27, ఫిబ్రవరి 2014, గురువారం

విన్నపాలు వినవలే వింత వింతలూ...

                                ఈ ఏడాదికి శివరాత్రి గడిచిపోయినట్టే..! ఎల్లుండి నించీ ఫాల్గుణం. ఆ  మాసంలో మరే పండుగలూ లేవు. మళ్లీ కొత్తమావాస్య..ఆ మర్నాడు ఉగాది నించీ మరో కొత్త సంవత్సరం ప్రారంభం. జీవితంలో మరో కొత్త సంవత్సరమైతే ఇట్టే మొదలైపోతోంది గానీ..కొత్త సంవత్సరంలో మరో కొత్త జీవితం ప్రారంభమవుతుందన్న ఠికాణా ఎక్కడన్నా ఉందా..? ఏమిటో ఈ జీవితం.."బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక" అన్న కవిగారు ఎంత బాగా చెప్పారో గాని..మనుషుల జీవితాలతో ఆడుకోవడం దేవుడికి గొప్ప వేడుక. ఈ జన్మలో మనం న్యాయంగానే ఉంటాం. ఐనా మనకి కష్టాలు తప్పవు. "న్యాయానికివి రోజులు కావు. ఈ కలికాలంలో ఎడాపెడా అన్యాయాలు చేసేవాడికే సమస్తమూను" అని నిట్టూరుస్తాం. అందుకు సాక్ష్యంగా మన పక్కింటివాడి దగ్గర్నించి పక్క దేశంలో ఉన్నవాడి దాకా వెయ్యిన్నొక్క ఉదాహరణలు టకటకా చెప్పేస్తాం. ఏం చేస్తున్నా మన తలరాత మారట్లేదంటూ ఆఖర్న ఓ కిలోమీటరు నిట్టూర్పు వదులుతాం. అందుకే..నన్నడిగితే దేవుడు తన పరిపాలనలో కూడా ఈ కింది అమెండ్ మెంట్స్ చేస్తే బావుంటుందనుకుంటాను నేను...అవేమిటో చూడండి...
 1) మనం ఎలా ఉండాలో...కాలమాన పరిస్థితుల్ని బట్టి ఎలా నడచుకోవాలో క్షుణ్ణంగా చెప్పడానికి వీధికో పెద్దాయన / పెద్దావిడ ఉండాలి. ఆయన మాటని ధిక్కరించే శక్తి ఎవరికీ ఉండకూడదు. ఆ పెద్దాయన / పెద్దావిడ ఇప్పటి పూజారుల్లా భక్తుల దగ్గర చెయ్యిజాపే రకాలు, భయపెట్టి పూజలు చేయించి డబ్బు గుంజే రకాలూ  కాకూడదు. కరుణామయుడైన దేవుడికి పరిపూర్ణమైన ప్రతినిధుల్లా ఉండాలి.
 2) చెప్పిన తీరున నడచుకోనివాళ్లని ఆ పెద్దవాళ్లు వెంటనే శిక్షించే ఏర్పాటు ఉండాలి.ఆ నేరాలూ-విచారణా-శిక్షలూ-వాటి అమలూ అంతా కలిపి ఓ రెండు రోజుల్లో తెమిలిపోవాలి తప్పితే ఇప్పట్లా పోలీసులూ-వాళ్ల చుట్టూ తిరగడాలూ, కోర్టులూ-వాటిలో కేసులు పేరుకుపోవడాలూ, జైళ్లూ-వాటినిండా కిటకిటలాడుతూ జైలుపక్షులూ, ఆమ్యామ్యాలూ ఉండరాదు.
 3)ముఖ్యంగా ఏ జన్మలో చేసే పాపానికి ఆ జన్మలోనే శిక్షలు ముగిసిపోవాలి. అంతేగాని..."ఏ జన్మలో ఏ పాపం చేశామో" అనుకుంటూ  అయోమయంలో పడిపోతూ ఈ జన్మలో చెయ్యని పాపానికి ప్రజలు లేనిపోని బాధలు అనుభవించకూడదు.
 4)ఆడపిల్లలకి వరకట్నాలూ-వెయ్యిన్నొక్క ఈతిబాధలూ లేకుండా ఇట్టే పెళ్లిళ్లవాలి.వారి వారి భర్తలు వాళ్లని "ఇల్లే ఇలలో స్వర్గం ఇల్లాలే ఇంటికి దేవత" అన్నట్టు చూసుకోవాలి..డొమెస్టిక్ వయలెన్స్ అన్నది అసలు సృష్టిలోనే మాయమైపోవాలి.  
 5) సమాజ, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా సదరు పెద్దాయన / పెద్దావిడలే నడుం బిగించాలి. సమాజంలో శాంతి సౌభాగ్యాలకీ పర్యావరణానికీ హాని కలిగించేవారిని తక్షణమే శిక్షించాలి.
 6) జాతకాలు అనేవి పూర్తిగా మాయమైపోవాలి. ఎవరికి ఏది మంచిదో..ఎవరు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో..ఏ సమస్యకి ఏది పరిష్కారమో..ఏ ఆడపిల్ల ఏ పిల్లాణ్ణి చేసుకుంటే బావుంటుందో ఇత్యాదులన్నీ కూడా ఆ పెద్దవాళ్లే నిర్ణయించి చెప్పాలి తప్పితే వీధికో జ్యోతిష్కుడూ-వాడికి వందలకొద్దీ ఫీజులూ,ఆనక లేనిపోని భయాలూ..బెంగలూ  ఉండనేకూడదు.
                                          ఇంకా ఈ జాబితాలో ఇలాంటివి బోలెడన్ని రాసుకోవచ్చు..దేవుడు వాటిని అనుమోదిస్తానంటే.
                        ముఖ్యంగా నాకు మండేదెక్కడంటే "పురాకృతం" అన్న పదం దగ్గర. ఏ జన్మ తాలూకు క్రెడిట్టూ డెబిట్టూ ఆ జన్మకే దేవుడు ఎందుకు సరిపెట్టలేదో..వాటిని అలా జన్మ జన్మల బేక్ లాగ్ లో ఎందుకు పెట్టాడో   బుర్ర బద్దలుగొట్టుకున్నా అర్ధమై చావదు. మా మాస్టారొకాయన...ఎంత మంచివారో..ఆయన ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి ఎదిగొచ్చినవాడు..చెప్పా పెట్టకుండా పరలోకానికి టిక్కెట్టు పుచ్చేసుకున్నాడు. పాపం మా మేష్టారి భార్య పిచ్చిదే అయిపోయింది. నా స్నేహితురాలొకర్తికి పుట్టిన దగ్గర్నించీ ఏదో ఒక అనారోగ్యమే...అలాగే పెరిగింది..పెద్దయింది..చదువుకుంది..పెళ్లాడింది. ఇప్పుడు మొగుడి చేత తిట్లు తింటూ మరీ ఉద్యోగం కూడా చేస్తోంది...ఇంటెడు చాకిరీతో బాటు. వాళ్లత్తగారు టీవీ ముందునించి కదలదు. మా మంచి మేష్టారూ..అసలు ఆరోగ్యభాగ్యానికే నోచుకోని మా ఫ్రెండూ గత జన్మల్లో ఏయే  పాపాలు చేశారో ఆ దేవుడొక్కడికే తెలుసు గాని మనకొక్క ముక్క కూడా తెలీదు  కదా...:(  
                                              అంచేత...ఈ మహాశివరాత్రి పర్వదినాన..ఉపవాసాలుండి..జాగరణలు చేసే అనంతకోటి భక్తుల్లో ఏ ఒక్కరికైనా ఆ సదాశివుడు గనక కనిపిస్తే నా విన్నపంగా  ఒక్కమాట చెప్పండి...
                  "సామీ...ఎప్పటి పరీక్ష రిజల్ట్ అప్పుడే వచ్చేసినట్టు మా పాపపుణ్యాల వేల్యుయేషన్ ని కూడా ఎప్పటికప్పుడు చేసెయ్యి తండ్రీ...ఒకటో క్లాసు  పాసయ్యామో లేదో టెంత్ క్లాసుకొచ్చాక చెప్పి అప్పుడు మళ్లీ చెట్టంత వాళ్లని ఒకట్లో కూచోబెట్టమాకు. ఇవేళ రాసిన పరీక్ష రేపు తెలుస్తుందంటే జనం ఎంతో కొంతైనా జాగ్రత్తగా ఉంటారు. పదేళ్ల తర్వాతేనంటే  పరీక్షలనేవి లేకుండా అటెండెన్సుతోనే గట్టేక్కిపోయే కుర్రాళ్లు పుస్తకాలు గిరాటేసినట్టు ఈ పదేళ్లూ నేరస్తులంతా చిత్రగుప్తుడి పద్దు నింపేస్తారు. అది కాస్త గమనించు దేవా.."  
                 ఈ మాట చెప్పడం మర్చిపోకండేం..లేదంటే ఆ ఎద్దునెక్కిన దేవర మీకు కనిపించగానే నాకొక్క ఫోను కొట్టండి...నేనే వచ్చి సంగతేమిటో తేల్చుకుంటా...ఓకే...ఉంటా మరి. సెలవు.... 

1 కామెంట్‌:

  1. మీరు చాలా చాలా బాగా వ్రాస్తున్నారు.
    అందాల కడలి ఎంత బాగుందో. నేను ప్రతిరోజు మీ పొస్ట్ కోసం చదువుతాను
    ఇలాగే కొనసాగించండి .

    సురభి

    రిప్లయితొలగించండి