3, మార్చి 2014, సోమవారం

అందాల కడలి-9


అమృతసముద్రం మధ్య అమృతానందమయి   


శ్లో : 8
       సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
       మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే
       శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
       భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం !
                               ఇది సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకం. అమ్మవారి నివాసస్థలాన్ని తెలియజేసేది. క్లుప్తంగా దీని భావమేమంటే, "అమృతసముద్రం మధ్యన, దేవతా వృక్షాలైన కల్పవృక్షాలు  చుట్టూ పరివేష్టించి ఉన్న మణిద్వీపంలో కదంబవృక్షాలతో నిండిన ఉద్యానవనంలో ల చింతామణీ గృహంలో శివాత్మకమైన మంచం మీద..పరమశివుడనే తల్పమందు జ్ఞానానందతరంగరూపమై  ఉన్న నిన్ను కొందరు ధన్యులు సేవించి తరిస్తున్నారు. "
                ఇప్పటిదాకా నేను మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సౌందర్య లహరిలోని వంద శ్లోకాలకీ వంద యంత్రాలున్నాయి..వంద బీజాక్షరాలున్నాయి. ఏ శ్లోకానికి ఏ యంత్రమో..ఏ బీజాక్షరమో..జపవిధానం ఎలాగో..నైవేద్యం ఏమిటో..ఫలితం ఏమిటో   వివరాలన్నీ తెలియజేసే పుస్తకాలున్నాయి. (బజార్లో దొరుకుతాయి) అవన్నీ మనకెందుకు గాని, ఏ శ్లోకాన్ని పారాయణ చేస్తే ఏ ఫలితమో మాత్రం ఇక మీదట చెప్పుకుందాం. శాస్త్రం చెప్పినట్టు వేలల్లో దాన్ని జపించలేకపోయినా, తోచినన్నిసార్లు జపించి, అమ్మ దయకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది.  ప్రస్తుత "సుధాసింధోర్మధ్యే" శ్లోకానికి సకల కార్య జయం ఫలసిద్ధిగా చెప్పబడింది.  రోజూ జపించవలసిన సంఖ్య కూడా చాలా తక్కువ. రోజుకి పన్నెండు సార్ల చొప్పున పన్నెండు రోజులు. అంతే. నైవేద్యం కూడా చాలా సులువైనది..నల్ల మిరియాలు. అంచేత  ఆసక్తి గలవారు యంత్రాలు, బీజాక్షరాల జోలికి పోకుండా చేతనైనంత మేరకు ఈ శ్లోకాన్ని రోజుకు పన్నెండుసార్లు చొప్పున 12 రోజులు జపించి తదనుగుణమైన ఫలితాన్ని పొందండి.
                                 ఇక ఈ శ్లోకపు భావార్ధాన్ని చూద్దాం..బ్రహ్మకు నివాసం సత్యలోకం. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు. శివుడు సరేసరి..కైలాసంలో ఉంటాడన్నది అందరూ ఎరిగిందే. మరి ముజ్జగాలకూ మూలపుటమ్మ అయి ఆ లలితా మహా త్రిపురసుందరి ఎక్కడుంటుంది..?? ఆ తల్లి ఉండే నెలవేది..? దాని  పేరేమిటి..లలితా సహస్రం చదివేవారిలో కూడా చాలామందికి ఈ ప్రశ్నలకు జవాబులు తెలియవు. ఈ శ్లోకం దానికి జవాబు చెబుతుంది గాని, సవిస్తరమైన జవాబు తెలుసుకోవాలంటే దేవీ భాగవతం చదవాల్సిందే. అందులోని మణిద్వీప వర్ణనను తెలుగులో 32 చిన్న చిన్న పద్యాలుగా వ్రాసి కూర్చిన "మణిద్వీప వర్ణన" పాట ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యాన్ని గడించుకుంది.  "మహాశక్తి మణిద్వీప నివాసిని..ముల్లోకాలకు మూలప్రకాశిని" అన్న పాదంతో మొదలై, "భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం..దేవదేవుల నివాసం అదియే కైవల్యం" అన్న పల్లవి పునరావృతమవుతూ సాగే  ఆ పాట పుణ్యమా అని పరదేవత మణిద్వీపంలో ఉంటుందన్న విషయం జగద్వ్యాపితమైంది. "నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు"చదివితే చాలా శుభమంటూ ఆ పాటలో ఉన్న ప్రకారం గృహప్రవేశ మహోత్సవాలు మణిద్వీపవర్ణన పారాయణలతో మారుమ్రోగుతున్నాయి. గృహప్రవేశవేళ మణిద్వీపవర్ణన చిరు పొత్తాల్ని అందరికీ కానుకగా ఇవ్వడం కూడా పలుచోట్ల ఆనవాయితీ అయింది.  
                             మొత్తానికి దేవి ఉండేది మణిద్వీపంలో అని చెప్పుకున్నాం కదా. లలితా సహస్రం తల్లిని "సుధాసాగర మధ్యస్థా" "చింతామణి గృహాంతస్థా" అంటూ వర్ణించింది. అయితే మనకు మొదటినించీ పాలసముద్రం గురించి మాత్రమే తెలుసు గాని ఈ అమృతసముద్రం గురించి ఆట్టే తెలియదు..!
                                         "సప్త సముద్రాలు" అన్న మాట మనం తరచూ వినేదే. అవి వరుసగా లవణ (ఉప్పు సముద్రం..మనకి ఉన్నది ఇదే) ఇక్షు (చెరకురసం) సురా (మద్యం..కల్లు) సర్పి (నేతి సముద్రం) క్షీర (పాల సముద్రం) దధి (పెరుగు సముద్రం) జల (మంచినీటి సముద్రం)సముద్రాలు. ఆయా సముద్రాల చెంత వరుసగా జంబూ (మన ద్వీపమే) ప్లక్ష, శాల్మలీ, కుశ, పుష్కర, క్రౌంచ, శాక ద్వీపాలున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కడా అమృత సముద్రం మాటే లేదు. అయితే, జంబూద్వీపంలో ఆరు కులగిరులు (కుల పర్వతాలు...అంటే ప్రళయమే వచ్చినా..భూదేవి ఎన్నెన్ని మార్పులకు గురైనా గాని ఈ పర్వతాలు మాత్రం తమ సరిహద్దుల్ని అతిక్రమించే నైచ్యానికి పాల్పడవట) ఉన్నాయని (కొన్ని కొన్ని చోట్ల ఈ పర్వతాల్ని ఏడుగా పేర్కొనడం కూడా జరిగింది) ఈ కులగిరుల్లో మేరుపర్వతం ఒకటని విష్ణుపురాణం పేర్కొంది.
                                            ఆ మేరు పర్వతం చుట్టూ కూడా మహా పర్వతాలు ఉన్నాయనీ, వాటి మీద మంచినీళ్లు, తేనె, చెరకురసం, పాల సరస్సులు ఉన్నాయనీ, అక్కడ సర్వతోభద్రమనే దేవతల ఉద్యానవనం ఉందనీ శ్రీమద్భాగవతం పేర్కొంది. ఇక్కడ కూడా  ఎక్కడా మణిద్వీపం గురించి గాని, అమృతసముద్రం గురించి గాని ప్రస్తావనే లేదు. అయితే దేవీ భాగవతం మాత్రం, బ్రహ్మలోకానికి పైన "సర్వలోకం" అని ఉంది. దానికే మణిద్వీపం అని నామాంతరం అని తెలిపింది. దానికి సాటి పధ్నాలుగు లోకాల్లోనూ మరేదీ లేదంటూ సాగిన మణిద్వీప వర్ణన చదువుతుంటే శరీరం ఒక్కసారిగా రోమాంచనమవుతుంది. ఆనందమూ, ఏదో తెలియని భయమూ, విభ్రమా...అసలు అదీ ఇదీ అని చెప్పుకోలేని ఒకానొక గాఢమైన అనుభూతీ కలుగుతాయి. అవన్నీ స్వయంగా అనుభవించాలంటే శ్రీ దేవీ భాగవతం చదవండి. అందులో చెప్పినదానికి సంక్షిప్త స్వరూపమే ప్రస్తుత శ్లోకంలోని వర్ణన.
                        అయితే...నాకు ఎప్పుడూ ఒక పెద్ద దరిద్రపు సందేహం కలుగుతూ ఉంటుంది. దేవీ భాగవతం ప్రకారం...త్రిమూర్తులకు సైతం మూలం ఆ పరదేవతే. అంతే కాదు...సమస్త హిందూ ఆధ్యాత్మిక చరిత్రకూ శిఖరం వంటిది శ్రీచక్రం. దాన్ని మించిన యంత్రరాజం గాని..ఉపాసనా దీక్షగాని ఉన్నట్టు నేను వినలేదు. (అఫ్ కోర్స్, నాకు తెలిసింది చాలా తక్కువని నేను మొదటినించీ చెబుతూనే ఉన్నాను...కాబట్టి ఇందులో ఏదైనా తప్పుంటే పాఠకులు పెద్దమనసుతో క్షమించగలరు.)
అయితే..."పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట" అన్న పోతనామాత్యుడంతటి పరమ భాగవతోత్తముడే  
  అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ  చాల పె
  ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లో
  నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
  యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ! 
                                    అంటూ పరదేవత విభవాన్నీ, మహిమనూ కీర్తించినా భాగవతంలో ఎక్కడా మణిద్వీప ప్రసక్తి గాని, అమృతసముద్రం ప్రసక్తి గాని వచ్చినట్టు నాకు తెలియదు. దేవీపురాణాలు తప్ప మిగతా సమస్తమూ విష్ణువునే కీర్తించాయి.ఎక్కడా ముగురమ్మల మూలపుటమ్మ ఊసే ఎత్తలేదు.  ఇదే నాకు గొప్ప సందేహం..బాధా..లోటూను. 
                               సరే మిడిమిడిజ్ఞానంతో వచ్చే ఈ సందేహాల మాటకేం గాని...ఈ "సుధాసింధోర్మధ్యే" అన్న శ్లోకాన్ని చదివినప్పుడల్లా నాకు కాళిదాసు "శ్యామలా దండకం" గుర్తొస్తూ ఉంటుంది. 
  "సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే" 
                                         అంటూ కాళిదాసు ఆశువుగా చెప్పిన  శ్యామలాదండకాన్ని మన మధుర గాయకుడు ఘంటసాల పాడగా విని..నాకసలు ఒళ్లు తెలియలేదు. 
                         "సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం..." 
                                            అన్న శ్యామలాదండకమొక్కటీ చాలు ఆ జగన్మాతృకను తలచుకుని పరవశించిపోవడానికి. 
                   ఇక్కడ ఓ చిన్న కోతి కొమ్మచ్చి. మా నాన్న లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ జిల్లాపరిషత్ కి డెప్యుటేషన్ మీద వెళ్లారు. అక్కడ ఓసారి, (శ్రీకాకుళం లో) జిల్లాపరిషత్ సెక్రటరీ తదితర ఐదు పోస్ట్ ల్లో ఎవరూ లేక, ఎకౌంట్స్ ఆఫీసర్ అయిన మా నాన్న సెక్రటరీ పోస్ట్ తో సహా ఎకాయెకీ ఐదు పోస్ట్ లకి ఇన్ చార్జ్ గా వ్యవహరించారు. డిపార్ట్మెంట్ లో అత్యంత సమర్ధుడంటూ మా నాన్నకున్న పేరు దాంతో మూడు రెట్లు పెరిగింది.అది తలచుకుంటే ఇప్పటికీ (మా నాన్న చనిపోయే పధ్నాలుగేళ్లు) నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. 
                                      అలాగే అనుకోండి...మన అమ్మ...సర్వ మంత్రాలూ, తంత్రాలూ, యంత్రాలూ, తీర్ధాలూ, చక్రాలు, శక్తులు, వేదాలు, విద్యలు, యోగాలు, వర్ణాలు, గీతాలు...ఒకటేమిటి...సమస్తమూ ఆమేనని తెలిస్తే...శృతులు, కాళీవరప్రసాదులు, సాక్షాత్ శివస్వరూపులు అంతా ఆమెను కీర్తిస్తుంటే మనకు ఆనందంతో..పరవశంతో..ఇంకా ఏదో తెలియని ఒకానొక అపురూపమైన భావంతో ఒళ్లు గగుర్పొడచదూ...???!!!   
                                                 ఆ తల్లి...ఏ అమృతంకోసమైతే దేవతలూ, రాక్షసులూ కొట్టుకున్నారో..ఆ అమృతం సముద్రంలా తనుండే ద్వీపం చుట్టూ పారుతూ ఉండగా..దేవతలందరూ పూజించే కల్పవృక్షాలు ఇంటి చుట్టూ కంచెగా అమరగా..మణిమయమైన ద్వీపంలో వర్ష సంబంధమైన కడిమి చెట్లు తోటగా అమరి ఉండగా..నవరత్నాలకు తలమానికమైన, కోరినదల్లా ప్రసాదించే మహిమ గల చింతామణులతో  (ఇది కూడా లక్ష్మీదేవితో బాటు క్షీరసముద్రంలోంచి పుట్టిందని గతంలో చెప్పుకున్నాం)నిర్మితమైన గృహంలో ఉంటుంది. 
                             ఆఫీసర్ గారి దాకా వెళ్లే శ్రమ లేకుండా ఆయన ఇంటి కాపలాదారే ఆశ్రితుల అవసరాలు కనిపెట్టినట్టు, అమ్మ ఇంటి చుట్టూ ఉన్న కల్పవృక్షాలు, చింతామణులే భక్తుల కోర్కెల్ని తీర్చి పారెయ్యగలవు. ఇంటి ముందున్న కడిమిచెట్లు కోరిన వర్షధారల్ని కురిపించి భూతలాన్ని సస్యశ్యామలం చెయ్యగలవు. 
                 సరే ఇక అమ్మ ఉండేది శివాకారమైన మంచం మీద...శివ అంటే ఆనందం.రూపుదాల్చిన ఆనందమే  ఆ తల్లి  ఆసనం. అంటే ఆయమ ఆసనం కూడా మనకు సుఖప్రదాతే...
                                         పోతే..ఈ "పరమశివ పర్యంక"మన్న పదానికి వేరే సంకేతార్ధం ఉందనీ..అది మన శరీరంలోని చక్రాలకూ, గ్రంధులకూ సంబంధించినదనీ చెప్పుకునే మాటను వివరించే ప్రయత్నం నేను చెయ్యను. అది నా శక్తికి అతీతమైనది. నేను చెప్పగలిగేది ఒక్కటే...పెళ్లికాని ఆడపిల్లలు కాత్యాయనీ వ్రతం చేసే ఆనవాయితీ మన వైపు ఉంది. ఆ వ్రతానికి శివుని వామాంకమందున్న అమ్మవారి ఫోటో కావాలి. సరిగ్గా అదే ఇది. పరమశివ పర్యంకమందున్నదంటే పరమశివుని అంకమనే పర్యంకము పై ఆసీన అయి ఉన్నదని మనం భావించాలి. 
                                   ఆఖరుగా చెప్పుకోవలసినదేమంటే అమ్మ "చిదానందలహరి" అంటే జ్ఞానానందలహరి. జ్ఞానప్రసూనాంబిక అయిన ఆ దేవి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా ఆనందప్రదాత అవుతుంది. ఇటువంటి తల్లిని భజించి ధన్యులవుతున్నవారు మాత్రం "కతిచన".... కొందరే..! ఎందుకంటే మణిద్వీపం మన పక్కింట్లో లేదు. త్రిగుణాత్మకమైన తల్లిని కేవలం అంతర్ముఖంగా మాత్రమే తెలుసుకోవాలి తప్పితే మరొక రకంగా  దేవి ప్రసన్నురాలు కాదు. అంచేత...శివుడికి  మానస పూజ చేసినట్టు అమ్మను కూడా ఆత్మలో ప్రత్యక్షం చేసుకుని భజించగలవారు నిజంగా ధన్యులే కదా...అటువంటి అదృష్టం ఏ కొద్దిమందికో...??!!  
                                   సరే ఇక సెలవా మరి...

1 కామెంట్‌:

  1. గాయత్రీ లక్ష్మిగారూ! నమస్కారం.

    సౌందర్య లహరిని గురించి ఇంతకుముందు విన్నాను, పుస్తకంకూడా మిగిలిన భక్తి స్తోత్రాలతోబాటు కొని ఇంట్లో పెట్టుకున్నాముగానీ, ఇంత వివరంగా తెలుసుకోవటం మీ పోస్టుల ద్వారానే. చాలా బాగుంది. కృతజ్ఞతలు.

    ఇవాళ్టి శ్లోక పారాయణంవలన కలిగే ఫలంగురించి తెలియజెప్పినట్లే, ప్రతి శ్లోకాన్నీ వివరించేటపుడు వాటి ఫలాన్నికూడా పేర్కొనగలరు. ఎంతైనా సగటు జీవులంకదా. ఆ ఫలం తెలుసుకుని తదనుగుణంగా జపంద్వారా ఫలితాలు పొందొచ్చనే స్వార్ధం. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో నేను మీ పోస్టులతో ఊరట పొందుతున్నాను.

    మరోసారి ధన్యవాదాలు, శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి