5, మార్చి 2014, బుధవారం

నా మనోగతం


                                 "సౌందర్య లహరిని గురించి ఇంతకుముందు విన్నాముగానీ, ఇంత వివరంగా తెలుసుకోవటం మీ పోస్టుల ద్వారానే. చాలా బాగుంది. కృతజ్ఞతలు.  ఇవాళ్టి శ్లోక పారాయణంవలన కలిగే ఫలంగురించి తెలియజెప్పినట్లే, ప్రతి శ్లోకాన్నీ వివరించేటపుడు వాటి ఫలాన్నికూడా పేర్కొనగలరు. ఎంతైనా సగటు జీవులంకదా. ఆ ఫలం తెలుసుకుని తదనుగుణంగా జపంద్వారా ఫలితాలు పొందొచ్చనే స్వార్ధం. మీ పోస్టులు మనసుకు చాలా ఊరటనిస్తాయి."
                             ఇది  ఒక పాఠకురాలు అందాల కడలి-9 కి రాసిన కామెంట్. దీనికి జవాబుగానే ఇది రాస్తున్నాను. 
                                     నా పోస్టులు మనసుకు ఊరటనిస్తాయన్నారామె.   నా పోస్టులు మనస్సుకు తశ్శాంతినిస్తున్నందుకు సంతోషమే గాని...నేనూ సగటు జీవినేనండీ... పాఠకులు  నా పోస్టులు చదివి ఊరట పొందుతూంటే నేనవి రాస్తూ ఊరట పొందుతున్నాను...:) అందరూ సర్వసాధారణంగా అనుకునేట్టు, సమస్యలతో నిండిన సగటు జీవులకే (ఈ కలికాలంలో) సర్వాంతర్యామి ఎక్కువ గుర్తొస్తాడు. దేవుడా నాకేది దిక్కు...నన్నేం చెయ్యదలచుకున్నావయ్యా అన్న తపన అధికమవుతుంది. 
                                నేను వృత్తి రీత్యా జర్నలిస్టుని. నా సహోద్యోగి ఒకరు ఒకసారి రాశారు..."ప్రార్ధన అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. ఈ ప్రార్ధన వల్ల మన జీవితాల్లో ఏదో మార్పు వచ్చేస్తుందనీ..మన సమస్యలన్నీ తీరిపోతాయనీ, ఆపదల నించి గట్టెక్కేస్తామనీ అనుకోవడం ఉత్తమాట. దేనిదారి దానిదే. అయితే, సమస్యలున్నప్పటికీ ధైర్యంగా బతకగలిగే ఓపికని, ఆపదలొచ్చినా నిభాయించుకోగల శక్తినీ ప్రార్ధన ఇస్తుంది" అని. 
                                  నాకా మాట ఎంతగానో నచ్చింది. ఆయన చెప్పింది ఎంత వాస్తవమైనదో అందరికీ తెలుసు. "ఇన్ని పూజలు చేస్తున్నాను. అయినా నాకీ కష్టాలేమిటి" అనుకునేవాళ్లు కోకొల్లలు. "నా పూజలో ఏదో లోపం ఉంది..అందుకే భగవంతుడు నన్ను కరుణించడం లేదు" అనుకునేవాళ్లకూ లోటు లేదు. 
                                "ఏమీ కోరుకోనివాడికి జీవితం అన్నీ ఇస్తుంది. అన్నీ కోరుకునేవాడికి మిగిలేది నిరాశే" నంటారు. అయితే ఇక్కడ ఓ చిన్న కిటుకుంది. ఏమీ కోరుకోనివాడు దొరికినదాన్నే మహాభాగ్యంగా భావిస్తాడు. అంచేత...వాడు ఎటూ భాగ్యశాలే. ఏ మనిషికీ ఎప్పుడూ అన్నీ దొరకవు. అంచేత అన్నీ కోరుకునేవాడు ఎటూ దౌర్భాగ్యుడే. ఇదిలా ఉంచితే.."ఏమీ కోరుకోకపోవడం" అన్నది సాధ్యమా...? ఏ సోనియా గాంధీలాగో ఉండాలని కోరుకుంటే తప్పు కావచ్చు గాక...కాని మధ్యతరగతి ఇల్లాలు తనకో సొంత ఇల్లూ...ఓ బుల్లి కారూ ఉండాలని కోరుకుంటే అందులో తప్పేముంది? పిల్లలు బాగా చదవాలని..మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని..కోరుకున్నవాళ్లని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కోరుకోవడం సమంజసం కాదని ఎవరైనా అనగలరా...? కాని ఈ కోరికలు కూడా ఎంతమందికి తీరుతున్నాయి..? కోరికలు తీరనప్పుడు ఎంతమంది భగవంతుణ్ణి తప్పుబడుతున్నారు..?? 
                                 సరిగ్గా ఇలా భగవంతుణ్ణి నెపమెన్నే సమయంలోనే ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం..మనం కోరుకుంటున్నాం సరే..కాని ఆ కోరినదాన్ని పొందే అర్హత మనకు ఎంతవరకూ ఉంది..? మనం పాపాలేమీ చెయ్యలేదని అనుకుంటున్నాం...కాని, "కరచరణ కృతంవా..కర్మ వాక్కాయజంవా...శ్రవణ నయనజంవా..మానసంవాపరాధం..విహితమవిహితంవా..సర్వమేతత్ క్షమస్వ" అన్నారు శంకరులు. పాపాలు పదికోట్ల రకాలు. తెలిసే చెయ్యం..తెలియకా చేస్తాం. చేతుల్తోనూ, కాళ్లతోనూ, పనులద్వారానూ, మాటలతోనూ, విని, చూసి..మనసుతోనూ..ఇలా ఏ పాపమూ చెయ్యలేదు నేనని చెప్పగలిగే ఆత్మస్థైర్యం ఎవరికుంది..? మన స్థితిగతులు బాగాలేక...మన కుటుంబంలోనే మరొకరు అదృష్టదీపుడిలా వెలిగిపోతూ ఉంటే కోతిలాంటి మన మనస్సు   బాధతో..దుఖంతో..ఈర్ష్యతో..ఆయా భావాల ఫలితంగా వచ్చే నానారకాలైన ఆలోచనలతో కునారిల్లకుండా ఉంటుందా..అది మానసికమైన పాపం కాదా...అత్యంత సహజంగా తోసుకొచ్చే ఈ  పాపానికి మనం అతీతులం కాదే..  మరి చేసిన పాపాలు ఊరికే పోతాయా..?! ఈ జన్మలో ఏ పాపమూ చెయ్యలేదేమో..గాని హిందూమతం చెప్పే ప్రకారం.."పురాకృతం" మనకు ఎంతవరకూ అనుకూలం..? మన జీవితాలు సక్రమంగా నడవకుండా ఏ లింకు అడ్డుపడుతోందో మనకు ససేమిరా తెలీదు. అటువంటప్పుడు..."పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు తాళము దప్పిన తప్పుగాక..చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ పలికినా అపశృతుల్ పలుకుగాక.." గాని ధర్మాన్ని అమలుచేయడంలో కించిత్తూ తేడా రానివ్వని ఆ భువనేశ్వరి మనకి ఎందుకింత శిక్ష విధించిందో..అని ఒక్క క్షణం ఆలోచించాలి కదా..!!   అలా ఆలోచించి..తప్పు మనదే అయి ఉంటుందని సరిపెట్టుకుని..బాధ పడితే పడొచ్చు గాని దేవుణ్ణి తప్పులెన్నడం మాత్రం మానెయ్యాలి. 
                 అయితే ఇది చెప్పినంత సులువు కాదు. నా మట్టుకు నేనే..నా కుటుంబానికి ఒకానొక మహా విపత్తు దాపురించిన దౌర్భాగ్యపువేళ వరుసగా ఒక వారం రోజులేమో...అసలు దేవుడి జోలికే పోలేదు. దీపారాధనే చెయ్యలేదు. "నేనింక నీ జోలికి రాను. నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో..." అని తెగించి చెప్పేశాను. 
             అలా ఓ వారం రోజులు గడిచాక...అప్పుడు ప్రారంభమైన అంతర్మధనం లోంచి వచ్చిందే ఇప్పుడు రాస్తున్న ఈ సోదంతా.  
                       ఇక పోతే మా సహోద్యోగి చెప్పినట్టు, ప్రార్ధన మన జీవితాల్ని మార్చదూ అన్న మాటని మాత్రం మనం పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే దేవతారాధన వల్లనే మన జీవితాలు ఓ ఒడ్డెక్కుతాయన్నది అనాదిగా వస్తున్న మాట కాబట్టి. అంచేత..చివరిగా చెప్పొచ్చే మాటేమిటంటే..దేవతారాధన విషయంలో కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి...
                  మనకి ముక్కోటి  దేవుళ్లున్నారు. వారిలో  మీ మనసుకు నచ్చిన దేవుణ్ణి ముందుగా ఎంచుకోండి. రాముడంటే మీకు చాలా ఇష్టమైతే ఇరవై నాలుగ్గంటలూ రాముణ్ణే ప్రార్ధించండి. అలాగే గణపతి..ఆంజనేయుడు..లలితమ్మ. మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించినప్పుడే మీరు ఆ పూజలో తల్లీనమవగలరు. ఏదో వాళ్లు సాయిబాబాని పూజిస్తున్నారు..మనం కూడా ఆ పూజ చేస్తే ఒడ్డేక్కుతామేమో ఇలాంటి లాటరీలు వద్దు గాక వద్దు. దాని వల్ల ఫలితం ఉండకపోగా వ్రతం కూడా సరిగ్గా సాగదు. 
                 దాదాపు పది-పన్నెండేళ్ల కిందటి మాట. అప్పట్లో నా ఆరోగ్యం అంత బావుండేది కాదు. లలితా సహస్రం చదువుకుంటూ ఉంటే చాలా హాయిగా..ఆ తల్లి నా పక్కనే నిలబడి నన్ను కాపాడుతున్నట్టు ధైర్యంగా అనిపించేది. ఎప్పుడు పడితే అప్పుడు లలిత చదివేసుకుంటూ ఉండేదాన్ని. అయితే అలా చదవకూడదూ అని కొందరు "పెద్దలు" చెప్పారు. శుచిగా స్నానం చేసి, దేవుడి పీఠం దగ్గర కూచుని మాత్రమే లలిత చదవాలి అని. కాని నాకు అలా కుదిరేది కాదు. పనంతా చేసేసుకుని ఆఫీస్ కి బైల్దేరి బస్సులో కూచున్నాక తీరిగ్గా హాయిగా లలిత చదువుకునేదాన్ని.  కాని అలా చదవడం తప్పు అని పెద్దలన్నవాళ్లు చెప్పారు కదా...అందుకని నిజంగా ఓ పెద్దాయనకి ఫోన్ చేసి, విషయం చెప్పాను. అప్పుడాయన..."ఎప్పుడైతే మీకు ఒక దేవుడికి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉంటే హాయిగా ఉందో...ఆ దేవత మీకు సిద్ధించిందన్నమాట. అప్పుడిక మీకు ఆ శ్లోకాలు గానీ స్తోత్రాలు గానీ చదువుకోవడానికి నియమాలు ఏమీ ఉండవు. హాయిగా చదువుకోండి" అని చెప్పారు. అయితే ఇది కేవలం స్తోత్రాలకే...బీజాక్షర జపాలకూ, నామాలు చదవడానికీ మాత్రం కాదు. అది గుర్తు పెట్టుకోండి. "శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ.."అంటూ మనం చదివేది లలితా సహస్రనామ స్తోత్రం. "ఓం శ్రీమాత్రే నమః" అంటూ ప్రతి నామానికీ ముందు ఓంకారం..చివర నమః అన్నవి చేర్చి చదివేవి నామాలు. స్తోత్రాలు మనం ఎలాగైనా చదువుకోవచ్చు. నామాలకు మాత్రం నియమనిష్టలు అవసరం. అలాగే బీజాక్షర జపాలకు కూడా. (మనకెటూ చేతకానప్పుడు ఆ బీజాక్షరాలూ అవీ అన్నీ  మనకెందుకు..హాయిగా ముక్కోటి దేవుళ్లకూ ముఫ్ఫై కోట్ల స్తోత్రాలుండగా..ప్రధానమైనది భక్తి మాత్రమే...బీజాక్షరాలు కాదు. గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పింది కూడా ఇదే.) కాని రామ నామం జపించడానికి మాత్రం ఏ నియమాలూ లేవు. "ర" కారం అగ్నిబీజం. "మ" కారం క్షేమ బీజం. "రామ"అంటూ జపించినప్పుడు మన పాపాలన్నీ దగ్ధమై, క్షేమం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నా..స్నానపానాదులు లేకుండా ఉన్న వేళ మనసు ఏదైనా ఆందోళనకు లోనవుతున్నా నిక్షేపంలా రామనామాన్ని జపిస్తూ ఉపశమనం పొందవచ్చు. నిరుడు నాకు గాల్ బ్లాడర్  ఆపరేషన్ అయినప్పుడు థియేటర్ లోకి వెళ్లే క్షణం దాకా నేను జపించింది రామనామాన్నే. నా శరీరం లోంచి ఒక అవయవం పోతే పోయింది గాని...నా పిల్లలకి నేను క్షేమంగా దక్కాను. ఇక్కడ నాకు ఆనందం కలిగించే మరో విషయం ఏమంటే...ఇది నిజం అవునో కాదో తెలీదు గాని...ఎక్కడో చదివాను...రాముడు లలితాదేవి పురుషరూపమట. సౌందర్య లహరి చదువుతున్నప్పుడు అనుకుంటూ ఉంటాను..."నిజంగా రాముడు అమ్మవారి పురుషరూపమే...లేకపోతే "పుంసాం మోహనరూపాయ" ఎలా అవుతాడు" అని...:)  
                                   ఇక చివరాఖరుగా చెప్పేదేమంటే..మీకు నచ్చిన దేవుణ్ణి ఊరికే అలా ప్రార్ధించుకోండి..స్తుతించండి..అంతే. ఇది ఎలాగంటే మీకు మీ అమ్మో నాన్నో ఇష్టమైతే వాళ్ల గురించి ఎలా ఆలోచిస్తారు..నలుగురికీ ఎలా చెబుతారు..అలా. మీకో ప్రేమికుడుంటే అతన్ని / ప్రేమికురాలుంటే ఆమెని తలచుకుని ఎలా పరవశించిపోతారు...అలా. ఏమీ కోరకండి. నా జీవితాన్ని కాస్త చూడు తండ్రీ..తప్పులు కాయి దేవుడా.. అనండి అంతే చాలు. ఇక మీ జీవితం ఎలా ఉన్నా...మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.మీ జీవితాన్ని / మీ పిల్లల జీవితాల్ని ఆ పరంధాముని చేతుల్లో పెట్టెయ్యండి...మీ అమ్మ..మీ నాన్న మీకు ఎలా అన్యాయం చెయ్యరో..అలాగే ఆ దేవుడూ అన్యాయం చెయ్యడు అని కనీసం నమ్మండి. ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే..తప్పొప్పుల గురించి ఆలోచించకుండా...మీ దారిన మీ ప్రార్ధనలు మీరు కొనసాగించండి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. మనం కోరినదల్లా మనకి జరగకపోవచ్చు. కాని...జరిగేదల్లా మన మంచికేనని నమ్మక తప్పదు.    
            ఏం చెప్పానో...ఎంతవరకూ సరిగ్గా చెప్పగలిగానో..నాకైతే ఏమీ తెలియడం లేదు. అవసరంలో ఉన్నవాళ్లకి ఈ సోది ఏమైనా ఉపకరిస్తే...నాకదే పదివేలు. దేవుడా..వాళ్లకి కాస్త ఉపకారం చేశాను..నా లిస్టులో మరో పది మార్కులు వెయ్యవూ అని దేవుణ్ణి ప్రార్ధించుకుంటాను...చూశారా..ఇదీ స్వార్ధమంటే..మరి ఇదీ లేకుండా బతకగలమా...:) 
   "దుష్టదూరా..దురాచార శమనీ దోషవర్జితా" (దుష్టుల నుండి దూరం చేసేది, దురాచారాల్ని రూపుమాపేదీ, సమస్త దోషాల్నీ పోగొట్టేదీ ఆ లలితాంబికే. ఆ తల్లిని ఊరికే అలా ప్రార్ధిస్తూ ఉండండి చాలు. మిగతాదంతా ఆవిడే చూసుకుంటుంది.)       
          సెలవా మరి... 
                       

1 కామెంట్‌: