9, ఫిబ్రవరి 2014, ఆదివారం

సావిత్రి వెడ్స్ నారాయణ

మా నాయనమ్మ నిజంగా అలనాటి నటి ఎస్. వరలక్ష్మికి సాటి రాగల హీరోయిన్. మృదువుగానూ, కటువుగానూ కూడా సరిసమానమైన నటనా చాతుర్యం ప్రదర్శించే చాకచక్యం  ఎస్. వరలక్ష్మి సొంతం. మెత్తగానూ..గట్టిగానూ కూడా ఉండగలగటం మా నాయనమ్మ సొంతం. కొడుక్కి పెళ్లయ్యేదాకా ఆవిడ పూర్తిగా రాముడి అవతారంలో జీవించింది. ఆనక రావణాసురుడి అవతారాన్ని పూర్తిగా ఎత్తకపోయినా...ఆ అంశ కొంచెం తెచ్చుకుని అమ్మ దగ్గర ప్రదర్శించింది. సరే..ముందు అసలు ఆవిడకి తాతగారితో పెళ్లి ఎలా అయిందో చెప్పుకోవాలి కదా...
                   మా నాయనమ్మకి ముచ్చటగా మూడు పేర్లు. కన్నవారు ఆవిడకి పెట్టిన పేరు వెంకట రత్నం. దత్తు తీసుకున్న వెంకట జోగయ్యగారు ఆ పేరు మార్చేసి సుబ్బలక్ష్మి అని పెట్టుకున్నారు. మరి మూడో పేరు ఎలా వచ్చిందో అది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక తల్లిదండ్రీ చచ్చిపోయిన మా తాతగారిని  తెచ్చి దగ్గర పెట్టుకున్నారే గాని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశ్యం నాయనమ్మ తండ్రి జోగయ్యగారికి నూటికి నూరుపాళ్లూ లేనేలేదు. మరి ఆయన ఆ కాస్త అయినా ఎందుకు తల ఒగ్గారూ అంటే అది నాయనమ్మ కారణంగానే. ఈ జులపాల బావలో ఏం చూసిందో గాని ఆవిడ పెళ్లంటూ చేసుకుంటే నారాయణ బావనే చేసుకుంటానని తల్లిదండ్రులకి కరాఖండీగా చెప్పేసింది.  
                               కూతురి మనసు నొప్పించలేక మేనల్లుణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఉద్ధరించడానికి నిశ్చయించుకున్నారే గాని జోగయ్య గారికి మా తాతగారు బాగుపడతారన్న నమ్మకం లేకపోయింది. అంచేత అచ్చం సినిమాలో లాగే  నాయనమ్మకి షరతులూ నియమాలూ విధించారు. బావతో ఆట్టే రాసుకు పూసుకు తిరక్కు...ఊరికే వాగకు వగైరా..వాటన్నిటినీ ఆవిడ కూడా  సినిమా హీరోయిన్ మల్లేనే తుంగలో తొక్కి పారేసి అదను దొరికినప్పుడల్లా బావ క్షేమసమాచారం కనిపెట్టుకోసాగింది.బావ భోజన ప్రియుడన్న విషయం తెలుసు కాబట్టి ఆయనగారికి నచ్చిన తినుబండారాలేవైనా ఉంటే రహస్యంగా కొంగులో మూట గట్టుకుని గుడికో బడికో తీసికెళ్లి అందించనూ అందించింది.   ఇలా రోజులు గడిచిపోతూ ఉండగానే జోగయ్యగారు మా తాతగారికి అంటకత్తెర వేయించెయ్యడం, ఆయన ఇంట్లోంచి పారిపోవడం జరిగాయి. దాంతో జోగయ్యగారు అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. "ఇంక ఆ వెధవకి పిల్లనిచ్చే మాటే లేదు ఫొపొ"మ్మన్నారు. పరిస్థితి అలా మలుపు తిరిగేసరికి మా నాయనమ్మ కూడా మరేమీ చెయ్యలేకపోయింది. ఎంతైనా ఆ పాతతరం సినిమా హీరోయిన్లు కూడా కాస్త నెమ్మదస్తులే కదా...ఈ తరం కుర్రకారంత ఫాస్ట్ కాదు. అంచేత పాపం ఆవిడ కూడా భట్టుమూర్తి నాయికలా బావురుమనడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది.  
                                 అక్కడ తాతగారు ఏం చేశారో..ఎలా ఉన్నారో గాని..ఇక్కడ జోగయ్య గారు మాత్రం మా నాయనమ్మకి జెట్ స్పీడులో సంబంధాలు చూసేశారు. కాని ఏం లాభం...ఒక్కటీ కుదరలేదు. వచ్చిన ప్రతీ సంబంధమూ ఏదో కారణంతో వెనక్కి పోవడమే గాని ముందుకొచ్చింది ఒక్కటీ లేకపోయింది. దాంతో జోగయ్యగారి ఇల్లాలు, అంటే మా నాయనమ్మ పెంపుడు తల్లి కూడా "పోనీలెండి..పిల్ల కూడా ఇష్టపడుతోంది, మన నారాయణకే ఇచ్చి చేద్దాం" అని మొగుడికి చెప్పి చూసింది. అయినా జోగయ్య గారు ససేమిరా అన్నారు. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. నాయనమ్మకి ఏ సంబంధమూ కుదరలేదు. ఆవిడ పొడుగు మనిషి. వయసుతో బాటు పొడుగు ఎదిగేస్తుంటే జోగయ్యగారికి కొత్త కంగారు పుట్టుకొచ్చింది. మరో పక్క మా తాతగారు ప్రభుత్వ పాఠశాలలో సంగీతం మాస్టారిగా ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చదువు రాకపోతే పోయింది గాని ఆయన  చాలా బాగా పాడేవారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు  కూడా. దాంతో  చుట్టాలంతా కలిసి.."వాడికీ దానికే రాసి పెట్టాడేమో భగవంతుడు. పిల్ల అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది గాని అంతా నీ చేతిలో ఉందిటయ్యా? పిల్ల ఎటూ వాణ్ణే చేసుకుంటానని ఏడుస్తోంది. అంచేత మారు మాట్లాడక దాన్ని నారాయణకిచ్చి చెయ్యి. పెళ్లయితే వాడే బాగుపడతాడు.మనిషి చెడ్డవాడేమీ కాదు కదా... " అంటూ నచ్చజెప్పారు. ఇలా పరిస్థితి తన చెయ్యి దాటిపోతూండేసరికి జోగయ్య గారి పట్టు నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. మరో పక్క మా తాతగారు ఎంతకీ దిగి రాకపోయేసరికి ఎంతైనా ఆడపిల్లనిచ్చుకునే తనే తగ్గి ఉండాలన్న సత్యమూ ఆయనకి బోధపడింది. దాంతో జోగయ్యగారు పూర్తిగా డౌన్ అయిపోయి...అల్లుడా మేనల్లుడా...అంటూ మా తాతగారి కోసం పరిగెత్తారు. 
                                               మొత్తానికి అలా మా తాతగారు-నాయనమ్మల పెళ్లి బాజాలు మోగాయి. ఇక మా నాయనమ్మకి మొత్తం మూడు పేర్లుండేవని చెప్పాను కదా...కన్నవాళ్లు వెంకట రత్నమనీ జోగయ్యగారు సుబ్బ లక్ష్మి అనీ పెట్టుకున్నారని చెప్పాను. మరి మా తాతగారికి మావగారి మీద కోపమో నిజంగా సుబ్బలక్ష్మి అన్న పేరు నచ్చలేదో గాని ఆయన కాబోయే పెళ్లానికి "సావిత్రి" అన్న పేరు స్వయంగా పెట్టుకుని మరీ పెళ్లాడారు. (అప్పటికి మహానటి సావిత్రి అసలు సినిమా రంగానికే రాలేదు. అంచేత ఇది ఆవిడ పేరు కాదు. బహుశా తాతగారికి సావిత్రీ సత్యవంతుల కధ నచ్చి ఉంటుంది..:) ) 
            మా నాయనమ్మ తాతగార్ల పెళ్లి వరకూ అయితే కధ సమాప్తం. అయితే మా తాతగారికి సంబంధించిన విశేషాలు బోలెడన్ని ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందామా మరి..? ఇవేల్టికి సెలవు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి