25, ఫిబ్రవరి 2014, మంగళవారం

అందాల కడలి-7


ఆ తల్లి కామేశ్వరి !!


శ్లో :
 
     ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః 
     వసంతస్సామంతో మలయమరుదా యోధనరధః 
     తధాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం 
     అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే ! 
                                    ఇది సౌందర్య లహరిలోని ఆరవ శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే.."ఓ హిమగిరినందనా..మన్మధుని విల్లు చూడబోతే పుష్పాలతో కూర్చినది. అల్లెతాడో..తుమ్మెదల బారు మాత్రమే. పోనీ దగ్గర ఏమైనా అక్షయ తూణీరం ఉందనుకుందామా అంటే ఉన్నవన్నీ కలిపితే ఐదే బాణాలు. సామంతుడో..కేవలం ఏడాదికి రెండు నెలలు మాత్రమే పచ్చగా ఉండగల వసంతుడు. పోనీ రధమేమైనా అత్యంత మహత్తు గలదా అనుకుంటే అది మలయమారుతం. స్వయంగా అతగాణ్ణి చూడబోతే అసలు శరీరమే లేని అనంగుడు. సామగ్రి దగ్గర్నించి అసలు వ్యక్తి దాకా అంతా ఇంత పనికిరాని వస్తు సముదాయంతో కూడినదైనా..మన్మధుడు జగత్తు మొత్తాన్ని జయిస్తున్నాడు. అది నీ కడగంటి చూపుల అనుగ్రహం వల్లనే కదా తల్లీ!"   
                           ఇక భావార్ధంలోకి వెళితే...ఈ శ్లోకం చదివినప్పుడల్లా నాకు అసలు దేవికీ, మన్మధునికీ తేడా ఏముందో అర్ధమే కాదు. ఆ తల్లి పుష్పబాణచాప. (అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం) మన్మధుడు పూవింటివాడు. ప్రపంచాన్నంతటినీ కనుగవ కదలికతో శాసించే భువనేశ్వరి చేత ధరించినది "మనోరూప ఇక్షు కోదండా"న్ని. అదిగాక ఆయమ చేతిలో విరాజిల్లుతున్నవి "పంచ తన్మాత్ర సాయక"లు. (పంచేంద్రియాలనే బాణాలు)  ఆ తల్లే స్వయంగా "మరాళీ మందగమన"   "వదనస్మర మాంగల్యగృహతోరణచిల్లికా" (దేవి ముఖం మన్మధుని మంగళకరమైన గృహంలా ఉందట. ఆమె కనుబొమలే ఆ గృహానికి కట్టిన మంగళతోరణాలు) ఇవన్నీ చాలనట్టు, స్మరతాపాన్ని పెంచి పోషించగల చంద్రుడు అమ్మ సిగలోనే ఉన్నాడు.  అంచేత..నన్నడిగితే దేవే మన్మధుడు..మన్మధుడే దేవి. సృష్టిలోని ఒక బుల్లి చీమ సైతం ఆ పరదేవత అంశను పుణికి పుచ్చుకోగా లేనిది..మహర్షుల్ని కూడా కలవరపెట్టగల మన్మధుడు భువనేశ్వరిలోని ఒక చిన్న రేణువు కాబోడా..?? కనుక..మన్మధునికి ఆ దేవి కరుణాకటాక్షం పరిపూర్ణంగా ఉండటమేమిటి..దేవి కదలమంటే మన్మధుడు కదులుతాడు..ఆగిపోమంటే ఆగిపోతాడు. ఇది ముమ్మాటికీ సత్యం. ఆ కరుణ ఉన్నంతసేపే మన్మధుడి ప్రజ్ఞ. లేని పక్షంలో అతడు ఉత్త బూడిదే..! 
                                      తపోదీక్షలో ఉన్న శివుణ్ణి పార్వతి పట్ల అనురక్తుణ్ణి చేసేందుకు మన్మధుణ్ణి నియమిస్తూ ఇంద్రుడు.."త్వం సర్వతోగామి చ సాధకం చ" అంటాడు. (కుమారసంభవం) "నా వజ్రాయుధాన్ని నేను తపోదీక్షలో ఉన్నవారిపై ప్రయోగించలేను. కాని నీకు అటువంటి అడ్డంకులు లేవు. మన్మధబాణం దేనిమీదికైనా వెళ్లగలదు..దేన్నయినా సాధించగలదు" అన్నది ఇంద్రుని మాట. విద్య-అవిద్య రెండూ తానే అయిన దేవికి తప్ప ఇలా జ్ఞాన-అజ్ఞానులందరిపైనా ప్రభావం చూపగల మహత్తు మరెవరికుంది? కాబట్టి మన్మధుడు బ్రహ్మాండనాయకి పరమాణువుల్లో ఒకడు.     
                                 మన్మధుని కారణంగా తన తపస్సు భగ్నమయ్యాక అతణ్ణి భస్మం చేసి మాయమైపోయాడు త్రిపురారి. అటుతర్వాత మన్మధుని భస్మం నించి "భండాసురుడ"నే భయంకరమైన రాక్షసుడొకడు పుట్టుకొచ్చాడట. మన్మధుణ్ణి బూడిద చేసేసి శివుడు ఎంచక్కా తన దారిన తాను పోగా...ఆ భండాసురుణ్ణి చంపుకొచ్చింది శ్రీదేవే..(భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా) మొగుడి చావుకి తట్టుకోలేక సహగమనానికి సిద్ధపడుతున్న రతీదేవిని ఓదార్చి, కాముణ్ణి అనంగుణ్ణి చేసి...ఆ గొప్పతనాన్ని తన మొగుడికి కట్టబెట్టిందీ ఆ శైలరాణ్ణందనే..! మరి కాముని మీద ఎంతటి అనుగ్రహం లేకపోతే ఇంత చేస్తుంది? అదలా ఉంచితే దేవి కామేశ్వరి... తాను కామునికి మారుపేరు  కాకపోతే ఈశ్వరుడి పేరుతో ఆ పేరుకు లంకె వెయ్యదు గదా...!!
                      కాబట్టి ఎలా చూసినా..యా దేవీ సర్వభూతేషు "చాయా రూపేణ" "శక్తిరూపేణ" సంస్థితా" కాబట్టి, సమస్త శృంగార ప్రపంచాన్నీ ఆ తల్లే నడిపిస్తోందన్నది మనం గ్రహించుకోవలసిన మాట.  అమ్మను సేవిస్తూ..విద్యాపధంలో సాగేవాడికి, "కామపూజిత" అయిన ఆ తల్లి "శృంగారరస సంపూర్ణ"గా గోచరించి సంసారాంబుధిని పాల్కడలి చేస్తుంది. అజ్ఞానమే పరమావధిగా అవిద్యలో మగ్గిపోయేవాణ్ణి తన చేత ధరించిన "క్రోధాకారాంకుశం"తో శిక్షిస్తుంది. అప్పుడా మన్మధుని చేష్ట వికటిస్తుంది. లేనిపోని చిక్కులొచ్చి పడతాయి. అందువల్ల అమ్మను సేవిస్తూ..పూవింటివాడి కడగంటి చూపులు,తూపులు మనపై సవ్యదిశలో పడేట్టు చూసుకోవడం చాలా ముఖ్యం. 
                        మన్మధుని చేతిలో ఐదు బాణాలున్నాయి. దేవి చేతిలో చేతిలో పంచ తన్మాత్ర సాయకలున్నాయి.సాయక అంటే బాణం.  తన్మాత్రలంటే ఇంద్రియాలు. పంచ తన్మాత్రలంటే పంచేంద్రియాలు. ప్రాణుల పంచేంద్రియాల్ని దెబ్బ తీయడంద్వారా వారిని తన వశం చేసుకుంటాడు మన్మధుడు. తన భక్తులకు ఇంద్రియనిగ్రహాన్ని ప్రసాదించి, హద్దులెరుగని వివశస్థితి కలగకుండా చూస్తుంది తల్లి.  
         ఇదీ సంగతి. ఇంక ముగింపు శ్లోకానికి వెళదామా...   

  హిమాద్రే స్సంభూతా సులలిత కరైః పల్లవయుతా
  సుపుష్పా ముక్తాభిర్ భ్రమరకలితా చాలకభరైః  
  కృతస్థాణు స్థానా కుచఫలనతా సూక్తి సరసా 
  రుజాం హంత్రీ గస్త్రీ విలసతి చిదానందలతికా !  
                                       ------శంకరాచార్య విరచితం            
 (భావం : ఆ దేవి జ్ఞానలత. ఆనందలత. ఆ లత మంచుకొండల్లో పుట్టింది. అందమైన అరచేతులనే పల్లవాలు కలది. ముత్యాల పూలు ఫూచింది. నల్లని తుమ్మెదలనే ముంగురులతో ముచ్చటగొలిపేది. (స్థాణువు అంటే శివుడు, మోడు) స్థాణువును ఆశ్రయించింది. స్తనఫలభారంతో వంగింది. సరసవాక్కుల తేనెలొలికించే ఆ లత సర్వరోగ నివారిణి..కలుషహారిణి..అది జ్ఞానానందలతిక..శివమనోవల్లరి)     
                               శంకరాచార్యులవారి కవితాచమత్కృతి శిఖరాగ్రానికి చేరిన శ్లోకమిది. పార్వతిని ఒక పూదీవెతో పోలుస్తూ ఆయన చేసిన ఈ వర్ణన నూటికి కోటి శాతం అనితరసాధ్యం. 
                     ఈ రోజుకు  సెలవా మరి......

1 కామెంట్‌: