6, ఫిబ్రవరి 2014, గురువారం

ఇదిగో నేను

సంవత్సరాల తరబడి కారాగారంలో మగ్గిపోయి...ఏడు గర్భాల్ని పోగొట్టుకున్న తర్వాత..దేవకీ వసుదేవుల పుణ్యం పండి, అష్టమ గర్భాన వాళ్లకి కొడుకుగా జన్మించాడు కృష్ణపరమాత్మ. అంతకు ముందు ఏడో గర్భం..ఆడపిల్ల..యోగమాయగా నింగికెగిరిపోయింది.            
         పదమూడు సంవత్సరాల వయసులో పెళ్లాడి, అత్తవారిల్లనే కారాగారంలోకొచ్చి పడ్డాక, అనారోగ్యమనే కంసుడి పుణ్యమా అని ఏడు గర్భాల్ని పోగొట్టుకున్న చెల్లూరివారి ఆడబడుచు...ముక్కామలవారి కోడలు సరస్వతికి అష్టమగర్భాన ఆడపిల్ల పుట్టింది. దేవకీదేవి కానుపుల చరిత్ర రివర్స్ అయి, ఏడో కానుపులో పండంటి మొగపిల్లవాడు నింగికెగిరిపోయాడు. ఆ అష్టమగర్భసంజాతనే నేను...:)  
         నక్కకీ నాగలోకానికీ పోలికా చెప్పండి...?? కనీసం మా నాన్న నాకు కృష్ణ అన్న పేరైనా పెట్టలేదు కదా...
        అయితేనేంగాక అనుకుని...నా రాతలన్నిటికీ కృష్ణలీలాతరంగిణి అని పేరు పెట్టేసుకుని...నారాయణ తీర్ధులవారికి మనసులోనే క్షమార్పణలు చెప్పుకుంటూ..."నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు...నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు" అని దర్జాగా మీ ముందుకి వచ్చేశాను. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇది. మీ జ్ఞాపకాలతో బ్లాగు రాయండని చెప్పి చెప్పి మిత్రులు శ్రీ రాజశేఖర రాజు గారు (చందమామ) ఆఖరికి నా ఖర్మకి నన్ను వదిలేశాక...ఇన్నాళ్లకి పుట్టిందీ బుద్ధి.   
                          సరే...ముందు మూలాల్లోకి వెళితే బావుంటుందేమో...అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ తల్లివేరు దాకా తవ్వి తవ్వి తీసిన మూలాలు "రూట్స్" నవలగా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో చాలామందికి తెలిసిందే. 
               ఏ కాలంలోనైనా  అమ్మ..అమ్మమ్మ..నాయనమ్మల జీవితాలు (అలాగే మగవాళ్లవి కూడా) చరిత్రకారులు తవ్వి తీసే పురా సంస్కృతీ ప్రతిబింబాలు. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్నట్టు..గతము తలచీ వగచే కంటే సౌఖ్యమే లేదోయ్ అన్నట్టూ...గతం ఎంతైనా బాగా ఊరిన ఉసిరికాయ. దానికున్న రుచి అప్పుడే ఊరవేసినదానికెలా వస్తుంది? అంచేత ముందు మా అమ్మ గురించీ నాన్న గురించీ  చెప్పుకుందాం...
                 రేపు పెళ్లనగా ఈ రోజు ఖద్దరు పరికిణీ...వోణీ వేసుకునీ జడగంటల జడ ఊపుకుంటూ పందిట్లో ఆటలాడుకునే పెళ్లికూతుర్ని ఎక్కడైనా చూశారా మీరు...పెళ్లికూతురు ఎలా ఉంటుందో కూడా తెలీకుండానే పెళ్లికి తరలి వచ్చి ఆ ఆడుకుంటున్నదే పెళ్లికూతురని తెలిశాక తెల్లని పాంటూ..షర్టూ వేసుకున్న ఓ బక్క పలచని పదిహేడేళ్లబ్బాయి (పెళ్లికొడుకు) ఆ పెళ్లికూతురివైపు చూసే చూపుని ఎలా వర్ణిస్తారు మీరు...???  ఆ పిల్లే మా అమ్మ...ఆ అబ్బాయే మా నాన్న!!

          సరే వాళ్లిద్దర్నీ రేపు కలుసుకుందాం...ఈ రోజుకింక సెలవా...

2 కామెంట్‌లు:

  1. జ్ఞాపకాల దొంతరలని పదిలపరుచుకోడానికి సందుగపెట్టె సిధ్ధంచేసేసుకున్నారన్నమాట. హృదయపూర్వక శుభాభినందనలు! :)

    రిప్లయితొలగించండి
  2. నిన్ననో మొన్ననో ఒక వ్యాఖ్య రాశాననుకున్నానే?? బ్లాగ్లోకానికి స్వాగతం. ఇటువంటి కథలు రాసుకోడానికి బ్లాగుకన్నా మంచి చోటు, సాధనమూ లేవు. ప్రారంభమే చాలా చక్కగా ఉన్నది. కమ్మని ఊరిన ఉసిరి ముక్కల కథలకోసం ఎదురు చూస్తూ ..

    రిప్లయితొలగించండి