28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

అందాల కడలి-8

అహో...అహంకారస్వరూపిణీ..!! 



శ్లో : 7
 క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా
 పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా
 ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
 పురస్తా దాస్తాం నః పురమధితు రాహో పురుషికా !  

                                ఇది సౌందర్య లహరిలోని ఏడవ శ్లోకం. క్లుప్తంగా దీని భావమేమిటంటే,"మెరుస్తున్న మణులతో కూడిన మొలనూలు కలది, గున్న ఏనుగు కుంభస్థలంతో సాటి రాగల కుచముల భారంతో కాస్త ముందుకు వంగినది, సన్నని నడుము గలది, శరత్కాల పూర్ణచంద్రబింబం వంటి నెమ్మోము గలది, చెరకు వింటిని, బాణాలను, పాశాన్ని, అంకుశాన్ని ధరించినది, త్రిపురాలను నిర్మూలించిన శివుడి అహంకార స్వరూపిణి అయిన భగవతి మా కట్టెదుట సాక్షాత్కరించుగాక..!" 
                                     ఇక భావార్ధంలోకి వెళదాం. అమ్మవారి దివ్య సౌందర్య వర్ణనకు తెరతీసిన మొట్టమొదటి శ్లోకమిది. సాధారణంగా కవులంతా సౌందర్య వర్ణన దగ్గరకొచ్చేసరికి స్త్రీనే వస్తువుగా తీసుకున్నారు తప్పితే పురుషుడికి తత్సమానస్థానం దక్కలేదు. రాముడు, కృష్ణుడు వంటి పురాణపురుషుల అందచందాల్ని వివిధ కవులు కీర్తించినా, స్త్రీ సౌందర్య వర్ణనకే ప్రధమ ప్రాధాన్యత లభించింది. అందునా ఎకాయెకీ విశ్వసౌందర్యానికే మూలమైన శ్రీదేవి దగ్గరకొచ్చేసరికి శంకరాచార్యులవారి లేఖిని సైతం కొత్త పుంతలు తొక్కింది. ఆది శంకరులు చేసిన అమ్మ సౌందర్య వర్ణనకు ఉద్భవించిన వ్యాఖ్యానాలు అన్నీ ఇన్నీ కావు. ఆ వర్ణన బీజాక్షర సమన్వితమూ, అత్యంత గుప్తమైన విషయ పరిజ్ఞానసహితమూ. మహానుభావులకు మాత్రమే గ్రాహ్యమయ్యే ఆ రకమైన అర్ధాల్ని ఒక పక్కన పెట్టి, సాధారణమైన అనుభూతుల్ని పరిగణనలోకి తీసుకుంటే..చతుర్దశ భువనాల్లోనూ భువనేశ్వరిని మించిన సౌందర్యవతి మరెక్కడా మనకు కానరాదు. ఆ అందం "మా అమ్మ ఇంత అందగత్తె సుమా" అన్న సాత్విక భావంతో మనల్ని పరవశింపజేస్తుంది. 
                        సరే ఇక సౌందర్య వర్ణనకొస్తే, కవులంతా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి సృష్టిలోని కొన్ని కొన్ని వస్తువులతో శాశ్వతమైన ఉపమ ఏర్పరిచేశారు. ముఖం చంద్రబింబం, కన్నులు కలువ రేకులు లేదా గండు మీనాలు, నాసిక సంపెంగ, పెదవులు దొండపళ్లు, కుచాలు ఏనుగు కుంభస్థలాలు, నడుము శూన్యం, ఊరువులు అరటి స్థంభాలు...ఇలా. శంకరులైనా కాళిదాసైనా సరే ఇవే ఉపమానాల్ని వినియోగించుకున్నారు. అయితే సార్వత్రికమైన ఆ ఉపమానాలన్నీ వారి వారి కవితా చమత్కృతి పుణ్యమా అని, దేవశిల్పి చేతికి చిక్కిన రాయిలా కొత్త సొబగులు సంతరించుకున్నాయి. 
                         ప్రస్తుత శ్లోకాన్నే తీసుకుంటే... "క్వణత్కాంచీదామా" అన్నారు శంకరులు. అమ్మ తన నెన్నడుమునకు అలంకరించుకున్నది సామాన్యమైన వడ్డాణం కాదు. చిరుమువ్వల మరుసవ్వడి చేసే మొలనూలు. వడ్డాణం అంటే దరిదాపు నాలుగు వేళ్ల వెడల్పున గల బంగారపు బద్దను గుండ్రంగా చుట్టీన ఆభరణ విశేషం. ఇది కాస్త మోటుగా ఉంటుంది. మొలనూలు అలా కాదు. సన్నగా, నాజూకుగా ఉండే బంగారు తాడు. దీన్ని ఇంచుమించుగా మొలతాడుగా చెప్పుకోవచ్చు. లలితలలితమైన సౌందర్యం గల శ్రీదేవికి అటు లలితా సహస్రం గాని, ఇటు సౌందర్య లహరి గాని మోటుగా ఉండే వడ్డాణాన్ని చుట్టలేదు...నాజూకుగా ఉండే మొలనూలును ధరింపజేశాయి.   "రత్న కింకిణికా రమ్య రశనాదామ భూషితా" అంటూ లలితా సహస్రం అమ్మను కీర్తించింది. మనోహరమైన కింకిణీ ధ్వనులు చేసే రమ్యమైన మణిమేఖలను ధరించిన తల్లి" అని దాని అర్ధం.  ఆభరణ విశేషాలు, అలంకార విశేషాలు సౌందర్యవతుల స్వాభావిక సౌందర్యాన్ని ఇనుమడింపజేసి,కొత్త అందాల్ని తెచ్చి పెడతాయి...బాపు హీరోయిన్ల నల్లని నాగుపాము జడల్లో ముద్దమందారాల్లా. మరి ఉందా లేదా అన్నట్టుండే దేవి నడుమును చుట్టిన నాజూకైన మణిమేఖల అంతకంటే నాజూకైన చిరుసవ్వడి చేస్తుంటే అది "మరు" (మారుని అంటే మన్మధుని) సవ్వడి కాకేమీ..?? ఓం ప్రధమంగా ఒక సన్నని బంగారు మొలతాడే ఇంత హృద్యమైన వర్ణనకు దారి తీస్తుంటే ఇక మిగతా శరీరాన్నీ, తదలంకార విశేషాల్నీ వర్ణించాలంటే అందుకు ఆ శంకరులే తగు గదా..!  
                                               సరే..నడుము సంగతి అయింది. ఇక కుచాల అందం. ఇక్కడ ఒక కవికీ మరో కవికీ పేచీయే లేదు. 

 "విద్యుద్వల్లి సమాన దేహలతికే మత్తేభ కుంభస్తనీ..
  హే ప్రియే తవ కరాత్తాంబూలమానీయతాం" 
                                      అన్నాడు కాళిదాసు.  ఆ కాళీ వరప్రసాదికైనా, ఈ శైవాంశ సంభూతునికైనా కుచాల స్థానంలో కనిపించేవి కరికుంభాలే..ఏనుగు ఎంత గంభీరమైనదో..తత్కుంభసమానకుచభారం గల పద్మినీ జాతి స్త్రీల హృదయాలు సైతం అంత   గంభీరమైనవేనన్నది వాత్సాయనుడు సైతం అంగీకరించిన విషయం. అందువల్ల కుచ సౌందర్యానికైనా, నెమ్మది తనానికైనా..వీటన్నిటినీ మించిన హుందాతనానికైనా ఏనుగులే స్త్రీలకు సరైన ఉపమా వస్తువులు.   
                       ఇక "పరిక్షీణా మధ్యే" అన్నారు శంకరులు. స్త్రీకైనా పురుషుడికైనా శరీరంలో ఏ భాగం ఎంత ఉండాలో అంత ఉంటేనే అందం. కొన్ని క్షీణించాలి..కొన్ని పుంజుకోవాలి. స్త్రీలకు అసలు ఉండకూడనిది నడుము. 
 "జలజవదన..చక్రజఘన..సింహమధ్య"
                        అన్నాడు అన్నమయ్య.  కుచభారానికి ఏనుగుల పోలిక వస్తే నడుమును చూడగానే గుర్తు రావాల్సింది సింహం. సింహానికి మధ్యభాగం ఎంత సన్నగా ఉంటుందో (ఆ ఆకృతికి తగినంత సన్నగా) స్త్రీకి కూడా అలాగే ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన ఒక మహా విచిత్రమేమంటే..కుచసౌందర్యం కోసం తీసుకునే ఏనుగూ...మధ్యభాగపు అందాన్ని వర్ణించేందుకు ఎంచుకునే సింహమూ రెండూ పరస్పర విరోధి జంతువులు. ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి చెండాడగలది ఒక్క సింహమే. సింహం కల్లోకి వచ్చినా ఏనుగు వణికిపోతుందిట. అలాంటి విరోధి జంతువుల పోలిక గల కుచాలు..నడుము కూడా పరస్పర విరుద్ధమైన ఆకృతుల్లో ఉండాలన్నమాట. అసలు సిసలైన కవయిత్రి, "సృష్టికర్త్రి" అయిన ఆ లలితాంబికే గదా...అవునంటారా..?! 
                               ఇక ముఖం విషయానికొచ్చినా కవులంతా ఏకగ్రీవంగా పోలిక తెచ్చేది పూర్ణ చంద్రబింబంతోనే. పూర్ణ చంద్రబింబం అనగానే చాలామందికి కేవలం పరిపూర్ణ వృత్తాకారమే (గుండ్రంగా ఉండటం) గుర్తొస్తూ ఉంటుంది. కాని ఇది తప్పు. ముఖాన్ని చంద్రబింబంతో పోల్చేది గుండ్రంగా ఉందని కాదు...షోడశకళలతో విరాజిల్లుతోందని. మొహం ఎంత గుండ్రంగా ఉన్నా కళావిహీనంగా ఉంటే అది అప్పడం మొహమే అవుతుంది గాని "రాకేందురమ్యానన"మెందుకవుతుంది..? ఇక తల్లి విషయానికొస్తే  షోడశకళలూ ఉద్భవించేది ఆయమ ముఖబింబం నుండే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే షోడశాక్షరీ మంత్రపూతమైన శ్రీవిద్యకు అధిదేవత అయిన లలితాంబికే షోడశకళలతో కూడిన పున్నమి చంద్రుడు. 
                                            ఇక ధనస్సు, బాణాలు, పాశం, అంకుశాలను చేతుల్లో పట్టుకుని ఉన్న ఆ పరదేవతను పురారి అయిన మహాశివుని "అహంకార స్వరూపిణి"గా వర్ణిస్తున్నారు ఆది శంకరులు. అదెలాగంటే..శక్తి లేనిదే శివుడు లేడు. మరి అటువంటప్పుడు సదాశివుడు.."నేను" (అహం) అంటూ దేనికైన అహంకరించి చెప్పుకోవాలంటే అందుకు ముందు ఆ తల్లి ఆయనలో ఉండాలి కదా..అంటే ఆ దేవాధిదేవుని అహంకారస్వరూపిణి ఆమే కదా..
                           ఇక్కడ మరో చిన్న మాట. స్త్రీ శక్తి స్వరూపిణి. నిండు నూరేళ్ల జీవితంలో స్త్రీ అండదండలు లేనిదే పురుషుడు కానీకి కొరగాడు. అయినప్పటికీ అతగాడు తనకు తానే అహంకరించి పేట్రేగిపోతాడు తప్పితే తన "అహం"కారానికి మూలం ఎక్కడుందో తెలుసుకోడే...:( 
                 ఇంతకీ ఆఖరుమాట ఏమిటంటే శివుని అహంకారస్వరూపిణి అయిన ఓ జగదంబా...మా కట్టెదుట సాక్షాత్కరించు తల్లీ అని ప్రార్ధిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో. మరి మనం కూడా అలాగే వేడుకుందామా...!!   

          ఇక ముగింపు శ్లోకానికి వెళదాం...

        సపర్ణామాకీర్ణాం కతిపయగుణైః స్సాదరమిహ
        శ్రయంత్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి
        అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః 
        పురాణోపి స్థాణుః ఫలతి కిల కైవల్య పదవీం !  

(భావం : (సపర్ణ అంటే ఆకులున్న తీగ) ఏవో కొద్దిపాటి ఔషధ గుణాలున్నంత మాత్రాన లోకులు సపర్ణను ఆదరిస్తారు గానీ ఇహలోకంలో తరించాలంటే అపర్ణనే (శివుడి కోసం ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసిన పార్వతిని మహర్షులు అపర్ణా అని పిలిచారు) సేవించాలన్నదే నా అభిప్రాయం. ఎందుచేతనంటే స్థాణువు (ఆకులు లేని మోడు, శివుడు) అపర్ణను పరిణయమాడిన తరువాతనే అర్ధనారీశ్వరుడై మోక్షఫలప్రదాత అయ్యాడు కదా..) 
                 ------శంకరాచార్య విరచితం 
 ఇక ఈ రోజుకు సెలవా మరి.... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి