16, మార్చి 2014, ఆదివారం

ఇదీ మా లలితా పీఠం

                           నిన్న పౌర్ణమి. మామూలుగా అయితే పట్టాభిరెడ్డి తోటలో కొలువుదీరి ఉన్న వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళతాను. కాని ఈ సారి  మాత్రం కించిత్కార్యార్ధం అక్కయ్యపాలెంలో ఉన్న లలితా పీఠానికి వెళ్లాను. తెల్లవారుజాము ఐదుంపావుకి నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి మధ్యలోంచి దూసుకుపోతున్న ఆటోలో లలితా సహస్రం వల్లె వేసుకుంటూ నేనొక్కత్తినే. దట్టంగా ఉన్న చీకట్లలోకి అప్పుడప్పుడే కాంతి కిరణాలు చొచ్చుకొస్తున్నాయి.... నిరాశతో మూసుకుపోయిన హృదయకవాటాల్ని తెరచుకుని ఆశాకిరణాలు దూసుకొస్తున్నట్టు. ఏమైనా తెల్లారుజాము ప్రయాణాలు బావుంటాయి...ఒంటరిగా అయినా సరే..నిజానికి ఒంటరిగా అయితేనే బావుంటాయేమో..గుంపులో బతకాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉన్నా, మన మనసుని మనకి తగినట్టూ నింపుకుని, ట్యూన్ చేసుకోవాలంటే ఇలాంటి ఒంటరితనం కూడా అప్పుడప్పుడూ అవసరమే.
                      సరే...అక్కయ్యపాలెం లలితా పీఠం విశాఖపట్నంలో చాలా పేరుకెక్కిన గుడి. కాస్త గ్రాంధికంగా ఉండేవాళ్లు లలితా పీఠం అనీ..జనసామాన్యం లలిత గుడి అనీ అంటూ ఉంటారు. దాదాపు శతాబ్దం కిందటి పీఠమిది. అమ్మవారి విగ్రహం ఎత్తుగా ఉన్న పీఠం మీద ఉంటుంది. తల్లి కాస్త పొట్టిది. (పొట్టిది కాబట్టే గట్టిది..:) ) ఆవరణలో పీఠం వ్యవస్థాపక   స్వాముల విగ్రహాలతో బాటు, మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, లలితా సహస్రాన్ని పరస్పర సంవాదరూపంలో వెలికి తెచ్చిన హయగ్రీవాగస్త్యుల విగ్రహాలు విడి విడి తిన్నెల మీద ఉంటాయి. చిత్రమేమిటంటే దక్షిణామూర్తి వగైరా విగ్రహాలకు కట్టిన బుల్లి బుల్లి ప్రాకారాల కంటే స్వాములిద్దరి గుళ్లూ పెద్దవి. అవి దాటి వెళితే జగన్నాధ, సుభద్ర, బలభద్రులకో గుడి, దాని కెదురుగా అశ్వత్థ వృక్షం, పక్కనే పద్ధెనిమిది మెట్ల పంక్తికి పైన కొలువు దీరిన అయ్యప్ప దర్శనమిస్తారు. ఆ వెనుక నవగ్రహ మండపం. ఇది కాస్త పెద్దదే. నవగ్రహాలకు పూజలు కూడా ఇక్కడ బాగా చేస్తారు.
                               అయిందా...ఇక చెప్పుకోవాల్సిన మాటేమిటంటే...త్రిమతాచార్యుల్లో ప్రధముడూ, అద్వైత మత ప్రవక్తా, గొప్ప కవీ సాక్షాత్తూ శైవాంశ సంభూతుడూ అయిన శంకర భగవత్పాదులది..ఓ చిన్న విగ్రహం..ఓ బుల్లి ప్రాకారంలో  నవగ్రహ మండపానికి ముందు ఉంటుంది. గుళ్లో కొలువుదీరిన తల్లి దివ్య సౌందర్యాన్ని అనితరసాధ్యంగా వర్ణించి...అందాల కడలిని కళ్ల ముందు ప్రవహింపజేసిన ఆది శంకరులకు దక్కింది ఆ పాటి గౌరవమే..!!
                           సరే మళ్లీ ఓ రెండడుగులు వెనక్కి వస్తే అక్కడ "మణిద్వీపం" ఉంటుంది. ఇది మొదట్లో లేదు. ఒకానొకప్పుడు సువిశాలమైన ప్రాంగణాలతో "దేవుడు ప్రకృతిలోనే ఉన్నాడ"న్నట్టు పరిఢవిల్లిన ఆలయాల ఆవరణలన్నిటినీ దరిమిలా ఏవేవో గుళ్లతో నింపేసి "టెంపుల్ కాంప్లెక్స్"లుగా మార్చేస్తున్న ఆధునిక ఆధ్యాత్మికతకు లలితాపీఠం మినహాయింపేమీ కాదు.  దాదాపు దశాబ్దం కిందట కట్టిన ఈ మణిద్వీపంలో సరస్వతి, దుర్గ, ఈశ్వరుడు, మహిషాసుర మర్దిని, వారాహి, ప్రత్యంగిర (ఈ ప్రత్యంగిరాదేవి విగ్రహం చూడటానికే ఎంత భయంకరంగా ఉంటుందో...) రాజరాజేశ్వరీ విగ్రహాలతో బాటు మండపం మధ్యభాగంలో "లలితాకామేశ్వరులు" కొలువై ఉంటారు. మధ్యలో ఈ లలితాకామేశ్వరులు ఉండగా చుట్టూ  ఎత్తుగా కట్టిన వేదికల మీద మిగిలిన విగ్రహాలన్నీ ఉంటాయి.
                                              ఈ మణిద్వీపం నిర్మాణదశలో ఉండగా దాని గురించిన ప్రకటనలు విని నేను చాలా ఆశపడ్డాను. అమృత సముద్రమధ్యంలో ఉండే మణిద్వీపాన్ని వాస్తవంగా నేలకు దింపడమనేది పూర్తిగా దుస్సాధ్యమన్న మాట తెలిసినా, కనీసం మణిద్వీపానికి దగ్గర్లో ఉండే ఒక చక్కని నిర్మాణాన్ని వాస్తవంగా చూడగలుగుతాం కదా అని ఆనందించాను. ఇప్పటిదాకా కేవలం ఊహల్లో మాత్రమే దర్శించుకుంటున్న అమ్మ నివాసాన్ని ఇక మీదట లలితాపీఠంలో హాయిగా చూస్తూ లోపలికి ఎంటరైపోవచ్చు కూడా కదా అని దురాశే పడ్డాను.  కాని మధ్యలో లలితాకామేశ్వరుల విగ్రహాలూ...చుట్టూ సగం సగం కట్టిన వేదికలూ (కొన్ని వేదికలకు సరైన ప్లాస్టింగ్ కూడా లేదు) ఆయా విగ్రహాలకు ఏదో చేశామంటే చేశామన్నట్టున్న అలంకరణలూ...ఇవన్నీ చూశాక అసలు అటువైపు పోబుద్ధే పుట్టడం లేదు.
                                  మణిద్వీపం పక్కనించి వెళితే అమ్మవారి గర్భగుడి. ఇదంతా  ఒక పెద్ద హాలు. మధ్యలో గర్భాలయం ఉండగా, చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేసేందుకు గాను ఖాళీ జాగా ఉంటుంది. శుక్రవారాల్లోనూ, పౌర్ణమి నాడూ ఓ చిన్న పెన్సిలు ముక్క పుచ్చుకుని, ఆలయం వాళ్లిచ్చే 108 అంకెలున్న కాగితంలో  టిక్కులు పెట్టేసుకుంటూ పరిగెడుతున్నట్టే అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసే భక్తులు బోలెడంతమంది కనిపిస్తారు. గంట తొమ్మిదైతే చాలు ఈ ప్రదక్షిణల్ని ఆపెయ్యాలి.
                           గర్భాలయంలో కొలువుదీరి ఉన్న లలితా త్రిపురసుందరి దర్శనం చేసుకుని అలా ముందుకు వెళితే అక్కడ మరో ఆలయం ఉంటుంది. అదో పెద్ద హాలు. అక్కడ వరుసగా బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకన్న, సీతారామచంద్రమూర్తి, స్వామికి ఎదురుగా హనుమన్న, రాముడికి పక్కనే సాయిబాబా, ఆ పక్కన అన్నిటికంటే పెద్ద వేదిక మీద గో,గోపికా పరివేష్టితులై ఉన్న  రాధాకృష్ణులు. వీటిలో బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే శిలలో మలిచినది. వెంకన్న ఒక పెద్ద ఫోటోలో మాత్రమే దర్శనమిస్తాడు. . మిగతావన్నీ పాలరాతి విగ్రహాలు. మాంఛి కళ ఉట్టిపడుతూ చాలా బావుంటాయి. ముఖ్యంగా  పచ్చని పచ్చిక బయలు మీద, చుట్టూ ఆవులూ, దూడలూ, నెమళ్లూ, లేళ్లూ తదితరాలతో,కడవలు నెత్తికెత్తుకుని వొయ్యారంగా ఉన్న గోపికలతో కొలువుదీరి ఉన్న రాధాకృష్ణుల వేదిక బృందావనాన్నే తలపిస్తుంది.
                  లలితా పీఠానికి వెలుపల బోలెడంతమంది పువ్వులవాళ్లుంటారు. గులాబీలూ, చామంతులతో బాటు ఎర్రని మందారపువ్వులు కూడా అమ్ముతారు. ఇక్కడి పువ్వులు బావుంటాయి కూడా. కాని, ఎంత డబ్బు పోసి పువ్వులు కొన్నా అమ్మవారి గర్భాలయం ఇవతల వేలాడదీసిన ఓ ప్లాస్టిక్ కవర్లో వాటిని పడెయ్యడమే. మనం అపురూపంగా పట్టికెళ్లి అక్కడున్న పళ్లెంలో పెట్టినా పూజారి గారు తీసి కవర్లోకి ఒక్క గిరాటు కొడతారు. పసుపు, కుంకుమ వగైరాలకూ అదే గతి. మరి నలిగిపోయిన తర్వాత గాని ఆ పువ్వులు పూజకి పనికిరావేమో...:( 
                   ఏమిటో...ఆలయాలు ఆలయాలంటూ కలవరించడమే గాని, తీరా వెళితే అక్కడ మనసు కోరుకున్న ప్రశాంతత దొరకదు. అయినప్పటికీ లలితా పీఠంలో నాకు నచ్చేది ఏమిటంటే అక్కడికి వెళ్లి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది...తిరుపతిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నా వెంకన్న మూలవిగ్రహాన్ని చూసి ఇవతలికొచ్చాక "ఇంక మనకేం భయం" అనిపించినట్టు. బహుశా ఇదంతా ఆయా ఆలయాల నిర్మాణక్రమంలో అక్కడ నెలకొల్పిన యంత్రాల మహిమ అయి ఉంటుంది. దాదాపు శతాబ్దం కిందట లలితా పీఠాన్ని నెలకొల్పుతున్నప్పుడు శ్రీచక్రాన్ని భూస్థాపితం చేసి ఉంటారు కదా...అక్కడ మన మనసును తాకేది అదే. అక్కడి గాలిలో సుళ్లు తిరుగుతూ అణువణువునా ఆవరించుకుని ఉన్న శ్రీచక్రపు మహిమ.. పవిత్రత..అమ్మ కరుణతో కలగలిసి మనసును నెమ్మదింపజేస్తాయి. 
                                     అందుకే వెనక మిట్టూరోడి కతలకు తన మాట రాస్తూ బాపు.."దేవుడు అంతటా ఉన్నాడని తెలిసినా అప్పుడప్పుడూ అన్నారమో భద్రాద్రో తిరుపతో వెళ్లి ఓ దండం పెట్టి వస్తూ ఉంటాం కదా" అన్నారు. అలాంటిదే మా లలితా పీఠమూను. నిన్న అక్కడ కలిసిన ఒకావిడ పీఠం గురించి మాట్లాడుతూ..."ఇది చాలా మహిమ గల పీఠమండీ...దేవుడి పుస్తకంలో ఉన్న గొప్ప గొప్ప పీఠాల జాబితాలో దీని పేరూ ఉందిట" అన్నారు. "దేవుడి పుస్తకమా..అదెక్కడుంటుంది" వెంటనే ఆత్రుతగా అడిగేశాను నేను...లలితా పీఠం నించి సరాసరి అక్కడికే వెళ్లి ఆ పుస్తకం కొనేసుకోవడానికి నా పర్సులో తగినంత డబ్బు ఉందా లేదా అని మనసులో లెక్కలు కట్టేసుకుంటూ..:) "పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గరుంటుందిట. వాళ్లే దాన్ని చూడగలరుట." అన్నారావిడ, నా ఆత్రుతని పట్టించుకోకుండా. హ్మ్మ్మ్ అని ఓక్క నిట్టూర్పు వదిలేశాను. పోన్లే ఏమైతేనేం...దేవుడి పుస్తకమనేది ఒహటుంది గదా...అందులో మా లలితా పీఠం పేరు ఉంది గదా...అక్కడికి నేను ఎప్పుడంటే అప్పుడు హాయిగా ఒక్క పాతిక రూపాయల ఖర్చుతో వెళ్లి రాగలను గదా...అది చాలు నాకు. 
న జానామి దానం న చ ధ్యానయోగం 
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం
న జానామి పూజాం న చ న్యాసయోగం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ 
                                  నాకు దానం చెయ్యడం తెలియదు. ధ్యానం రాదు. మంత్రతంత్రాలూ, స్తోత్రపాఠాలూ రావు. పూజాపునస్కారాలూ, అంగన్యాసకరన్యాసాదులూ తెలియవు. నాకున్న ఏకైక దిక్కల్లా నువ్వే. తల్లీ భవానీ...నువ్వొక్కత్తివే నాకు గతి. ఇదే నా శరణాగతి..!! 

4 కామెంట్‌లు:

  1. బావుందండీ! చదువుతుంటే ,హాయిగా, చివర్లో శ్లోకము ,దాని అర్థం చదివాక మనస్సంతా తేలికగా అన్పించింది,ఎందుకంటే భారమంతా ఆమె మోస్తుందన్న ధీమాతో.

    రిప్లయితొలగించండి
  2. Chala chakkaga undi . Antha kallamundu kanipistundi chaduvutunte.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి