7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

బాల సరస్వతి

మా తాతగారు (మాతామహులు)  వెంకట నరసింహం పంతులుగారు. అనకాపల్లి దగ్గర చోడవరంలో అప్పట్లో పేరెన్నిక గన్న వకీలు.గాంధేయవాది. తను ఖద్దరు కట్టడమే గాక, కూతుళ్లకి సైతం ఖద్దరు బట్టలే కొన్న పెద్దమనిషి. (అందుకే గదా అమ్మ ఖద్దరు పరికిణీ..వోణీ వేసుకుని నాన్నకి తొలి దర్శనం ఇచ్చింది. మా అమ్మకి కొన్ని కొన్ని విషయాల మీద ఎంత తీపి జ్ఞాపకపు పట్టు అంటే..ఆ రోజు తను కట్టుకున్న బట్టల రంగునీ డిజైన్ నీ డెబ్భయ్యేళ్ల వయసులో కూడా ఖచ్చితంగా వర్ణించి చెప్పేది. నేనే మర్చిపోయాను...) ఆయనకి సరిగ్గా వాటాలేసుకున్నట్టూ నలుగురు కూతుళ్లూ..నలుగురు కొడుకులూ. పెద్దదొడ్డ కృష్ణవేణి, చిన్నదొడ్డ కామేశ్వరి,పెద్దమావయ్య సుబ్రహ్మణ్యం, అమ్మ సరస్వతి,చిట్టిపిన్ని, బుచ్చి మావయ్య, శివరాం మావయ్య, సిద్ధాంతి మావయ్య. ఇదీ వరస. చిట్టిపిన్నికీ బుచ్చి మావయ్యకీ సొంత పేర్లున్నాయన్న సంగతి ఎవరికీ ఎప్పుడూ గుర్తు రాదు. బంధువులతో బాటు ఊళ్లోవాళ్లు కూడా కొందరు చిట్టెప్పా...బుచ్చీ అనే పిలిచేవారు వాళ్లని.
                                                    పెద్ద దొడ్డకి వ్యక్తురాలవకుండానే పెళ్లి చేసేశారు. అంత హడావుడిగానూ మా పెద్ద పెదనాన్నగారు పైకెళ్లిపోయారు.  తొమ్మిది-పది సంవత్సరాల వయసులో..అసలు పెళ్లి సంసారం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉన్న పెద్దదొడ్డకి వెంటనే గాజులూ..బొట్టూ తీసేశారు. మా తాతగారు వీధి చావిడి మీద కూర్చుని క్లయింట్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా గాజుల మలారం వస్తే ఆ అలికిడికి దొడ్డ లోపలి నించి పరిగెత్తుకుంటూ వచ్చి రంగు రంగుల గాజులు చూసి మురిసిపోతూ.."ఇవి కావాలి నాన్నగారూ" అంటూ అడిగేదిట. మా తాతగారు కళ్ల నీళ్లు పెట్టుకుని దొడ్డని సముదాయించి మలారాన్ని అవతలికి పంపేసేవారుట. ఓ సారి తాతగారు లేని సమయంలో ఓ గాజుల మలారం పచ్చని పసిమి ఛాయలో మెరిసిపోతున్న దొడ్డని చూసి ముచ్చటపడుతూ తనే స్వయంగా గాజులు తీసి పిల్ల చేతికి తొడిగాట్ట. ఈ లోపున మా అమ్మమ్మ లోపలినించి వచ్చి చూసి ఏడుస్తూ "దీనికి ఆ భాగ్యం లేదు నాయనా.." అని గాజులు తీసెయ్యమందిట. విషయం విని తెల్లబోయిన మలారం తప్పనిసరిగా గాజులు తీసేసి తను కూడా ఏడుస్తూ వెళ్లిపోయాట్ట.
                                                 ఇవీ ఆ రోజులు. ఇంతకీ పెద్దదొడ్డకి పెళ్లి ఎక్కడ చేశారనుకుంటున్నారు...అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం బాల్య వివాహాల్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఎవరైనా చట్టవ్యతిరేకంగా బాల్య వివాహం చెయ్యబోతే పోలీసులు పట్టుకునేవారు.  అంచేత ఆ చట్టం అమలవని యానాం కి తీసికెళ్లి అక్కడ పెళ్లి చేసేశారుట. అదీ సంగతి. గాజులూ బొట్టూ అంటే తీసేశారు గాని పువ్వుల పిచ్చి ఉన్న దొడ్డని పువ్వులు పెట్టుకోకుండా ఆపలేకపోయారు. అక్కడ కన్న పేగు మెలిపడిందేమో పువ్వులు పెట్టుకోనిచ్చారు.రంగు రంగుల చీరలూ కట్టుకోనిచ్చారు.  దొడ్డ మా ఇంటికి వస్తే అమ్మ ప్రత్యేకం మా దొడ్లో పూసిన సన్నజాజులూ, మల్లెపూలూ మాల కట్టి "పెద్దక్కయ్యా...పెట్టుకోవే" అంటూ ప్రేమగా ఇచ్చేది.
                         ఇంక చిన్నదొడ్డకి పెళ్లి ఎప్పుడు చేశారో ఎలా చేశారో నాకు తెలీదు గాని మా అక్క చిన్నపిల్లగా ఉండగా మా చిన్న పెదనాన్నగారు జబ్బు చేసి పోయారు. ఎన్నాళ్లయినా తండ్రిని మర్చిపోకుండా "మా నాన్నని మీరు ఆస్పత్రిలో వదిలేశారు. నాన్న కావాలో" అని ఏడుస్తున్న మా అక్కని సముదాయించలేక మా పెద్ద దొడ్డ ఓ  రోజు దాన్ని విశాఖపట్నం కేజీహెచ్ కి తీసుకుపోయిందిట. అక్కడ మంచం మంచమూ తిప్పి చూపించి ఆఖర్ని దేవుడి ఫోటో దగ్గరకి తీసికెళ్లి మీ నాన్న ఇదిగో ఈ దేవుడి దగ్గరకి వెళ్లిపోయాడు అని చెబితే ఇంక అప్పుడు చేసేదేమీ లేక ఊరుకుందిట అక్క.
                          ఇంక మూడోది మా అమ్మ.కుమారసంభవంలో బాల పార్వతిలా హాయిగా ఆటలాడుకుంటూ బాల్యాన్ని నిశ్చింతగా గడిపిన మనిషి. పెద్దదొడ్డలాగే అమ్మది కూడా పచ్చని పసిమి ఛాయ. మా అమ్మ నాకంటే అందంగా ఉండేది...(నేను మా నాన్న పోలిక కదా...నేనూ మా నాన్నా నల్ల బంగారాలం) పెద్దకూతురు బాల వితంతువు అయినప్పటికీ మూడో కూతురు పెళ్లి కాకుండానే వ్యక్తురాలయ్యేసరికి అమ్మమ్మ ఏడుస్తూ కూచుందిట. గాంధేయానికీ ధర్మానికీ పోయి మొగుడు  రెండు చేతులా విచ్చరూపాయలు సంపాదించుకురాకపోగా మూడోకూతురు పెళ్లి కాకుండానే చాపెక్కడం ఆవిడకి గుండెలమీద మరో పెద్ద బండరాయి అయింది. అయితే అప్పుడు బంధువులే ఆవిణ్ణి ఓదార్చారుట. "అన్నీ మన చేతుల్లో ఉన్నాయిటే అమ్మన్నా..(అమ్మమ్మని అమ్మన్నా అనేవారు. మా నాయనమ్మ అమ్మడు) మరేం గాభరా పడకు. వెంటనే సంబంధం చూసి పెళ్లి చేసేద్దాంలే.." అన్నారుట. అదిగో సరిగ్గా అప్పుడు...మీసాల బావా...అమ్మడూ...వాళ్ల ఒక్కగానొక్క బిడ్డ ప్రకాశిగాడూ అందరికీ గుర్తొచ్చేశారు.
                          మరప్పుడు ఏం జరిగిందో రేపు చెప్పుకుందామేం...ఓకే..సెలవు మరి.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి