాలున లాక్కునే సరికి ఆవిడ ముందు బిత్తరపోయి, తర్వాత
కాళికావతారం ఎత్తింది.
ఆయన ఫోన్ లో
కూతురికి చెబుతున్నాడు..."చూడూ, గ్రూప్ వన్
ఆఫీసర్ గా పాతికేళ్ళు పని చేశాను. నేను రిటైర్ అయి వచ్చేస్తుంటే మా బాసు, ఎవరనుకుంటున్నావ్, ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూడా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అలాంటిది పనివాళ్లకీ, రూలూ రెగ్యులేషనూ తెలీని బచ్చా వెధవలకీ లొంగి, నోరు మూసుకు పడుంటానా?! ముమ్మాటికీ ఆ
సెక్రటరీ ముండాకొడుకుదే తప్పు. వాడూ వాడి పెళ్లాం కాదు... బిల్డింగు యావన్మందీ
మొహాలు తిప్పేసుకున్నా సరే నేనామాటే చెబుతా..."
ఈసారి ఆవిడ
ఫెటేలున ఫోన్ ఊడలాక్కుంది.
"ఆఫీసర్ గా వెలగబెడితే చాలదు. బతకనేర్చిన తెలివితేటలు
ఉండాలి ముందు. మీ నాన్నకి చెప్పు, పనిమనిషీ, అపార్టుమెంటు సెక్రటరీ ఆయన మోచేతి కింది నౌకర్లు
కాదు."
ఆయన మళ్లీ ఫోన్
లాక్కోబోయాడు. కానీ ఆవిడ ఫోను గట్టిగా పట్టుకుని "మీ నాన్నతో నాకు ప్రాణం
విసిగెత్తిపోతోంది. ఎప్పుడే గొడవ తెస్తాడో అని బెంగే. ఈసారి మళ్లీ ఎవరితోనైనా
గొడవాడాడా... నేను చెప్పా పెట్టకుండా మా తమ్ముడి దగ్గరికి పోతాను. మీ నాన్న సంగతి
నువ్వే చూసుకో" అంది.
ఆవిడ ఇంకా ఏదో
అనబోతుండగా అవతలి నుంచి ఫోన్ కట్ అయింది. ఆవిడ కోపంగా ఫోన్ సోఫాలోకి విసిరేసి
వంటింట్లోకి వెళ్లిపోయింది.
ఆయన పళ్లు పటపట
లాడిస్తూ పేపర్లో తల దూర్చాడు.
*********
మర్నాడు శనివారం!
తెల్లవారుజామునే
ఆయన్ని లేపిందావిడ.
"లేవండి. ఇవాళ
శనివారం. మీకసలే ఏల్నాటి శని. తొందరగా లేచి స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి పూజ చేయిస్తా"
"నా చేత పూజ నువ్వు చేయించేదేవిఁటి?! నేను పువ్వు పెట్టలేనా.. అగ్గిపుల్ల గీసి దీపం
వెలిగించలేనా.. స్తోత్రాలూ శ్లోకాలూ చదువుకోలేనా"
"ఆఁ.. అన్నీ
చెయ్యగలరు. పువ్వులన్నీ ఒక్కసారే బుట్టలోంచి తీసి పిడికిట్లో ముద్ద చేసేసి అందరు
దేవుళ్లకీ తలా కాస్త ముద్దా పెట్టగలరు. దీపం కుందిలో అరచెంచాడు నూనీ, బల్ల మీద చెంచాడు
నూనీ. పదంటే పది నిమిషాల్లో సుప్రభాతం, స్తోత్రం, అష్టోత్తరం, గోవిందనామాలు
అన్నీ అయిపోతాయి. ఏ దిక్కుమాలిన చదువు చదివేరో గాని మీరు సుప్రభాతం చదువుతుంటే
ఏడుపొస్తుంది. నాతో బాటు ఆ దేవుడు కూడా ఏడవడం ఎందుగ్గానీ తొరగా తెవలండి."
ఆయన నోరెత్తకుండా
లేచి, స్నానం చేసి పట్టుపంచె కట్టుకుని దేవుడి మందిరం
ముందుకొచ్చేడు. ఆవిడ దగ్గరుండి శాస్త్రోక్తంగా పూజ చేయించింది.
"ఆఁ... నైవేద్యం
సమర్పయామి. ఇప్పుడు హారతివ్వండి"
ఆయన హారతిచ్చి, హారతి రేకు కింద పెట్టి చెయ్యి వెనక్కి తీసుకుంటూండగా ఆ
చెయ్యి వెళ్లి, వెండి గ్లాసు నిండా పోసి నైవేద్యం పెట్టిన పాలకి
తగిలింది. గ్లాసు తొణికి, ఇంచుమించు సగం పాలు ఒలికిపోయాయి. ఆ పాలల్లో కొన్ని
చుక్కలు గాల్లో ప్రయాణించి, పక్కనే ఉన్న హారతి రేకు మీద పడి, వెలుగుతూ ఉన్న కర్పూరం కాస్తా కొండెక్కిపోయింది.
"ఆఁ... ఆఁ...
ఆఁ..." పాలగ్లాసు తొణకగానే మొదలైన ఆవిడ ఆక్రోశం, హారతి కొండెక్కేసరికి ఆర్తనాదంగా మారిపోయింది.
"ష్ష్...
అరవకే.... " ఆయన కంగారు అణచుకుంటూ గబుక్కున పైకి లేచి పక్కనే ఉన్న దండెం మీద
చేతికందిన బట్ట లాగి, పాల ప్రవాహం మీద వేసేశాడు.
"ఆఁ... ఆఁ...
అయ్యో.. అయ్యో" పాలు పీల్చుకుంటున్న తన పట్టు జాకెట్టుని చూసి ఆవిడకి
ఏడుపొక్కటే తరవాయి.
"చాలాపు నీ గోల.
ఇక్కడ అంగుళం ఖాళీ ఉందా?! కొబ్బరి కాయ, అరటిపళ్లు, వడపప్పు, పానకం, చలిమిడి, పాలు, డ్రై ఫ్రూట్స్... చెయ్యి ఎటు తిప్పినా ఏదో ఒకటి తగుల్తుంది.
ఇండియా మేప్ కూడా ఇంత గజిబిజిగా ఉండదు. కనిపించని దేవుడికి ఇన్ని
నైవేద్యాలు. ఏడాదికి నాలుగు పట్టుచీరలు కొనే మొగుడికి ఒక్ఖ రెండు రకాలు చేసి పెట్టడానికి గొల్లున ఏడుపు. వచ్చే వారం నుంచి
నువ్వే చేసుకో పూజ. నా వల్ల కాదు"
"తప్పు నా మీదకి
తొయ్యడమే గాని నీ తప్పు నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవు" ఆవిడ రౌద్రంగా అరిచింది.
"ఒక్క మచ్చ
లేకుండా ఎక్సలెంట్ మార్కుతో రిటైరయేను. నా తప్పేవిఁటి మధ్యలో?!" ఆయన లేచి వెళ్లిపోయేడు. వెళుతూ వెళుతూ, "టిఫిను తొందరగా పట్రా. తెల్లారుజామునే లేపేశావు. ఆకలి
దంచేస్తోంది. మరో ఇడ్లీ ఎక్కువ పెట్టు. కారప్పొడిలో నెయ్యి బాగా వెయ్యి. ముందు
అర్జంటుగా కాఫీ పట్రా" అనేసి వెళ్లిపోయేడు.
ఆవిడ పళ్ళు నూరుకుంటూ పైకి లేచింది.
సాయంత్రం ఆరింటికి కూతురు ఫోన్ చేసింది.
"ఏం చేస్తున్నావమ్మా" అని ఆ పిల్ల అడిగీ
అడగడంతోనే ఆవిడ దండకం మొదలెట్టింది. "ఏం చేస్తానూ... చపాతీ పిండి
పిసుక్కుంటున్నాను. ఇల్లే వైకుంఠం... వంటిల్లే కైలాసం!! వన్నాట్ ఫైవ్ జానకమ్మ గారూ
ఆయనా చాక్కగా రోజూ గుడికెళ్లి, ప్రశాంతంగా ఓ గంట
గడిపి వస్తారు. టూ నాట్ సెవెన్ సీతగారూ ఆయనా కలిసి తిరపతి వెళ్ళేరు. నా బతుకు
మాత్రం ఇల్లో నారాయణ వేణుగోవిందా...ఏడుకొండలవాడు దిగొచ్చి రావయ్యా అన్నా మీ నాన్న
కదలరు. ఇంట్లో పూజే అంత కమ్మగా చేస్తున్నారు. పేపరూ టివీ తప్ప మరో లోకం లేదు గదా
మహానుభావుడికి... " అంది.
అటు నించి
కూతురు, “అమ్మా, ఇల్లు అద్దేకిచ్చేసి నువ్వూ నాన్నామా దగ్గరకొచ్చెయ్యండి. రొజూ
ఫోన్లో మీ గొడవలు వినలేక చస్తున్నాను. కుక్కల్లా కొట్టుకుంటున్నారిద్దరూ. మీ
గొడవలు కాదు గాని నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది.” అంది.
కూతురి మాటలు విని, ఆవిడ "ఏవిఁటీ.. ఈ ఇల్లద్దెకిచ్చేసి మీ దగ్గరకొచ్చెయ్యాలా...కుక్కల్లా కొట్టుకుంటున్నామా...!! హవ్వ, ఎవరైనా వింటే నవ్విపోతారు. పెళ్లయిన ఇన్నేళ్లకి ఆయన రిటైరై ఖాళీగా ఉండబట్టి ఏదో కాస్త మంచీ చెడ్డా మాటాడుకుంటున్నాం. చిలకా గోరింకల్లా హాయిగా కాపరం చేస్తున్నాం. ఇన్నాళ్లూ మా చుట్టూ కాపలా భటుల్లా ఎవరో ఒకరు. ఎప్పటికైనా ఇద్దరం కాస్త హాయిగా ఉంటామా అనుకునేదాన్ని. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ మీ నాన్నకి నోట్లో ముద్దా వీధిలో కాలూ!! పిచ్చి మనిషి ఏనాడైనా తీరిగ్గా తిని ఎరుగుదురా..?! ఇప్పుడు కూడా ఏదో తింటున్నారు గానీ పాపం ఆయనకి నాలుగూ చేసి పెడదామంటే నాకు ఓపికే ఉండట్లేదు. మొన్నటికి మొన్న పొద్దున్నే లేవలేకపోయాను. ఆయనెంత కంగారు పడ్డారో... వద్దు వద్దంటున్నా కాఫీ కలిపి తెచ్చి అందించేరు. ఎంత బాగా కలిపారో...నాకెంత సంతోషమనిపించిందో..! మొన్న నా పుట్టినరోజుకి ఇంట్లో వంట చెయ్యకు అని హోటలుకి తీసికెళ్లేరు...” ఫుల్ స్టాప్ కామాల్లేకుండా చెప్పుకుపోతున్న ఆవిడ, "ఆపు. మళ్లీ పొద్దున్నే నాకు ఫోన్ చేశావో.... " అని ఓ అరుపు అరిచి కూతురు ఫోన్ పెట్టెయ్యడం చూసి, "ఏవిఁటో ఈ పిల్లలు.. " అంటూ ఫోన్ పెట్టేసి, "ఏవండీ... చపాతీల్లోకి కూరేం చెయ్యమంటారు" అంటూ హాల్లోకి బైల్దేరింది!!
***************