28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

అందాల కడలి-8

అహో...అహంకారస్వరూపిణీ..!! 



శ్లో : 7
 క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా
 పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా
 ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
 పురస్తా దాస్తాం నః పురమధితు రాహో పురుషికా !  

                                ఇది సౌందర్య లహరిలోని ఏడవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమిటంటే,"మెరుస్తున్న మణులతో కూడిన మొలనూలు కలది, గున్న ఏనుగు కుంభస్థలంతో సాటి రాగల కుచముల భారంతో కాస్త ముందుకు వంగినది, సన్నని నడుము గలది, శరత్కాల పూర్ణచంద్రబింబం వంటి నెమ్మోము గలది, చెరకు వింటిని, బాణాలను, పాశాన్ని, అంకుశాన్ని ధరించినది, త్రిపురాలను నిర్మూలించిన శివుడి అహంకార స్వరూపిణి అయిన భగవతి మా కట్టెదుట సాక్షాత్కరించుగాక..!" 
                                     ఇక భావార్ధంలోకి వెళదాం. అమ్మవారి దివ్య సౌందర్య వర్ణనకు తెరతీసిన మొట్టమొదటి శ్లోకమిది. సాధారణంగా కవులంతా సౌందర్య వర్ణన దగ్గరకొచ్చేసరికి స్త్రీనే వస్తువుగా తీసుకున్నారు తప్పితే పురుషుడికి తత్సమానస్థానం దక్కలేదు. రాముడు, కృష్ణుడు వంటి పురాణపురుషుల అందచందాల్ని వివిధ కవులు కీర్తించినా, స్త్రీ సౌందర్య వర్ణనకే ప్రధమ ప్రాధాన్యత లభించింది. అందునా ఎకాయెకీ విశ్వసౌందర్యానికే మూలమైన శ్రీదేవి దగ్గరకొచ్చేసరికి శంకరాచార్యులవారి లేఖిని సైతం కొత్త పుంతలు తొక్కింది. ఆది శంకరులు చేసిన అమ్మ సౌందర్య వర్ణనకు ఉద్భవించిన వ్యాఖ్యానాలు అన్నీ ఇన్నీ కావు. ఆ వర్ణన బీజాక్షర సమన్వితమూ, అత్యంత గుప్తమైన విషయ పరిజ్ఞానసహితమూ. మహానుభావులకు మాత్రమే గ్రాహ్యమయ్యే ఆ రకమైన అర్ధాల్ని ఒక పక్కన పెట్టి, సాధారణమైన అనుభూతుల్ని పరిగణనలోకి తీసుకుంటే..చతుర్దశ భువనాల్లోనూ భువనేశ్వరిని మించిన సౌందర్యవతి మరెక్కడా మనకు కానరాదు. ఆ అందం "మా అమ్మ ఇంత అందగత్తె సుమా" అన్న సాత్విక భావంతో మనల్ని పరవశింపజేస్తుంది. 
                        సరే ఇక సౌందర్య వర్ణనకొస్తే, కవులంతా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి సృష్టిలోని కొన్ని కొన్ని వస్తువులతో శాశ్వతమైన ఉపమ ఏర్పరిచేశారు. ముఖం చంద్రబింబం, కన్నులు కలువ రేకులు లేదా గండు మీనాలు, నాసిక సంపెంగ, పెదవులు దొండపళ్లు, కుచాలు ఏనుగు కుంభస్థలాలు, నడుము శూన్యం, ఊరువులు అరటి స్థంభాలు...ఇలా. శంకరులైనా కాళిదాసైనా సరే ఇవే ఉపమానాల్ని వినియోగించుకున్నారు. అయితే సార్వత్రికమైన ఆ ఉపమానాలన్నీ వారి వారి కవితా చమత్కృతి పుణ్యమా అని, దేవశిల్పి చేతికి చిక్కిన రాయిలా కొత్త సొబగులు సంతరించుకున్నాయి. 
                         ప్రస్తుత శ్లోకాన్నే తీసుకుంటే... "క్వణత్కాంచీదామా" అన్నారు శంకరులు. అమ్మ తన నెన్నడుమునకు అలంకరించుకున్నది సామాన్యమైన వడ్డాణం కాదు. చిరుమువ్వల మరుసవ్వడి చేసే మొలనూలు. వడ్డాణం అంటే దరిదాపు నాలుగు వేళ్ల వెడల్పున గల బంగారపు బద్దను గుండ్రంగా చుట్టీన ఆభరణ విశేషం. ఇది కాస్త మోటుగా ఉంటుంది. మొలనూలు అలా కాదు. సన్నగా, నాజూకుగా ఉండే బంగారు తాడు. దీన్ని ఇంచుమించుగా మొలతాడుగా చెప్పుకోవచ్చు. లలితలలితమైన సౌందర్యం గల శ్రీదేవికి అటు లలితా సహస్రం గాని, ఇటు సౌందర్య లహరి గాని మోటుగా ఉండే వడ్డాణాన్ని చుట్టలేదు...నాజూకుగా ఉండే మొలనూలును ధరింపజేశాయి.   "రత్న కింకిణికా రమ్య రశనాదామ భూషితా" అంటూ లలితా సహస్రం అమ్మను కీర్తించింది. మనోహరమైన కింకిణీ ధ్వనులు చేసే రమ్యమైన మణిమేఖలను ధరించిన తల్లి" అని దాని అర్ధం.  ఆభరణ విశేషాలు, అలంకార విశేషాలు సౌందర్యవతుల స్వాభావిక సౌందర్యాన్ని ఇనుమడింపజేసి,కొత్త అందాల్ని తెచ్చి పెడతాయి...బాపు హీరోయిన్ల నల్లని నాగుపాము జడల్లో ముద్దమందారాల్లా. మరి ఉందా లేదా అన్నట్టుండే దేవి నడుమును చుట్టిన నాజూకైన మణిమేఖల అంతకంటే నాజూకైన చిరుసవ్వడి చేస్తుంటే అది "మరు" (మారుని అంటే మన్మధుని) సవ్వడి కాకేమీ..?? ఓం ప్రధమంగా ఒక సన్నని బంగారు మొలతాడే ఇంత హృద్యమైన వర్ణనకు దారి తీస్తుంటే ఇక మిగతా శరీరాన్నీ, తదలంకార విశేషాల్నీ వర్ణించాలంటే అందుకు ఆ శంకరులే తగు గదా..!  
                                               సరే..నడుము సంగతి అయింది. ఇక కుచాల అందం. ఇక్కడ ఒక కవికీ మరో కవికీ పేచీయే లేదు. 

 "విద్యుద్వల్లి సమాన దేహలతికే మత్తేభ కుంభస్తనీ..
  హే ప్రియే తవ కరాత్తాంబూలమానీయతాం" 
                                      అన్నాడు కాళిదాసు.  ఆ కాళీ వరప్రసాదికైనా, ఈ శైవాంశ సంభూతునికైనా కుచాల స్థానంలో కనిపించేవి కరికుంభాలే..ఏనుగు ఎంత గంభీరమైనదో..తత్కుంభసమానకుచభారం గల పద్మినీ జాతి స్త్రీల హృదయాలు సైతం అంత   గంభీరమైనవేనన్నది వాత్సాయనుడు సైతం అంగీకరించిన విషయం. అందువల్ల కుచ సౌందర్యానికైనా, నెమ్మది తనానికైనా..వీటన్నిటినీ మించిన హుందాతనానికైనా ఏనుగులే స్త్రీలకు సరైన ఉపమా వస్తువులు.   
                       ఇక "పరిక్షీణా మధ్యే" అన్నారు శంకరులు. స్త్రీకైనా పురుషుడికైనా శరీరంలో ఏ భాగం ఎంత ఉండాలో అంత ఉంటేనే అందం. కొన్ని క్షీణించాలి..కొన్ని పుంజుకోవాలి. స్త్రీలకు అసలు ఉండకూడనిది నడుము. 
 "జలజవదన..చక్రజఘన..సింహమధ్య"
                        అన్నాడు అన్నమయ్య.  కుచభారానికి ఏనుగుల పోలిక వస్తే నడుమును చూడగానే గుర్తు రావాల్సింది సింహం. సింహానికి మధ్యభాగం ఎంత సన్నగా ఉంటుందో (ఆ ఆకృతికి తగినంత సన్నగా) స్త్రీకి కూడా అలాగే ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన ఒక మహా విచిత్రమేమంటే..కుచసౌందర్యం కోసం తీసుకునే ఏనుగూ...మధ్యభాగపు అందాన్ని వర్ణించేందుకు ఎంచుకునే సింహమూ రెండూ పరస్పర విరోధి జంతువులు. ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి చెండాడగలది ఒక్క సింహమే. సింహం కల్లోకి వచ్చినా ఏనుగు వణికిపోతుందిట. అలాంటి విరోధి జంతువుల పోలిక గల కుచాలు..నడుము కూడా పరస్పర విరుద్ధమైన ఆకృతుల్లో ఉండాలన్నమాట. అసలు సిసలైన కవయిత్రి, "సృష్టికర్త్రి" అయిన ఆ లలితాంబికే గదా...అవునంటారా..?! 
                               ఇక ముఖం విషయానికొచ్చినా కవులంతా ఏకగ్రీవంగా పోలిక తెచ్చేది పూర్ణ చంద్రబింబంతోనే. పూర్ణ చంద్రబింబం అనగానే చాలామందికి కేవలం పరిపూర్ణ వృత్తాకారమే (గుండ్రంగా ఉండటం) గుర్తొస్తూ ఉంటుంది. కాని ఇది తప్పు. ముఖాన్ని చంద్రబింబంతో పోల్చేది గుండ్రంగా ఉందని కాదు...షోడశకళలతో విరాజిల్లుతోందని. మొహం ఎంత గుండ్రంగా ఉన్నా కళావిహీనంగా ఉంటే అది అప్పడం మొహమే అవుతుంది గాని "రాకేందురమ్యానన"మెందుకవుతుంది..? ఇక తల్లి విషయానికొస్తే  షోడశకళలూ ఉద్భవించేది ఆయమ ముఖబింబం నుండే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే షోడశాక్షరీ మంత్రపూతమైన శ్రీవిద్యకు అధిదేవత అయిన లలితాంబికే షోడశకళలతో కూడిన పున్నమి చంద్రుడు. 
                                            ఇక ధనస్సు, బాణాలు, పాశం, అంకుశాలను చేతుల్లో పట్టుకుని ఉన్న ఆ పరదేవతను పురారి అయిన మహాశివుని "అహంకార స్వరూపిణి"గా వర్ణిస్తున్నారు ఆది శంకరులు. అదెలాగంటే..శక్తి లేనిదే శివుడు లేడు. మరి అటువంటప్పుడు సదాశివుడు.."నేను" (అహం) అంటూ దేనికైన అహంకరించి చెప్పుకోవాలంటే అందుకు ముందు ఆ తల్లి ఆయనలో ఉండాలి కదా..అంటే ఆ దేవాధిదేవుని అహంకారస్వరూపిణి ఆమే కదా..
                           ఇక్కడ మరో చిన్న మాట. స్త్రీ శక్తి స్వరూపిణి. నిండు నూరేళ్ల జీవితంలో స్త్రీ అండదండలు లేనిదే పురుషుడు కానీకి కొరగాడు. అయినప్పటికీ అతగాడు తనకు తానే అహంకరించి పేట్రేగిపోతాడు తప్పితే తన "అహం"కారానికి మూలం ఎక్కడుందో తెలుసుకోడే...:( 
                 ఇంతకీ ఆఖరుమాట ఏమిటంటే శివుని అహంకారస్వరూపిణి అయిన ఓ జగదంబా...మా కట్టెదుట సాక్షాత్కరించు తల్లీ అని ప్రార్ధిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో. మరి మనం కూడా అలాగే వేడుకుందామా...!!   

          ఇక ముగింపు శ్లోకానికి వెళదాం...

        సపర్ణామాకీర్ణాం కతిపయగుణైః స్సాదరమిహ
        శ్రయంత్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి
        అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః 
        పురాణోపి స్థాణుః ఫలతి కిల కైవల్య పదవీం !  

(భావం : (సపర్ణ అంటే ఆకులున్న తీగ) ఏవో కొద్దిపాటి ఔషధ గుణాలున్నంత మాత్రాన లోకులు సపర్ణను ఆదరిస్తారు గానీ ఇహలోకంలో తరించాలంటే అపర్ణనే (శివుడి కోసం ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసిన పార్వతిని మహర్షులు అపర్ణా అని పిలిచారు) సేవించాలన్నదే నా అభిప్రాయం. ఎందుచేతనంటే స్థాణువు (ఆకులు లేని మోడు, శివుడు) అపర్ణను పరిణయమాడిన తరువాతనే అర్ధనారీశ్వరుడై మోక్షఫలప్రదాత అయ్యాడు కదా..) 
                 ------శంకరాచార్య విరచితం 
 ఇక ఈ రోజుకు సెలవా మరి.... 

27, ఫిబ్రవరి 2014, గురువారం

విన్నపాలు వినవలే వింత వింతలూ...

                                ఈ ఏడాదికి శివరాత్రి గడిచిపోయినట్టే..! ఎల్లుండి నించీ ఫాల్గుణం. ఆ  మాసంలో మరే పండుగలూ లేవు. మళ్లీ కొత్తమావాస్య..ఆ మర్నాడు ఉగాది నించీ మరో కొత్త సంవత్సరం ప్రారంభం. జీవితంలో మరో కొత్త సంవత్సరమైతే ఇట్టే మొదలైపోతోంది గానీ..కొత్త సంవత్సరంలో మరో కొత్త జీవితం ప్రారంభమవుతుందన్న ఠికాణా ఎక్కడన్నా ఉందా..? ఏమిటో ఈ జీవితం.."బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక" అన్న కవిగారు ఎంత బాగా చెప్పారో గాని..మనుషుల జీవితాలతో ఆడుకోవడం దేవుడికి గొప్ప వేడుక. ఈ జన్మలో మనం న్యాయంగానే ఉంటాం. ఐనా మనకి కష్టాలు తప్పవు. "న్యాయానికివి రోజులు కావు. ఈ కలికాలంలో ఎడాపెడా అన్యాయాలు చేసేవాడికే సమస్తమూను" అని నిట్టూరుస్తాం. అందుకు సాక్ష్యంగా మన పక్కింటివాడి దగ్గర్నించి పక్క దేశంలో ఉన్నవాడి దాకా వెయ్యిన్నొక్క ఉదాహరణలు టకటకా చెప్పేస్తాం. ఏం చేస్తున్నా మన తలరాత మారట్లేదంటూ ఆఖర్న ఓ కిలోమీటరు నిట్టూర్పు వదులుతాం. అందుకే..నన్నడిగితే దేవుడు తన పరిపాలనలో కూడా ఈ కింది అమెండ్ మెంట్స్ చేస్తే బావుంటుందనుకుంటాను నేను...అవేమిటో చూడండి...
 1) మనం ఎలా ఉండాలో...కాలమాన పరిస్థితుల్ని బట్టి ఎలా నడచుకోవాలో క్షుణ్ణంగా చెప్పడానికి వీధికో పెద్దాయన / పెద్దావిడ ఉండాలి. ఆయన మాటని ధిక్కరించే శక్తి ఎవరికీ ఉండకూడదు. ఆ పెద్దాయన / పెద్దావిడ ఇప్పటి పూజారుల్లా భక్తుల దగ్గర చెయ్యిజాపే రకాలు, భయపెట్టి పూజలు చేయించి డబ్బు గుంజే రకాలూ  కాకూడదు. కరుణామయుడైన దేవుడికి పరిపూర్ణమైన ప్రతినిధుల్లా ఉండాలి.
 2) చెప్పిన తీరున నడచుకోనివాళ్లని ఆ పెద్దవాళ్లు వెంటనే శిక్షించే ఏర్పాటు ఉండాలి.ఆ నేరాలూ-విచారణా-శిక్షలూ-వాటి అమలూ అంతా కలిపి ఓ రెండు రోజుల్లో తెమిలిపోవాలి తప్పితే ఇప్పట్లా పోలీసులూ-వాళ్ల చుట్టూ తిరగడాలూ, కోర్టులూ-వాటిలో కేసులు పేరుకుపోవడాలూ, జైళ్లూ-వాటినిండా కిటకిటలాడుతూ జైలుపక్షులూ, ఆమ్యామ్యాలూ ఉండరాదు.
 3)ముఖ్యంగా ఏ జన్మలో చేసే పాపానికి ఆ జన్మలోనే శిక్షలు ముగిసిపోవాలి. అంతేగాని..."ఏ జన్మలో ఏ పాపం చేశామో" అనుకుంటూ  అయోమయంలో పడిపోతూ ఈ జన్మలో చెయ్యని పాపానికి ప్రజలు లేనిపోని బాధలు అనుభవించకూడదు.
 4)ఆడపిల్లలకి వరకట్నాలూ-వెయ్యిన్నొక్క ఈతిబాధలూ లేకుండా ఇట్టే పెళ్లిళ్లవాలి.వారి వారి భర్తలు వాళ్లని "ఇల్లే ఇలలో స్వర్గం ఇల్లాలే ఇంటికి దేవత" అన్నట్టు చూసుకోవాలి..డొమెస్టిక్ వయలెన్స్ అన్నది అసలు సృష్టిలోనే మాయమైపోవాలి.  
 5) సమాజ, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా సదరు పెద్దాయన / పెద్దావిడలే నడుం బిగించాలి. సమాజంలో శాంతి సౌభాగ్యాలకీ పర్యావరణానికీ హాని కలిగించేవారిని తక్షణమే శిక్షించాలి.
 6) జాతకాలు అనేవి పూర్తిగా మాయమైపోవాలి. ఎవరికి ఏది మంచిదో..ఎవరు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో..ఏ సమస్యకి ఏది పరిష్కారమో..ఏ ఆడపిల్ల ఏ పిల్లాణ్ణి చేసుకుంటే బావుంటుందో ఇత్యాదులన్నీ కూడా ఆ పెద్దవాళ్లే నిర్ణయించి చెప్పాలి తప్పితే వీధికో జ్యోతిష్కుడూ-వాడికి వందలకొద్దీ ఫీజులూ,ఆనక లేనిపోని భయాలూ..బెంగలూ  ఉండనేకూడదు.
                                          ఇంకా ఈ జాబితాలో ఇలాంటివి బోలెడన్ని రాసుకోవచ్చు..దేవుడు వాటిని అనుమోదిస్తానంటే.
                        ముఖ్యంగా నాకు మండేదెక్కడంటే "పురాకృతం" అన్న పదం దగ్గర. ఏ జన్మ తాలూకు క్రెడిట్టూ డెబిట్టూ ఆ జన్మకే దేవుడు ఎందుకు సరిపెట్టలేదో..వాటిని అలా జన్మ జన్మల బేక్ లాగ్ లో ఎందుకు పెట్టాడో   బుర్ర బద్దలుగొట్టుకున్నా అర్ధమై చావదు. మా మాస్టారొకాయన...ఎంత మంచివారో..ఆయన ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి ఎదిగొచ్చినవాడు..చెప్పా పెట్టకుండా పరలోకానికి టిక్కెట్టు పుచ్చేసుకున్నాడు. పాపం మా మేష్టారి భార్య పిచ్చిదే అయిపోయింది. నా స్నేహితురాలొకర్తికి పుట్టిన దగ్గర్నించీ ఏదో ఒక అనారోగ్యమే...అలాగే పెరిగింది..పెద్దయింది..చదువుకుంది..పెళ్లాడింది. ఇప్పుడు మొగుడి చేత తిట్లు తింటూ మరీ ఉద్యోగం కూడా చేస్తోంది...ఇంటెడు చాకిరీతో బాటు. వాళ్లత్తగారు టీవీ ముందునించి కదలదు. మా మంచి మేష్టారూ..అసలు ఆరోగ్యభాగ్యానికే నోచుకోని మా ఫ్రెండూ గత జన్మల్లో ఏయే  పాపాలు చేశారో ఆ దేవుడొక్కడికే తెలుసు గాని మనకొక్క ముక్క కూడా తెలీదు  కదా...:(  
                                              అంచేత...ఈ మహాశివరాత్రి పర్వదినాన..ఉపవాసాలుండి..జాగరణలు చేసే అనంతకోటి భక్తుల్లో ఏ ఒక్కరికైనా ఆ సదాశివుడు గనక కనిపిస్తే నా విన్నపంగా  ఒక్కమాట చెప్పండి...
                  "సామీ...ఎప్పటి పరీక్ష రిజల్ట్ అప్పుడే వచ్చేసినట్టు మా పాపపుణ్యాల వేల్యుయేషన్ ని కూడా ఎప్పటికప్పుడు చేసెయ్యి తండ్రీ...ఒకటో క్లాసు  పాసయ్యామో లేదో టెంత్ క్లాసుకొచ్చాక చెప్పి అప్పుడు మళ్లీ చెట్టంత వాళ్లని ఒకట్లో కూచోబెట్టమాకు. ఇవేళ రాసిన పరీక్ష రేపు తెలుస్తుందంటే జనం ఎంతో కొంతైనా జాగ్రత్తగా ఉంటారు. పదేళ్ల తర్వాతేనంటే  పరీక్షలనేవి లేకుండా అటెండెన్సుతోనే గట్టేక్కిపోయే కుర్రాళ్లు పుస్తకాలు గిరాటేసినట్టు ఈ పదేళ్లూ నేరస్తులంతా చిత్రగుప్తుడి పద్దు నింపేస్తారు. అది కాస్త గమనించు దేవా.."  
                 ఈ మాట చెప్పడం మర్చిపోకండేం..లేదంటే ఆ ఎద్దునెక్కిన దేవర మీకు కనిపించగానే నాకొక్క ఫోను కొట్టండి...నేనే వచ్చి సంగతేమిటో తేల్చుకుంటా...ఓకే...ఉంటా మరి. సెలవు.... 

26, ఫిబ్రవరి 2014, బుధవారం

"కొంటె గంగమ్మ" ట...:)

చూడండి...ఎటూ ఆయనగారి జటాకలాపం "గంగాతరంగ రమణీయమైన"దే గదా అని ఆ "కొంటె గంగమ్మ" మొగుడి జటల్లోంచి ఓ మూడు పాయలు ఏరి తీసి ఎంచక్కా జడేసి ఊడిపోకుండా రిబ్బనుతో బిగించి కట్టి మరీ నవ్వుతోంది...పాపం సవితి లీలలు భరించలేక పెద్దావిడ పుట్టింటికి వెళ్లిపోయిందో ఏమిటో గాని బొమ్మలో ఎక్కడా కనిపించట్లేదు. శివరాత్రి సందర్భంగా ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ బాబు గీసిన కార్టూన్ ఇది. ఎంత బావుందో కదా...నేను బాపు తర్వాత ఇష్టపడేవి జయదేవ్ బాబు కార్టూన్లనే..!


జయదేవ్ బాబు 

ఈ రోజుకు అయ్యవారు...


అర్జెంటు పని మీద రోడ్డు పట్టుకుని తిరగాల్సి వచ్చింది. అదిగాక..సంసార సాగరంలో అలల ధాటి కూడా కాస్త ఎక్కువై..సౌందర్య లహరి రాయలేకపోయాను.ఏమిటో..షేక్స్పియర్ చెప్పినట్టు జీవితంలో ఏడు అంకాలు మాత్రమే ఉన్నట్టు లేవు...రోజుకి కనీసం ఒక అంకం చొప్పున అనంతమైన అంకాలు ఉన్నట్టున్నాయి.ఎంతో కొంత కాలానికి దేవుడికి బాండు రాసేశాక అన్నాళ్లూ చచ్చినట్టో బతికినట్టో నటీంచక తప్పదు  కదా..!!
                  సరే..రేపు మహా శివరాత్రి. అమ్మ కోరి కోరి కట్టుకున్న అయ్యకి బోలెడంత సంరంభం. వెనకటికి ఎవరో అన్నారు...వైష్ణవాలయాల్లో పూజారులు చక్రపొంగలీ..దద్ధోజనం..లడ్డూలూ తినీ తినీ తెగ బలిసి ఉంటారుట..(పాపం శమించుగాక) శివాలయాల్లో పూజారులు ఉపవాసాలు చేసీ చేసీ బక్కచిక్కిపోయి ఉంటారుట. అంచేత..చెప్పొచ్చేదేమంటే రేపు పర్వదినం కదా అని మనం చచ్చీ చెడీ ఏ పిండివంటలూ వండి వార్చక్కర్లేదు. ఎల్లుండి పొద్దున్న దాకా సరిపడేలా ఇప్పుడే తినేసి ఎల్లుండి దాకా ముక్కు మూసుక్కూచుంటే చాలు.
                                   నా చిన్నతనంలో శివరాత్రి గానీ..కార్తీక సోమవారాలు గానీ ఇంటిల్లిపాదీ ఉపవాసాలు ఉండేవాళ్లం. ఒకర్ని చూసి ఒకరికి భక్తిభావం పెచ్చరిల్లేది. మరి ఇప్పుడో...బీపీ ఉందని నాన్నా..సుగరుందని అమ్మా..కాలేజీకి సెలవు లేదని అబ్బాయీ..పరీక్షలవుతున్నాయని అమ్మాయీ...ఇలా ఇంటిల్లిపాదీ సుష్టుగా తినేసి..వీలు దొరికినప్పుడు ఓ దండం పారెయ్యడంతో భక్తిని రక్తి కట్టించేస్తున్నారు. కాలమహిమ...ఏమనగలం..??
                సర్లెండి. ఇవేళ సౌందర్య లహరి ఎటూ లేదు గాబట్టి...అందాకా శివమానసపూజాస్తోత్రం చెప్పుకుందాం. శివస్తోత్రాలన్నిటిలోకీ నాకది చాలా ఇష్టం. ముందు స్తోత్రం చెప్పుకుని తర్వాత దాని గురించి చూద్దాం.

 రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ |
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || ౧ ||
సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || ౨ ||
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || ౩ ||
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || ౪ ||
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో || ౫ ||
నాలాంటిదానికి ఈ స్తోత్రం ఒక పెద్ద వరం. ఇది మహేశ్వరుడికి మనసా చేసే పూజ. దీనికి బాహ్యమైన వస్తువులతో పని లేదు. ఈ పూజ ఇలా సాగుతుంది...
                  "స్వామీ..రత్నాలతో ఆసనం తయారుచేశాను. (మరి బంగారపు సింహాసనానికే    రత్నాలు  తాపారో..లేక ఎకాయెకీ ఒక పెద్ద రత్నాన్ని దొలిచి ఆసనంలా తయారు చేశారో) హిమాలయ ప్రాంతంలో ప్రవహించే గంగ వంటి దివ్య నదుల్లోంచి మంచులా చల్లగా ఉన్న నీళ్లు తీసుకొచ్చి..ఇదిగో..నీకు స్నానం చేయిస్తున్నాను. (స్వామి రుద్రుడు. కోపం వస్తే తట్టుకోవడం కష్టం. అంచేత స్వామిని చల్లబర్చేందుకు గాను, మాఘమాసమైనా చలేస్తున్నా సరే స్నానానికి చన్నీళ్లే కావాలి.)   స్నానం అయిపోయిందా...ఇవిగో దివ్యమైన పట్టు పీతాంబరాలు. కట్టబెడుతున్నాను..చూడు..నీకు నచ్చాయా తండ్రీ..(అయినా నాకు తెలీకడుగుతానూ...దిక్కులే వస్త్రాలుగా గల దిగంబరుడికి పట్టు పీతాంబరాలేమిటి నా మొహం) బట్టలు కట్టేసుకున్నావా..ఇప్పుడు ఆభరణాలు తెస్తున్నానుండు. రకరకాల రత్నాలతో కూర్చిన విభూషితాలివి...నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఆఆ..నగలు అలంకరిచడం కూడా పూర్తయింది. ఇప్పుడు చందన చర్చ చేస్తానుండు. అదేమిటి స్వామీ..నువ్వెంత విభూతిరాయుడవైనా జగదీశ్వరుడవు...అప్పుడప్పుడైనా ఇలా..మాలాంటి భక్తుల ముచ్చట తీర్చడం కోసమైనా చందనమలదుకోవలసిందే..తప్పదు. ఇదేమి చందనమనుకున్నావు...కస్తూరీమృగాల వంటి మృగాల చెక్కిళ్లనుండి స్రవించే మదంతో తయారైన అత్యంత పరిమళభరితమైన చందనం. అయిందా...ఇప్పుడు పూలు. "గంగాతరంగ రమణీయమైన నీ జటాకలాపం" లో నన్ను పూలు కూడా ముడవనీ.పుష్పకోమలమైన అమ్మ చేతులకు బదులు సర్పబంధం అల్లుకున్న నీ మెడలో  పరిమళభరితమైన పూమాలను వేయనీ..ముజ్జగాలనేలే ముక్కంటివి నువ్వు...మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ అంటూ నీ పాదాల దగ్గర ఓపినన్ని పూలు రాశిగా పొయ్యనీ..ఒక్క పువ్వులే కాదు స్వామీ...నీకు అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు కూడా ఉన్నాయి. ఇవిగో..స్వీకరించు. పూసేవ అయిందా ఇప్పుడు నన్ను నీ చుట్టూ అగరు ధూపం వెయ్యనీ. నువ్వుండే  తావు అగరు పరిమళాలతో గుబాళిస్తూ మా బతుకుల్ని గుబాళింపజేయాలి. ఏ పూజకైనా ముందు పూలు పెట్టి అప్పుడు దీపం వెలిగిస్తారు.ఆనకే గంధమూ ధూపమూ. కాని నేను నీకు అన్నీ చేసేశాను..దీపం తప్ప. ఉండు..ముల్లోకాలూ కాంతివంతమయ్యేలా నీ ముందు బంగారు ప్రమిదలో నిండా ఆవునెయ్యి పోసి త్రికరణ శుద్ధిగా మూడు వత్తులు వేసి వెలిగించనీ...ఆఆ ఇదిగో దీపం. ఓ దయానిధీ..పశుపతీ..ఇవన్నీ నిజంగా లేవు తండ్రీ..నేను కూర్చున్న చోటి నించి కదలకుండా..నా ఊహాలోకంలో నీకివన్నీ "కల్పిస్తున్నాను". అంతే. దయతో స్వీకరించు. 
                    అలంకారాలూ అవీ అయ్యాయి...ఇప్పుడు నీకు కడుపునిండా భోజనం పెడతాను. బోలెడంత నెయ్యి పోసి నీకోసం పరమాన్నం తయారు చేశాను. పచ్చకర్పూరపు వాసనతో అది గుబాళిస్తోంది. కమ్మని నేతి ఘుమఘుమలు కైలాసందాకా వ్యాపిస్తున్నాయి. దాన్ని నవరత్నాలు తాపిన బంగారు పాత్రలో అమర్చాను. ఇదిగో..తిను. అదొక్కటే కాదు తండ్రీ...మమ్మేలే మారాజువు నీకు ఇంత బియ్యం ఉడకేసి పెట్టి ఊరుకుంటానా...ఐదు రకాలైన భక్ష్యాలు  (గారెలు, బూరెలు అవీ) తయారు చేశాను. ఎర్రగా కాగిన పాలూ, కమ్మని మీగడ పెరుగూ కూడా ఉన్నాయి. కేవలం వీటితోనే భోజనం పూర్తి కాదుగా...పెరుగన్నంలోకి నంజుకుంటావో..భోజనమంతా అయ్యాక తింటావో నీ ఇష్టం గాని, తేనె కంటే తియ్యనైన చక్కెరకేళీ అరటిపళ్లు కూడా తెచ్చాను..అచ్చంగా నీకోసం. ఇక తాగడనికి మేం తాగినట్టు ఉత్తి నీళ్లిస్తానా నీకు...రకరకాల పళ్లూ, కూరల నించి తయారు చేసిన రుచికరమైన పానీయం ఇదిగో...హాయిగా తాగు.  పెళ్లికొడుకులా అలంకరించుకున్నావు. కడుపునిండా భోంచేశావు. బిడ్డ తిండి తల్లి చూసినా దిష్టి తగులుతుందిట.నువ్వు తింటూండగా ఎంతమంది చూశారో..ఉండు గుత్తంగా ఇంత ముద్ద కర్పూరం వెలిగిస్తున్నాను...నీ చుట్టూ తిప్పి దిష్టి తీసి మంగళం పలుకుతాను. ఆఆ..అయింది. ఇంక హాయిగా విశ్రాంతిగా కూచో..భోజనం తర్వాత మంచి తాంబూలం ఉంటేనే ఆ భోజనం తాలూకు పస. ఇదిగో తాంబూలం...పచ్చకర్పూరమూ..ఏలకులూ మిళాయించాను. నిజంగా బజారు నించి ఆకూ వక్కా తెచ్చాననుకునేవు సామీ...లేదు లేదు..ఇదంతా నా మనసులో సాగుతున్న ఉత్తుత్త పూజే. మానస పూజ.   అయితేనేం...నువ్వంటే నాకెంతో భక్తి..ప్రేమ..ఆరాధన. అంచేత నేను చేస్తున్న ఈ మానస పూజను స్వీకరించు తండ్రీ..
                     అయిందా...నువ్వెంత హిమగిరిపై ఉన్నా వేడిగానే ఉంది సామీ, గొడుగు పడుతున్నానుండు. చమరీ మృగాల నించి తయారు చేసిన చామరాలతో నీకు వీవన వీయనీ...ఈ క్షణం నువ్వు ఎంత బావున్నావో తెలుసా...అందుకే ఆ త్రిపురసుందరి ఆకులలములు కూడా మానేసి తపస్సు చేసి మరీ నువ్వే కావాలంది. ఎందుకు స్వామీ నవ్వుతావు...నా మాట నమ్మవా...కావాలంటే ఇదిగో నిర్మలమైన అద్దం..నీ అందాన్ని నువ్వే చూసుకో. అద్దం అబద్ధం చెప్పదు. సర్లే...ఈ కబుర్లెందుకు గాని...లయాత్మకమైన విధులతో అలసి సొలసి ఉన్నావు నువ్వు. కాస్సేపు వీనుల విందుగా  వీణాభేరీమృదంగ కాహళ వాద్యాలతో కూడిన గీతాల్ని విను. ఇదిగో అందాల సురభామినులు ముల్లోకాలూ మురిసిపోయేలా నృత్యం చేస్తున్నారు. తిలకించు. ఈ పవిత్రమైన వేళ..నీ పావనమైన సన్నిధిలో నేను సాంగంగా నీ ఎదుట సాష్టాంగపడుతున్నాను. నాకు తోచినట్టు అనేక విధాల  నిన్ను స్తుతిస్తున్నాను. వాస్తవానికి ఇవేమీ కూడా నేను చెయ్యలేదు తండ్రీ...మా విభుడివైన నీకోసం నా మనస్సులో ఇవన్నీ సంకల్పించుకుంటున్నాను..అంతే. ప్రభూ..నా ఈ మానస పూజను స్వీకరించు.  
                                         స్వామీ...ఇన్ని మాటలెందుకు...నా ఆత్మ నువ్వే. నా బుద్ధి శివపత్ని అయిన ఆ గిరిజమ్మ. నా పంచ ప్రాణాలూ నీ సహచరులైన శివగణాలు.  పాంచభౌతికమైన నా ఈ శరీరమే నీ ఇల్లు. నేను నా జీవనయానంలో చేసే దైనందిన కృత్యాలే నీకు పూజ. నేను చలనం వలనం లేకుండా నిద్రపోతాను చూశావా..అదే నా తపస్సమాధి. రోజూ నేను నడిచే నడకే నీకు ప్రదక్షిణాలు. నా నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాటా నీకు స్తోత్రమే. ఇంకా ఒక్క మాటలో చెబుతున్నాను చూడు...నేనంటూ అసలు ఏ ఏ పనులు చేస్తానో..ఓ శంభో...అదంతా నీ ఆరాధన కోసమే.   
 నేను చేతులతో గాని కాళ్లతో గాని..పనుల ద్వారా గాని, వాక్కు ద్వారా గాని, విని గాని, చూసి గాని, మనస్సులో గాని, తెలిసి గాని తెలియక గాని చేసిన అపరాధాలన్నిటినీ క్షమించు తండ్రీ...నన్ను దయజూడు శంకరా..!! 
              ఇదండి ఆ స్తోత్ర భావం. ఇంతకీ దీన్ని ఎవరు రాశారనుకుంటున్నారు...ఊహించేశారా...మరెవరు...మన గురువుగారు..ఆది శంకరాచార్యులవారు. అందుకే ఇది ఇంతా బావుంది...! 
 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో...సెలవు మరి.... 







                                            

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

అందాల కడలి-7


ఆ తల్లి కామేశ్వరి !!


శ్లో :
 
     ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః 
     వసంతస్సామంతో మలయమరుదా యోధనరధః 
     తధాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం 
     అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే ! 
                                    ఇది సౌందర్య లహరిలోని ఆరవ శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే.."ఓ హిమగిరినందనా..మన్మధుని విల్లు చూడబోతే పుష్పాలతో కూర్చినది. అల్లెతాడో..తుమ్మెదల బారు మాత్రమే. పోనీ దగ్గర ఏమైనా అక్షయ తూణీరం ఉందనుకుందామా అంటే ఉన్నవన్నీ కలిపితే ఐదే బాణాలు. సామంతుడో..కేవలం ఏడాదికి రెండు నెలలు మాత్రమే పచ్చగా ఉండగల వసంతుడు. పోనీ రధమేమైనా అత్యంత మహత్తు గలదా అనుకుంటే అది మలయమారుతం. స్వయంగా అతగాణ్ణి చూడబోతే అసలు శరీరమే లేని అనంగుడు. సామగ్రి దగ్గర్నించి అసలు వ్యక్తి దాకా అంతా ఇంత పనికిరాని వస్తు సముదాయంతో కూడినదైనా..మన్మధుడు జగత్తు మొత్తాన్ని జయిస్తున్నాడు. అది నీ కడగంటి చూపుల అనుగ్రహం వల్లనే కదా తల్లీ!"   
                           ఇక భావార్ధంలోకి వెళితే...ఈ శ్లోకం చదివినప్పుడల్లా నాకు అసలు దేవికీ, మన్మధునికీ తేడా ఏముందో అర్ధమే కాదు. ఆ తల్లి పుష్పబాణచాప. (అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం) మన్మధుడు పూవింటివాడు. ప్రపంచాన్నంతటినీ కనుగవ కదలికతో శాసించే భువనేశ్వరి చేత ధరించినది "మనోరూప ఇక్షు కోదండా"న్ని. అదిగాక ఆయమ చేతిలో విరాజిల్లుతున్నవి "పంచ తన్మాత్ర సాయక"లు. (పంచేంద్రియాలనే బాణాలు)  ఆ తల్లే స్వయంగా "మరాళీ మందగమన"   "వదనస్మర మాంగల్యగృహతోరణచిల్లికా" (దేవి ముఖం మన్మధుని మంగళకరమైన గృహంలా ఉందట. ఆమె కనుబొమలే ఆ గృహానికి కట్టిన మంగళతోరణాలు) ఇవన్నీ చాలనట్టు, స్మరతాపాన్ని పెంచి పోషించగల చంద్రుడు అమ్మ సిగలోనే ఉన్నాడు.  అంచేత..నన్నడిగితే దేవే మన్మధుడు..మన్మధుడే దేవి. సృష్టిలోని ఒక బుల్లి చీమ సైతం ఆ పరదేవత అంశను పుణికి పుచ్చుకోగా లేనిది..మహర్షుల్ని కూడా కలవరపెట్టగల మన్మధుడు భువనేశ్వరిలోని ఒక చిన్న రేణువు కాబోడా..?? కనుక..మన్మధునికి ఆ దేవి కరుణాకటాక్షం పరిపూర్ణంగా ఉండటమేమిటి..దేవి కదలమంటే మన్మధుడు కదులుతాడు..ఆగిపోమంటే ఆగిపోతాడు. ఇది ముమ్మాటికీ సత్యం. ఆ కరుణ ఉన్నంతసేపే మన్మధుడి ప్రజ్ఞ. లేని పక్షంలో అతడు ఉత్త బూడిదే..! 
                                      తపోదీక్షలో ఉన్న శివుణ్ణి పార్వతి పట్ల అనురక్తుణ్ణి చేసేందుకు మన్మధుణ్ణి నియమిస్తూ ఇంద్రుడు.."త్వం సర్వతోగామి చ సాధకం చ" అంటాడు. (కుమారసంభవం) "నా వజ్రాయుధాన్ని నేను తపోదీక్షలో ఉన్నవారిపై ప్రయోగించలేను. కాని నీకు అటువంటి అడ్డంకులు లేవు. మన్మధబాణం దేనిమీదికైనా వెళ్లగలదు..దేన్నయినా సాధించగలదు" అన్నది ఇంద్రుని మాట. విద్య-అవిద్య రెండూ తానే అయిన దేవికి తప్ప ఇలా జ్ఞాన-అజ్ఞానులందరిపైనా ప్రభావం చూపగల మహత్తు మరెవరికుంది? కాబట్టి మన్మధుడు బ్రహ్మాండనాయకి పరమాణువుల్లో ఒకడు.     
                                 మన్మధుని కారణంగా తన తపస్సు భగ్నమయ్యాక అతణ్ణి భస్మం చేసి మాయమైపోయాడు త్రిపురారి. అటుతర్వాత మన్మధుని భస్మం నించి "భండాసురుడ"నే భయంకరమైన రాక్షసుడొకడు పుట్టుకొచ్చాడట. మన్మధుణ్ణి బూడిద చేసేసి శివుడు ఎంచక్కా తన దారిన తాను పోగా...ఆ భండాసురుణ్ణి చంపుకొచ్చింది శ్రీదేవే..(భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా) మొగుడి చావుకి తట్టుకోలేక సహగమనానికి సిద్ధపడుతున్న రతీదేవిని ఓదార్చి, కాముణ్ణి అనంగుణ్ణి చేసి...ఆ గొప్పతనాన్ని తన మొగుడికి కట్టబెట్టిందీ ఆ శైలరాణ్ణందనే..! మరి కాముని మీద ఎంతటి అనుగ్రహం లేకపోతే ఇంత చేస్తుంది? అదలా ఉంచితే దేవి కామేశ్వరి... తాను కామునికి మారుపేరు  కాకపోతే ఈశ్వరుడి పేరుతో ఆ పేరుకు లంకె వెయ్యదు గదా...!!
                      కాబట్టి ఎలా చూసినా..యా దేవీ సర్వభూతేషు "చాయా రూపేణ" "శక్తిరూపేణ" సంస్థితా" కాబట్టి, సమస్త శృంగార ప్రపంచాన్నీ ఆ తల్లే నడిపిస్తోందన్నది మనం గ్రహించుకోవలసిన మాట.  అమ్మను సేవిస్తూ..విద్యాపధంలో సాగేవాడికి, "కామపూజిత" అయిన ఆ తల్లి "శృంగారరస సంపూర్ణ"గా గోచరించి సంసారాంబుధిని పాల్కడలి చేస్తుంది. అజ్ఞానమే పరమావధిగా అవిద్యలో మగ్గిపోయేవాణ్ణి తన చేత ధరించిన "క్రోధాకారాంకుశం"తో శిక్షిస్తుంది. అప్పుడా మన్మధుని చేష్ట వికటిస్తుంది. లేనిపోని చిక్కులొచ్చి పడతాయి. అందువల్ల అమ్మను సేవిస్తూ..పూవింటివాడి కడగంటి చూపులు,తూపులు మనపై సవ్యదిశలో పడేట్టు చూసుకోవడం చాలా ముఖ్యం. 
                        మన్మధుని చేతిలో ఐదు బాణాలున్నాయి. దేవి చేతిలో చేతిలో పంచ తన్మాత్ర సాయకలున్నాయి.సాయక అంటే బాణం.  తన్మాత్రలంటే ఇంద్రియాలు. పంచ తన్మాత్రలంటే పంచేంద్రియాలు. ప్రాణుల పంచేంద్రియాల్ని దెబ్బ తీయడంద్వారా వారిని తన వశం చేసుకుంటాడు మన్మధుడు. తన భక్తులకు ఇంద్రియనిగ్రహాన్ని ప్రసాదించి, హద్దులెరుగని వివశస్థితి కలగకుండా చూస్తుంది తల్లి.  
         ఇదీ సంగతి. ఇంక ముగింపు శ్లోకానికి వెళదామా...   

  హిమాద్రే స్సంభూతా సులలిత కరైః పల్లవయుతా
  సుపుష్పా ముక్తాభిర్ భ్రమరకలితా చాలకభరైః  
  కృతస్థాణు స్థానా కుచఫలనతా సూక్తి సరసా 
  రుజాం హంత్రీ గస్త్రీ విలసతి చిదానందలతికా !  
                                       ------శంకరాచార్య విరచితం            
 (భావం : ఆ దేవి జ్ఞానలత. ఆనందలత. ఆ లత మంచుకొండల్లో పుట్టింది. అందమైన అరచేతులనే పల్లవాలు కలది. ముత్యాల పూలు ఫూచింది. నల్లని తుమ్మెదలనే ముంగురులతో ముచ్చటగొలిపేది. (స్థాణువు అంటే శివుడు, మోడు) స్థాణువును ఆశ్రయించింది. స్తనఫలభారంతో వంగింది. సరసవాక్కుల తేనెలొలికించే ఆ లత సర్వరోగ నివారిణి..కలుషహారిణి..అది జ్ఞానానందలతిక..శివమనోవల్లరి)     
                               శంకరాచార్యులవారి కవితాచమత్కృతి శిఖరాగ్రానికి చేరిన శ్లోకమిది. పార్వతిని ఒక పూదీవెతో పోలుస్తూ ఆయన చేసిన ఈ వర్ణన నూటికి కోటి శాతం అనితరసాధ్యం. 
                     ఈ రోజుకు  సెలవా మరి......

24, ఫిబ్రవరి 2014, సోమవారం

అందాల కడలి-6


అంతా అమ్మ చలవే 



శ్లో :


 హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ
 పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
 స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
 మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం !

ఇది సౌందర్య లహరిలోని ఐదవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమిటంటే.."ప్రణమిల్లే భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించు ఓ జగజ్జననీ! పూర్వం విష్ణువు నిన్ను ఆరాధించే స్త్రీరూపాన్ని పొంది పురారిని కూడా ఇంతింతనరాని క్షోభకు గురి చేశాడు.అలాగే మన్మధుడు కూడా నిన్ను పూజించినాకనే తన భార్య రతీదేవి కన్నులకు ఇంపైన సుందరాకృతిని పొంది, మహా మహా మునులను సైతం మోహపరవశుల్ని చేస్తున్నాడు."
                             ఇక భావార్ధం లోకి వెళితే..ఇది పరదేవత గొప్పదనాన్ని వేనోళ్ల చాటే శ్లోకమైనప్పటికీ..దీనికి ఎన్ని అర్ధాలైనా చెప్పుకోవచ్చు.  ఆది శంకరులు ఆది నుండి చెబుతున్నట్టు..పిపీలికాది బ్రహ్మ పర్యంతానికీ అధిదేవత ఆ భువనేశ్వరే కదా. ఆ తల్లిని కరుణ లేనిదే సృష్టి సాగదు..ప్రభవించిన సృష్టి నిలవదు..నిలిచిన సృష్టి పునరుజ్జీవానికి నాందిగా లయమొందదు. అంచేత నిత్య వ్యాపారాలకే త్రిమూర్తులు అమ్మను ఆశ్రయించి ఉన్నప్పుడు, ఇక ప్రత్యేక కార్యాలన్నీ పరిపూర్ణంగా ఆ భువనేశ్వరి అండదండలతో నడవవలసినవే కదా..! 
                                 త్రిమూర్తుల్లో దుష్టశిక్షణా..శిష్ట రక్షణా హరివే. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత..అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అన్న గీతాకారుడు..పూర్ణావతారాలైన దశావతారాలే గాక, వెంకటేశ్వరుని వంటి  అర్చావతారాల్ని కూడా ధరించినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక ప్రత్యేకావసరం కోసం విష్ణువు ధరించిన మరో అవతారం జగన్మోహిని. దేవదానవులకు నిర్విరామంగా జరిగే యుద్ధాల్లో రక్కసులు మాయాబలంతో జయం సాధించడమూ, దేవతలు ఓడిపోయి నశిస్తూ ఉండటంతో, దేవతాజాతిని "అమర"జాతిగా చేసేందుకు సంకల్పించినదే అమృతోత్పాదన.  దేవదానవులు క్షీరసాగరాన్ని మధించి..ఎలాగైతేనేం అమృతాన్ని సాధించాక.. రాక్షసులు దాన్ని తమ వశం చేసుకుందామని ప్రయత్నించారు. మళ్లీ పోరాటం ప్రారంభం. ఇక ఆ క్షణంలో విష్ణుమూర్తి కల్పించుకోక తప్పలేదు. ఏదో  రకంగా రాక్షసుల దృష్టి మరల్చి అమృతాన్ని పూర్తిగా దేవతల పరం చెయ్యాలి. అందుకోసం విష్ణుమూర్తి ఎత్తిన ప్రత్యేకావతారమే జగన్మోహినీ అవతారం. దశావతారాల్లోకి లెక్కరాని ఈ అవతారం కేవలం అమృతం పంచేవరకే. మధ్యలో రాహుకేతువులు కాస్త కాస్త తాగేసినా, మిగతా అమృతాన్నంతటినీ దిగ్విజయంగా దేవతలకు పంచేసిన జగన్మోహిని, న్యాయం చొప్పున అయితే మరిక కనబడకుండా మాయమైపోవలసిందే. కాని అవలేదు...త్రిపురసుందరిని అర్ధాంగిగా కలిగిన మహాదేవుడు..తనను ఇంద్రియ వికారానికి లోను చెయ్యబోయిన మన్మధుణ్ణి భస్మం చేసేసి "మదనారి"గా ప్రసిద్ధికెక్కిన ముక్కంటి..జగన్మోహిని సౌందర్య విలాసాన్ని చూసి..విభ్రమ చెంది వెంటబడ్డాడట.  
                             ఈ కధను వెనక చందమామ పిల్లల పత్రికలో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు "వినాయకుడు" సీరియల్ లో అద్భుతంగా వర్ణించారు. "మీ నాన్న..ఆ శంకర మహాదేవుడికే పిచ్చెక్కి   జగన్మోహిని వెంట పడ్డాడు" అంటుంది పార్వతి పెద్దకొడుకుతో. "అవునా..అయితే అప్పుడేం జరిగిందమ్మా" అని కౌతుకంగా ప్రశ్నిస్తాడు గజముఖుడు. "ఏదో అయిందిలే. అప్పుడో నల్లని భూతపిల్లడు పుట్టాట్ట.." అంటుంది పార్వతి. "అంటే నాకు తమ్ముడన్నమాట..ఎక్కడున్నాడమ్మా" అని అడుగుతాడు గజాననుడు మరింత కుతూహలంగా. "ఎక్కడో ఉంటాడు. నల్లని బట్టలు కడతాట్ట. పొరబాటున కూడా అటు వెళ్లకుమీ...జడుసుకుంటావు" అంటుంది పార్వతి పుత్రవాత్సల్యంతో. కానీ వినాయకుడు అటు వెళ్లనే వెళతాడు...దిగులుమొహంతో శబరుల మధ్య తిరుగుతున్న నల్లపిల్లాణ్ణి చూసి, అతని శరీరమంతా నిమిరి..అరటిదవ్వలా తెల్లగా చేసి.."ఇతను మీకు స్వామి. "స్వామీ శరణం" అనండి..కాపాడతాడు.." అని శబరులకు చెప్పి వస్తాడు. ఆ స్వామే హరిహరపుత్రుడు అయ్యప్ప.
అంటే అంగజహరుడు అయ్యప్ప జననం కోసమే జగన్మోహిని వెంటపడ్డాడా..?? లేకపోతే కామారికి కామ వికారమేమిటి..?? 
                   అదలా ఉంచితే..స్వయంగా తండ్రి ఆదేశంతో తన మానసచోరుడైన త్రినేత్రుణ్ణి సేవించుకున్న శైలరాణ్ణందన, తన కట్టెదుటే అతడు మన్మధుణ్ణి భస్మం చేసెయ్యడంతో బిత్తరపోయింది. కలువకాడలా వేలాడిపోయింది. అయినా సరే  సౌందర్యానికే వన్నె తేగల తనని చూసి కూడా చలించక మూడోకన్ను తెరిచిన ఆ జితేంద్రియునితోనే తన జీవితాన్ని ముడేసుకోవాలని దీక్షగా ఆకులలములు మానేసి మరీ తపస్సు చేసి  అచ్చంగా అతని అర్ధాంగి  అయిపోయింది.తన మగడు భక్తికే గాని భామినులకు లొంగని వాడని  ఆనందపడుతుండగా..దేవతలందరికీ తెలిసిన ఆ పగటివేషగాణ్ణి అచ్చమైన ఆడదని భ్రమించి శంకర మహాదేవుడు వెంటపడటం కంటే ఆ తల్లికి వేరే అవమానం ఏముంటుంది గనక..??  పెళ్లికి ముందు తనవైపు కన్నెత్తి కూడా చూడనివాడు, పెళ్లయి, ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యాక మరో ఆడదాని వెనక పడటం చూస్తే ఆ ఇల్లాలి కడుపు దహించుకుపోదూ..?? ఆ మంట అంతా చక్కగా గ్రహించుకున్నారు శంకరులు. "అమ్మా..ఇదంతా నీ లీలే కదమ్మా" అంటూ తల్లిని ఓదార్చారు. "ఆ హరి తనకు తానుగా ఏమంత గొప్పవాడు కాదమ్మా...నిన్ను ఆరాధించి, నీ చలవ వల్లనే జగన్మోహినిగా రూపెత్తి శివుణ్ణి క్షోభపెట్టాడు. ఇదంతా నీ కనుగవ కదలిక వల్ల జరిగిందే కదమ్మా" అంటూ...విశ్వరచనకు పునాది వేసే అమ్మను మరపించారు. 
                          మరొక మాట ఏమిటంటే వాస్తవానికి శివపత్ని పార్వతి వేరు..ముజ్జగాలనేలే ముగురమ్మల మూలపుటమ్మ భువనేశ్వరి వేరు. కాని శంకరులు సౌందర్య లహరి పొడవునా తల్లిని "హిమగిరితనయా" అనే కీర్తించారు. ఇది కేవలం కవిత్వానికి ఆలంబన అయిన విషయం తప్ప వేరు కాదు. ఎందుకంటే..భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పాడో..అదే విధంగా దేవీ భాగవతంలో శ్రీదేవి కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తూ..హిమవంతాదులతో "త్రిమూర్తులూ..వాణీ, లక్ష్మీగౌరులూ నేనే" అని చెబుతుంది. "దొంగల్లో, వ్యాధుల్లో, చండాలురలో నేనున్నాను" అన్న పరదేవతను శైలపుత్రి గిరిజగా కీర్తించకపోతే ఇక ఆ కవిత్వానికి వస్తువేది? అయినప్పటికీ...శంకరాచార్యులవారి ఈ సౌందర్య లహరి భువనేశ్వరి దివ్య సౌందర్యానికీ..మహిమకూ..వీటన్నిటినీ మించిన ఒకానొక అద్వితీయ అనుభూతికీ...అంతకు మించిన యోగవైశిష్ట్యానికీ ఆధారభూతమైంది.  చెప్పుకున్న కొద్దీ సౌందర్య లహరికి వ్యాఖ్యానాలు పెరుగుతాయే తప్ప తరగవు. 
                            ఇక ప్రస్తుత శ్లోకం రెండో భాగాన్ని చూద్దాం. ఇది కూడా శివుడి కోసం పార్వతి తపస్సు చేసిన వైనానికి సంబంధించిందే. కాకపోతే శివుడి కంటే పార్వతికే ఓ నాలుగు మార్కులు ఎక్కువ వేసిన ఘట్టమిది. తపోదీక్షలో ఉన్న తనను శైలజ పట్ల అనురక్తుణ్ణిగా చేయబోయినందుకు గాను ఆగ్రహించిన ముక్కంటి, మన్మధుణ్ణి దహించివేసిన మరుక్షణం అక్కడ లేనేలేడు. మాయమైపోయాడు. మరోవైపు హిమవంతుడు వచ్చి..రుద్రుని కోపతీవ్రతకు జడిసి తోటకూరకాడలా వేలాడిపోతున్న కూతుర్ని,  కలువపువ్వును తొండంతో పట్టుకున్న మదగజంలా అతి సున్నితంగా చేతుల్లోకి తీసుకుని భవనానికి వెళ్లిపోయాడు. ఇక మిగిలిందల్లా భర్త బూడిద కుప్ప దగ్గర వెక్కి వెక్కి రోదిస్తున్న రతీదేవి మాత్రమే. అలా ఏడ్చి ఏడ్చి డస్సిపోయిన రతి...చివరికి శివపార్వతుల కళ్యాణ సమయాన ముక్కంటి ఇల్లాలిని ప్రార్ధించి తన భర్తను "అనంగుడి"లా పునరుజ్జీవింపజేసుకుని,ఓదార్పు పొందింది. అలా ఆ తల్లి దయ వల్ల మళ్లీ బతికి బట్ట కట్టిన మన్మధుడు మరింత విజృంభించి మహా మహా ఋషుల్ని సైతం లొంగదీసుకుంటున్నాడు. 
                           ఇక్కడ మరో వైచిత్రి ఉంది. శివుడి చేతిలో భస్మమైపోయిన మన్మధుణ్ణే గనక పార్వతి మళ్లీ తిరిగి బతికించకుండా ఉంటే శంకర మహాదేవుడు అసలు జగన్మోహిని వెనక కూడా పడేవాడు కాదేమో. అంచేత.."తల్లీ కోరి కోరి కొరివితో తల గోక్కున్నావు కదా" అంటున్నారా శంకరులు...వద్దు వద్దు. ఇలాంటి వెటకారపు వ్యాఖ్యానాలు చెయ్యనే వద్దు. నేరుగా..సూటిగా..ముచ్చటగా చెప్పుకుందాం. "అమ్మా...హరి జగన్మోహినీ అవతారమెత్తి సాక్షాత్తూ ఆ మదనారి మతే పోగొట్టినా...ఒకసారి చచ్చి బూడిదైపోయిన కాముడు తిరిగి పునర్జన్మెత్తి మహర్షుల్ని సైతం లొంగదీసుకుంటున్నా...ఆ అసంభవాలు సంభవాలవుతున్నాయంటే అందుకు కారణభూతురాలివి నువ్వే కదమ్మా. నువ్వు తలచుకుంటే ఎలాంటిదాన్నయినా సంభవంగా చెయ్యగలవు."  
                         ఇదండీ  సంగతి. ఇంక ముగింపు శ్లోకానికి వెళదామా...
                   నవీనార్క భ్రాజన్మణి కనక భూషా పరికరైః 
                   వృతాంగీ సారంగీ రుచిరనయనాంగీకృత శివా 
                   తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా 
                   మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ ! 
 (భావం : హే జగన్మాతా..! అప్పుడే ఉదయించిన బాలభానునిలా దేదీప్యమానంగా తేజరిల్లే సువర్ణ మణిమయాది భూషణాలతో సర్వాంగ భూషితవు. ఆడలేడి కన్నులవంటి సుందరమైన కన్నులు గలదానవు. పరమశివుని పతిగా స్వీకరించినదానవు. మెరుపులాంటి పచ్చని మేనికాంతి కలదానవు. పసిడి పీతాంబరం...పాదమంజీరాలతో కళకళ్లాడే అయిదవరాలా..ఓ ఆనందస్వరూపిణీ..అపర్ణా..నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని ప్రసాదించు తల్లీ..!)
 ------------శంకరచార్య విరచితం. 
 ఈ రోజుకు ఇంక సెలవా మరి...
 

22, ఫిబ్రవరి 2014, శనివారం

అందాల కడలి-5


ఆ పాదాలు..వరాల ఆరామాలు! 


 శ్లో :

 త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవత గణాః
 త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా
 భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంచా సమధికం
 శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ !!               

                         ఇది సౌందర్య లహరిలో నాలుగవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమిటంటే.."అమ్మా, మిగిలిన దేవతలందరూ తమ రెండు చేతులా అభయ, వరదముద్రల్ని దాల్చి ఉన్నారు. నువ్వొక్కతివే ఆ మాదిరిగా ముద్రలు అభినయించనిదానివి. నువ్వలా ఎందుకు చెయ్యడంలేదంటే ఆర్తుల్ని వారి వారి భయాలనుండి కాపాడటానికీ, అర్ధులకు వారు కోరినదానికి రెట్టింపుగా వరాలనిచ్చేందుకూ నీ చేతుల దాకా ఎందుకు..అట్టడుగునున్న నీ పాదాలే చాలు కదా..!" 
                                         ఇక భావార్ధం లోకి వెళితే శంకరాచార్యులవారు ఎప్పటిలాగే దేవి పట్ల తన మక్కువనంతటినీ కవితా చమత్కృతిలోకి జొప్పించి మిగతా దేవుళ్లని ఒక్కపెట్టున తీసి పారేశారు. మిగతా దేవుళ్లంతా వరాభయ ముద్రలు ప్రదర్శిస్తారట. అదీ రెండు చేతులతోనూ...(మిగతా దేవుళ్ల పట్ల ఎంత వ్యంగ్యమో.."ఆవిడగారు రెండు చేతులూ ఊపుకుంటూ ఎలా గొప్పలు చెబుతుందో చూశావా..." అని అమ్మలక్కలు ఆడంబరంగా మాట్లాడే మరో ఆడదాని గురించి చెప్పుకున్నట్టే) తల్లి మాత్రం అసలు ఏ అభినయమూ చెయ్యదు. గంభీరంగా..హుందాగా "పాశాంకుశ పుష్పబాణచాపా"లతో ఉంటుంది. అమ్మగారు చేత్తో చెయ్యవలసినదేదో ఆమె కాళ్లే చేసుకుపోతాయి. ఇదీ చమత్కృతి. హవ్వ..ఎంత అభిమానం ఉంటే మటుకు.."నువ్వు ముద్రల్ని అభినయించవు తల్లీ...చాలా గొప్పదానివి" అంటూ అలా అనేయడమేనా...అభయ, కటి హస్త ముద్రలతో అలరారే వెంకన్న ఈ మాట విని ఎంత చిన్నబుచ్చుకుంటాడు పాపం..? ఏమైనా శంకరులకు త్రిపురసుందరి అంటే వెయ్యిన్నొక్క శాతం పక్షపాతం. మరోచోట ఈయనే.."నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్నే ఆరాధిస్తానమ్మా. వేరే దేవతల జోలికి వెళ్లినా వాళ్లు ఇంతకంటే కంటే గొప్పగా ఆదరిస్తారన్న నమ్మకమేమీ లేదు" (త్వదన్యస్మాదిఛ్ఛా విషయ ఫల లాభే న నియమః) అంటూ కుండ బద్దలుగొట్టినట్టు చెప్పేశారు. 
                                   ఇక్కడ ఇంకో విశేషం ఉంది. దేవతా దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా విగ్రహం తాలూకు పాదాలు చూడాలట. అక్కడి నించి అలా అలా పైకి చూడాలి. అలాగే పూజ చేసేటప్పుడు..లేదా దేవతను వర్ణించేటప్పుడు ముందు పాదాల దగ్గర నించీ మొదలు పెట్టాలి. అలా అలా శిరసు దాకా వెళ్లాలి. అసలు మనం దేవతా దర్శనానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసుకున్నా దేవుడి పాదాలకే ముందు నమస్కారం చేస్తాం. ఇక్కడ కాపాడటానికీ, వరాలివ్వడానికీ పాదాలే చాలు అంటే..  మనం ముందు తల్లి పాదాల్ని చూసి ఇలా  శరణు వేడుకోగానే ఆయమ అలా  కరుణించేస్తుందన్నమాట...అంటే అంత శీఘ్రంగా..అదీ విశేషార్ధం. 
                               ఈ శ్లోకంలో కవితా చమత్కృతి  సంగతి అలా ఉంచితే ఇది (ఈ శ్లోకం) త్రిపురసుందరి పట్ల మన నమ్మకానికి గీటురాయి. సౌందర్య లహరి అంతటికీ నాకు భక్తి పరంగా, ప్రార్ధనాపరంగా ఈ శ్లోకం చాలా ఇష్టం. ఎందుకంటే...సింపుల్..బై వన్ గెట్ టూ అంటే ఎవరు తన్మయులైపోరు చెప్పండి? మనుషులందరిలోనూ ఉండే ఆరోగ్యవంతమైన స్వార్ధమే నాలోనూ ఉంది. సాధారణంగా లోకంలో అందరూ సమస్యా పరిష్కారం కోసమో,  అభివృద్ధి కోసమో మాత్రమే దేవుణ్ణి ప్రార్ధిస్తారు..పూజలు చేస్తారు. దేవుడు కాపాడి, వరాలిచ్చేవాడు కాదంటే ఉత్తరక్షణంలో  భక్తుడనేవాడొక్కడూ మిగలడు. సంపదలు పెరుగుతాయీ అంటే వైభవలక్ష్మి నోము నోచుకుంటాం.  పెళ్లవుతుందంటే కాత్యాయనీ వ్రతం. కుటుంబ సంక్షేమం కోసం నిత్య పూజలూ..వ్రతాలూ..!! ఇది తప్పు అని ఎవరూ అనరు, శంకరాచార్యులవారితో సహా. మనుషులు దేవుణ్ణి తమ మేలు కోసమే పూజిస్తారని శంకరులకు తెలుసు..అందుకే ఆయన "భయాల నుండి కాపాడటానికీ..కోరినది రెట్టింపుగా ఇవ్వడానికీ" అన్నారు..అక్కడికి  దేవుడి పని అదే అయినట్టు.  బై వన్ గెట్ టూ (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ) అంటూ ఏ పెద్ద షాపింగ్ మాలో ప్రకటిస్తే నగరంలోని జనాభా అంతా అక్కడ చేరిపోతుందా లేదా..అలాగే, స్వయంగా శంకరుడి అంశలో ఉద్భవించిన శంకరాచార్యులవారు,"ఫలమపిచ వాంఛా సమధికం"  (కోరినదానికంటే ఎక్కువ ఫలం) ఇస్తుందని చెబుతూ ఉంటే ఆశగా ఆ తల్లిని పూజించకుండా ఉండగలరా ఎవరైనా..?? అలాగే నేనూ.                         
                 ఈ రోజుల్లో మనుషులకు జీవితమే ఒక పెద్ద భయంకరానుభవంలా తయారైంది. ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితులు, అనుబంధాలు, రక్షణ..అన్నీ సమస్యలే. కల్లో సైతం పీడించుకు తినే భయాలే. ఇటువంటి పరిస్థితిలో, "మీ భయాల్ని తగ్గిస్తాం.మీ కోర్కెల్ని రెట్టింపుగా తీరుస్తాం" అంటూ ఎవరైనా కాస్త అభయమిచ్చేసరికి జనాలంతా అక్కడికి పరుగు తీస్తూ ఉండటం మనకు తెలిసిందే కదా. అదేమిటి..అలా ఎవరు అభయమిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా ..మరి రోజుకొకరుగా సంఖ్యాబలాన్ని పెంచుకుంటున్న దొంగ స్వాములు, బాబాలూ చేస్తున్నదేమిటి..వరాభయ ముద్రల్ని అభినయించడం కాదా..?? "నువ్వు అభినయించవు" అంటూ దేవిని పొగడటంలో  శంకరులు ఆ "అభినయం" అన్న పదాన్ని "సూచింపదగిన అర్ధాన్ని సూచించడం" అన్న అర్ధంలో ఉపయోగించారే తప్ప,"నటించడం" అన్న భావంతో మాత్రం వాడలేదు. కాని భక్తుల్ని  చుట్టూ పోగేసుకుని తమ వాంచితార్ధాల్ని తీర్చుకుంటున్న దొంగ స్వాములంతా మాత్రం ఆ ముద్రల్ని నూటికి నూరుపాళ్లూ అభినయిస్తున్నారు..అంటే నటిస్తున్నారు. అటువంటి నటనలకు లొంగి మోసపోయే బదులు..జగద్గురువైన ఆది శంకరులు చెప్పిన మాటను నూటికి నూరుపాళ్లూ నమ్మండి. అదేదో ఆ మహనీయుడు ఉత్ప్రేక్ష చేసి అలంకారం కోసం చెప్పిన మాట కాదు..మనసా వాచా కర్మణా మనం నమ్మాలే గాని మన నమ్మిక ఊరికే పోదు..తప్పక ఫలిస్తుంది. మీలో ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. పరదేవత పాదసేవ లౌకికమైన భయాల్ని పోగొడుతుందనీ..ప్రాపంచికావసరాలకు సంబంధించి మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుందనీ ప్రగాఢంగా నమ్మండి. ఆ నమ్మిక ఫలితాన్ని స్వయంగా అనుభవించండి.  
  "రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పధి సదైవ గఛ్ఛతాం " అన్నాడు బుధకౌశిక ముని రామరక్షాస్తోత్రంలో.
 "శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి
 పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
 కామధేనువతడింట గాడి పసర
 మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు"
అన్నాడు శ్రీనాధుడు. ఇవి కేవలం కవితా చమత్కృతులు కావు. నమ్మినవాడి నమ్మకం ఎన్నటికీ వట్టిపోదని "నమ్మకం" గా చెప్పే మాటలు. బుధ కౌశిక ఋషి చెప్పినట్టు రామలక్ష్మణులు నిజంగా ధనుర్బాణాలు తీసుకుని మన ముందు రక్షక భటుల్లా నడవరు. శివుడికి అభిషేకం చేసి పత్రితో పూజిస్తే కామధేనువూ, కల్పవృక్షమూ మన పెరట్లో వచ్చి వాలవు.  కాని త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి నమ్మినవాడి విశ్వాసం మాత్రం ఎన్నటికీ వృధా పోదన్నది ఎవరికి వారే అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయం. రామకృష్ణ పరమహంస తన కధల్లో ఇదే మాట ఎన్నోసార్లు చెప్పాడు. అడవి దాటేందుకు భయపడే పిల్లవాడికి వాళ్లమ్మ చెప్పినట్టు "అన్నయ్య గోపాలుడు" తోడు రావడం అలాంటి నమ్మకానికి దక్కే ఫలితాలకు సాక్ష్యమే. 
                        ఇక్కడ ఒక చిన్నమాట. మీకు తెలియదని కాదు..సందర్భానుసారంగా మరోసారి చెబుతున్నానంతే. మనం పురాకృతాన్ని నమ్ముతాం. "ఫూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితా" అనేది మా అమ్మ. ఈ జన్మలో మనకి దక్కేవి పురాకృతాన్ని అనుసరించి మాత్రమే ఉంటాయన్నది పెద్దలు చెప్పే మాట. అదలా ఉంచితే, మనం కోరే కోర్కెలు మన వర్తమాన జీవితానికి ఎంతవరకూ మేలు చేస్తాయన్నది మనకు తెలియదు. ఒక్కొక్కసారి కోరిన కోరిక తీరడం కూడా శాపమే అవుతుంది. అంచేత, మన పురాకృతం ఫైలు తిరగేసి, ఈ జన్మలో మన భవిష్యత్తుని క్లెయర్ వాయెన్స్ (దివ్యదృష్టి) తో చూసి..అప్పుడు మనకి ఏమివ్వాలో..ఎప్పుడివ్వాలో..ఎంత ఇవ్వాలో నిర్ణయించి ఆర్డర్స్ పాస్ చేస్తాడు దేవుడు. ఇలా ఈ విశ్వాంతరాళంలోని పిపీలికాది బ్రహ్మ పర్యంతానికీ...అబ్బ.. ఆ భువనేశ్వరి ఎంత గొప్ప "మహారాజ్ఞో" కదా..!!  అందుకే పది రోజుల పసికందు మాదిరి  జీవితాన్ని ఆ తల్లి చేతుల్లోకి వదిలేసి, కేవలం ధర్మంగా..మన విచక్షణాజ్ఞానాన్నీ, బుద్ధికుశలతనూ అనుసరించి బతకడం చాలా మంచిదంటాను నేను. (కాని మళ్లీ నేనే అలా బతకలేను కదా...:) మీకు చేతనైతే అలా బతికి చూడండి..అప్పుడు ఏ సమస్యా పీడించదు.) మన పూర్వీకులు అలాగే బతికేవారన్నది కాస్త ఆలోచిస్తే నికరమవుతుంది.  
 సరే...ఇంక ముగింపు శ్లోకానికి వెళదామా...
 విరాజన్మందార ద్రుమ కుసుమ హారస్తనతటీ 
 నదద్వీణా నాద శ్రవణ విలసత్ కుండల గుణా 
 నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ 
 సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే ! 
                    (మెడలో మందార కుసుమ మాలను ధరించి..మధుర వీణానాదాన్ని ఆలకిస్తూ..చెవుల తళతళ మెరిసే కుండల కాంతుల సొబగుతో..వయ్యారంగా వంగిన తనువుతో..ఆడయేనుగు అందమైన నడకలా మనోహరమైన మందగమనంతో..హే భగవతీ..శంభుని సతీ..కలువల వంటి కన్నులు గల నీ రూపమే నాకు సర్వత్రా గోచరించేను తల్లీ..! )  
                             ---శంకరాచార్య విరచితం (శంకరాచార్యులవారి శ్లోకాల్లో అద్భుతమైన లయ ఉంటుందనడానికి ఈ శ్లోకం ఒక గొప్ప ఉదాహరణ) 
                           P.S...(రేపు ఆదివారం. అమ్మవారు, అయ్యవారు సరదాగా న్యూయార్క్ నించి ఏ కైలాసగిరో (ఇప్పుడందరూ జన్మభూమిని వదిలేసి పరసీమలో కాపురం చేస్తున్నారు కదా..అమ్మ, అయ్య కూడా కైలాసం నించి ఏ న్యూయార్కో వలస వెళ్లలేదని ఏమిటి గేరంటీ..:) ) షికారు వెళ్లొచ్చు. (మా ఇశాపట్నంలో కైలాసగిరి పెద్ద టూరిస్టు స్పాట్) అంచేత రేపు కూడా నా పిచ్చి రాతలతో వాళ్లని డిస్టర్బ్ చెయ్యడం బాగోదు. కాబట్టి, మళ్లీ సోమవారం కలుసుకుందాం. అప్పుడైతే మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ హడావిడిలో ఉన్న సీఎంలా అమ్మ కూడా ఈ రాతల్ని పట్టించుకోదు. మరి ఉంటా..సెలవు.)   
 
                     
  

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

అందాల కడలి-4


అమ్మకు అందరూ సమానమే 


శ్లో :
       అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ
       జడానాం చైతన్యస్తబక మకరంద సృతిఝరీ
       దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ
       నిమగ్నానాం దంష్ర్టా మురరిపు వరాహస్య భవతి !!
                            ఇది సౌందర్య లహరిలోని మూడవ శ్లోకం. ఈ శ్లోకం మొదటి పాదంలో "తిమిర మిహిర ద్వీపనగరీ" అన్నది కొన్ని కొన్ని పుస్తకాల్లో తిమిర మిహిరోద్దీపనకరీ" అని ఉంది. అర్ధం ప్రకారం చూస్తే బహుశా అదే సరైనదేమోననిపిస్తుంది. ఇక క్లుప్తంగా ఈ శ్లోక భావం ఏమిటంటే "తల్లీ, నీ పాదధూళి అజ్ఞానులకు అజ్ఞానమనే చీకటిని పోగొట్టే సూర్యకాంతిని ప్రేరేపించునది.(మిహిర ద్వీపనగరీ..అంటే సూర్యుడు ఉదయించే పట్టణము వంటిది.)మందబుద్ధులైన జడులకు జ్ఞానమనే పూదేనె ప్రవాహం.దరిద్రులకది (నీ పాదధూళి) చింతామణుల హారం. సంసార సాగరంలో మునిగిన వారికి అది ఆదివరాహపు కోర..!!"
                                    ఇక భావార్ధంలోకి వెళితే..శంకరులు ఇంకా ఆ తల్లి పాదధూళి పరవశంలోంచి తేరుకోలేదు. సాక్షాత్తూ త్రిమూర్తులే దేవి పాదాలకు మొక్కి పరదేవత పాదధూళిని గ్రహించి దానితోనే సమస్త వ్యాపారాలూ సాగిస్తారని చెప్పినా కూడా ఇంకా ఆయనకు తనివి తీరలేదు. ఇక్కడ శంకరులు అటు దేవికి, ఇటు భక్తులకూ కూడా   తండ్రే అయ్యారు. తండ్రికి తన బిడ్డ గొప్పతనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఇంకా ఇంకా వేర్వేరు రకాలుగా చెబుతూనే ఉంటాడు. అలాగే బిడ్డకు ఒక కొత్త విషయం చెప్పినప్పుడు దాన్ని అన్ని కోణాల్లోంచీ వివరించి  ఓ పిసరు ఎక్కువగా చెబితే తప్ప తండ్రికి "బిడ్డకు అర్ధమైంది"అన్న తృప్తి కలగదు..  శంకరాచార్యుల వారికి  కూడా అలాగే "తనీయాంసం పాంసుం" శ్లోకంతో అటు త్రిపురసుందరి పాదధూళి మహిమను, గొప్పతనాన్నీ  సాకల్యంగా వర్ణించిన తృప్తి గాని ఇటు భక్తులకు పరిపూర్ణమైన సమాచారాన్ని అందించిన తృప్తి గాని కలగలేదు. "దేవి పాదధూళి త్రిమూర్తులకు ఉపకరిస్తుందేమో. మరి మా సంగతేమిటి" అని సామాన్యులు, అజ్ఞానులు, జడులు, సంసారసాగరంలో మునిగితేలుతున్నవారు తెల్లమొహం వేస్తున్నట్టే ఆయనకు తోచింది.  అందుకే ఆయన..ఇప్పుడు సాధారణ మానవులకు అమ్మ పాదధూళి ఏ రకమైనదో చెబుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్లోకాల్లో గాని, మరెక్కడ గాని కవులు చెప్పిన మాటల్లో అంతరార్ధాన్ని గ్రహించాలే గాని, వారు చెప్పినదాన్ని యధాతధంగా తీసుకుని వితండవాదానికి దిగరాదు. ప్రస్తుత శ్లోకంలో అజ్ఞానులు, జడులు, దరిద్రులు,సంసారబాధల్లో ఉన్నవారికి తల్లి పాదధూళి సూర్యకాంతిగానూ, పూదేనె ప్రవాహంగానూ, చింతామణుల హారంగానూ, ఆది వరాహమూర్తి కోరగానూ ఉంటుందంటే.."అయితే ఏమిటి? ఆ కనిపించే సూర్యకాంతి మనల్ని ఉద్ధరిస్తుందా..తాగడనికిన్ని మంచినీళ్లే లేవు..ఇంక పూదేనె ప్రవాహాలేమిటి..మెళ్లో ఓ బంగారు హారానికి దిక్కు లేదు..చింతామణుల దండ కూడానూ.. "  అంటూ  శ్లోకాల్లోని కవితాత్మకతను అర్ధం చేసుకోకుండా వాదించేవారు బోలెడంతమంది మనకు కనిపిస్తారు. సూర్యకాంతేమిటి, పూదేనె ఏమిటి, చింతామణుల దండేమిటీ అని తెల్లమొహం వేసేవారూ అందరికందరే..!  అటువంటివారికి ప్రస్తుత శ్లోకం గురించి చెప్పే మాట ఏమిటంటే.. సూర్యకాంతి..పూదేనె..చింతామణుల దండ..వరాహమూర్తి కోర ఇవన్నీ పక్కన పెడితే  అజ్ఞానులు, జడులు, దరిద్రులు, సంసార సాగరంలో నిండా మునిగిపోయి ఉన్నవారు..ఈ రకమైనవారంతా కూడా అమ్మ కృపకు అనర్హులేమీ కాదని చెప్పడమే శంకరుల మాటల  అంతరార్ధం.  త్రిమూర్తులు జ్ఞానులకు సంకేతమనుకుంటే జ్ఞానులైనవారే గాక అజ్ఞానులు  కూడా తల్లి పాదాలనాశ్రయించి  ఇబ్బడి ముబ్బడిగా ఫలితాన్ని పొందవచ్చునన్నదే  శంకరాచార్యులు గొంతెత్తి ప్రకటించదలచుకున్న విషయం. అయితే అది ఎలా..ఆ ఫలితం ఏ విధంగా కలుగుతుందన్నదే ప్రశ్న. "మాకు నిత్యమూ పూజలు చేసే తీరుబాటు లేదు. స్తోత్రాలు చదవలేము. మరింక ఎలా" అనేది కోట్లాదిమంది సందేహం. దీనికి జవాబు లలితా సహస్రంలో ఉంది. ఆ తల్లి "భక్త మానస హంసిక" "భక్తివశ్య" ఈ రెండింటినీ మించి ఆమె "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా.." అంటే మనలో అంతర్ముఖంగా ఉన్న తన అంశని గుర్తించి, మనలో ఉన్న తనని భక్తిగా ఆరాధించినప్పుడే ఆ లలితా మహా త్రిపురసుందరీ దేవి ఆరాధ్యురాలయి, ప్రసన్నురాలవుతుంది. అంతర్ముఖత లేకుండా కేవలం బహిర్ముఖంగా విగ్రహాలు, పటాలకు చేసే బాహ్యాడంబర పూజలన్నీ  మన తృప్తికే గాని దానివల్ల ఫలితం సున్నా. మనలో ఉన్న తల్లిని గుర్తించడమెలా..మరేమీ లేదు..ఆ తల్లికుండే దేవతాగుణాలన్నిటినీ తు.చ. తప్పకుండా అనుసరించడమే. సత్యం, అహింస, భూతదయ ఇత్యాది దైవీగుణాలన్నిటినీ అనుసరిస్తూ ఉంటే దేవిని గుర్తించి అనుసరిస్తున్నట్టే కదా..ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే సమాజం ఎలా ఉంటుంది..ఒక్కసారి ఆలోచించండి..!  
                                   ఇక భావార్ధ వివరణలోకి వెళదాం..అజ్ఞానులు వేరు, జడులు వేరు. "మాకు తెలియదు. ఎవరైనా తెలియజెబితే బావుణ్ణు" అనుకునేవారు అజ్ఞానులు. వీరు చీకటిలో ఉండి వెలుగు కోసం తపించిపోతున్నవారు.  అటువంటివారికి పరదేవత సేవ వల్ల అజ్ఞానాంధకారం తొలగి, జ్ఞానసూర్య దర్శనం అవుతుంది.వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే బుద్ధికుశలత పెరిగి చాలా విషయాలు వాటికవే స్ఫురిస్తాయి..పందితులు చెప్పేవి ఇట్టే గ్రాహ్యమవుతాయి. ఇక జడులు చైతన్య రహితులు. వారికి అసలు తాము అజ్ఞానులమన్న విషయం కూడా తెలియదు. జడులకు ముందు కావలసినది చైతన్యం. త్రిపురసుందరీ ఆరాధన వారిలోని ఆ జడత్వాన్ని పోగొడుతుంది. జిహ్వ చచ్చిన నోటికి మధుసేవ అమృతోపమానమైనది. చైతన్యమనే జిహ్వ చచ్చి, జడత్వం ఆవరించుకుని ఉన్నవారికి త్రిపురసుందరి సేవ పూదేనె వంటిది. అలాగే దరిద్రులకు చింతామణి వంటిది. చింతామణి మామూలు రత్నం కాదు. క్షీరసాగర మధన సమయంలో శ్రీలక్ష్మితో బాటు పుట్టిన అనేకానేక వస్తువుల్లో చింతామణి ఒకటి. ఇది కోరిన కోర్కెల్ని తీర్చే మహత్తు గలది. దరిద్రులకు పరదేవత సేవ ఎకాయెకీ చింతామణుల హారంతో సమానమైన ఫలితాల్ని ఇస్తుంది. 
                    ఇక్కడ మరొక అద్భుతమైన విషయాన్ని చెబుతాను వినండి...అక్షరాల ద్వారా అంకెల్ని వ్యక్తపరచే ఒక చిత్రమైన పద్ధతిని వరరుచి చెప్పాడట. ఆ ప్రకారం గుణిస్తే..ప్రస్తుత శ్లోకంలోని "గుణనికా" అన్న పదానికి 1053 సంఖ్య వస్తుంది.లలితా సహస్ర నామస్తోత్రంలోని అమ్మవారి నామాల్ని 1053 గా విడదీసి చెప్పే పద్ధతి కూడా ఉందట. ఆ రకంగా చూస్తే దరిద్రులకు అమ్మవారి సేవ వల్ల లలితాసహస్రాన్ని పారాయణ చేసే మహద్భాగ్యం కలిగి..తద్వారా జన్మజన్మలకూ సరిపడా సుఖసౌఖ్యాలు లభిస్తాయన్నది అంతరార్ధం. 
                              ఇక ఆఖరుగా చెప్పుకునేది సంసారంలోని ఈతిబాధలకు గురవుతున్నవారి గురించి. పూర్వం హిరణ్యాక్షుడు భూదేవిని చెరబట్టినప్పుడు విష్ణువు ఆదివరాహమూర్తి అవతారాన్ని ధరించి తన కోరలతో భూమిని జలగర్భంలోంచి  ఏ విధంగా పైకెత్తి కాపాడాడో అదే విధంగా అమ్మవారి సేవ సంసారసాగరంలో మునిగిపోతున్నవారిని ఉద్ధరించి ఆదుకుంటుంది. 
                   అదీ సంగతి. మొత్తమ్మీద చెప్పుకునే మాట ఏమంటే..జ్ఞానీ-అజ్ఞానీ అన్న తేడా లేకుండా అమ్మకు అంతా సమానులే..అందర్నీ ఆ తల్లి ఒకేలా కరుణించి కాపాడుతుంది..! స్వస్తి..! ఇక ముగింపు శ్లోకానికి వెళదాం..
 
  ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా 
 లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా 
 స్ఫురత్కాంచీ శాటీ పృధుకటితటే హాటకమయీ 
 భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీమవిరతం 

 భావం : నోటికి ఎర్రని తాంబూల రక్తిమ..కళ్లకు నల్లని కాటుక..నొసట ఉదయసూర్యునిలా కుంకుమతిలకం..మెడలో తెల్లని మంచి ముత్యాల దండ..ఒంటిమీద బంగారు జలతారు చీర..నడుమున రత్నాలు తాపిన వడ్డాణం..ధగ ధగ మెరిసే ఈ రకమైన వేషభూషలతో విరాజిల్లే ఓ గిరిరాజనందినీ..నేను సదా నిన్నే ఆరాధిస్తాను తల్లీ..! 
                        --------------- (శంకరాచార్య విరచితం )
 ఈ రోజుకు సెలవా మరి..!

20, ఫిబ్రవరి 2014, గురువారం

అందాల కడలి-3


అంతా ఆ పాదధూళిలోనే ఉంది 


శ్లో :
      తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహభవం
      విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలాన్
      వహత్యేనం శౌరిః కధమపి సహస్రేణ శిరసాం
      హరః సంక్షుద్యైనం భజతి భసితోద్దూళన విధిం
                                 ఇది సౌందర్య లహరిలోని రెండవ శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే "ఓ మాతా..త్రిమూర్తులు ముగ్గురూ  నీ పాదపద్మాల నుండి కించిత్ ధూళిని గ్రహించి దాని సహాయంతోనే తమ తమ పనులు నెరవేరుస్తున్నారు. బ్రహ్మ ఆ ధూళిని ఎటువంటి వైకల్యమూ లేని విశ్వాంతరాళంగా సృష్టిస్తున్నాడు. విష్ణుమూర్తి దాన్ని ఒక్కతలతో మోయలేక ఎలాగో వెయ్యి తలలతో మోస్తున్నాడు. లయకారుడైన హరుడు మాత్రం ఆ ధూళిని చక్కగా మెదిపి..విభూతిగా ఉపయోగించుకుంటున్నాడు."
                                ఇక భావార్ధం చూద్దాం. ఈ శ్లోకంలో రచనా వైచిత్రి అంతగా లేదు. కేవలం ఆ జగన్మాత గొప్పతనమూ, త్రిమూర్తులతో సహా యావత్  సృష్టికీ ఆ తల్లే ఆధారభూతమైనదన్న విషయాన్ని మరోసారి స్థిరీకరించడమూ మాత్రమే ఇక్కడ జరిగాయి. భావార్ధం లోకి వెళితే ముందుగా మొదటి శ్లోకంలో చెప్పుకున్నదాన్నే మళ్లీ మరోసారి చెప్పుకోవాలి. సృష్టిలోని చరాచరవస్తుసముదాయమంతా ఆదిపరాశక్తి అంశగలదేనని చెప్పుకున్నాం కదా..అదేమాటను ఇక్కడ మరో రకంగా చెబుతున్నారు శంకరులు. త్రిమూర్తులు ముగ్గురిలో  సృష్టికర్త బ్రహ్మకు సాత్వికశక్తీ, స్థితికర్త విష్ణువుకు రాజసశక్తీ,శివుడికి తామస శక్తీ సహాయపడుతున్నాయి.  ఆ సహాయమే ఎలా జరుగుతోందన్న విషయాన్ని మనకు చెప్పడానికి  శంకరాచార్యులవారు దేవి పాదధూళిని వస్తువుగా ఎన్నుకున్నారు. అమ్మవారి పాదాలు ఎటువంటివి...అరవిచ్చిన పద్మాల్లాంటివి. బీదవాడి పాదాల నుంచి దుమ్మూ ధూళీ వస్తాయి..లక్ష్మీపుత్రుల పాదాలు చందన చర్చలతో గుబాళిస్తాయి. మరి ఆ పాదపద్మాలు  సాక్షాత్తూ  భువనేశ్వరివే అయితే...వాటి నుంచి వచ్చేది ధూళి కానేకాదు...పుప్పొడి..పరాగం. ఆ పాద పరాగాన్ని స్వీకరించి బ్రహ్మ దాంతోనే  తన సృష్టి సాగించాడు. అంటే సృష్టిలోని సమస్త జీవజాలంలోనూ అమ్మ అంశ ఉందన్నమాటే కదా..ఇక స్థితికర్త అయిన విష్ణుమూర్తి ఆ ధూళిని అంటే బ్రహ్మ చేసిన సృష్టిని ఎలాగో వెయ్యి తలలతో మోస్తున్నాడు. ఆ పుప్పొడిలోనే సర్వ శక్తులూ ఉన్నాయన్నమాట.  
              ఇక్కడే నాకు కాస్త సందేహం కలుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తిని వెయ్యి తలలవాడిగా వర్ణించడంలోనూ, దేవి పాదధూళిని నారాయణుడు  "ఎలాగో కష్టపడి" మోస్తున్నాడని చెప్పడంలోనూ శంకరుల ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? మహా త్రిపురసుందరి "నారాయణి" కాగా.."గోవిందం భజ మూఢమతే" అంటూ నారాయణుణ్ణి కీర్తించిన  శంకరులు అప్రయత్నంగానే  "సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం" అంటూ  యజుర్వేదం కీర్తించిన మహాపురుషుణ్ణి తలచుకున్నారా? అయినప్పటికీ నారాయణుడు "ఎలాగో కష్టపడి" మోస్తున్నాడని చెప్పడం ద్వారా నారాయణికే పెద్దపీట వేశారా..??   "శివకేశవయోరభేదః" అన్న అద్వైత ప్రవక్త ఆదిశంకరులు తన రచనల్లో శివకేశవులిద్దర్నీ దరిదాపు సమానంగానే కీర్తించారు. అయితే.."మనసి భావయామి పరదేవతాం" అంటూ ముల్లోకాలకూ మూలవిరాట్టు అయిన జగదంబను కీర్తించడంలో మాత్రం ఆయన హద్దులెరుగని  రచనామండలంలో కనీ వినీ ఎరుగనీ చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆనందవిహారం చేసిన మాట వాస్తవం. 
              గుంటూరు టీజీపిఎస్ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగాధ్యక్షులుగా పని చేసిన డా. జి.ఎల్.ఎన్. శాస్త్రి గారు తనకసలు సంబంధమే లేని కవితారంగంలోకి జొరబడి..సౌందర్య లహరి చదివి..పరవశించిపోయి..ఆ మహత్తర కృతికి తెలుగుసేత  చేస్తూ..వ్రాసిన ఈ మాటల్ని చదివితే శంకరులు సౌందర్య లహరీ రచనలో ఎంతటి రసానందాన్ని అనుభవించి..మనకు పంచిపెట్టారో అర్ధమవుతుంది. శాస్త్రిగారి మాటలివీ..."శంకరులు ఎన్నో స్తోత్రాలు రచించారు. వాటన్నిటిలోకీ తలమానికమైనది సౌందర్య లహరి. ఇది మంత్ర, తంత్ర,యంత్ర, సౌందర్య, యోగసమన్వితమైన స్తోత్రం. త్రిపురసుందరి అయిన అమ్మవారి అందచందాలు, అనురాగ అనుగ్రహాలు, నవరసోపేతమైన ఆ తల్లి దినచర్యల్ని శంకరులు వర్ణించిన తీరు న భూతో న భవిష్యతి. ఉపమ, రూపక, ఉత్ర్పేక్షాది అలంకారాలు, అసమానమైన శబ్ద రమ్యత, చిత్రవిచిత్రమైన కవితారీతులు సౌందర్య లహరికి మాత్రమే ప్రత్యేకం. పాఠకులకు ఆ పరదేవతను సాక్షాత్కరింపజేయాలనే విధంగా శంకరుల రచన సాగింది"   శాస్త్రిగారు సౌందర్య లహరికి తెలుగు అనువాదం ప్రారంభించాక, అది 32 శ్లోకాల దాకా సాగి, అక్కడ ఎందుకో ఆగిపోయిందిట. చాలారోజుల దాకా కొనసాగింపు కుదరలేదు. ఆ పరిస్థితిలో ఒక తెల్లవారుఝామున శాస్త్రిగారికి తన ఇంట్లో గజ్జెల చప్పుడు సుమధురంగా వినిపించిందిట. అది అమ్మవారి అందెల రవళేనని నిశ్చయించుకున్నారు   శాస్త్రిగారు. ఆ రోజు నించి ఆయన రచన గంగావతరణంలా వడివడిగా సాగిందిట. అదీ ఆ తల్లి మహత్తు. నమ్మినవారికి విగ్రహం...నమ్మనివాడికి రాయి!!    
                                               ఇక్కడ మరో విషయమేమంటే "పాదధూళి" అనగానే నాకు శరత్ బాబు  గుర్తొస్తాడు. శరత్ నవలల్లో ఇంచుమించు ప్రతి స్త్రీ పాత్రా పెద్దవాళ్ల "పాదధూళి" స్వీకరిస్తూ ఉంటుంది. అంటే వంగి వారికి పాదప్రణామాలర్పిస్తుందన్నమాట. అంటే ఇక్కడ దేవి పాదధూళిని స్వీకరించిన త్రిమూర్తులు మువ్వురూ ఆయమకు పాదాభివందనం చేస్తున్నట్టే కదా..! అదీ అంతరార్ధపు వైచిత్రి..! 
                             సరే..విష్ణువు దాకా వచ్చాం. విష్ణుమూర్తి వేయి తలలతో మోస్తున్న ఆ ధూళిని పరమేశ్వరుడు చక్కగా మెదిపి..భస్మలేపనంగా ఉపయోగించుకుంటున్నాట్ట. ఇది లయాత్మకమైన వర్ణన. బ్రహ్మ సృష్టిలోకి ఇమిడ్చిన ధూళిని, నారాయణుడు శిరసా భరిస్తూ ఉండగా..శివుడు మాత్రం దాన్ని మెదిపేశాడు..అంటే లయమొందించాడు. లయమైనదాన్ని తనలోకి ఇముడ్చుకున్నాడు. లయకారుడైన శివుని మృత్యుంజయత్వానికి ఇది చిహ్నం. విలయాన్నంతటినీ తనలో ఇముడ్చుకుని తాను మాత్రం చిరంజీవిగా చిరుదరహాసమొనరించగల విశ్వనాధుడతడు. రూపగుణస్వభావాల్లో ఏ మాత్రమూ అమ్మకు తీసిపోనివాడు. గంగావతరణ సమయాన తన దూకుడు భరించడానికి సిద్ధపడిన శివుణ్ణి చూస్తూ గంగ.."ఇతడేనటే స్మరహరుడు..ఇతడేనటే పురహరుండు..? ఇతడేనటే హిమవన్నగనందినీ మనోహరుండు.." అనుకుందట. అప్పుడాయన కూడా గంగను చూసి.."స్ఫురత్ శుభ్ర సుందరతర దరస్మేర ముఖము...శరద్యామినీ రాకా చంద్రకోటి సఖము" అనుకున్నాట్ట. బాబోయ్...దక్షిణ నాయకుడు..!!
                     చాలు..ఇంక ఆపేద్దాం. అమ్మ వింటే ఇంకేమైనా ఉందా..:) 
మరి ముగింపు శ్లోకానికి వెళదామా...
  ఘృతక్షీర ద్రాక్షా మధు మధురిమా కైరపి పదై
   ర్విశిష్యానాఖ్యేయో భవతి రసనా  మాత్రవిషయః 
   తధా తే సౌందర్యం పరమశివ దృజ్మాత్ర విషయః 
   కధంకారం బ్రూమ సకల నిగమా గోచరపదే.
      (నెయ్యి, పాలు, ద్రాక్ష, తేనెల్లోని మాధుర్యాన్ని వట్టి మాటలతో చెప్పలేం. ఆ మాధుర్యపు రుచి ఎంతటిదో జిహ్వకే తెలుసు. అలాగే..ఓ తల్లీ..నీ సౌందర్యాన్ని వర్ణించేందుకు వేదాలకే శక్తి చాలదే..ఇంక మాబోటివాళ్లమెంత..? ఆ సౌందర్యపు అతిశయం ఒక్క మహాదేవుని కంటికే ఎరుక!) 
                            -------శంకరాచార్య విరచితం 
ఈ రోజుకు సెలవా మరి.. 
    ఇది వ్రాయడం పూర్తయ్యాక ఎందుకో ఫేస్ బుక్ చూసేసరికి అక్కడ ఈ ఫోటో కనిపించింది. బావుంది కదూ..
   

19, ఫిబ్రవరి 2014, బుధవారం

అందాల కడలి-2


అమ్మగారు లేనిదే అయ్యగారు లేరు 



శ్లో.. శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి 
ప్రణంతుం స్తోతుంవా  కథ మకృత పుణ్యః ప్రభవతి !! 

 ఇది సౌందర్య లహరిలోని మొట్టమొదటి శ్లోకం. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే.."అమ్మా..శివుడు శక్తితో (నీతో) కూడి ఉన్నప్పుడే సృష్టించగలడు. లేని పక్షంలో ఆ మహాదేవుడు కదలడానికి సైతం అశక్తుడే.అందుకే త్రిమూర్తులకు ఆరాధ్యురాలవగు నిన్ను స్తుతించడానికి గాని,నీకు ప్రణమిల్లడానికి గాని పూర్వపుణ్యం లేనివాడు ఎలా సమర్ధుడవుతాడు..?? 
                                                         ఇక ఇప్పుడు ఈ శ్లోకపు భావార్ధం లోకి వెళదాం. మనకు తెలిసినంతవరకూ శివుదు లయకారుడు. త్రిమూర్తులు ముగ్గురిలో సత్వగుణ ప్రధానుడైన బ్రహ్మ సృష్టికీ, రజోగుణమూర్తి అయిన నారాయణుడు స్థితికీ, తమోగుణసంపన్నుడైన ఈశ్వరుడు లయకూ అధిపతులు. బ్రహ్మ పని సృష్టించడం..విష్ణుమూర్తి పని ఆ సృష్టిని పరిరక్షించడం..శంకరుని పని దాన్ని లయమొందించడం. మరి ఈ సౌందర్య లహరి ఆదిలోనే ఆదిశంకరులు శివుడికి  సృష్టితో ఎలా ముడిపెట్టారో నాకు అర్ధం కాలేదు. ఆఖరికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారిదంటూ కనబడిన (ఇంటర్నెట్ లో) ఒకానొక వ్యాఖ్యానంలో కూడా అలాగే ఉంది. సరే పెద్దలు చెప్పినదాంట్లో తప్పులు వెతకడమన్నది అపభ్రంశపు పనేనని దాన్ని అలా వదిలేశాను. అంచేత మిగతా విషయాల్లోకి వెళదాం. ఈ విషయంలో ఎవరైనా ఎమైనా తమకు తెలిసింది చెప్పదలచుకుంటే...వారికి స్వాగతం...నిరభ్యంతరంగా ఈ కింద వ్యాఖ్యల జాగాలో వారు తమకు తెలిసినది రాయవచ్చు. నేను పండితపుత్రికనని మరోసారి గుర్తు చేస్తున్నాను.   
                      సరే...ఆదిలోనే వ్యతిరేకపు పలుకు పలికినందుకు శంకరులకు క్షమార్పణ చెప్పుకుంటూ..తరువాయిలోకి వెళదాం. శక్తి తోడు లేనిదే శివుడు కదలను కూడా కదలలేడట. ఆ శివుడు ఎటువంటివాడు..? జగదీశ్వరుడు. క్షీరసాగరమధనవేళ అమృతానికి బదులు హాలాహలం ఉద్భవించగా..దాన్ని నిర్భయంగా తాగబుచ్చుకుని..నోట ప్రవేశించినది జర్రున  కడుపులోకి జారకుండా "ఆగక్కడ" అంటూ దాన్ని గొంతులోనే నిలబెట్టి అక్కడే ఇముడ్చుకున్న గరళకంఠుడాయన..!!
                      తాతముత్తాతలకు సద్గతుల కోసం భగీరధుడు భూమ్మీదకు దింపజూసిన దివిజగంగ ఉరుకులు పరుగులు పెడుతూ..దిగివస్తుండగా ఆ దూకుడు ధాటికి కులగిరులే కంపించిన వేళ..  
"కులనగపంక్తులు సడలెను కువలయమండలమడలెను
 కూర్మరాజు సర్దుకొనె కపర్ది కాలు కదుపలేదు"  
                      ఇక లాభం లేదని  "పరమపురుష నీ దానను..పరమేశ్వర నీ చానను..దయగొనుమీ జడదారిని" అంటూ భగీరధుని తరఫున వియద్గంగ తనే శంకరుణ్ణి వేడుకోగా తన జటాకలాపం నుండి ఒకే ఒక్క చుక్కను మాత్రం విడుదల చేసి...మిగిలిన "కురులన్నియు వడి ముచ్చట ముడి చుట్టు"కున్న త్రిపురాంతకుడాతడు..!!
                           సౌందర్య లహరి గురించి చెబుతానంటూ శివుడి గురించి వల్లిస్తుందేమిటీవిడ అనుకుంటున్నారు కదూ...అక్కడికే వస్తున్నా...మీ ఆఫీసులో ఓ బాసు ఉన్నాడండీ...అత్యంత సమర్ధుడూ... మంచివాడూను. ఆయనకి యెకాయెకీ ఏదో అవార్డు కూడా వచ్చింది. ఉన్నట్టుండి వాళ్ల పక్కింటాయన.."అబ్బే..అంతా అమ్మగారి మహిమే. ఆవిడ లేకపోతే ఈయన కానీకి కొరగాడు."  అంటూ తేల్చి పారేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాసు మీది అభిమానాన్ని చంపుకోనూలేము..అలా అని "అమ్మగార్ని" కూసింత ఎక్కువగా ఆరాధించకుండా ఉండనూ లేము. అయ్యగారి కంటే అమ్మగారిపట్లే  ఓ పిసరు ఎక్కువ మొగ్గు చూపిస్తాం. అవునా కాదా..?? దిగంబరుడు..ఆదిమధ్యాంతరహితుడు అయిన పరమేశ్వరుడికి ఆయన పేరు పెట్టుకుని మరీ శంకరులు చేసిన ఉపకారమిది...వహ్వా..!! పోనీ కాదందామా అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే.."ఆమె లేక మనం లేము" అని చెప్పినట్టు దేవీ భాగవతం వేనోళ్ల చాటుతోంది.  
                      సందర్భం వచ్చింది కాబట్టి మరో ముక్క చెబుతా...ఒక్క శంకరులే కాదు..శ్రీనాధుడు కూడా అమ్మగారికే ఓటు వేశాడు. 
  మ్రింగెడిది గరళమని తెలిసి
  మ్రింగెడివాడు ప్రాణవిభుడని, మేలని ప్రజకున్
  మ్రింగుమనె సర్వ మంగళ
  మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో...
                              అన్నాడు చూశారా..."ఆవిడ" మింగమంది కాబట్టే ఆయన మింగాడు. అదండీ సంగతి..! అందుకే మనవాళ్లు కూడా ఎవరైనా మొగాడు ఏ యాక్సిడెంట్ లోనో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనై ఇల్లు చేరితే.."వాళ్లావిడ తాళి గట్టిది" అంటారు. యధా రాజా తధా ప్రజా..!!  
                      అయితే ముందు ముందు ఆ ఆదిదంపతుల అన్యోన్యతనూ..ఆయమ ఆయన పట్ల ప్రదర్శించే భక్త్యనురాగాల్నీ శ్లోకాల మాధ్యమంలో దర్శించుకున్నాక..అసలు వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న అనుమానం కూడా కలిగేలా చేశారు లెండి శంకరులు. 
             సరే..అదలా ఉంచితే,ఈ శ్లోకంలో వాడిన "శక్తి" అన్న పదం ఉంది చూశారూ...ఆ పదమే ఒక అఖండం.  "ఎండవేడికి తట్టుకోలేక సోలిపోతున్నారా...తక్షణ శక్తి కోసం తాగండి గ్లూకోస్" అంటుంది గ్లూకోస్ వ్యాపార ప్రకటన. "కదలడానికి బొత్తిగా శక్తి లేదమ్మా" అంటారు వయోవృద్ధులు. శక్తి అంటే బలం అన్న సామాన్యార్ధంలో మనం వాడతాం. కాని అది జగన్మాతృక అంశ అన్న భావాన్నే సమస్త పురాణేతిహాసాలూ వ్యక్తం చేస్తాయి. రెండిటినీ కలగలుపుకుంటే ఆయమ అంశ ఉంటేనే మనకి జవం..జీవం..బలం..అన్నది విస్పష్టం..!!  దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది.. "సర్వశక్తిమయి" "సర్వమయి" అయిన ఆ జగన్మాత అంశ పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ వ్యాపించి ఉందని..సమస్త జగత్తుకూ "ప్రాణదాత్రి" ఆమేనని. ఆ అంశ ఎంత కొరవడితే మనం అంతగానూ సోలిపోతామని..! అందుకే ఈ చరాచర ప్రపంచమంతటినీ సోదరభావంతో చూడాలన్నది హిందూమత మూలసూత్రం.  
                   ఇక ఈ శ్లోకం మనకు తెలియజెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే...భగవత్ప్రార్ధనకు సైతం పురాకృతం సహకరించాలని."ఆ..తల్చుకుంటే ఆ పూజలన్నీ మనమూ చేసెయ్యగలం" అనుకుంటాం.  కానీ అది తప్పు. మన రెండు చేతులూ మనవే కావచ్చు. కానీ ఆ రెండింటినీ జోడించి భగవంతునికి ఒక్క నమస్కారం చెయ్యాలన్నా కూడా మనకి అది రాసిపెట్టి ఉండాలి.ఈ విషయాన్ని సోదాహరణంగా నిరూపించడానికి లక్ష సంగతులు  చెప్పుకోవచ్చు. కాస్త శ్రద్ధగా గమనించాలే గాని నిత్య జీవితంలో మీక్కూడా అలాంటివి బోలెడన్ని తటస్థపడతాయి. ఆ మధ్య ఓ పెద్దమనిషి చెప్పిన మాటని ఇక్కడ ఉదాహరణగా చెబుతాను వినండి..ఆయన దాదాపు యాభై ఏళ్లవాడు. వాళ్లింట్లో అందరూ వెంకటేశ్వరస్వామి భక్తులు. శనివారం రాత్రి ఫలహారమే గాని ఎవరూ అన్నం తినరు. కాని ఈయన చిన్నప్పుడు "అలా ఎందుకు చెయ్యాలి.." అని పంతగించి ఏదేదో వితండవాదం చేసి, అసలు దేవుడికి దండమే పెట్టకుండా, శనివారం రాత్రి ప్రత్యేకంగా తనకొక్కడికీ పేచీ పెట్టి అన్నం వండించుకు తినేవాట్ట. "ఇప్పుడు నేను శనివారం అసలు ఏమీ తిననమ్మా...పూర్తి ఉపవాసం. ఏడాదికోసారి తిరుపతి వెళ్లి ఆ స్వామిని దర్శించుకు రానిదే స్తిమితం ఉండదు" అన్నాడాయన నవ్వుతూ. అంటే ఆయన పురాకృతం ఇప్పటికి ఫలించిందన్నమాట.      
                             అదండీ సంగతి. అంచేత ముగురమ్మల మూలపుటమ్మ...చాల పెద్దమ్మకు ప్రణమిల్లాలన్నా,  ఏ లలితా సహస్రమో చదివి ఆ తల్లిని స్తుతించాలన్నా మనకు పూర్వపుణ్యం ఉండి తీరాలి. అందుకోసమూ మళ్లీ ఆ దేవినే ప్రార్ధించాలి. వేరు గతి లేదు. అందుకే గదా శంకరులు "గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ" అన్నారు. సరే...ఇక్కడొక లలితలలితమైన శ్లోకం చెప్పుకుని సెలవు తీసుకుందామా మరి... 
  భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిన్న వదనైః 
 ప్రజానామీశాన స్త్రిపురమధనః పంచభిరపి 
 న షడ్భిస్సేనానీ ర్దశశతముఖై రప్యహిపతిః  
 తదాన్యేషాం కేషాం కధయ కధమస్మిన్నవసరః 
                                   (ఇది సౌందర్య లహరిలోది కాదు గాని శంకరాచార్యులవారిదే)